దురాచారాలను ఎత్తిచూపిన దుర్భిణి

  • 819 Views
  • 6Likes
  • Like
  • Article Share

తొలిసారిగా దురాచారాలను ప్రశ్నించిన నవల.. సమాజంలోని మూఢ విశ్వాసాలను ఏకరువు పెట్టిన నవల.. సంఘ సంస్కర్తల ఆలోచనలకు ఉత్ప్రేరకంగా పనిచేసిన నవల.. అదే కందుకూరి వీరేశలింగం పంతులు కలం నుంచి వెల్లువెత్తి, ప్రజా మన్నన పొందిన రాజశేఖర చరిత్రము..!
      ఆంగ్లంలో నావెల్‌ అనే మాటను బీజంగా తీసుకుని, తెలుగులో పెద్దకథకు నవల అనే పేరును ప్రతిపాదించాక, తొలి నవలగా ఈ రాజశేఖర చరిత్రమును పరిగణించారు సాహితీవేత్తలు.
      నవలా ప్రక్రియను మరాఠీ, గుజరాతీ, కన్నడ సాహిత్యాల్లో ‘కాదంబరి’ అని అంటారు. సంస్కృతంలో ‘కాదంబరి’ అంటే కావ్యం అని అర్థం. బెంగాలీ, ఒడియా, అస్సామీ, హిందీ, పంజాబీ భాషల్లో ‘ఉపన్యాస్‌’ అని వాడతారు. ఉర్దూలోనూ తెలుగులోనూ ‘నవల’ అనే పేరు ఉంది.
      రాజశేఖర చరిత్రముతో నవలా ప్రక్రియకి ఆద్యుడిగా కందుకూరిని గుర్తించారు. దీని రచనా కాలం 1878 - 1880. ఆంగ్ల]భాషలో ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌ రాసిన ‘వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డ్‌’ అనే గ్రంథానికి నిమిత్తమాత్ర అనుసరణ అయినా, రాజశేఖర చరిత్రములో పాత్రలూ, సన్నివేశాలూ, వాతావరణం అన్నీ తెలుగు ప్రాంతానికీ, తెలుగువారికీ సంబంధించినవి. ఆంగ్ల గ్రంథంలో అయితే కథానాయకుడే ఒక మతాచార్యుడు. రాజశేఖర చరిత్రములో నేపథ్య చిత్రణ పూర్తిగా వేరు. కందుకూరి రచనను జె.రాబర్ట్‌ హచిన్‌సన్‌ ఇంగ్లీష్‌లోకి ‘ఫార్చ్యూన్‌ వీల్‌’ పేరిట అనువాదం చేశాడు. అయితే తొలి నవల ఏదన్న విషయంలో 1872లోనే నరహరి గోపాలకృష్ణ శెట్టి ‘శ్రీరంగరాజు చరిత్ర’ అనే నవలను ప్రకటించినట్లు చెప్పుకుంటారు. ఇదిగాక అనేక వాదాలున్నాయి. 1867లోనే కొక్కొండ వేంకట రత్నం పంతులు రాసిన ‘మహాశ్వేత’ తొలి నవల అని కొందరంటారు.
      పదిహేను ప్రకరణలుగా సాగిన ‘రాజశేఖర చరిత్రము’లో ఆనాటి కాలమాన పరిస్థితులన్నీ యథాతథంగా చిత్రించే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అప్పటి వ్యవస్థలోని సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను, విపరీత పోకడలనూ సందర్భానుసారంగా నవలా పాత్రల చిత్రణలో చొప్పించారు.
      కథా క్రమంలో తొలి ప్రకరణల్లో వర్ణనకు ప్రాధాన్యతనివ్వటం పాత గద్య రీతిని కొంత మేరకు విడిచిపెట్టలేదని అనిపించేలా ఉన్నా, ద్వితీయార్ధంలో మాత్రం ఉత్కంఠభరిత మలుపులతో నవీన పంథాలో పరుగులు పెడుతూ ఈ నవలాశ్వం గగనవిహారం చేయిస్తుంది.
      కథలో ప్రధాన పాత్ర ధవళేశ్వర నివాసి గోటేటి రాజశేఖరుడు. స్థితిమంతుడు. పొగడ్తలకు పొంగిపోయే భోళామనిషి. ఈ సంగతి తెలిసిన బంధువులూ స్నేహితులూ అడ్డూ ఆపూ లేకుండా దానాలనీ, చేబదులనీ చెప్పి సొమ్ము స్వాహా చేస్తుంటారు. గొప్ప పేరు వస్తుందన్న ధ్యాసలో అపాత్రదానం చేయటం రాజశేఖరానికున్న అవలక్షణం. తన చుట్టూ చేరిన భజన బృందానికి అతని అహం దాసోహం అవుతుంది. ఈ ప్రవృత్తిని అతని పాండిత్యం ఏమాత్రమూ గుర్తించలేకపోతుంది.
      రాజశేఖరుని భార్య మాణిక్యాంబ. ముగ్గురు పిల్లలు రుక్మిణి, సుబ్రహ్మణ్యం, సీత. రుక్మిణి భర్త నరసింహ స్వామి దేశాంతరం వెళ్లిపోవటాన ఆమె దిగులుతో అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె వివాహం చూడటానికి వచ్చిన కొందరు బంధువులు ఇంకా రాజశేఖరం ఇంట పబ్బం గడుపుతూనే ఉంటారు. పండితుడైన రాజశేఖరుడు మూఢనమ్మకాలను విశ్వసిస్తూ వాటిలో గొప్పతనముందని సందర్భానుగుణంగా తన గణానికి కూడా చెబుతుంటాడు. గొప్పవాడిగా గుర్తింపబడిన వాళ్లు ఎవరివైపు మాట్లాడినా సమాజం అడ్డు చెప్పదు. ఆ మాట మూఢనమ్మకానికి వత్తాసు పలికితే ఇక సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నిస్తారు వీరేశలింగం.
      మీ అల్లుడు చనిపోయాడంటూ ఒక తప్పుడు సమాచారం అందుతుంది రాజశేఖరానికి. ఇంటిల్లిపాదీ ఏడవటం పూర్తయ్యేనాటికి రుక్మిణి జబ్బు పడుతుంది. ఆ జబ్బు మనోవేదన అని గుర్తించలేక రకరకాలైన వైద్యాలు చేయిస్తారు. అదును చూసుకుని సందట్లో సడేమియాలా మంత్రగాళ్లూ, బైరాగులూ, బుడబుక్కలాళ్లూ, సోదిగత్తెలూ, భూత వైద్యులూ ఎక్కడ లేని తంత్రాలూ ప్రదర్శించి తమ సామర్థ్యాలు ప్రదర్శిస్తారు. 
      రాజశేఖరం ఇంట్లో ఓ సిద్ధాంతి సాయంతో మలయాళీ మాంత్రికుడినంటూ వచ్చిన హరిశాస్త్రులు రుక్మిణికి దయ్యం పట్టిందని, శరభసాళ్వము ప్రయోగించి వదిలిస్తాననీ చెప్పి చేసిన కనికట్టు పాఠకులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక గదిలోకి వెళ్లి అందరినీ బయటికి పంపిస్తాడు హరిశాస్త్రులు. మట్టి మిద్దెకు నడుమగా మేకులు దిగ్గొడతాడు. వాటికి జనపనార తాడును కడతాడు. పొడుగాటి బట్ట ముక్క చించి బొమ్మరాళ్లను కొంచెం కొంచెం దూరాలలో ఆ గుడ్డలో కట్టి, నేతిలో ముంచి, ఆ జనపనార తాడుకు కట్టి వేలాడదీస్తాడు. దాని దిగువన నేలమీద లోతైన ఇత్తడి పళ్లెంలో నీరు నింపి అందులో పువ్వులు వేసి, గుడ్డ కొసకి నిప్పంటించి బయటికి వచ్చేస్తాడు. కాసేపటికి గుడ్డ కాలడంవల్ల బొమ్మరాయి ఒకటి దిగువనున్న ఇత్తడి పళ్లెంలో పడుతుంది. ఇత్తడి పళ్లెంలో నీరు పువ్వులూ ఉంచటంవల్ల ఆ ధ్వని ఒక మనిషిని ఎవరో కొట్టినట్టుగా వినిపిస్తుంది. ఇలా ఒక్కో రాయి పడుతుంటే దయ్యం దిగి వస్తుందంటాడు హరిశాస్త్రులు. ఇలాంటి జిత్తులు ఇప్పటికీ మన మధ్యన ఎందరో ప్రదర్శిస్తున్నా గుర్తించలేని పరిస్థితిని కందుకూరి ఆనాడే హెచ్చరించారు.
      హరించుకుపోతున్న ఆస్తిని పెంచుకోవాలని అత్యాశకు పోయి ఒక బైరాగిని నమ్ముతాడు రాజశేఖరుడు. సువర్ణ విద్య అంటూ నమ్మబలికి ఆ బైరాగి పంగనామాలు పెడతాడు. అలా సర్వం కోల్పోయాక ఆదుకోడానికి బంధువులూ, స్నేహితులూ ఎవ్వరూ రారు. దాంతో వైరాగ్యం పట్టుకుని కాశీయాత్రకి సకుటుంబంగా బయలుదేరతాడు.
      తోవలో వడదెబ్బ తగిలిన రామరాజు అనే బాటసారిని కాపాడతాడు రాజశేఖరుడు. ఆపై అడవులలో ప్రయాణిస్తుండగా దొంగల బారిన పడ్డపుడు రామరాజు సహాయంతోనే తప్పించుకుంటాడు. ఆ దాడిలో రుక్మిణి చనిపోయిందని తీర్మానించుకుంటారు. అక్కడినుంచి భీమవరానికి చేరుకుని తమ బంధువు శోభనాద్రి రాజును ఆశ్రయిస్తాడు.  ఈలోగా కుమారుడు సుబ్రహ్మణ్యాన్ని ఏదైనా ఉద్యోగం చూసుకొమ్మని పిఠాపురం పంపిస్తాడు రాజశేఖరుడు. అయితే, సుబ్రహ్మణ్యయం అక్కడ ఓ దొంగతనం నేరంలో ఇరుక్కుంటాడు.  
      చిన్న కూతురు సీతను పద్మరాజు అనే తన అనుచరునికిచ్చి పెళ్లి చెయ్యమంటాడు వంచకుడైన శోభనాద్రి. ఈ పన్నాగాన్ని రామరాజు అడ్డుకుంటాడు. అయితే రాజశేఖరుడి మీద తప్పుడు నేరం మోపి కారాగారంలో వేయించి, తన మనుషులతో సీతను ఎత్తుకుపోతాడు శోభనాద్రి.
      ఆ మనుషులు రామరాజుని చూసి సుబ్బరాయని ఇంట సీతను వదిలి పారిపోతారు. సీతను తండ్రి దగ్గరికి చేర్చేందుకు రామరాజు, సుబ్బరాయడు కలసి ప్రయాణమవుతారు.
      ఇటువైపు విచారణ నిమిత్తం రాజమందిరానికి వెళ్లిన రాజశేఖరుడికి రామరాజే పెద్దాపురం మహారాజైన కృష్ణజగపతి అని తెలిసి ఆశ్చర్యపోతాడు.
      మరోవైపు పిఠాపురంలో రాజశేఖరుని కుమారుడు సుబ్రహ్మణ్యం, అపవాదు నుంచి తెలివిగా బయటపడి అసలైన నేరస్థులను పట్టించి, పిఠాపురం రాజుగారి అభిమానానికి పాత్రుడవుతాడు.
      సీతను ఇంటికి తీసుకువచ్చిన సుబ్బరాయడు తాను మగ వేషంలో ఉన్న రుక్మిణినంటూ (నరహరి గోపాలకృష్ణమ శెట్టి రాసిన శ్రీరంగరాజ చరిత్రములో ఉన్న ఇటువంటి చిత్రణను కందుకూరి అనుసరించారని అంటారు) కుటుంబాన్ని చేరటం, దేశాటనకు పోయిన ఆమె భర్త తిరిగి రావటం, పోయిన సొమ్ములు దొరకటం, పెద్దాపురం రాజావారు రాజశేఖరుడి మాన్యాలు తిరిగి ఇప్పించటం, ఇవన్నీ కథను సుఖాంతం చేసే దిశలో చక్కటి బిగితో సాగిన మలుపులు.
      ఇక ఆఖరి ప్రకరణంలో రాజశేఖరుడిలో ఎలాంటి మార్పు వచ్చిందో తెలియజేస్తారు. పిల్లలిద్దరికీ సంబంధాలు కుదుర్చుకోవటం నించీ పెళ్లిళ్లు జరిపించటం వరకూ ఎంతో వివేచన కనబరుస్తాడు. అభ్యుదయ భావాలనూ, హేతువాదాన్నీ కనబరుస్తాడు. ఈ ప్రకరణంలోని రాజశేఖరుని ప్రతిమాటా వీరేశలింగం పంతులుగారి ప్రత్యక్ష భాషణంలానే ఉంటుంది. తన సందేశాన్ని ఈ ప్రకరణంలో ఇమిడ్చే ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తుంది. 
      సత్యం, ధర్మం, నీతి, నిజాయతీ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలనే అంతస్సూత్రం పాటిస్తూనే, సాంఘిక దురాచారాలను ఎత్తి చూపటం ప్రధాన లక్ష్యంగా ఈ నవల రాశారు వీరేశలింగం. అందుకోసం కథను సులభ గ్రాంథికంలోనే రాశారు. అచ్చ తెలుగు గ్రామీణ నుడి చాలా సంభాషణల్లో కనిపిస్తుంది. ‘అత్త పోగొట్టినది అడుగోటి కుండ కోడలు పోగొట్టినది కొత్త కుండ’, ‘పిండి బొమ్మను చేసి పీటలమీద పెడితే ఆడతనానికి అదిరదిరి పడిందంట..!’ వంటి సామెతలు స్త్రీల సమస్యలను కళ్లముందుంచుతాయి.
      వితంతువుల సమస్యలు, బాల్య వివాహాల ప్రస్తావనల కన్నా ఎక్కువగా మూఢనమ్మకాలపైనే కథ గురి పెడుతుంది. గ్రహదోషాలు, జాతకాలు, అంజనం వెయ్యటం, భూతవైద్యాలు, లోహాలను బంగారంగా మార్చటం, దొంగ స్వాముల దురాగతాలూ.. ఇలాంటి నమ్మకాల వెనుక ఎలాంటి జిత్తులు ఉంటాయో కథలో సోదాహరణంగా చెబుతారు కందుకూరి. 
      ఆకాశవాణిలో నాటకంగానూ, దూరదర్శన్‌లో సీరియల్‌గానూ ఈ రాజశేఖర చరిత్రము తెలుగు వాళ్లకి మరింత చేరువైంది. ఇప్పటికి ఈ నవలకి నూట ముప్ఫై అయిదేళ్ల వయసొచ్చినా అప్పటి  మూఢనమ్మకాలు మాత్రం ఇంకా మన సమాజంలో అమాయకుల పాలిట ధనపాశం విసురుతూనే ఉన్నాయి.. వీధుల పాలైన ఆ పేదల ప్రాణాలు కందుకూరి బాటను వెతుకుతూనే ఉన్నాయి..!


వెనక్కి ...

మీ అభిప్రాయం