అడ్డాల నాడేనా బిడ్డలు?

  • 1049 Views
  • 12Likes
  • Like
  • Article Share

బిడ్డ కంట నీరొస్తే అమ్మ కంట నెత్తురు కారుతుంది! అక్కర లెక్కలకు అతీతమైన ఆ అమ్మప్రేమను అర్థం చేసుకోకుండా... గోరుముద్దలు తిన్న నోటితోనే తల్లిని తూలనాడే తనయులున్నారీ లోకంలో. అలాంటి వారి చేతలు అధర్మానికి చేయూతనందిస్తాయని చెబుతుందా సినీ గీతం. కన్నతల్లిని కాలదన్నే కొడుకులకు కనువిప్పు కలిగించే సాహిత్యం దాని సొంతం.
మనువుతో
మగువ కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కాన్పుతో కొత్త బాధ్యతను స్వీకరిస్తుంది. తనువు చాలించే దాకా ఆ బాధ్యతను నిర్వర్తించడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. వాస్తవానికి ఆమె దృష్టిలో అది బాధ్యత కాదు... తన బతుకు. అందుకే, తను పస్తులున్నా బిడ్డల కడుపు నింపుతుంది. గుండె అరుగుపై అడుగులేయించి వారికి నడక నేర్పుతుంది. వారి భవిత కోసం తన వర్తమానాన్ని పెట్టుబడి చేస్తుంది. ఆ పెట్టుబడిపై లాభాలు సంపాదించే వయసు లోకి వచ్చేసరికి కొందరు బిడ్డలు గతాన్ని మర్చిపోతారు. గోరుముద్దలకు ఖరీదు కట్టే షరాబులుగా మారిపోతారు. అలాంటి కొడుకులకు బుద్ధి చెప్పడానికి ఓ అమ్మ ఏం చేసిందన్నదే ‘అమ్మ రాజీనామా’ చిత్ర ఇతివృత్తం.
      దాదాపుగా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి కావచ్చింది. రష్‌ చూసిన దర్శకుడు దాసరికి... ఎక్కడో ఏదో లోపం కనిపించింది. చిత్రమంతా బాగానే ఉన్నా... ఇంకేదో తగ్గుతోందనిపించింది. చిత్ర కథలోని ముఖ్యాంశాన్ని ప్రతిబింబించే పాట ఒకటుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా స్వయంగా కలం కదిలించారు. అలా పుట్టిన గీతమే ఇది...
సృష్టికర్త ఒక బ్రహ్మ... 
అతనిని సృష్టించినదొక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో...
ఈ సృష్టినే స్తంభింపజేసే తంత్రాలు ఎన్నో...
బొట్టు పెట్టి పూజ చేసి, గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి ఒట్టిపోతే గోవు తల్లే కోతకోత
విత్తు నాటి చెట్టు పెంచితే, చెట్టు పెరిగి పళ్లు పంచితే
తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే
లోకమా ఇది న్యాయమా...
ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్న తల్లే అడ్డు అడ్డు
ఉగ్గు పోసి ఊసు నేర్పితే, చేయి పట్టి నడక నేర్పితే
పరుగు తీసి పారిపోతే, చేయి మార్చి చిందులేస్తే
లోకమా ఇది న్యాయమా...

      ‘అమ్మ’ లేనిదేది సృష్టిలో ఉండదు కదా. ఈ ఆలోచనలోంచే తన పాట పల్లవికి ప్రాణం పోశారు దాసరి. సృష్టికర్త అయిన బ్రహ్మనూ సృష్టించింది ఒక అమ్మే అంటూ ప్రారంభించారు. అయితే, అమ్మకు తెలిసిందల్లా బిడ్డ బాగోగులు చూడçమే. మా అబ్బాయి బంగారమనుకుంటూనే ఉంటుంది ఆ పిచ్చితల్లి. కానీ, బిడ్డ మనసులో మెదిలే కపటాలోచనల  గురించి మాత్రం తనకు తెలియదు. ‘ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో’ అంటూ ఆ విషయమే చెప్పారు దాసరి.  నెత్తురు ధారపోసి పెంచిన తల్లిని తృణీకరించడం ‘చిత్రమే’ కాదు... సృష్టిని స్తంభింపజేసే తంత్రమన్నది ఆయన మాట.
      గోమాత అంటూ ఆవుకు నమస్కరిస్తారు. చక్కగా గడ్డి పెట్టి పాలు పితుక్కుంటారు. ముదిమి మీదపడి పాపం అది వట్టిపోతే... నిర్దాక్షిణ్యంగా కసాయి కత్తికి బలిచేస్తారు. లోకం పోకడ ఇది. చెట్టు విషయంలోనూ అంతే. విత్తు నాటామన్న కృతజ్ఞతతో పళ్లనిస్తుంది తరువు. ఆ అభిమానంలోని రుచిని ఆస్వాదించకుండా కాసుల కోసం చెట్టును కట్టెగా మార్చేస్తోంది మానవ జాతి. ఇది అన్యాయమంటున్నారు దాసరి. మరోవైపు... గోవు, చెట్టులను అమ్మకు ప్రతీకలుగానూ తీసుకున్నారాయన. ఎందుకంటే, ఆవు, చెట్లను దేవతా రూపాలుగా భావించి పూజించడం భారతీయ సంస్కృతిలో భాగం కాబట్టి. ఆవును కబేళాకు పంపడం... చెట్టును కొట్టేయడం... అమ్మను అవమానించడం... అన్యాయమైన ఈ మూడు పనులూ ఒకటే అన్నది దాసరి భావన. అది సహేతుకమే కదా.
      నిజం చెప్పాలంటే, ఆకు చాటు పిందె చాలా ముద్దు. అది అందంగా ఉండటమేకాదు... ఆకు చాటున ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరూ తెంపరు. తల్లి ఒడిలోని బిడ్డ కూడా అంతే సురక్షితంగా ఉంటాడు. ఈ విషయాలే చెప్పారు దాసరి చివరి చరణం తొలి వాక్యంలో. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదంటారు కదా. ‘గడ్డమొస్తే (పెరిగి పెద్దయ్యాక) కన్నతల్లే అడ్డు అడ్డు’ అనడంలో అర్థమిదే. పెళ్లయ్యాక ఆలి బెల్లం - తల్లి అల్లం అవడం వల్లే ఈ పరిస్థితి అన్నది ఈ వాక్యంలో అంతరార్థం. 
      పిల్లాడికి మాటలు బాగా రావాలని ఉగ్గు పట్టించేది అమ్మ. ఆదిగురువుగా ఊసులు (మాటలు) నేర్పించేది అమ్మ.  పడిపోతాడేమోనని చేయిపట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేయిస్తూ నడకను అలవాటు చేసేది అమ్మ. ఇంత చేస్తే... చివరికి ఆమెకు ఏం మిగులుతోంది? పరిగెత్తడం వచ్చిందని చెప్పి తల్లికి దూరంగా పారిపోతున్నాడు కొడుకు! అప్పటి వరకూ పట్టుకున్న అమ్మ చేతిని వదిలేసి మరొకరి(భార్య)తో చేయి కలిపి తన దారి తాను చూసుకుంటున్నాడు. ‘నడక నేర్పిన చేతిని వదిలేసి... చేయి మార్చి చిందులేస్తే’ అనడంలో మరో అర్థమూ ఉంది. నడక నేర్పడమంటే ఎక్కడ ఎలా నడచుకోవాలో చెప్పడం. బాబూ.. అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదంటూ బిడ్డలో విలువలను రంగరించిపోస్తుంది తల్లి. అలా ఆమె దగ్గర ‘క్రమశిక్షణతో కూడిన నడక’ నేర్చుకున్న వాడు... ‘కొత్త’ సావాసాలకు అలవాటు పడి కట్టుతప్పుతున్నాడు. తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ అమ్మనే అవహేళన చేస్తున్నాడు. ఇదెక్కడి న్యాయమని అడుగుతున్నారు దాసరి. 
      తనకంటూ ఏమీ దాచుకోకుండా... అంతా బిడ్డలకే అందించే త్యాగమూర్తి తల్లి. అలాంటి అమ్మను బరువుగా భావించే ప్రతి కొడుకునూ ప్రశ్నించే పాట ఇది. కె.జె.ఏసుదాసు తన గాత్రంతో ఈ గీతానికి పరిపూర్ణత్వం తెచ్చిపెట్టారు. 
అమ్మా అని పిలవని నోరు మట్టిగుంటతో సమానమంటాడు సుమతీ శతకకారుడు. చద్దన్నం మూట లాంటి ఈ మాటను అర్థం చేసుకుని... తల్లిని కనిపెట్టుకుని ఉండే బిడ్డలు ధన్యులు. అమ్మను ప్రేమించడమంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్లే. ఇది సత్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం