ఆదిమభాషలకు ఆలంబన

  • 317 Views
  • 1Likes
  • Like
  • Article Share

    అపర్ణ

ప్రఖ్యాత ఆంగ్లేయ నావికుడు కెప్టెన్‌ కుక్‌ 1770లో తన విశ్వయాత్రలో భాగంగా ఆస్ట్రేలియాలో కొన్ని వారాలు గడిపాడు. స్థానికులతో మాటామంతి పెంచుకునేందుకు అక్కడి ‘గూగు- యుమిద్ధిర్‌’ భాషలోని వంద పదాలను, జాతీయాలను నమోదు చేసుకున్నాడు. వాటిలో ఒకటే.. ఆస్ట్రేలియా అనగానే గుర్తుకొచ్చే కంగారుకు మాతృక ‘గుంగుర్రు’ (‘నాకు తెలియదు’ అని అర్థం!). కేప్‌యార్క్‌ పెనిన్సులా ప్రజల మాతృభాష అయిన ఈ ‘గూగు- యుమిద్ధిర్‌’ది వేలాది సంవత్సరాల చరిత్ర! కానీ, ఇప్పుడు ఆ భాష వేగంగా అంతరించిపోతోంది. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న భాషలు ఆస్ట్రేలియాలో వందల్లో ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి ప్రస్తుతం అక్కడ స్ఫూర్తిదాయక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నార్మన్‌
తిండాల్‌ అనే సామాజికవేత్త 1974లో చేసిన అధ్యయనం ప్రకారం పద్దెనిమిదో శతాబ్దంలో ఆస్ట్రేలియాలో మూడొందల నుంచి ఏడొందల స్థానిక భాషలు చెలామణీలో ఉండేవి. ఏ సమాజ సంస్కృతికైనా మాతృభాష పట్టుగొమ్మ లాంటిది. తరతరాల తమ చారిత్రక సంపదను, సాంస్కృతిక ప్రత్యేకతను తమదైన శైలిలో భావితరాలకు, ప్రపంచానికి తెలియజేయటానికి అది అత్యావశ్యకం. మానవ సంబంధాలను పటిష్ట పరచటంలోనూ అమ్మభాష పాత్ర అద్వితీయం. అయితే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మూలభాషలను కోల్పోతున్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటని యునెస్కో నిర్ధరించింది. ఆ సంస్థ 2005లో నమోదు చేసిన అక్కడి మూలభాషల్లో దశాబ్దం గడిచేసరికి పదిహేడు శాతం కనుమరుగయ్యాయి. ఇక పద్దెనిమిదో శతాబ్దంలో వాడుకలో ఉన్న భాషల్లో అయితే సగానికి పైగా అంతరించిపోయాయి. 2016కి వచ్చేసరికి 160 భాషలు మాత్రమే.. అదీ ఇంటికి పరిమితమైన స్థితిలో మిగిలాయి. ప్రస్తుతమైతే పిల్లలు కూడా సంభాషించగలిగిన భాషలు కేవలం పదమూడు! వీటిలో ‘ద్జామ్బర్పుయుంగు’ భాషను అత్యధికంగా 4,264 మంది వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ భాషలను కాపాడుకోవడానికి కొన్ని సంస్థలు సాంకేతికత సాయం తీసుకుంటున్నాయి.
      ‘అక్షరాస్యతే స్వేచ్ఛ’ అనే నినాదంతో పురుడుపోసుకున్న ‘ది ఆస్ట్రేలియన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ’ సంస్థ (ఏఎల్‌ఎన్‌ఎఫ్‌) ఆస్ట్రేలియా మూలభాషల పునరుజ్జీవానికి కృషిచేస్తోంది. ఏ భాషైనా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతోనే నిలబడుతుందన్నది ఈ సంస్థ ప్రగాఢ విశ్వాసం. ఆ క్రమంలో మూలభాషలను తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లటానికి సాంకేతికతను ఆయుధంగా మార్చుకున్నారీ సంస్థ సభ్యులు. ఆయా భాషల అక్షరాలు, పద ఉచ్చారణ, వాక్యనిర్మాణం, వ్యాకరణం తదితరాలతో పరస్పర వినిమయ దృశ్య శ్రవణ సాధనాలే (ఇంటరాక్టివ్‌) బోధనోప కరణాలుగా పిల్లలకు సైతం అర్థమయ్యేలా ఓ అంతర్జాల వేదికను రూపొందించారు. ‘‘మా దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈ బోధనోపకరణాలే మార్గదర్శకాలు. మా కార్యక్రమాలు మాతృభాషా జిజ్ఞాసుల శ్రవణ, భాషణ, పఠన, లేఖన నైపుణ్యాలను పెంపొందించేలా మాత్రమే కాదు, భాష బాగా తెలిసిన వాళ్ల జ్ఞానాన్ని రాబోయే తరాల కోసం కూడబెట్టటానికి కూడా ఉద్దేశించి ఉంటాయి’’ అంటారు ఏఎల్‌ ఎన్‌ఎఫ్‌ బృంద నాయకుడు ఎరిక్‌ బ్రేస్‌.  
      ఆస్ట్రేలియా మూలభాషల్లో ఒక్కొక్క దాన్ని నమోదు చేయడానికి, ఆయా భాషల విశేషాలను ముందు తరం నుంచి సేకరించి.. ఆ జాతి మొత్తానికి అందించడానికి ఏఎల్‌ఎన్‌ఎఫ్‌ అంతర్జాల వేదిక ఓ సాధనంగా నిలుస్తోంది. ఆ క్రమంలో ఇదో విజ్ఞాన భాండాగారంగా భాసిస్తోంది. ‘‘ప్రాచీన భాషలను కాపాడటం మన చారిత్రక, సాంస్కృతిక అవసరం మాత్రమే కాదు, భావి తరాల మేధో వికాసానికి పునాది కూడా. మాతృభాషా నైపుణ్యాలు, మరొక భాష వ్యాకరణాన్ని సులువుగా అర్థం చేసుకోవటానికి ఉపకరిస్తాయి. అందుకే నేరుగా పరాయి భాషను నేర్చుకోవటం కంటే ముందుగా మాతృభాషలో పట్టు సాధించడం మంచిది’’ అంటారు ఎరిక్‌ బ్రేస్‌. దీనికి నిదర్శనంగా ‘పిట్జంట్జట్జర’ భాష ఉచ్చారణ.. ఆంగ్ల భాషను సరిగ్గా పలకడానికి ఎంతో సాయపడటాన్ని చూపిస్తారాయన. ప్రాథమిక దశలో భాషా పరిరక్షణలో సంతృప్తికరమైన ఫలితాలను సాధించిన ఏఎల్‌ఎన్‌ఎఫ్‌ బృందం.. ఇప్పుడు పూర్తిస్థాయిలో భాషలను కాపాడటానికి వ్యూహాలను రచిస్తోంది.   
మద్దతుగా ఓ మరమనిషి!
ఏఎల్‌ఎన్‌ఎఫ్‌ కృషికి సమాంతరంగా దేశీయ భాషల సంరక్షణకు క్వీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా పరిశోధక మండలి ‘ఓపీ’ అనే మరమనిషికి ప్రాణంపోశాయి. పదేళ్లలోపు బాలబాలికలకు కనుమరుగవుతున్న వారి మాతృభాషలను నేర్పించేందుకు అనువుగా దీన్ని వారు సృష్టించారు. ఇదో రెండడుగుల చెక్క బొమ్మ. ఆయా ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకృతమై ఉండే ఈ బొమ్మలు పిల్లలను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ బొమ్మల్లో రెండు డిజిటల్‌ టాబ్లెట్లను అమర్చారు. ఒక టాబ్లెట్‌ చిన్నారుల కదలికలను గమనిస్తుంది. మరొకదాంట్లో ఆయా ప్రాంతీయుల మూలభాషల్లోని ప్రాచీన కథలు శ్రవణ రూపంలో ఉంటాయి. అంతేకాదు, ఆ కథలను విన్న తర్వాత పిల్లల అవగాహన, గ్రహణ, జ్ఞాపక శక్తులను పరీక్షించే ఆటలు ఉంటాయి. ‘‘మన మాతృభాషను కాపాడుకోవటానికి సాంకేతికత ప్రత్యక్షంగా ఎలాంటి సాయం చేయకపోవచ్చు. కానీ, భాషాబోధనలో అధ్యాపకులకు అదో అమూల్య ఉపకరణం అవుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు’’ అంటారు ఓపీ రూపకర్తల్లో ఒకరైన ఆచార్య జానెట్‌వైల్స్‌. ఈ ఓపీ రెండు ప్రాంతీయ భాషల ప్రజలకు సమర్థంగా సేవలందిస్తోంది. దీన్ని ఇతర భాషల్లోకి కూడా తీసుకెళ్లడానికి జానెట్‌వైల్స్‌ బృందం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇటీవలే ఆస్ట్రేలియన్‌ జాతీయ, చార్లెస్‌ డార్విన్‌ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ‘బైనింగ్‌ కున్వోక్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధిచేశాయి. దీని సాయంతో అంతర్జాలంలో ప్రజలు ఒకరికొకరు భాషను నేర్పించుకునే అవకాశాన్ని కల్పించాయి.
      ‘‘చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియా భిన్నమైంది. ఆయా ప్రాంతాల్లో పది ఇరవై భాషలు ఉండవచ్చునేమో కానీ ఆస్ట్రేలియా కొన్ని వందల భాషలకు పుట్టిల్లు. యూరోపియన్లు ఈ దేశంలోకి అడుగుపెట్టే సమయంలో దాదాపు అయిదు వందల తెగలు ఏడొందల భాషలను మాట్లాడుతూ ఉండేవి. 1970 వరకూ ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఈ భాషలను చిన్నచూపు చూడటంవల్లే నేడు ఈ దుస్థితి దాపురించింది. ఇన్ని రకాలుగా ఇన్ని సంస్థలు, వ్యక్తులు భాషా పరిరక్షణకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వ సాయం తక్కువగానే ఉంది’’ అంటారు సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య రాచెల్‌హెండ్రి. నిరుడు ప్రాంతీయ భాషా నివేదికను రూపొందించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ క్రమంలో ఓ ముందడుగైతే వేసింది. కానీ, ఆ కృషి ఇంకా వేగవంతమవ్వాల్సి ఉంది. భాషాస్పృహ కలిగిన వ్యక్తులు, బృందాల ప్రయత్నాలకు ప్రభుత్వం చేయూత తోడైతేనే ఆస్ట్రేలియా మూలభాషలు తిరిగి జవసత్వాలద్దుకుంటాయి. దేశీయ సంస్కృతులతో పాటు ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి అత్యవసరమైన ఈ కృషిలో అక్కడి పాలకులు నిబద్ధతతో వ్యవహరిస్తారని ఆశిద్దాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం