బాలల కథా కేతనం

  • 339 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘చందమామ’ పత్రికలో భేతాళ కథలు అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు టి.జి.ఆర్‌.ప్రసాద్‌. పూర్తి పేరు తాటిచెర్ల గురు రామ ప్రసాద్‌. అయిదు వందలకు పైగా బాలల కథలు రాసి, బాలసాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రతిభాశాలి ఆయన. కడపకు చెందిన ప్రసాద్‌ సాహిత్యం మీద మక్కువతో బీఎస్సీ తర్వాత ఎంఏ తెలుగు చేశారు. కొడవటిగంటి ‘చదువు’ నవల మీద ఎంఫిల్, ‘కర్నూలు జిల్లా జానపద గేయగాథలు’లో పీహెచ్‌డీ అందుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు, కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేశారు. ‘అధికార దాహం, అల్పుని అధికారం, ఎడారి దిబ్బ, ఔదార్యం, కార్యసాధకుడు, తప్పని శిక్ష, నిజమైన పండితుడు, బూటకపు సన్యాసి, మహిమగల పిల్లనగ్రోవి, అన్నదానం, పొట్టితోక, నేరము శిక్ష, వృద్ధాప్యం, నేనంటే నేను’ లాంటి వందల పిల్లల కథలు రాశారు. వీటి మీద కడప, అనంతపురం, తిరుపతి ఆకాశవాణి కేంద్రాల్లో పలు ప్రసంగాలు ప్రసారమయ్యాయి. ప్రసాద్‌ మంచి విమర్శకులు కూడా. పత్రికల కోసం పలు సాహిత్య విమర్శ వ్యాసాలు రాశారు. వాటిలో కొన్నింటితో ‘చేతన’ పొత్తం తెచ్చారు. ప్రసాద్‌ బాలల కథలు 50 ఎంపిక చేసి క్రిష్టిపాటి బాలసుబ్రహ్మణ్యం ‘గోరంత దీపం’ అనే పరామర్శ గ్రంథం తెచ్చారు. మరో వంద కథల మీద సమీక్ష రాశారు. బొందలపాటి సత్యనారాయణ ‘డా।। టి.జి.ఆర్‌.ప్రసాద్‌ బాల కథలు- ఒక సమాలోచన’ అనే పొత్తం ప్రచురించారు. ప్రసాద్‌ కథల మీద తొండాటి బాలసుబ్రహ్మణ్యం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన చేశారు. టి.జి.ఆర్‌. భేతాళ కథల మీద రెడ్డిపోగు సులోచన మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్‌ చేశారు. బాలల కోసం అలుపెరుగని కథా సేద్యం చేసిన ప్రసాద్‌ ఈ మేలో బెంగళూరులో కన్నుమూశారు. బాల సాహిత్యంలో ఆయనకి దక్కాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ, ఆయన కథలు మాత్రం తెలుగు సాహితీ వినీలాకాశంలో వెలుగులు చిందిస్తూనే ఉంటాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం