కంప్యూటర్ పనిచేయాలంటే, అదీ అన్ని సదుపాయాలతో కావాలంటే బోలెడన్ని సాఫ్ట్వేర్లు కావాలి. అలాగనీ వేలకు వేలు పోసి సాఫ్ట్వేర్లన్నీ కొనలేం. ఒకవేళ కొన్నా అవి ఎలా పనిచేస్తాయో తెలియదు. పోనీ ఉచిత (ఓపెన్సోర్సు) సాఫ్ట్వేర్లను వాడదామని వాటి గురించి అంతర్జాలంలో వెతికితే సమాచారమంతా ఆంగ్లంలోనే ఉంటుంది. మరేం చేయాలి? ఆ సాఫ్ట్వేర్ల పనితనాన్ని ఎలా ‘అర్థం’ చేసుకోవాలి? ఇలా అనుకుంటూ ఆంగ్లంతో ఇబ్బందులు పడే తెలుగు కంప్యూటర్ వినియోగదారులకు సాయం చేసే బ్లాగు ఒకటి ఉంది. అదే... ‘ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్లు’.
ఇందులో ఏమేముంటాయి?
కంప్యూటర్కు సంబంధించిన సాంకేతిక సమాచారమంతా ఉంటుంది. అదీ చక్కటి తెలుగులో. పైసా ఖర్చు లేకుండా ఉచిత సాఫ్ట్వేర్లను ఎలా పొందాలో కూడా వివరిస్తుంది ఈ బ్లాగు. ఉదాహరణకు ఈ ఉచిత సాఫ్ట్వేర్ల వివరాలన్నీ (ప్రత్యేకతలు, ఎలా పని చేస్తాయి, ఎలా డౌన్లోడు చేసుకోవాలి తదితరాలు) చక్కగా తెలుగులోనే రాసుంటాయి.
* ఎలిబ్రే ఆఫీస్ - ఎం.ఎస్.ఆఫీస్కు బదులుగా దీన్ని వాడుకోవచ్చు.
* స్రైబస్ - పేజిమేకర్కు ప్రత్యామ్నాయం.
* గింప్షాప్ - ఇదుంటే ఫొటోషాప్ అక్కర్లేదు.
* నోట్పాడ్++ - విండోస్ నోట్పాడ్కు ప్రత్యామ్నాయం
* వర్చువల్ బాక్స్ - మనం ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టంని అలాగే ఉంచి మరిన్ని ఆపరేటింగ్ సిస్టంలను ఇన్స్టాల్ చేసుకునేందుకు ఉపయోగపడే సాఫ్ట్వేర్.
ఇలా మనకు ఉపయోగపడే మరిన్ని సాఫ్ట్వేర్ల సమాచారమూ ఈ బ్లాగులో ఉంటుంది. అంతేకాదు డ్రైవర్లను ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా? ఆండ్రాయిడ్ ఫోన్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడమెలా? ఉబుంటు గురించిన పూర్తి సమాచారం, ఫైర్ఫాక్స్లో వీడియో చాట్ తదితర అంశాలనూ ఇందులో చూడొచ్చు. ఇంకా స్మార్ట్ఫోన్ల్లను స్కానర్గా మార్చుకునే కిటుకులు, కంప్యూటర్ పరికరాల కొనుగోలుకు సూచనలనూ అందుకోవచ్చు. ఈ బ్లాగు చిరునామా...http://spveerapaneni.blogspot.com/
ఎవరిదీ బ్లాగు?
నిజామాబాద్ నివాసి శివప్రసాద్. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని డా.రెడ్డీస్ లాబ్లో పనిచేస్తున్నారు. చదివింది విజ్ఞానశాస్త్రం. మొదట్లో తనకు కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. ఆ తర్వాత తాను ఆ అంశాలపై పట్టు పెంచుకుని, ఆ విజ్ఞానాన్ని పదిమందికీ పంచుతున్నారు. ఈ బ్లాగును 2009లో రూపొందించారు. సాంకేతిక నిపుణుడు కాకపోయినా అందరికీ తేలిగ్గా అర్థం అయ్యేలా సాంకేతిక అంశాలను సరళమైన తెలుగులో వివరించడంలో శివప్రసాద్ దిట్ట. ఈ బ్లాగును లక్షమందికి పైగా చూశారు. ఆధునిక అవసరాలను తీర్చేలా తెలుగును తీర్చిదిద్దుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి.