ఉచిత పుస్తకాలు

  • 908 Views
  • 3Likes
  • Like
  • Article Share

ఒక్క క్లిక్‌ దూరంలో ఉండే గ్రంథాలయమది! అంతర్జాలమే వేదికగా 4 వేలకు పైగా పుస్తకాలతో కొలువుదీరిన పొత్తాలగుడి ఇది. ప్రబంధాల నుంచి కథాసంపుటాల వరకూ మన సాహిత్యం లోని మేలిమి గ్రంథాలను పాఠకులకు అందుబాటులో ఉంచిన ఆ వెబ్‌సైట్‌... www.freegurukul.org. ఇందులోని పుస్తకాలను చదువుకోవడమే కాదు, ఉచితంగా డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌ వ్యవస్థాపకులు కొమిరెడ్డి రాజా రమేష్‌రెడ్డి. పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు. ఈయనకు తెలుగు అంటే చిన్నతనం నుంచే ఇష్టం. పుస్తకాలు బాగా చదివేవారు. ఉద్యోగరీత్యా పుణె వెళ్లాక వెతకబోతే మన పుస్తకాల జాడే కనిపించలేదు. పోనీ అంతర్జాలంలో చదువుకోవచ్చని వెబ్‌సైట్లు బ్లాగులు చూశారు. అయితే నచ్చిన పుస్తకాలకు సంబంధించిన సమాచారం కోసం చాలా వెబ్‌సైట్లు వెతకాల్సి వచ్చింది. అవి కూడా చదివేందుకు వీలులేకుండా అనేక ఫార్మాట్లలో ఉన్నాయి. స్వస్థలానికి దూరంగా ఉండే తనలాంటి పుస్తక ప్రియులందరూ ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారని రాజాకు అర్థమైంది. అప్పుడే ఆయనో నిర్ణయం తీసుకున్నారు. మంచి తెలుగు పుస్తకాలన్నింటినీ ఒకే అంతర్జాల వేదిక మీదకు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. తన ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడానికి తమ్ముడు శ్రీనివాసరెడ్డి, మిత్రుడు రామాంజనేయుల తో కలిసి సాయిరామ్‌సేవక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ బృందం కృషి ఫలితమే.. ఈ వెబ్‌సైట్‌. 
సాయిరామ్‌సేవక బృందం లక్ష్యం... మానవీయ విలువల్ని పెంపొందింపచేసే సాహిత్యాన్ని సామాన్యులకు చేరువలో ఉంచడం. దానికి అనుగుణంగా ఇప్పటివరకూ 4200కు పైగా పుస్తకాలను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటిని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. ఈ పుస్తకాల్లో 85 శాతం భారత ప్రభుత్వ ‘డిజిటల్‌ లైబ్రరీ’ నుంచి సేకరించినవి. మిగిలినవి ఇతర సేవాసంస్థల నుంచి వచ్చాయి.
ఎలాంటి పుస్తకాలుంటాయి? 
అన్ని తరహా పుస్తకాలనూ అందుబాటులో ఉంచారు. కొంతమందికి భక్తిపుస్తకాలు ఇష్టం. ఇంకొందరు ప్రాచీన సాహిత్యాన్ని చదువుతారు. మరికొందరు వ్యక్తిత్వ వికాస గ్రంథాలను ఇష్టపడతారు. ఇలా ఎవరికి నచ్చిన పుస్తకం వాళ్లు చదువుకునేలా అందుబాటులో ఉంచారు. మన సాహితీసంపదలోని ముఖ్య రచనలన్నీ ఇక్కడ కనపడతాయి. భగవద్గీత, రామాయణం, వేదాలకు సంబంధించిన ఆధ్యాత్మిక పొత్తాలతో పాటుగా కథలు, కావ్యాలు ఎన్నో ఉన్నాయి. మనుచరిత్ర నుంచి కన్యాశుల్కం వరకూ, అన్నమయ్య కీర్తనల నుంచి  వేమన శతకం వరకూ, కాశీమజిలీ కథల నుంచి ‘కథానిక- స్వరూప స్వభావాల’ వరకూ, ‘తెలుగు సాహితీ వస్తు పరిణామం’ నుంచి ‘తెనుగు కవుల చరిత్ర’ వరకూ అన్నీ ఉన్నాయి. బాలవిజ్ఞానకోశం, పెద్దబాలశిక్ష తదితరాలు వంటివి అదనం. విజ్ఞానశాస్త్ర, వ్యక్తిత్వ వికాస రచనలనూ ఇక్కడ చూడవచ్చు. ఈ పొత్తాలన్నింటినీ పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఆప్‌ కూడా..!
వెబ్‌సైట్‌తో పాటుగా ఇవే పుస్తకాలను మొబైల్‌ ఆప్‌ రూపంలోనూ చదువరులకు అందుబాటులో ఉంచారు. ఆ ఆప్‌.. 3500 FreeGurukul - Telugu Books. ఒక్కసారి ఈ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక, తీరికను బట్టి పుస్తకాన్ని ఆఫ్‌లైన్లో కూడా చదువుకోవచ్చు.


వెనక్కి ...

మీ అభిప్రాయం