సాహితీ శేఖరుడు

  • 255 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలంగాణ తొలితరం సాహితీవేత్తల్లో ఒకరైన ఆచార్య మడుపు కులశేఖరరావు తెలుగు సాహిత్యం, చరిత్ర పరిశోధనలో విశేష కృషి చేశారు. తెలుగు సాహిత్య చరిత్రను ఆంగ్లంలోకి అనువదించారు. ఇబ్రహీంపట్నం తాలూకా నక్కర్త గ్రామంలో నవంబరు 14, 1932న కులశేఖరరావు జన్మించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివిన ఆయన ఆచార్య దివాకర్ల వేంకటావధాని పర్యవేక్షణలో ‘ఆంధ్ర వచన వాఙ్మయం.. ఉత్పత్తి వికాసాల’ మీద పరిశోధన చేసి డాక్టరేటు పొందారు. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాఠాలు బోధించారు. 1986-89లో ఉస్మానియాలో తెలుగు శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యులుగానూ ఉన్నారు. ‘కావ్యానుశీలనం, తెలుగులో వచన వికాసం, రుచిరాలోకనం, తెలుగు సాహిత్యం- పరిశోధన, భాగ్యనగరం, పరిశోధన పద్ధతులు’ లాంటి పదుల కొద్దీ గ్రంథాలను రచించారు. ‘నా కథ’ పేరిట ఆత్మకథనూ వెలువరించారు. ‘‘సాత్త్వికుండు నొకడు సత్యంబు మాటాడ/ కుత్సితుండు దాని కుళ్లు చేయు/ కుక్క మంచి రుచిని దక్కంగ నిచ్చునా/ వమ్ము చేయు గాక, వనజనాభ’’ లాంటి ఆలోచనాత్మకమైన ఆటవెలదులతో కులశేఖరరావు వెలువరించిన ‘లోకగీత’ పద్యకవితాసంపుటి ప్రత్యేకమైంది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి మీద ఆయన ఆంగ్లంలో ఒక పొత్తాన్ని ప్రచురించారు. కులశేఖరరావుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొన్నాళ్లుగా కెనడాలో కుమారుడి దగ్గర ఉంటున్న ఆయన ఈ మేలో అక్కడే స్వర్గస్థులయ్యారు.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం