కొరకరాని కొయ్య

  • 1601 Views
  • 132Likes
  • Like
  • Article Share

    రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

  • రాజమహేంద్రవరం,
  • 7799111456
రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

‘కొరకరాని కొయ్య’ అంశమిచ్చి హాస్య ప్రసంగం రాసుకుని రమ్మన్నారు ఒక సంస్థవాళ్లు. నేను వద్దంటున్నా వినకుండా మా స్నేహితుడు ఓకే చేయించేశాడు. అప్పట్నుంచీ నాకు కుదురులేదు. ఈ హాస్య ప్రసంగం నాకు కొరకరాని కొయ్యగా ఉంది. ఏం రాయాలి?
ఎవరితోనన్నా
మాట్లాడితే ఆ క్రమంలో ఏమన్నా తడుతుందేమోనని ఆ రోజు సాయంత్రం ఊరిమీద పడ్డాను. మా కుర్ర కొలీగు చలం కలిశాడు. ‘‘కొరకరాని కొయ్య గురించి మాట్లాడాలి’’ అన్నాను. ‘‘మీ వాడు పర్లేదనుకున్నానండీ?’’ అని ఆశ్చర్యపోయి నన్ను ఆశ్చర్యపరిచాడు. వాళ్ల కుర్రాడితో సమస్యగా ఉందన్నమాట. ‘‘ఏమైంది?’’ అన్నాను. 
      ‘‘లేక లేక చాలా ఆలీసెంగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకని మా ఆవిడా, మనవడని మా అమ్మా గారం చేశారు కదా! ఇప్పుడు వేపుకుతింటున్నాడు. వాడు ఏం అంటే అది అయిపోవాలి. కాదంటే పేచీ. మీరు ఏం చెప్పండి. వినడు. మేం షాండిలియర్‌ కొన్నాం కదా సరదాగా. బోలెడయిందనుకోండి. మా ఆవిడ పట్టు మరి. మొన్నొక నాడు ఆ షాండిలియర్‌ కావాలన్నాడు. చచ్చినట్టు దింపించి చేతికిచ్చామండి. ఇంక అది పుచ్చుకుని పచార్లు, పరుగు కూడాను. నాకు దడ. అది బద్దలు కొట్టేశాడు. నా బాధ అందుక్కాదు. అది ఎలాగూ దక్కదని నాకు ముందే తెలుసు. తొందరగా బద్దలు కొట్టెయ్యొచ్చుకదండీ! దాన్ని అరగంట తర్వాత గాని బద్దలుకొట్టలేదు. అందాకా నాకు చిత్రహింస. చివరికి సైకాలజిస్టు దగ్గరకి వెళ్లాల్సివచ్చింది. కుర్రాణ్ని పల్లెత్తు మాట అన్లేదు. ఒక్క నీతి బోధ చెయ్యలేదు. మమ్మల్ని తిట్టిపోశాడండి, మాకు పెంచడం రాలేదని. చివరికి ఆయనేం అన్నాడంటే ‘ఓ పని చెయ్యండి. కొన్నాళ్ల పాటు వాడు ఏది అడిగితే అది చేసెయ్యండి చెబుతాను’ అన్నాడు. ‘ఇప్పుడు చచ్చినట్టు అదే కదా చేస్తున్నది. ఈ మాత్రానికి మీ దగ్గరకి రావడం ఎందుకు?’ అని నేను అంటే ‘అలాకాదు మీరు వాణ్ని సతాయించి, కాదని, కోప్పడి, చివరికి గతిలేక చేస్తున్నారు. ఇప్పుడు అదేమీ లేకుండా వెంటనే చేసెయ్యండి. చెబుతా’ అన్నాడు. సరే నన్నాను. ఇంటికి పోగానే వాడు మిడత కావాలన్నాడు. చంపుదామనుకున్నాను. డాక్టరు చెప్పింది గుర్తొచ్చింది. ఇదే మొదలు.. అప్పుడే వ్రత భంగమా? ఆ చంపేదేదో మిడతనే చంపుదాంలే అని మిడత వెంటపడ్డాను. నానా తంటాలు పడ్డాను. అక్షరాలా పడ్డానండి. మిడతను పట్టుకోవడం భలే కష్టంగా అనిపించింది. కానీ పట్టుకున్నాక భలే సంతోషం వేసింది. ఒక విజయం కదా! మీ వాడు మిడత కావాలంటే ఎలా పట్టుకోవాలో చెబుతాను నన్నడగండి. సులువు తెలిసిపోయింది. ఈగను మాత్రం అడక్కుండా చూసుకోవాలి మరి. చాలా కష్టం కదా! సరే. పట్టుకుని తెచ్చాను కదా! ‘ఇప్పుడు వేయించు’ అన్నాడండి. ‘‘మిడతను వేయించు’’ అన్నాడు. ఈసారి చితక తందామనుకున్నాను. తమాయించుకుని వేయించాను. ‘ఇద్దరం తిందాం’ అన్నాడు. చూడండి, వైద్యం ఎంత దారుణంగా ఉందో! సరే గుండె రాయి చేసుకుని, కళ్లు మూసుకుని సగానికి తుంపి నోట్లో వేసుకున్నాను. ఏడుపు. ఒకటే ఏడుపు. ఏమిటనుకున్నారు? వాడికి రావలసిన తలభాగం నేను మింగేశానుట’’. 
      ‘‘మరేం చేశావు?’’ అన్నాను. ‘‘చెయ్యడానికి ఏమన్నా ఉంటే కదా! వాడు ఇంట్లో ఏడుస్తున్నాడండి. ఇలా నేను వీధిలో ఏడుస్తున్నాను’’ అన్నాడు.
      మావాడి సంగతి చెబుతాను. వాడికి లెక్కల సబ్జెక్టు కొరకరాని కొయ్య. అందు వల్ల మాకు ఒక కొరకరాని కొయ్య బాపతు బ్రాంచిగా తయారయ్యాడు. వాడికి చిన్న ప్పుడు వెయ్యిన్నొకటిలో ఎన్ని సున్నాలు చుట్టాలో, అన్నే ఎందుకు చుట్టాలో చెప్పడం నా తరం కాలేదు. తీసివేత ఒక పెద్ద గందరగోళంగా ఉండేది. పక్క అంకె నుంచి ఒక పది ఎప్పుడు చేబదులుచ్చు కోవాలో తెలిసేది కాదు. కాసేపయాక చేబదులు చేశాడో లేదో తెలిసేది కాదు. ఆ పైన ప్రతీ లెక్కా వాడికి ఒక సమస్యే. ఒక ఉదాహరణ చెబుతాను. ఒకసారి వాడికి ఒక లెక్క వచ్చింది. ‘1996 సంవత్సరంలో ఒక రైతు బ్యాంకు నుంచి రుణం తీసుకుని 60 గొర్రెలు, 25 మేకలు కొనుక్కుని’.. అంటూ మొదలయ్యింది లెక్క. పూర్తిగా చదవకుండానే లెక్క చెయ్యడం మొదలెట్టేశాడు. ఎప్పుడూ అంతే. ‘చివరికంటా చదివితే ఇంకా చాలా అంకెలు తగులుతాయి నాన్నా. గందరగోళం పెరిగిపోతుంది. ముందు వీటి సంగతి చూడనీ’ అనేవాడు. 1996 సంవత్సరం అనే మాటలో కూడా అంకెలున్నాయి కదా! వాటిని ఏం చెయ్యాలో ఏమో, వదిలేస్తే టీచరు ఏం తిడుతుందో అని గొణుక్కుని, 1996నీ పక్కనున్న గొర్రెల సంఖ్య 60నీ కూడేశాడు. ఆ తర్వాత తగిలిన మేకల సంఖ్య ఇరవై అయిదూ పెట్టి ఈ మొత్తాన్ని గుణించాడు. తీసివేతలు వీలైనంత తక్కువగా వాడుతూ మొత్తం లెక్కలో అంకెలన్నిటినీ ఏదో ఒకటి చేసి సమాధానాన్ని తీసికెళ్లి వాళ్ల టీచరుకి చూపించాడు. ‘ఇదేంటి!!’ అందిట ఆవిడ బిత్తరపోయి. అప్పుడు వీడికి గుర్తుకొచ్చింది, మనం ఇవి రూపాయలో సంవత్సరాలో ఏంటో రాయలేదు అని. ‘ఒక్క నిమిషం టీచరు’ అని లెక్క చూసి ‘వడ్డీరేటు’ అని చెప్పాట్ట. ఆవిడకి మతి భ్రమించింది కాసేపు. ఆ టీచరు ఆ తర్వాత రాజీనామా చేసేశారు. వేరే ఉద్యోగం వచ్చినందువల్ల అంటారు కానీ వీడి లెక్కల దెబ్బకేనేమో అని నా అనుమానం. 
      సరే. నాకు ఇంకా సమాచారం కావాలి. ఎలా? అప్పుడు నాకు మా రామ్మూర్తి గుర్తొచ్చాడు. రామ్మూర్తి చాలా తెలివైన వాడు. ఈ ప్రసంగానికి సాయం చెయ్యగలడు. వాణ్ని అడిగాను. ఆశ్చర్యపోయాడు. ‘‘కొరకరాని కొయ్య గురించి అంటే ఏం రాయాలో తెలియడం లేదా! గొప్పవాడివిరా! వాళ్లు మీ ఆవిడ గురించి రాయమంటున్నారు!’’ అన్నాడు. నేను ఉలుకూ పలుకూ లేకుండా నిలబడి ఆశ్చర్యపోతుంటే ‘‘అవును. ఎవరికైనా కొరకరానికొయ్య వాళ్లావిడే కదా!’’ అన్నాడు.
      నిజమే. పట్టుచీరకన్నా పనికి రాని వస్తువు ప్రపంచం మొత్తం మీద లేదు అని నా అభిప్రాయం. దాన్ని నేను కుండ బద్దలు కొట్టినట్టు చెబుతూనే వచ్చాను. కానీ ఆవిడకి ఓ డజను పట్టు చీరలు న్నాయి. ఎలా కొందీ.. ‘నువ్వు చెప్పేదేంటి బోడి’ అన్లేదు. ‘మీకేం తెలియదు చిట్టీ..’ అని కొనేసింది. ఆ మధ్య దంపుడు బియ్యం మంచివని చదివిందిట పేపర్లో. ‘రుచీపచీ లేవు. ఇవి చంపుడు బియ్యం’ అని నేను మొత్తుకుంటున్నా రోజూ వండేస్తోంది. పైగా దారుణం ఏమిటంటే నాతోనే తెప్పిస్తుంది. నాకోపం, నా బుజ్జగింపు, నా వాదన, నా సణుగుడు, నా బిక్క మొహం జాన్తానై. నాకిష్టమైన బంగాళా దుంప వేపుడు నేను చెప్పినా నాలుగేళ్లుగా చెయ్యనే లేదని ఇప్పుడు తోస్తోంది. మళ్లీ నన్ను ఎప్పుడోగాని గట్టిగా తిట్టనైనా తిట్టదు. కొరకరాని కొయ్యలు మెత్తగా కూడా ఉండొచ్చన్న మాట. 
      నాకో అనుమానం వచ్చింది. ‘‘ఆవిడ నాకు కొరకరాని కొయ్య అయితే మరి మా ఆవిడకి నేనేమిటి?’’ అన్నాను. ‘‘నువ్వు పెంపుడు జంతువ్వి’’ అన్నాడు రామ్మూర్తి. ముందు పెంపుడు అనే విశేషణం చేర్చి బతికించాడు. ‘‘అంటే కుక్కపిల్లన్నమాట’’ అన్నాను. ‘‘పెద్దవాణ్నే కానీ చూస్తూ చూస్తూ ‘కుక్కనన్న మాట’ అని ఎలా అనను?’’ వాడు కాదన్నాడు. ‘‘కుక్కపిల్ల కాస్తో కూస్తో కసురుకుంటుంది. ఎప్పుడేనా పళ్లు వాడుతుంది. పైగా దాన్ని షికారు తిప్పుతారు. స్నానం చేయిస్తారు. నీకు ఆ స్థాయి ఉన్నట్టు లేదు. మన సుబ్బారావు గడించుకోగలిగాడు ఆ స్థాయి. నువ్వుట్టి పెంపుడు పిల్లివి’’ అన్నాడు. ‘‘దారుణం’’ అన్నాను. ‘‘సారీ బాస్‌. నిజాలు దారుణం గానే ఉంటాయి’’ అన్నాడు రామ్మూర్తి.
      ‘‘మా ఆవిడ గురించి రాయొచ్చు కానీ తెలిస్తే ప్రమాదం’’ అన్నాను. ‘‘కొంచెమే రాయి’’ అన్నాడు. ‘‘కానీ ఇంకా టైము మిగిలిపోతుంది. ఏం చెయ్యను?’’ అన్నాను రామ్మూర్తితో. ‘‘నువ్వు స్త్రీవయితే నీకు రెండు కొరకరాని కొయ్యల మీద రాసే అవకాశం దక్కేది’’ అన్నాడు.‘ ఏంటి?’ అన్నాను. ‘‘అత్తగారూ ఆడపడుచూను. కొరకరాని కొయ్యల్లో అత్యుత్తమ స్థాయి వాళ్లు వాళ్లే. నీ దురదృష్టం’’ అన్నాడు. 
      ‘‘ఇంకా చెప్పు’’ అన్నాను. ‘‘నీకు అల్లుకుపోవడం రాదు గురూ!’’ అని విసుక్కున్నాడు రామ్మూర్తి. ‘‘ఆడవాళ్లకు ఆడపడుచున్నట్టే మగాళ్లకు బావమరుదు లుంటారు- గ్రేడు కొంచెం తక్కువనుకో. మీ బావమరిది గురించి రాయి’’ అన్నాడు. నాకు భలే సంతోషం వేసింది. ‘‘వాడు కొరకరానికొయ్యే కానీ, నీకెలా తెలుసు?’’ అని అడిగాను. ‘‘1+1=2 కదా బాస్‌’’ అన్నాడు. నాకు అర్థం కాలేదని వాడికి అర్థమైంది. ‘‘పెళ్లానికి పెంపుడు పిల్లి అయినవాడికి బావమరిది కొరకరానికొయ్యే అవుతాడ్రా వెర్రి నాయినా!’’ అనేశాడు. 
      మా బావమరిది తనను నా దగ్గరే ఉంచుకుని.. కాదు.. ఉంపించుకుని, నాతో చదివింపించుకుంటున్నాడు. ఇంటి దగ్గర ఉంటే వాళ్లనాన్నకి బి.పి. వస్తోందిట. అందుకని నా నెత్తి మీద దిగబెట్టారు. ఇక్కడ చేరాడు. ఇంజినీరింగు చదువుతున్నాడు. ఈ వాక్యం సరిగా లేదు కానీ ఎలా చెప్పాలో నాకు తెలియక ఇలా చెప్పాను. వాడు ఇంజినీరింగు చదవడం లేదు అని చెబితే మీరు అపార్థం చేసుకుంటారు కదా మరి. ఒక్క సెమిస్టర్‌లో కూడా అన్ని సబ్జెక్టులూ పాసవ్వలేదు. ఇక్కడా వాక్యం సరిగా రాలేదు ఖర్మ. అన్ని సబ్జెక్టులూ పాసవ్వలేదు అంటే కొన్ని పాసయ్యాడని కాదు. తెలిసింది కదా! నేను ఏమీ అనడానికి వీల్లేదు. నా బైకు ఎప్పుడు నాకు అందుబాటులో ఉంటుందో తెలియదు. నా కంప్యూటరు వాడు వదిలి పెట్టాక గాని నాది కాదు. వాడు సౌండు సిస్టంలో వినే పిచ్చి పాటలు చచ్చినట్టు నేనూ వినాలి. ఓసారి ‘‘ఏమిటీ గోల?’’ అంటే ‘‘రిలాక్స్‌ అవుతున్నాడు. అవనివ్వండి’’ అంది మా ఆవిడ. ‘‘ఏం చదివి అలిసిపోయాడని? ఎంత చదివినా ఇంత వినెయ్యక్కర్లేదు’’ అన్నాను. ‘‘భవిష్యత్తులో చదివి అలిసిపోతే పనికొస్తుందని ఇప్పుడే వినేసి ఉంచుకుంటున్నాడు.. అప్పుడు కుదరకపోవచ్చు కదా!’’ అంది. ఈవిడికీ చెప్పలేను. వాడికీ ఏమీ చెప్పలేను. ‘‘నేను మా ఇంట్లో ద్వితీయ శ్రేణి పౌరుణ్ని’’ అన్నాను. ‘‘నీ శ్రేణి రెండు కాదు మూడు’’ అన్నాడు మా రామ్మూర్తి లెక్క సరిచేస్తూ. 
      ‘‘సరేలే. ఇపుడు ఇంకాసిని ఆలోచనలు చెప్పు’ అని అడిగాను. ‘‘మీ కాలేజి కుర్రాడి గురించి రాయి’’ అన్నాడు. ‘‘వివరంగా చెప్పు’’ అని అడిగాను. ‘‘మీ కాలేజీలో శీను అని ఉంటాడు. వాడు ఎప్పుడూ కాలేజీ మానడు. ఏ రోజూ తిన్నగా క్లాసులో కూచోడు. చచ్చినా క్యాంపసు విడిచిపోడు. వాడు కాలేజీకి తాగి వస్తాడు. అలా అని లెక్చరర్లూ ఆడపిల్లలు కంప్లెయింట్లు ఇస్తూ ఉంటారు. ఎవరూ మందలించరు. నువ్వు ప్రిన్సిపాలువి కాబట్టి నీ చావు నిన్ను చావమని బాధ్యత నీ మీదకి గెంటేసి వినోదం చూస్తూంటారు. వాడు ఎప్పుడు ఏ పిల్లని ఏం అల్లరి పెడతాడో, కొంప మునుగుతుందని నీ ఆత్మని వాడి చుట్టూ తిప్పుతూ నీ గదిలో నువ్వు కీర్తిశేషుడిలా కూచుంటావు. అక్కడికీ నువు నెమ్మదిగా వాడికి మంచి చెప్పి చూస్తావు. నిన్ను జాలిగా చూస్తాడు. తెగించి బెదిరిస్తావు. ఎర్రగా చూస్తాడు. నువ్వు నిస్సహాయంగా అరుస్తావు. తలదిం చుకుని కోరగా చూసి వెధవనవ్వు నవ్వేస్తాడు. నువ్వు పోలీసులకి చెప్పలేవు. ఎందుకంటే ఆ కుర్రాడికి ఒక కులం ఉంటుంది. ఆ కులానికి పెద్ద మనుషు లుంటారు. ఆ కుర్రాడు నీకు- పనిచెయ్యని మరుగుదొడ్డి కుళాయి గురించి, మంచి నీళ్ల ట్యాప్‌ గురించి, కలుపు మొక్కల గురించీ ఎదురు ఫిర్యాదు చేస్తాడు. నీ మీద కక్ష తీర్చుకోవడానికి నీకింది వాళ్లు అప్పుడ ప్పుడూ వాణ్ని రామబాణంలా వాడతారు. వాడి గురించి రాయి’’ అని చెప్పాడు. నిర్ఘాంత పోయాను- ఇదంతా వీడెప్పుడు చూశాడు అని. ‘‘అసలు మా కాలేజీలో అలాంటి కుర్రాడు ఒకడున్నాడని ఎలా తెలుసు? వాడు తాగి వస్తాడని, నన్ను జాలిగా చూస్తాడని ఎలా తెలుసు? అసలు వాడి పేరు శీను అని నీకెలా తెలుసు?’’ అని అడిగేశాను. ‘‘అలాంటి కుర్రాడు లేని కాలేజీ ఉందా ఇవాళ? వాడు సర్వాంతర్యామి. శీను అనే పేరంటావా? చాలా ఏళ్లుగా అది తెలుగువాడికి సర్వనామం లాంటిది’’ అన్నాడు రామ్మూర్తి.
      ‘‘ఒరే సవాలక్ష కొరకరాని కొయ్యలున్నాయి మన కొంపల్లో.. మన చుట్టూ లోకంలో. ఉదాహరణకు ఎలక. జానెడు ఎలక. దాని తోక మీద వెంట్రుక పీకగలవా నువ్వు? నీ ఇల్లు దాంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు పంపర పనాస డిప్ప క్రాపువాడున్నాడు చూడు, వాడు ప్రపంచానికి ఇప్పుడు ఒక కొరకరాని కొయ్య. మన దేశానికి కశ్మీరు ఒక కొయ్య. రాష్ట్రానికి పోలవరం ప్రోజెక్టు ఒక కొయ్య. కాబట్టి నీ టాపిక్కు కాదొక చిక్కు. వెళ్లు.. పెన్నుతో చెక్కు. అసలు నీ టాపిక్కు కొరకరాని కొయ్యే కాదు’’ అనేశాడు మావాడు. ఇదీ సంగతి.


వెనక్కి ...

మీ అభిప్రాయం