పిల్లల ప్రపంచంలోకి ఓ ప్రయాణం!

  • 1558 Views
  • 3Likes
  • Like
  • Article Share

    బి.అనిల్‌ డ్యాని

  • కొండపల్లి, కృష్ణా జిల్లా
  • 9703336688
బి.అనిల్‌ డ్యాని

‘‘అడివి బాపిరాజుని గోన గన్నారెడ్డి రాశాడా? గోన గన్నారెడ్డిని అడివి బాపిరాజు రాశాడా?’’  
      కొన్నాళ్ల కిందట ఓ రచయిత తన పుస్తకంలో ఇలా రాశారు. సమాధానం తెలిసినవాళ్లకి నవ్వు రావచ్చు కానీ, ఈ ప్రశ్నలో ఓ నిజం దాగుంది... మనకి సాహిత్యం మీద పెద్దగా అవగాహన లేదని! ఎందుకోకానీ, ఎనభైల్లోంచి తెలుగునాట సాహిత్యాభిరుచి కొంత తగ్గిపోయింది. బహుశా టీవీల ప్రభావం కావొచ్చు లేదా మరే కారణాలైనా ఉండవచ్చు. ఏదేమైనా సాహితీ పాఠకుల సంఖ్య తగ్గింది. ఈ ప్రభావం గత పది పదిహేనేళ్ల నుంచి యువతగా మారుతున్న పిల్లల్లో మరీ ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఆ మధ్యన ఓ అమ్మాయి టీవీలో ‘తోడికోడలు’ శీర్షిక చూసి, ‘‘మమ్మీ... తోడికోడలు అంటే ఏంటి?’ అని వాళ్లమ్మను అడిగిందట. ఆ అమ్మాయి చదివేది పదో తరగతి! మనం ఇలాంటి కాలానికి వచ్చేశాం!! ఓ రకంగా ఇదో నిరాశాజనకమైన సంధి కాలమే.
      ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? చాలామందిని ఆలోచింపచేసిన ప్రశ్న ఇది. కొంతమంది సాహిత్యం రాశారు. మరికొంతమంది మాటల్ని బాణీలుగా కట్టి పాటలు రాశారు. ఇంకొంతమంది బాలల కోసం డిజిటల్‌ సీడీలు తెచ్చారు. కానీ, ఇవేవీ పూర్తిస్థాయిలో పిల్లల దాకా వెళ్లట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆలోచనాపరులు కలిసి ఈ ఏడాదిలో ఓ వినూత్న ప్రయోగం చేశారు. అదే... విద్యార్థులతో సాహితీవేత్తల ముఖాముఖి.
‘నవతరంతో యువతరం’
ప్రముఖ కథకురాలు, ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి డా।। కె.ఎన్‌.మల్లీశ్వరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఏప్రిల్‌ 30, మే 1 తేదీల్లో విశాఖపట్నం సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ దీనికి వేదికైంది. పాఠశాల యజమాని సూర్యనారాయణరెడ్డి సహకారంతో ‘మహిళా చేతన’ సంస్థతో కలిసి ‘ప్రరవే’ దీన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నలభై మంది కవులు, కథా రచయితలు ఆ పాఠశాలకు వెళ్లారు. అక్కడి పిల్లలను ఇరవై బృందాలుగా విభిజించి, ఒక్కో బృందానికి ఒక్కో పుస్తకం పేరుపెట్టారు. ఆయా పుస్తకాలను పిల్లలకి పరిచయం చేస్తూ కార్యక్రమం సాగింది. కథకులు, కవులు చిన్నారులతో కలిసి వాళ్లకి కొంత నేర్పిస్తూ, వీళ్లు కొంత నేర్చుకుంటూ మొదటి రోజు కొంత సాహిత్యాన్ని పిల్లల చెవుల్లోంచి మనసులోకి చేరవేయగలిగారు. రెండో రోజు చిన్నారులను రచయితలతో, కవులతో కలిపి అరకు గిరిజన ప్రాంతాలకి తీసుకువెళ్లారు. అక్కడి పిల్లలతో మాట్లాడించారు. అంతకు ముందురోజు నుంచి సాహిత్య వాతావరణంలో ఉన్న ‘సంస్కృతి’ పిల్లలు గిరిజన చిన్నారులను చాలా ప్రశ్నలే అడిగారు. ‘మీరెందుకు చదువుకోవట్లేదు?’ లాంటి ప్రశ్నలు, సమాజం గురించి తెలుసుకోవాలన్న పిల్లల సహజాసక్తిని వెల్లడించాయి. అలా గిరిజన చిన్నారులతో ముచ్చటించి, ఆ రోజంతా అరకు సంతలో తిరిగి, వాళ్లు ఆహారం ఎలా పండిస్తారో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఖనిజాల వెలికితీత వల్ల అక్కడ ఉత్పన్నమవుతున్న పరిస్థితులనూ ప్రత్యక్షంగా చూశారు. కార్యక్రమం అనంతరం పిల్లలను మాట్లాడమంటే... దాదాపు అందరూ అక్కడి సమస్యలను విశ్లేషించారు. సాహిత్యంతో పరిచయం వల్ల సమస్యల పట్ల వాళ్లలో ఓ దృక్పథం ఏర్పడింది. 
      ఈ కార్యక్రమంలో సాహితీవేత్తల నుంచి తాము నేర్చుకున్న మెలకువల ఆధారంగా చిన్నారులు కొన్ని కథలు, చిన్న చిన్న కవితలు రాశారు. వాటిని చూసి ముచ్చటపడ్డ పాఠశాల యాజమాన్యం... మల్లీశ్వరి సాయంతో ‘పండువెన్నెల’ అనే పుస్తకాన్నీ తీసుకొచ్చారు. ఇదొక మార్పు. మొత్తమ్మీద పిల్లల్లో సాహితీ పటిమని నింపడానికి ఈ కార్యక్రమం సాయపడింది. సత్యం అనే ఏడో తరగతి విద్యార్థి రాసిన ఈ నాలుగు పాదాల కవితే దీనికి నిదర్శనం...
‘‘తెల్లకాగితం’’
ఆకాశాన్ని మనముందు నిలుపుతుంది
ఆ ఆకాశం మీద కవిత్వం రాస్తాను
మబ్బుల మీద బొమ్మలు గీస్తాను
తెల్ల కాగితం మీద ఎగిరే పక్షుల్ని చూస్తాను
‘చిత్రకూటమి’

‘నవతరంతో యువతరం’ తర్వాత మళ్లీ ఆగస్టు 13, 14, 15 తేదీల్లో అదే పాఠశాల పిల్లలతో కలిసి మరో యాత్ర నిర్వహించారు కవులు, రచయితలు. ఈసారి విశాఖ సముద్రతీరం నుంచి జగదల్‌పుర్‌ (చత్తీస్‌గఢ్‌) వరకు బస్సు యాత్ర చేశారు. దీనికి ‘తెలుగు రీడర్స్‌ క్లబ్‌’, టెన్‌ టీవీ ‘అక్షరం’ తమ వంతు సహకారాన్ని అందించాయి. 
      దాదాపు 700 కిలోమీటర్ల ప్రయాణం. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటుకుంటూ వెళ్లాలి. అడుగడుగునా ఆంక్షలు. పిల్లల్ని సైతం వదలకుండా అణువణువూ సోదాలు... ఎందుకు ఇదంతా? ఓ పిల్లవాడి ప్రశ్న! ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనకిష్టం వచ్చిన చోటుకు మనం ఆంక్షలు లేకుండా వెళ్లలేమా? మరో విద్యార్థిని సందేహం! ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో జరుగుతున్న విషాద పరిణామాల గూర్చి ఓ పాత్రికేయ మిత్రుడు చెబుతుంటే పిల్లలు సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నారు.
      ఈ యాత్రలో మొదటి మజిలీ విజయనగరం జిల్లా బొండపల్లి ప్రభుత్వ పాఠశాల. అక్కడి వంద మంది విద్యార్థుల్లో ఆడపిల్లలే ఎక్కువ. ఈ చిన్నారుల సమస్య ఏంటంటే... వాళ్ల తల్లిదండ్రులు దూర ప్రాంతాలకి వలసవెళ్లిపోతారు. పిల్లలు ఇక్కడే ఉండి, కనీస అవసరాల కోసం వీళ్ల మీద ఆధారపడే వృద్ధులకు సేవ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. ఎక్కడో ఊరికి దూరంగా ఉందీ బడి. ఇలా ఇంతమంది రచయితల్నీ, పాత్రికేయుల్నీ చూడగానే ఆ చిన్నారుల మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్నలన్నీ ఒక్కసారిగా నిద్రలేచి ఒళ్లు విరుచుకున్నాయి. ఇక్కడ కూడా వెళ్లిన వాళ్లంతా కొన్ని బృందాలుగా విడిపోయి, ఆ పసి మనసుల్లోని సంఘర్షణని కొంత మేరకు తగ్గించగలిగారు.
      బొండపల్లి పాఠశాలలో జీఎస్‌ చలం దంపతులు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తమ విద్యార్థులను సాహిత్య మూలాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ బడిలో ఓ పిల్లాడు నూరు పద్యాలను అవలీలగా పాడగలడు. ఓ అమ్మాయి శ్రీశ్రీ కవితల్ని సులువుగా చెప్పగలదు. గ్లోబల్‌ పాఠశాల పిల్లలకు ఈ బడి ఓ విచిత్రం. వాళ్ల పాఠశాలలో, వసతి గృహాల్లో అన్నీ ఏసీ గదులు... ఇక్కడేమో పిల్లలు హాయిగా చెట్ల కింద పాఠాలు నేర్చుకుంటున్నారు. సామాజిక, జీవన విధ్వంసంలో బలవుతున్న పిల్లలకి సజీవ సాక్ష్యాలు ఈ రెండు పాఠశాలల పిల్లలు. ఓ బడి వాళ్లకేమో గొంతు పెగిలితే ఆంగ్లమే వస్తుంది. మరో బడిలోనేమో నోరు తెరిస్తే తెలుగు ఉప్పొంగుతుంది. భిన్న ధృవాల్లాంటి వీళ్లు సాధారణంగా కలిసే వీల్లేదు. కానీ, ‘చిత్రకూటమి’ యాత్ర దాన్ని సుసాధ్యం చేసింది. వీళ్ల భావాల్ని వాళ్లకి, వాళ్ల భావాల్ని వీళ్లకి బట్వాడా చేసింది. సాహిత్యమూ అదే చేస్తుంది. విభిన్న సామాజిక వర్గాల ప్రజల్నీ, సమూహాల్నీ ఓ చోటికి తెస్తుంది. ఈ ‘చిత్రకూటమి’ యాత్ర లక్ష్యమూ ఇదే. 
      ఇక జగదల్‌పుర్‌ ఉన్న బస్తర్‌ ప్రాంత పరిస్థితి పూర్తిగా వేరు. తెల్లార్తే ఏ వార్త వినాల్సి వస్తుందో అనే భయం నిత్యం వెంటాడుతూ ఉంటుంది. అలాంటి సమాజాన్ని పిల్లలకి తెలియజేయాలి. జీవితం పట్ల ఓ అవగాహనను పెంచుకోవడానికి ఈ ‘తెలుసుకోవడం’ ఉపయోగపడుతుంది. ‘చిత్రకూటమి’ యాత్ర పిల్లలకు ఆ విషయాలను తెలియజేస్తూ సాగింది. జగదల్‌పుర్‌ చేరాక,  చిత్రకూటమి జలపాతాన్ని చూశాక పిల్లల్లో ప్రకృతి ఎంత సంతోషాన్ని నింపుతుందో, ఎన్ని పాఠాల్ని బోధిస్తుందో అవగతమైంది. చిన్నారులు అక్కడి పరిస్థితులని గమనించడానికి వీలుగా స్థానిక సామాజిక కార్యకర్తలతో ఓ  సమావేశం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పిల్లలు అప్పటిదాకా చూసిన వాస్తవాలను ప్రశ్నల రూపంలో వాళ్లని అడిగి కొంత సమాచారం రాబట్టుకుని సంతృప్తి చెందారు. దాన్ని వాళ్ల జీవితాలకి అన్వయించుకుని సాహిత్యంతో కలిసి నడిస్తే ఈ కార్యక్రమ ప్రయోజనం నెరవేరినట్టే.


పాఠశాల విద్యార్థులకు సాహిత్యాన్ని పరిచయం చేస్తే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయన్న ఉద్దేశంతో ‘నవతరంతో యువతరం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో చేసిన ప్రయోగం ఏంటంటే... రచయితలే ఓ సమూహంగా కూడి పాఠాశాలలకి వెళ్లడం, విద్యార్థుల్ని చిన్న చిన్న బృందాలుగా చేసి- ఒక్కో బృందానికి ఒక్కో మార్గదర్శక రచయితతో సంభాషణ ఏర్పాటుచేయడం. దీనివల్ల రచయితల నుంచి మంచి సాహితీ పరిచయాన్ని మాత్రమే కాకుండా రచనా మెలకువలనూ పిల్లలు తెలుసుకుంటారు. రచయితకీ, చిన్నారి పాఠకులకీ మధ్య ఏర్పడే అనుబంధం భవిష్యత్‌ సాహిత్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలకి ఒక తరం ముందటి కొత్త రచయితలతో ఈ ప్రయోగం చేశాం. చిత్రంగా యువరచయితలూ ఈ పిల్లల దగ్గర చాలా విషయాలను నేర్చుకున్నామని చెప్పారు. - డా।। కె.ఎస్‌.మల్లీశ్వరి, ‘నవతరంతో యువతరం’ నిర్వాహకురాలు


పిల్లలకు ప్రపంచ బాలసాహిత్యాన్ని పరిచయం చేయాలి. దాని సాయంతో వాళ్ల సృజనని బయటకి తీయగలిగితే.. అరుదైన పుస్తకాల్లో సాధారణ మనుషులని, సాధారణ మనుషుల్లో అరుదైన పుస్తకాల్నీ చూడగలుగుతారు. మా బ్లాగు www.sovietbooksintelugu.blogspot.inలో అద్భుతమైన పిల్లల పుస్తకాలు వందకు పైగా ఉన్నాయి. వాటిని అందరూ ఉచితంగా చదువుకోవచ్చు.  - అనిల్‌ బత్తుల, ‘చిత్రకూటమి’ నిర్వాహకులు


కొత్తగూడెం ‘బాలోత్సవ్‌’
కొత్తగూడెం క్లబ్‌ ఆధ్వరంలో ఏటా నవంబర్‌లో ‘బాలోత్సవ్‌’ జరుగుతుంది. పాతికేళ్లుగా ఇది నడుస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది ఆ బాలోత్సవానికి ముందుగా అక్టోబరులోనే ‘సాహితీవేత్తలతో ముఖాముఖి’ ఏర్పాటుచేశారు నిర్వాహకులు. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఓ ఇరవై మంది కథకులను, కవులను కొత్తగూడెం ఆహ్వానించారు. ఈ రెండు రోజుల కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరూ దాదాపు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల వాళ్లే. ఓ రెండొందల మంది ఇందులో పాల్గొన్నారు.
      సాధారణంగా తెలంగాణలో సాంస్కృతిక ఉత్తేజం ఎక్కువ. పల్లెపదాలు, జానపదాలు లాంటివి ఇంకా బతికే ఉన్నాయి. కానీ, గ్రామీణ నవతరం నుంచి కథకుల్నీ, కవుల్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీన్ని ‘బాలోత్సవ్‌’ గుర్తించింది. అందుకే కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాల పిల్లల్లో దాగున్న సృజనాత్మక శక్తులను వెలుగులోకి తేవడానికి ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇక్కడికి వచ్చిన పిల్లల్లో దాదాపు అందరూ సాహిత్యంపట్ల కొంత అభిరుచి ఉన్నవాళ్లే. కవులు, కథా రచయితల్నీ పిల్లలు బాగానే ఆకళింపు చేసుకున్నారు. చాలా మంది చిన్నారులు కథవైపు మొగ్గు చూపారు. కథకులు వీళ్లని చేయిపట్టుకుని నడిపించారు. వాసిరెడ్డి నవీన్‌ లాంటి వాళ్లు రెండు రోజులూ అక్కడే ఉండి సభా నిర్వహణ బాధ్యతలను పంచుకున్నారు. ప్రముఖ కథకులు పెద్దింటి అశోక్‌కుమార్, కుప్పిలి పద్మ, కె.పి.అశోక్‌కుమార్, చంద్రశేఖర్‌ ఆజాద్, దగ్గమాటి పద్మాకర్‌ తదితరులు పిల్లల్ని అక్కున చేర్చుకుని, వాళ్లకి కథల్ని పరిచయం చేశారు. చిన్న చిన్న అంశాలు ఇచ్చి కథలు రాయించారు. ఇక కవిత్వం మీదా ఫర్వాలేదనిపించేత స్థాయిలో పిల్లలు ఆసక్తి చూపించారు. బండ్ల మాధవరావు, అరసవిల్లి కృష్ణ, ఎస్సార్‌ భల్లం, భగవంతం లాంటి వాళ్లు పిల్లలతో కొన్ని కవితలు చదివింపజేశారు. వాటిలో పిల్లలకి ఏం అర్థమైందో వాళ్లతోనే చెప్పించారు. నిజానికి ఇదో పద్ధతి... పిల్లలకి పిల్లలే బోధించడం!  
భోజనాల సమయంలో ఓ ఎనిమిదో తరగతి అమ్మాయి ఓ కథకుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘‘సార్‌... నేను రాసిన కథకి ముగింపు ఎలా ఇస్తే బాగుంటుంది’’ అని అడిగింది. ‘‘నువ్వేమనుకుంటున్నావు’’ అన్నారాయన. ‘‘ఏమో సార్‌.. నాకు అర్థం కావట్లేదు’’ అందా అమ్మాయి. ఆయనేమో ‘‘నీకెలా అనిపిస్తే అలా రాయి’’ అన్నారు. ‘‘కాదు సార్‌ చెప్పండి’’ అందా గడుగ్గాయి. ‘‘నువ్వు ఎక్కడికి అనుకుంటున్నావో అక్కడికి ఆపెయ్‌ కథని. కొంతకాలానికి నీకే స్ఫురిస్తుంది ఏం రాయాలో’’ అన్నారు ఆ అనుభవశాలి. అంతే ఆ అమ్మాయి వెళ్లిపోయింది. కార్యక్రమం ముగిసే సమయానికి వచ్చి కథ చూపించింది. కథని ఎలా ముగించాలో అలాగే ముగించింది.
      కవితల్లోనూ పిల్లలు తమదైన శైలి కనపర్చారు. కవులు ఇచ్చిన వస్తువుల్ని కవితలుగా మార్చి ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ‘నువ్వే గాలిపటమైతే’ అనే అంశాన్ని అద్భుతంగా రాసి ప్రశంసలు పొందారు. కరిష్మా అనే పదో తరగతి విద్యార్థిని రాసిన కవితను ‘బాలోత్సవ్‌’ నిర్వాహకులు వాసిరెడ్డి రమేష్‌బాబు అప్పటికప్పుడు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రతినిధులకి చదివి వినిపించి రికార్డ్‌ చేయించారు. ఈ కార్యక్రమానికి ముగింపులో హాజరైన ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌ ‘పిల్లల్లో యాంత్రికతని తగ్గించి నైతిక స్థైర్యాన్ని పెంచేలా రచనలు చేయాల’ని రచయితలకు పిలుపునిచ్చారు. 
      సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాహితీవేత్తలెప్పుడూ సిద్ధమే. ఆర్థిక పరిపుష్టత లేకపోవడం వల్లే చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలకి పూనుకుంటే చిన్నారులను నాణ్యమైన పౌరులుగా, సాహితీవేత్తలుగా తయారు చేయవచ్చు. దేన్నయితే ఓ తరం కోల్పోయిందని మనం భావిస్తున్నామో, దాన్ని మళ్లీ నూతన తరంలో వికసింపజేయవచ్చు.


వెనక్కి ...

మీ అభిప్రాయం