బ్రోచేవారెవరురా, మల్లేశం, ఓ..బేబీ, దొరసాని - సమీక్షలు

  • 526 Views
  • 6Likes
  • Like
  • Article Share

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!


భలే బ్రోచితిరి.. 
దొంగల ముఠాలో పదవినోదం నింపే కుర్రాడు.. శని ప్రభావం ఎలా ఉందో అని ఆదుర్దాపడుతూ గ్రహఫలాలు చూసుకునే పెద్దదొంగ.. అమాయకంగా గుంటూరు యాసలో మాట్లాడే అతని వాహనచోదకుడు.. భలే గమ్మత్తయిన సన్నివేశాలు ఈ చిత్రంలో బోలెడు.  సంభాషణలూ హాస్యాత్మకంగా సాగేవే.. కిడ్నాపర్‌ ఎలా ఉంటాడంటే.. ‘సాగర సంగమంలో కమల్‌హాసన్‌ రిక్షా నెట్టుకుంటూ వస్తాడు కదండీ.. ఆ రిక్షావాడిలా ఉంటాడు.. ఇంకోడు నరసింహ నాయుడు సిన్మాలో గ్రూప్‌ డాన్సర్లతో మూడోవరసలో రెండోవాడిలా ఉంటాడు..’ వంటి పోలికలు చెప్పడం నవ్వులు పూయిస్తుంది. పరీక్షల పేపర్లు ఇస్తూ మార్కులు చెబుతున్నప్పుడు గడ్డం పెంచుకున్న రామకృష్ణను చూసి విస్తుపోతుంది మేడం. ‘పాసైతే తిరుపతిలో తీయిస్తానని మా నాన్న మొక్కిన మొక్కు ఉందని’ చెబుతాడు కుర్రాడు. తర్వాత నాయకి మార్కులు చూసి ‘ఏంటి అరా?’ అని అవాక్కయి నవ్వుకోవడం బావుంది. ఇక దొరగారి సొగసరి సిరి తోటలో దొరసాని సిలకమ్మ ఉందిరో.. గలబాల గడసరి పెడ మూకతో సెలిమే అది సేసెరో.. పాట ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. భరద్వాజ్‌ రాసిన ఈ పాటలో ‘గలబాల’ అంటే ఏంటో తెలియని యువత జవాబులు వెతికే పని లోనూ పడ్డారు. ‘పొగమంచే పడే పొడితడీ వేళల్లో.. తలవంచేసినా సిటారు సేలో.. సిగురించే సావాసాలు..’ అని వర్ణించడం కొత్తగా ఉంది. అలాగే.. ‘రేచుక్క నావలో కిందికి తేలిపో’ అన్న ప్రయోగం అద్భుతం! ‘తలపు తలుపు తెరిచానా స్వయానా..’లో ‘భూగోళం చెయ్యందేలా ఆకాశం దిగాలా?’ అంటూ నాయకి అంతరంగం స్పష్టంగా అక్షరబద్ధం చేశారు రామజోగయ్యశాస్త్రి.


సల్లని మాటల మల్లేశం
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నడిచే జీవిత కథ కావడంతో అచ్చమైన మాండలికం చిత్రం ఆద్యంతమూ ఆహ్లాదంగా వినపడుతుంది. పెద్దింటి అశోక్‌ మాటలు అదనపు బలం. చిత్ర ప్రారంభం నుంచే ‘అరే.. బడి మస్త్‌ యాదికస్తాందిరా.. మల్ల రాబుద్దయితాంది’ అంటూ బాల్యంలో చదువును ఆపేశాక బాధపడే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది.  ‘పంకా కొంచెం పైలంగ పెట్టుర్రి..’ అంటూ గంగవ్వతో చెప్పించిన చిన్నచిన్న మాటలూ కొత్తగానే వినిపించాయి. ఆసు విసరడం ఎంత కష్టమో తెలియజేస్తూ కోడలి పాత్రతో చెప్పించే సన్నివేశం ఆకట్టుకుంటుంది. మరోవైపు ‘బావా.. నాతాన ఎయ్యి రుపాయలున్నయ్‌..’ అంటూ ఆమె మాటల్లో అమాయకత్వం తెలంగాణ యాసలో నవ్వులను పంచుతుంది. అంతే కాదు.. ‘పండుక్కి నారాజేంది తియ్‌ బావా.. అంతా మంచిగుంది. నువ్వేం ఫికర్‌జెయ్యకు..’ అంటూ మల్లేశాన్ని సముదాయించడం ముమ్మాటికీ తెలుగు తెరకు కొత్తే! మా బావకి కోప్మొచ్చినట్టుండ్ల.. అని నవ్వించడం కూడా బావుంది. ఆసు యంత్రం తయారీకి పడ్డ కష్టాన్ని నవ్వుతూనే పంచుకోవడం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. నీకు విలువలేని జాగల నేనెట్లుంట బావ అంటూ పుట్టింటినుంచి బయటకు వచ్చి మల్లేశంతో నడవటం కంటతడి పెట్టిస్తుంది. ‘నీ బొజ్జలోపల దాగున్న బిడ్డను ఈ నాన్నకి కానుకివ్వవా.. నా బుద్దిలోపల దాగున్న బిడ్డను లోకానికంత కానుకియ్యనా..’ అంటూ అన్వయార్థంతో పాటలో చేసిన ప్రయోగం బావుంది. దాశరథి రచన ‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో..’ పాటను సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు.
గోరటి వెంకన్న ‘ధనాధనాధన్‌’ పాటలో పల్లెల్లో ఆడుకునే ఆటలను గుర్తుచేస్తూ ‘సుక్కల సూరు దాటే సిర్రాగోని ఆట..’ అని రాసిన పద ప్రయోగం బావుంది. శీర్షికాగీతాన్ని ఎంత మాయాగల్లదీ బట్టా.. నవనాడులనుగొని పడుగుపేకలు వరుసగాజుట్టా.. అంటూ తత్వాలు పాడే తీరులో రూపొందించారు.
      యంత్రాన్ని బిడ్డగా భావిస్తూ రాసిన పాట ‘చేతికొచ్చిన బిడ్డా నువ్వే జారిపోతివా..’ ఆర్ద్రంగా సాగిపోతుంది. పేగు బంధం లెక్కన ఇది పోగు బంధంరా.. చీరగ ఎదిగే సంబంధాన్ని చిరుగుల గుడ్డగ చేసేశావా.. అంటూ సాగిన చంద్రబోస్‌ భావ వ్యక్తీకరణలు సన్నివేశాలను రక్తికట్టించాయి.


బేబీ మాట చద్ది మూట 
మానవ సంబంధాల నేపథ్యంలో చిత్రాలు నిర్మిస్తే యువత చూస్తారా? అనుమానం పటాపంచలైంది. ఒకింత వినోదమూ కాల్పనికతా కథలో చొప్పించి తల్లిదండ్రుల మనసులు ఎలా ఉంటాయో తెరమీద చూపించారు. ఇప్పటికే ఎన్నో ప్రపంచ భాషల్లో వచ్చిన కథ ఇది. దీనికి సంభాషణలు లక్ష్మీభూపాల్‌. 
      ‘ముసలాడు డప్పుకొడితే ముసలెద్దు రంకేసిందని..’, ‘ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట నీలాంటిది’, ‘బాస బడాయికెల్తే సోకు సిన్మాకెల్లిందంట’ వంటి తమాషా సామెతలు అలరిస్తాయి. వయసు తగ్గిన బేబీ తన మనవడితో కలిసి సంగీత సాధన చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రత్యేకంగా ‘వద్దురా.. నేను నీకు నాయనమ్మనురా.. ఆ సూపేంట్రా.. సెప్పేవంటే సంపేత్తాను..’ అంటూ మనవడితో గోదావరి యాసలో సమంత చెప్పిన భాషణలు యువతకు చేరువయ్యాయి.
      ముసలోళ్లంటే ఏంటీ? వయసులో ఉండి నువ్వేం ఉద్దరిస్తున్నావురా.. తాగి తందనాలాడటం తప్ప...’ అంటూ ఆవేశంగా చెప్పే మాటలు చప్పట్లు కొట్టిస్తాయి. మరోవైపు కథానాయకుడిని ‘మలబద్ధకం ఉందా నీకు?’ అని అడిగే బేబీ పెద్దరికం పొట్టచెక్కలు చేస్తుంది.
      ఇంట్లో తినలేదని తిట్టే తల్లి గురించి కొడుక్కి తండ్రి వివరించే సన్నివేశం ఆలోచింపజేస్తుంది. అమ్మలు అంతేరా.. మెంటలే.. మనకి తిండి పెడతారు.. మనతోనే తిట్లు తింటారు.. ఏం అనుకోవాలి వాళ్లని.. ఆళ్లంతేరా.. గొడవ పడేది మనతోనే.. మన మంచి కోసమే.. మనం దాన్ని చాదస్తం అనుకుంటాం.. వాళ్లుదాన్ని బాధ్యత అనుకుంటారు..’ అని రావురమేశ్‌ పాత్ర వివరించడం కథకు మూల సన్నివేశం.
      ‘ఇంట్లో అమ్మో నాన్నో తాతయ్యో నానమ్మో లేకపోతే ఇంక ఎవరడుగుతార్రా మనల్ని తిన్నావా ఉన్నావా అని..’ అన్న మాట ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది. తల్లిదండ్రుల గురించి చెబుతూ ‘వాళ్లు ఉన్నప్పుడు విలువ తెలీదురా.. వాళ్లు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా.. పెద్దోళ్లన్నాక తిడతారు.. పడతాం.. ఏమైంది? ఈగో ఎందుకుమనకి? అన్నది మనవాళ్లేగా.. మనకోసమేగా.. వాళ్లున్నంతవరకేరా మనం చిన్నపిల్లం.. వాళ్లు పోతే మన బాల్యాన్ని కూడా వాళ్లతో తీసుకుపోతార్రా..’ అనే మాటలకు గుండె చెమర్చుతుంది. ‘తొండమయ్యా.. నీకు నాకు చెల్లు ఇంక.. ఏదీ లేదురా జీవితంలో అనుకుని బాధపడుతూ ఉంటే.. ముందు నీ కళ్ల మందున్న జీవితం చూడవే పిచ్చిమొహమా అని చూపించావు..’ అనుకుంటూ నాయకి తృప్తి పడ్డ సన్నివేశాలు రక్తికట్టాయి.


దొరసానిది సక్కటి మాట
ఒకప్పటి గడీలలోని వాతావరణం, ప్రజల జీవితాలు ఎలా ఉండేవో ఓ ప్రేమకథను ముడేసి చెబుతూ ఈ చిత్రంలో చూపించారు. ఇందులో దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర రచయితగానూ తన కలం బలం చూపించారు. చిత్రం పూర్తిగా తెలంగాణ మాండలిక సొబగుతో సాగిపోతుంది.
      ‘లోపలికచ్చి శానా ఏట్లైంది గదా.. రాజును జూడాలి’ అంటూ ఒక ఖైదీ కోరికతో ప్రారంభమైన చిత్రం ‘రాజు గెలిసిండన్నా.. రాజే గెలిసిండు.. ఆని ప్రేమకోసం దొరసాని గడీ దిగినప్పుడే ఆడు గెలిసిండు..’ అన్న సముదాయింపుతో ముగుస్తుంది. 
      చిత్రంలో చదువు ఆవశ్యకత గురించి నాయకుడు ఓ సన్నివేశంలో చెబుతాడు. ‘సదివి నౌకరి జేసే మొకమా నాది.. నువ్వంటే కవితలు గివితలు గట్ల రాస్తవు..’ అని అతని దోస్తు అంటే.. ‘ఉద్యోగం కోసం గాదు. తెల్వికోసం జదవాలె. పత్రికలు, పుస్తకాలు అన్నీ చదవాలె..ఎవని ముంగట వంగి నిలబడే అవసరం ఉండదని చెప్తాండా..’ అంటాడు కథానాయకుడు. ఉపకథగా సాగే గడీల మీద పోరాటంలో ఉద్యమ నాయకుడు ‘ఈ ఉద్యమం ఇంత మంది వీరులని తీసకపోయి తూట్లు పడ్డ శవాల్ని అప్పగిస్తందే..’ అంటూ ఆవేదనతో చెప్పే మాటలకు ఒళ్లు జలదరిస్తుంది. గోరటి వెంకన్న రచన ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే.. నేల పైన పాలపిట్ట తొవ్వగాసెనే’ పాట జోరైన బాణీలో వినిపిస్తుంది. ఈ సాహిత్యంలో ‘కంచు సెంబుల సల్ల.. దోరసాని ఆపిల్ల’ అన్న పోలిక చాలా బాగుంది. కథ సగభాగం అయిపోయినా నాయికానాయకుల మధ్య ఒక్క మాట కూడా ఉండదు. కథనంలో చక్కటి బిగి ఉండటంతో ఈ విషయమే ఆలోచనకు రాదు. గడీల బతికే దొరసానికి ఏ కాయిష్‌ ఉండదు.. అంటూ నాయకి అవస్థను చూపించడం బావుంది. ఉద్యమ నాయకుడు ‘ఉద్యమంల చావుకూడా ఓ విజయం’ అంటే ‘మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే’ అని చెబుతాడు నాయకుడు. చరిత్రలో మొదటిసారి ఒక దొరసాని గడీపై తిరుగుబాటు చేస్తాంది.. వంటి మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. శ్రేష్ఠ రచన ‘కళ్లలో కల వరమై’ పాటలో ‘ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే..’ అన్న భావన బావుంది. పాలబుగ్గలోని తళుకులే.. వెన్నుపూసలోని ఒణుకులై అన్న ప్రయోగం ఆకట్టుకుంది. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం