వాల్మీకి నుంచి నేటి రచయితల వరకు వెన్నెల జడిలో తడవని కవీ, రచయితా లేరు. ఆ వెన్నెల వెలుగుల్లో కొత్త తరానికి వెన్ను తట్టి, వారికి పాత తరానికీ వారధి కట్టి... అక్షరార్చన చేయించవచ్చనే తలంపుతో పురుడు పోసుకుందే కరీంనగర్ మిత్రుల ‘ఎన్నీల ముచ్చట్లు’. ప్రతీ పౌర్ణమినాడు జరిగే ఈ కవిత్వోత్సవం కొత్త కొత్త కవులను వెలుగులోకి తెస్తోంది. అంతే కాదు ప్రతి ఎన్నీల ముచ్చట్లనూ పుస్తకంగానూ తెస్తోంది. తెలుగు సాహితీ వికాసానికి తన వంతు వన్నెలద్దుతోంది.
సాహితీ క్షేత్రం..
కరీంనగర్ జిల్లా... కురిక్యాల గుట్ట... తెలుగునేల మీద తొలిసారిగా కందపద్యం అవతరించిన క్షేత్రం. ఈ శాసనాన్ని వేయించింది జినవల్లభుడు. తెలుగుకు ప్రాచీన భాష హోదా దక్కడంలో దీని పాత్ర కూడా ఉంది. అంతకుముందే హాలుడి గాథాసప్తశతి ఇక్కడి కోటిలింగాల నుంచి జాలువారిందే. ఆ మట్టి వారసత్వమే సాహిత్యంలో పలు ప్రయోగాలకు దారితీసింది. పధ్నాలుగు భాషల్లో ప్రవేశం ఉన్న మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, మాటలనే తూటాలుగా పేల్చిన అలిశెట్టి ప్రభాకర్, మట్టి మనిషి జీవితాలను కళ్లకు కట్టిన అల్లం రాజయ్య, కథల కార్ఖానా కాలువ మల్లయ్య, సింగరేణి కార్మికుల కష్టాలకు అక్షర రూపమిచ్చిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్, వెలిచాల కొండలరావు, జువ్వాడి గౌతమ్‌రావు.. లాంటి ఎందరో సాహితీవేత్తలకు పుట్టినిల్లు ఈ జిల్లా.
ప్రాచీన, చారిత్రక, దేశభక్తి, అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు ఈ గడ్డ నుంచి వచ్చాయి. స్వాతంత్య్రోదమ కాలం నుంచి 1980వ దశకం వరకు సాహితీ సమాలోచనలు, చర్చలు, వాదోపవాదాలకు కరీంనగర్ వేదికైంది. ఆ స్ఫూర్తిని కొత్త తరాలకూ అందించి, అమ్మభాషపట్ల తమ భక్తిని చాటుకుంటూ పాత కొత్త రచయితల, కవుల సమ్మేళనగా నిర్వహిస్తున్న సాహితీ సమావేశమే ఈ ‘ఎన్నీల ముచ్చట్లు’.
గత వైభవ పునరుద్ధరణ
తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ నుంచి కవిత్వం వెల్లువలా వచ్చింది. కానీ కవుల మధ్య పెద్దగా పరిచయాల్లేవు. సాహితీ చర్చలు కూడా ఉనికిలో లేవు. దీంతో కవులందరినీ ఒకచోట చేర్చి సాహిత్యానికి గత వైభవం తీసుకురావాలనే సాహితీ మిత్రుల సంకల్పం, దానికో ప్రత్యేకత ఉండాలనే వారి ఆలోచనే ‘ఎన్నీల ముచ్చట్ల’కు బాటలు వేసింది. వరంగల్లులో 50 ఏళ్ల కిందట కాళోజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతీనెలా రెండో ఆదివారం సాహితీ మిత్రులంతా సమావేశమై సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడుకునేవారు. అప్పుడే, తాము రాసిన కవితలనూ ఆలపించి చర్చించుకునే వారు. వీటికి కాళోజీ నారాయణరావు, వరవరరావు తదితర కవులు హాజరయ్యేవారు. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. కరీంనగర్ సాహితీమిత్రులకు ఇదే స్ఫూర్తి.
దీనికోసం నలిమెల భాస్కర్ ఇంట్లో రెండేళ్ల కింద బూర్ల వెంకటేశ్వర్లు, గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, నగునూరి శేఖర్లు సమావేశమయ్యారు. కార్యక్రమం కొంచెం ప్రత్యేకంగా ఉండాలను కున్నారు. అప్పుడు పున్నమి, అమావాస్యల ప్రస్తావన వచ్చింది. ఇంకేం... పదుగురితో కలిసి వెన్నెలను ఆస్వాదిస్తూ సాహిత్యం గురించి ముచ్చటించుకునేలా ఖరారైంది. పేరూ కరీంనగర్ యాసలోనే పెట్టారు.
ఇంటి డాబా మీదే
ఇది 2013, ఆగస్టు 21న రాఖీ పూర్ణిమనాడు అన్నవరం దేవేందర్ ఇంటి డాబా మీద శ్రీకారం చుట్టుకుంది. పాతిక మంది కవులు హాజరయ్యారు. అప్పటి నుంచి ఒక్కోసారి ఒక్కొక్కరి ఇంటి డాబా కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొంటున్న వారిలో అరవై ఏళ్లు మొదలుకుని ఆరో తరగతి పిల్లల వరకు ఉంటున్నారు. కవులు, రచయితలే కాదు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, గృహిణులూ, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 19 ముచ్చట్లు జరిగాయి. పట్టణానికే పరిమితం అవుతాయనుకున్న ఈ ముచ్చట్లు ఇప్పుడు జిల్లా అంతా విస్తరించాయి. ఇతర తెలుగు జిల్లాల కవులు, సాహితీకారులనూ ఆకర్షిస్తోందీ కార్యక్రమం. ఈ స్ఫూర్తితో ముంబయిలోని మన వాళ్లూ ‘అరేబియా ముచ్చట్లు’ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నీల ముచ్చట్లులో ఆలపించిన కవితలను పుస్తక రూపంలో తీసుకొచ్చి మరుసటి కార్యక్రమంలో అందిస్తున్నారు. వీటిని ప్రచురించేందుకు సాహితీ సోపతి పేరుతో సంపాదక వర్గాన్ని ఏర్పాటు చేశారు. ముద్రణ ఖర్చును సాహితీ సోపతి మిత్రులు, కొందరు కవులు భరిస్తున్నారు. నలిమెల భాస్కర్, అందెశ్రీ, జూకంటి జగన్నాథం, జింబో తదితర ప్రముఖ కవులు, రచయితలు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలు, విశ్లేషణలను, కవితలను పంచుకుంటున్నారు. ఇప్పటిదాకా 18 సంచికలు వచ్చాయి.
నాన్న స్ఫూర్తితో...
నాన్న వైరాగ్యం ప్రభాకర్ స్ఫూర్తితో కవితలు రాస్తున్నా. జీవితం యాంత్రికంగా మారిపోతున్న తీరు, మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతున్న తీరు బాధ కలిగిస్తోంది. మానవ సంబంధాలే మూలంగా కవితలు రాస్తున్నా. - మానస, విద్యార్థిని
సాహిత్య అభిరుచే కారణం
మా అమ్మానాన్నలు నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. ఎన్నీల ముచ్చట్లకు తరచుగా వస్తూండటంతో నాకూ రాయాలని అనిపించింది. ప్రతి నెలా ఏదో ఒక కవిత రాసుకొచ్చి చదువుతున్నా. తప్పులుంటే వచ్చిన పెద్దలు సరిదిద్దుతున్నారు. - సాయి అక్షిత, విద్యార్థిని
ప్రాంతీయ అస్తిత్వం- జాతీయ దృక్పథం
ఇక్కడి అక్షరార్చన ప్రాంతీయ కోణంలోనే కాదు, జాతీయ, అంతర్జాతీయ సంఘటనల మీదా స్పందిస్తూ విశాల దృక్పథంతో సాగుతోంది. తొలి సమావేశం... మహారాష్ట్రకు చెందిన హేతువాద ప్రచారకుడు నరేంద్ర దభోల్కర్ హత్యను ఖండించి, నివాళులర్పించింది. ఎన్నీల ముచ్చట్ల గురించి విన్న, పశ్చిమగోదావరి జిల్లా పెదపాడుకు చెందిన సాహిత్యాభిమాని కాట్రగడ్డ లక్ష్మీనరసింహారావు వీటిని ఆడియో రికార్డింగ్ చేయించారు. సంచికల ప్రచురణకు విరాళాలూ పంపించారు.
‘ఒకప్పటి కవులు సమాజ స్థితిగతుల్ని లోతుగా అధ్యయనం చేసి కవిత్వం రాసేవాళ్లు. అందుకే అది ప్రజల హృదయాల్లో ఇప్పటికీ నిలిచి ఉంది. ఆ స్ఫూర్తితో ఆ తరహా సాహిత్యాన్ని తేవాలి. ఈ ఎన్నీల ముచ్చట్లు దానికి పునాది అవుతుందనే నమ్మకం ఉందంటారు స్థానిక కవి నడిమెట్ల రామయ్య. ఇటీవల హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ‘ఎన్నీల ముచ్చట్ల’ గురించి వివరించినప్పుడు కొందరు విదేశీ ప్రతినిధులూ ఆసక్తిగా అడిగి తెలుసుకోవడాన్ని ‘ముచ్చట్ల’ నిర్వాహకులు గర్వకారణంగా భావిస్తున్నారు. అందుకే ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగువాళ్లున్న ప్రతీ చోటా జరగాలి.
* * *