భాషలేనిది... బంధమున్నది

  • 1244 Views
  • 4Likes
  • Like
  • Article Share

    ఓలేటి శ్రీనివాసభాను

  • హైదరాబాదు
  • 7032480233
ఓలేటి శ్రీనివాసభాను

ఒకరిది మధ్య తమిళనాడులోని కావేరి పరీవాహక ప్రాంతం.. మరొకరిది ఉత్తరాంధ్రలోని నాగావళి తీరం.. మధ్యతరగతి జీవిత నేపథ్యం ఒకరి ఇతివృత్తం.. మట్టిమనుషులు శ్వాసించే యాస మరొకరి ఆయుధం...
ఆ ఇద్దరి ఏకైక సారూప్యం.. నాటకరంగం! సినిమా రంగం కలగలిపిన ఆ ప్రతిభామూర్తుల బంధానికి భాష లేదు.. దర్శకుడు బాలచందర్, రచయిత గణేశ్‌పాత్రోలు లేని లోటు పూడ్చగలిగేది కాదు!
తంజావూరు
జిల్లా నుంచి చెన్నపట్నం చేరుకుని, ఏజీ ఆఫీసు ఉద్యోగంలో కుదురుకుని, బాలచందర్‌ మొదటి నాటకం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ రాసే నాటికి గణేశ్‌పాత్రో పార్వతీపురంలో విద్యార్థి! 
      ప్రముఖనటుడు ఎమ్‌జీఆర్‌ కోరిక మేరకు సినిమా రంగంలో అడుగుపెట్టిన బాలచందర్‌ ‘దైవతాయి’కి సంభాషణలు రాసినప్పుడూ, తాను రాసిన ‘నీర్‌కుమిళ్‌’ నాటకాన్ని తన దర్శకత్వంలోనే తెరకెక్కించినప్పుడూ గణేశ్‌పాత్రో తెలుగు సాహిత్యాన్ని చదువుతూ, నాటకాలు చూస్తూ, కథలు రాయాలనీ, కవిత్వం చెప్పాలనీ, అవకాశం వస్తే రంగు పూసుకుని రంగస్థలం మీద నటించాలనీ ఉవ్విళ్లూరుతున్న రోజులు! తమిళ సినిమా రంగంలో తనదైన స్థానం సంపాదించుకున్న బాలచందర్‌ తెలుగు తెరకి పరిచయమైన సమయానికి పాత్రో నాటక రచయితగా జన్మించడం విశేషం! మధ్యతరగతి జీవితంలోని అట్టహాసాల్నీ, ఆర్భాటాల్నీ ఆటపట్టిస్తూ బాలచందర్‌ రాసిన ‘భామా విజయం’ నాటకం ఆయన దర్శకత్వంలోనే తమిళంలో సినిమాగా వెలువడి ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం ఆధారంగా జెమినీ వారు తెలుగులో బాలచందర్‌ దర్శకత్వంలోనే ‘భలేకోడళ్లు’గా నిర్మించారు. ఆ రోజుల్లోనే గణేశ్‌పాత్రో ‘పావలా’ కాసుని ఎగరేసుకుంటూ వచ్చారు. ఆయన రాసిన ‘పావలా’ నాటిక ఒక సంచలనం. పరిషత్తు వేదికల మీద బహుమతులు సొంతం చేసుకుంటూ విజయవిహారం చేయడం మొదలు పెట్టింది.
      తమిళనాట బాలచందర్‌ నాటకాలూ, సినిమాలూ మధ్యతరగతి బతుకులోని ఆటుపోట్లను చిత్రిస్తే ఇక్కడ గణేశ్‌పాత్రో ‘పావలా’ ఉత్తరాంధ్ర మట్టి మనుషుల ఆరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అంతకు మునుపు ‘కనక పుష్యరాగం’ నాటకానికి అజ్ఞాత రచయితగా మిగిలిపోయిన పాత్రో ప్రతిభకి సొంత ముద్ర లభించింది. గుర్తింపు దొరికింది. ‘పావలా’ విజయంతో... లాభం, మృత్యుంజయుడు, ఆగండి కొంచెం ఆలోచించండి, తెరచిరాజు, కొడుకుపుట్టాల, ధర, దేశం కొంచెం మందుపుచ్చుకుంది... లాంటి నాటికలు, అసురసంధ్య, తరంగాలు లాంటి నాటకాలు తెలుగు ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
      ఆలోగా బాలచందర్‌ తన అభిమాన రంగమైన నాటకరంగంలో అప్పటికే స్టార్లుగా నాగేశ్, షావుకారు జానకి లాంటివారితో కనిపిస్తూ, మరో వైపు తన మధ్యతరగతి మాయాజాలంతో తక్కువ బడ్జెట్‌లో, కొత్త తారలతో సినిమాలు తీస్తూ, ఇతర భాషల్లోకి విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో ‘సత్తెకాలపు సత్తెయ్య’, ‘బొమ్మా-బొరుసా’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ మధ్యకాలంలో గణేశ్‌పాత్రో రచనల ద్వారా పైకి వచ్చిన నటీనటులు ‘నీడలేని ఆడది’ చిత్రం ద్వారా సినిమాలోకి అడుగుపెట్టారు. గణేశ్‌పాత్రోకి సినిమా తలుపులు ఇంకా తెరచుకోని పరిస్థితుల్లో నటుడు గుమ్మడి పాత్రో రాసిన ‘కొడుకుపుట్టాల’ నాటిక చూడటంతో కథ మలుపు తిరిగింది. ప్రముఖ నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి తన సొంత సంస్థ ద్వారా గణేశ్‌పాత్రోను తెలుగు తెరకు పరిచయం చేశారు. ‘కొడుకు పుట్టాల’ నాటికను వెండితెరకు అనువుగా విస్తరింపజేసి కృష్ణంరాజు హీరోగా ‘నాకూ స్వతంత్రం వచ్చింది’ పేరుతో చిత్రాన్ని నిర్మించారు. అక్కణ్నుంచి దర్శకుడు ప్రత్యగాత్మ ద్వారా ‘పిఏపి’లోకి ప్రవేశించిన పాత్రోకి ఆత్రేయ సాన్నిహిత్యం బాలచందర్‌ పాఠశాలకు చేరువచేసింది.
      ‘బొమ్మా బొరుసా’ తీసిన అయిదేళ్ల తర్వాత ‘అంతులేనికథ’ ద్వారా బాలచందర్‌ తెలుగులోకి వచ్చారు. ఆత్రేయ మాటలు - పాటలు ఆ చిత్ర విజయానికి అండగా నిలిచాయి. ఆత్రేయ అభిమానాన్ని, ఆశీస్సుల్నీ పొందిన పాత్రో బాలచందర్‌ సహాయకుడైన ఈరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘చిలకమ్మ చెప్పింది’కి మాటలు రాశారు. అందులో అద్భుత నాటకీయత, కవితాత్మకత కలబోసి పాత్రో రాసిన సంభాషణలు చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. రజనీకాంత్‌ తొలిసారిగా తెలుగులో నటించిన ఆ చిత్రంలో గణేశ్‌పాత్రో ఆయన మిత్రుడిగా ఓ సన్నివేశంలో నటించారు కూడా! ‘చిలకమ్మ చెప్పింది’ ద్వారా గణేశ్‌పాత్రో సంభాషణ రచయితగా సాధించిన విజయం ఆయనకి నేరుగా బాలచందర్‌తో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అంతకుముందు బాలచందర్‌ తెలుగులో తీసిన మూడు సినిమాలూ తమిళమాతృకల ఆధారంగా వచ్చినవే. కానీ పాత్రోను రచయితగా పెట్టుకుని నేరుగా తెలుగు కథతో బాలచందర్‌ ‘మరోచరిత్ర’ తీశారు. అది సాధించిన అనూహ్య విజయం చరిత్రను తిరగరాసింది. ఆ ఇద్దరి కాంబినేషన్‌కి బలమైన పునాదులు వేసింది.
      ఇద్దరూ నాటకరంగం నుంచి రావడం ఆ జోడీకి కలిసివచ్చింది. వారి ఆలోచనల కలగలుపు నుంచి సరికొత్త సృజన రూపుదిద్దుకుంది. అంతకు ముందు బాలచందర్‌ తెలుగులో తీసిన సినిమాల్లో ఎంతలేదన్నా కనిపిస్తూ వచ్చిన తమిళ పోకడలు పాత్రో రాకతో పూర్తిగా మారిపోయాయి. కారణం పాత్రో అనువాదకుడిలాగా కాకుండా స్వతంత్ర సృజనకారుడిగా ఆలోచించడమేనని సన్నిహితులు చెబుతారు. తన దర్శకుడు సూచించిన లైన్‌ని ఊతంగా చేసుకుని పాత్రో నూరుపాళ్ల తెలుగుదనం ఉట్టిపడేలాగా పాత్రల్నీ, సంభాషణల్నీ పండించారు.
      ఎక్కడా మూలం తాలూకు ఛాయలు కనిపించని తెలుగు నుడికారం వాటిలో గుబాళిస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణ మరో చరిత్రలో ‘‘నీ బొట్టు ఏమైంది?’’ అని అన్నయ్య అడిగితే ‘‘కన్నీటి బొట్టు అయింది’’ అని చెల్లెలు చెప్పిన డైలాగ్‌! ఇది కేవలం తెలుగులోనే రాయాల్సిన, రాయగలిగిన సంభాషణ. ఇలాంటి వాటికి మూలాలు ఉండవు. అనువాదానికి లొంగవు.
      ‘మరోచరిత్ర’తో స్థిరపడిన వారి అనుబంధం అనేక చిత్రాలతో కొనసాగింది. అందమైన అనుభవం, ఇది కథకాదు, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, ఆడాళ్లూ మీకు జోహార్లు, తొలి కోడి కూసింది, కోకిలమ్మ, రుద్రవీణ లాంటి చిత్రాలు ‘పాత్రో’చిత సంభాషణలతో వాసికెక్కాయి. ఆయన ప్రతిభ బాలచందర్‌ చిత్రాలకే పరిమితం అనుకుంటే పొరపాటు. ఇతర దర్శకుల చిత్రాల్లో సైతం గణేశ్‌పాత్రో ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. మయూరి, మనిషికో చరిత్ర, ముక్కుపుడక, సంసారం ఓ చదరంగం, స్వాతి, సీతారామయ్యగారి మనవరాలు లాంటి సినిమాలు ఇందుకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు. భార్గవ్‌ ఆర్ట్స్‌ వారి చిత్రాల్లోని వాణిజ్య కోణాన్ని దృష్టిలో ఉంచుకుని తన కలానికి రెండు వైపులా పదునుందని పాత్రో నిరూపించుకున్నారు.
      బాలచందర్‌కీ పాత్రోకీ మధ్య పదిహేనేళ్ల తేడా! ఒకరి స్థానంలో మరొకరు, ఒకరి ఆలోచనలతో శ్రుతి కలుపుతూ మరొకరు కూర్చొని వెండితెర కథనీ కథనాన్నీ సమకూర్చగలిగే చాతుర్యం ఆ ఇద్దరినీ విజయవంతమైన జోడీగా నిలిపింది. అందుకేనేమో కొద్ది రోజుల తేడాలోనే కథా చర్చల కోసం కాబోలు.. ఒకరి వెంట మరొకరు వెళ్లిపోయారు. తమ తొలి చిత్రంలోని ‘భాషలేనిది.. బంధమున్నది’ అన్న ఆత్రేయ మాటల్ని అక్షరాలా నిజం చేశారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం