అనగనగా...

  • 2144 Views
  • 94Likes
  • Like
  • Article Share

    డా।। కడిమిళ్ల శ్రీరామచంద్ర వరప్రసాదరావు

  • నరసాపురం, పశ్చిమగోదావరి
  • 9247879606
డా।। కడిమిళ్ల శ్రీరామచంద్ర వరప్రసాదరావు

అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఈ కథ తెలియని తెలుగువారుండరు. తరతరాలుగా ఈ కథ తెలుగువారి నోళ్లల్లో నానుతూనే ఉంది. విచిత్రమేంటంటే భారత భాగవతాలను మించి ప్రచారానికి వచ్చిన ఈ కథను రాసిందెవరో తెలియదు. అజ్ఞాతకవి నోటి నుంచి వెలువడిన ఈ కథ అజరామరమైపోయింది. ఇంతకూ దీని ప్రారంభంలో పలికే ‘అనగనగా’ అంటే అర్థం చాలామందికి తెలియదు.
      ఒక రాజుగారు ఉన్నారు అని చెప్పగానే అతణ్ని నువ్వు చూశావా? అని పిల్లాడు అడిగితే లేదని సమాధానం చెప్పాలి. మరి నీకెలా తెలుసు అని అంటే ‘మా అమ్మ నాకు చెప్పింది’. ‘ఓ! అయితే అమ్మమ్మ చూసిందా’? లేదు. ఆమెకు వాళ్ల అమ్మ చెప్పింది. ఇలా ఒకరు మరొకరితో అనగా, వారు మరొకరితో అనగా, ఇలా అనగా అనగా తరాలు దాటి ఈ కథ వ్యాపించిందని భావం. అనగా అనగా అనేది ‘అనగనగా’ అని మారిపోయింది. వెరసి ఆ మాట పూర్వకాలంలో, లేదా ఒకానొకప్పుడు అనే అర్థంలో జాతీయంగా మారిపోయింది.
      జాతీయం అంటే శబ్దాలకు ఉన్న అర్థాన్ని విడిచిపెట్టి, వేరే అర్థంలో ఒక భాషాజాతి మొత్తం వ్యవహరించే పదసముదాయం అని అర్థం. అలాంటి జాతీయాల్లో అదే అర్థాన్నిచ్చే వేరే పదాలు చేరినా, కొన్ని అక్షరాలు మారినా ఆ జాతీయత పోయి, కేవలం శబ్దార్థం మాత్రమే మిగులుతుంది. ఉదాహరణకు ఈ అనగనగా అన్న దాన్ని విడదీసి అనగా అనగా అంటే పూర్వకాలంలో అనే అర్థం రాదు. ఒక మాటను మళ్లీ మళ్లీ అనగా అనే అర్థమే వస్తుంది. అందుకనే వేమన ‘‘అనగ ననగ రాగ మతిశయిల్లు’’ అంటాడు. సంగీతంలోని రాగాలను పదే పదే అంటుంటేనే, ఆ అభ్యాసంతోనే పట్టుబడుతుందని అర్థం. అదే అనగనగా రాగం అంటే ‘పూర్వకాలంలో రాగం’ అని అర్థం మారిపోతుంది. ‘కన్నుమూయు’ అనేది ఒక జాతీయం. నిజానికి ఆ పదసంపుటిలో ఒక కన్నును మూయుట అనే అర్థమే ఉంది. కానీ తెలుగు భాషాజాతి ఆ పదబంధాన్ని ‘మరణించుట’ అనే అర్థంలో ఉపయోగిస్తుంది. కాబట్టి అది జాతీయమైంది. అదే కన్నులు మూయు అంటే రెండు కళ్లూ మూసుకోవడం అనే అర్థమే వస్తుంది కానీ మరణించడమనే అర్థం రాదు.
అతి వినయం ధూర్తలక్షణం
అతి వినయం అనే మాటకు మిక్కిలి వినయం అనే అర్థం. కానీ అది ధూర్తలక్షణం అనే అర్థంలో జాతీయంగా మారిపోయింది. ‘అతి వినయుడు’ అంటే మాత్రం ధూర్తుడు కాడు. తిక్కన అర్జునుడి గురించి చెబుతూ అశ్వమేథపర్వంలో ‘‘అతివినయుండునౌచు’’ అంటాడు. అక్కడ అర్జునుడు మిక్కిలి వినయవంతుడై అనే అర్థం. ఒక్క అక్షరం మారేసరికి జాతీయత పోతుంది. ‘కొంప మునుగు’, ‘కొంపలు మునుగు’, ‘కొంప అంటుకును’, కొంపలు అంటుకును’ అనేవి ఏక వచన బహువచనాలు రెంటిలోనూ జాతీయాలుగానే ఉంటాయి. నిజానికి ‘కొంప మునగడం’ అంటే నీళ్లల్లో మునగడం కాదు. ‘కొంప అంటుకోవడం’ అంటే అగ్నిప్రమాదమనీ కాదు. ఏదో అవాంఛనీయ సంఘటన జరుగుతుందనే అర్థంలో జాతీయాలుగా స్థిరపడ్డాయి ఆ పదబంధాలు. అయితే వాటిలో కొంప అనే పదం స్థానంలో అదే అర్థాన్నిచ్చే గృహశబ్దం పెట్టి గృహం మునిగిందంటే నీళ్లల్లో మునిగిందనే అర్థం. గృహం అంటుకుందంటే అగ్నిప్రమాదం సంభవించిందనే అర్థం.
      ‘పుట్టి పుట్టడు’ అని ఒక మాటుంది. వ్యవహారంలో పుట్టీ పుట్టడు అని వినబడుతుంటుంది. ‘పుట్టి’ అంటే పుట్టాడు. ‘పుట్టడు’ అంటే పుట్టలేదు. పుట్టి పుట్టకపోవటమేమిటి. నిజానికి ఆ పదబంధానికి అర్థం పొసగదు. కానీ, నిన్న గాక మొన్న పుట్టినవాడు, మిక్కిలి చిన్నవాడు అనే అర్థంలో అది జాతీయంగా మారింది. పోతన భాగవతంలో గోపికలు యశోదతో బాలకృష్ణుడి మీద నేరాలు చెప్పే సందర్భంలో ‘‘పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మా యిలు సొచ్చి’’ అంటారు. అంటే అంత చిన్నపిల్లాడు మా ఇళ్లకు వచ్చి దొంగతనం చేయటమేంటా అని వారి ఆశ్చర్యాన్ని ప్రకటించారన్న మాట. 
నాలుగు రాళ్లు.. నీళ్లు నములు
‘ఒరేయ్‌! బాగా చదువుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుంటే బాగుపడతావురా!’ అంటారు. ‘నాలుగు రాళ్లు’ అనేది కూడా జాతీయమే. నాలుగురాళ్లు వెనుక వేసుకోవడమంటే నిజంగా నాలుగు కంకర రాళ్లు ఇంటి వెనుక వేయడం అనే అర్థాన్ని విడిచిపెట్టి, కావల్సినంత ధనాన్ని సంపాదించుకోవడం అనే అర్థంలో జాతీయంగా మారింది. వాడికి ‘కడుపుమంట’ అంటారు. అంటే కడుపులో మంట పుట్టింది. వైద్యం చేయించుకోవాలనే అర్థం కాదు. వాడు ఈర్ష్యాగ్రస్థుడు అనే అర్థంలో అది జాతీయమైంది. ఒక్క అక్షరం పెంచి కడుపులో మంట అంటే మాత్రం అనారోగ్యమనే శబ్దార్థమే తప్ప, ఈర్ష్య అనే జాతీయార్థం రాదు. అలాగే నచ్చని మాటను విన్నా, నచ్చని సన్నివేశం ఏర్పడినా ‘కడుపు మండిపోతుంది’ అంటారు. చాలా బాధ, క్రోధం కలిగాయనే అర్థంలో అది జాతీయమైంది.  
      అలాగే ‘నీళ్లు నములుతున్నాడు’ అంటే నోట్లో నీళ్లు పోసుకొని వాటిని నములుతున్నాడు అని అర్థం కాదు. ఎవరైనా ఒక గట్టి ప్రశ్న వేస్తే దానికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడ్డాడని అర్థం. ‘గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాడు’ అంటే తన చేతులతోనే తీసుకుంటున్నాడని అర్థం కాదు. సోమరితనంతో కాలయాపన చేస్తున్నాడని అర్థం. నిజానికి గోళ్లు అన్న శబ్దానికి గాని, గిల్లుకొను అనే క్రియకు గాని సోమరితనం అనే అర్థం లేదు. శబ్దార్థాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాం కాబట్టి అది జాతీయం.
      ‘వాడికి కళ్లు నెత్తికెక్కాయి’ అంటారు. ఎవరికీ కళ్లు నెత్తిమీదికి రావు. అహంకారం పెరిగిపోయిందని అర్థం. నిజానికి కళ్లు అనే శబ్దానికి కానీ, నెత్తి అనే శబ్దానికి కానీ, ఎక్కు అనే క్రియకు కాని అహంకారం అనే అర్థం లేదు. అయినా ఆ అర్థంలోనే వాడుతున్నాం కాబట్టి అది జాతీయం. విదురుడు ఎన్నోమార్లు దుర్యోధనుడితో పాండవులతో గొడవ వద్దు. యుద్ధం వద్దు. సంధిచేసికోమని ‘చెవినిల్లు కట్టుకొని చెప్పాడు’. ఇక్కడ చెవినిల్లు కట్టుకొని అంటే చెవిలో ఇల్లు కట్టుకొన్నాడని కాదు. అదే విషయాన్ని ఎన్నోమార్లు చెప్పాడని అర్థం. మనం ఏ నిఘంటువు చూసినా చెవి, ఇల్లు, కట్టుకొను అనేవాటికి పలుమార్లు అనే అర్థం ఉండదు. అయినా ఆ అర్థంలో తెలుగు జాతి వ్యవహరిస్తోంది కాబట్టి అది జాతీయం.
      ‘ఒరేయ్‌! ఆ మాయదారి మందు అలవాటు నీకెలా వచ్చిందిరా? ఆరోగ్యం పాడయిపోతుందిరా! మానెయ్యరా! అని ‘నెత్తీనోరు బాదుకొని’ చెప్పాను. అయినా నా మాట వినలేదు. ఇదిగో ఇప్పుడు మంచాన పడ్డాడు’ అంటూ ఒక తల్లి తన గోడు వెళ్లబోసుకుంటుంది. ఇక్కడ నిజంగా నెత్తిని, నోటిని కొట్టుకొంది అని అర్థం కాకుండా చాలా బాధపడింది అనే అర్థం వచ్చింది కనుక జాతీయం. వాడు పెద్ద వాగుడుకాయలెండి అంటుంటారు. ‘వాగుడుకాయ’ అనేది ఒక చెట్టుకు కాసిన కాయ కాదు. అతిగా మాట్లాడేవాడు అని అర్థం. వాగుట అనే పదానికి ఎక్కువగా మాట్లాడుట అనే అర్థం ఉన్నా, కాయ అనే పదానికి మనుజుడు అనే అర్థం లేదు. అయినా ఎక్కువగా మాట్లాడేవాడు లేదా సమయ సందర్భాలు లేకుండా మాట్లాడేవాడు అనే అర్థంలో వ్యవహారం ఏర్పడి అది జాతీయం అయింది. వేసవికాలం వచ్చిందంటే ఆ ఊళ్లో ఒక పేట మొత్తం పరశురామప్రీతి జరిగింది అని దినపత్రికలలో వస్తుంటుంది. అంటే అగ్నిదగ్ధమయిందని అర్థం. నిజానికి పరశురాముడు దుష్టసంహారం తన గొడ్డలితో చేశాడు కాని అగ్నికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. అయినా జాతీయం అలా పుట్టింది. ఇలా పురాణ కథలకు భిన్నంగా కూడా కొన్ని జాతీయాలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిని మనం మార్చలేం. మార్చకూడదు కూడా.
పొయ్యిలో పిల్లి.. కడుపులో ఎలుకలు
పాపం వారింట్లో ‘పొయ్యిలో పిల్లి కదలలేదు’ అంటారు. ఇప్పుడంటే గ్యాస్‌పొయ్యిలొచ్చాయి కాని, పూర్వం కట్టెపొయ్యిల మీదే వండుకునేవారు. చలికాలం రాత్రివేళ పొయ్యి వెచ్చగా ఉంటుంది కనుక దాంట్లో పిల్లులు పడుకుంటుండేవి. తెల్లవారాక వంట వండటంకోసం ఆ ఇంటి ఇల్లాలు పొయ్యిదగ్గరకు రాగానే అది లేచి వెళ్లిపోయేది. ఆరోజు పాపం వారింట్లో వంట దినుసులు లేక, పొయ్యి దగ్గరకే వెళ్లలేదనుకోండి, అప్పుడా పిల్లి అక్కడే లేవకుండా పడుకుంటుంది. అందువల్ల పొయ్యిలో పిల్లి లేవలేదు అనే మాట ‘పస్తున్నారు’ అనే అర్థంలో జాతీయంగా మారిపోయింది. ఇందులో పస్తుండుట అనే అర్థం వచ్చే పదమేదీ లేకపోయినా, ఆ అర్థం రావడానికి విషయంతో కొంత సంబంధముంది. కొన్ని జాతీయాలు ఏర్పడటానికి ఇలా కొంత సంబంధం కనిపిస్తుంటుంది. అలాగని అన్నింటికీ ఉండదు.
      అమ్మా! నా ‘కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి’ అంటాడు కొడుకు. ‘పదినిమిషాలలో వంట అయిపోతుంది. వడ్డించేస్తాను’ అంటుంది అమ్మ. కడుపులో ఎలుకలు పరుగెత్తడానికి... వంట అయిపోయింది, వడ్డించేస్తాను అనడానికి సంబంధమేమిటి? నిజానికి కడుపులో ఎలుకలు పరుగెత్తవు. చాలా ఆకలిగా ఉంది అనే అర్థంలో అది జాతీయమైంది. ఎలుకలు తిండిగింజలు ఎక్కడున్నాయా అని వెతుక్కొనేందుకు అటూ ఇటూ పరుగెడుతుంటాయి. గింజలు దొరికితే ఇక కదలకుండా చడీ చప్పుడూ లేకుండా వాటిని తింటుంటాయి. జఠరాగ్ని ఆహారం కోసం వెతుకులాడుతుంటుంది. అదే ఎలుక. కడుపులో కొంత ఆహారం ఉండి కొంత భాగమే ఖాళీగా ఉంటే ఆ పక్కనే జఠరాగ్ని వెతుకుతుంటుంది. మొత్తం కడుపు ఖాళీగా ఉంటే అది అగ్నిజ్వాలలుగా మారి అన్నివైపులా వెతికేసుకుంటుంది. అగ్నిజ్వాలలు నెమ్మదిగా నడవవు. వేగంగా పరుగెడతాయి. అందుకనే కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి అంటారు. కడుపులో ఎలుక పరుగెడుతోంది అని ఏకవచన ప్రయోగం చెయ్యరు. చేస్తే అది జాతీయం కాదు.
      దంతసిరి, హస్తవాసి లాంటి పదబంధాలు కూడా జాతీయాలే. అయితే వీటిని వ్యాకరణ పండితులు అంగీకరించరు. ఎందుకంటే దంత, హస్త అనేవి సంస్కృత శబ్దాలు. సిరి, వాసి తెలుగు శబ్దాలు. వాటిని కలిపి సమాసం చేస్తే దుష్ట సమాసం అంటారు. ఇలాంటి ప్రయోగాలను పద్యరచనలో మహాకవులు ప్రయోగించరు. కానీ జన వ్యవహారంలో మాత్రం బహుళ ప్రచారాన్ని పొందాయి ఈ జాతీయాలు. ఏది కావాలన్నా తినగలిగే ఆర్థికస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా ఉంటే వాడి దంతసిరి బాగుందంటారు. అలాగే ఒక వైద్యుడి చేయి తగిలితే ఎలాంటి అనారోగ్యమైనా ఇట్టే నయమవుతుంటే ఆయన హస్తవాసి మంచిదంటారు. వీటిలో కూడా శబ్దార్థ సంబంధం లేకపోయినా విషయ సంబంధం ఉంది. అలాగని వ్యాకరణదృష్టితో చేతివాసి, పంటిసిరి అన్నా ఆ పదబంధాలకు సహజమైన జాతీయత ఉండదు. అందుకనే ‘‘జాత్యము కానీ యొప్పయిన సంస్కృతమున్‌ బచరింపబోను’’ అంటాడు తిక్కన.
      ఇలా చెప్పుకొంటూ పోతే తెలుగు జాతీయాలు కోకొల్లలు. వాటివల్లనే భాషకు పరిపుష్టి ఉంటుంది. తర్వాతి తరాల వారికి సుసంపన్నమైన తెలుగు భాషను అందివ్వాలంటే ఇలాంటి జాతీయాలను గురించి వారికి మంచి అవగాహన కలిగించాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం