పసిపాపగా అమ్మ

  • 945 Views
  • 7Likes
  • Like
  • Article Share

    విజయబక్ష్

  • విశ్రాంత తెలుగు రీడర్
  • మండపేట, తూ.గో. జిల్లా.
  • 9441382303
విజయబక్ష్

‘లాలపోసుకుంటావా బుజ్జికన్నా’... అని అమ్మ పిలవగానే బోసినవ్వుతో పరిగెత్తుకొచ్చేస్తాడు బంగారు తండ్రి! కాసేపు నీళ్లతో పండుగ చేసుకుంటాడు. తర్వాత ‘ఆం తిందామా నాన్నా’ అనగానే... పెట్టమంటూ నోరు తెరిచేస్తాడు. ఇలా పసివాళ్లతో మాట్లాడుతూ... మాట్లాడిస్తూ... తెగ సంబరపడిపోయే తల్లులు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తారు. ఈ అమ్మలందరూ కలిసి అమ్మభాషలో ఓ ‘బుజ్జాయి వ్యాకరణాన్నే’ సృష్టించారు. దాని అందం అనిర్వచనీయం. 
వచ్చీ రాని
మాటలతో పసినోళ్లు చేసే సందడి... చెవులకింపుగా ఉంటుంది. వాళ్ల మాటలను పదేపదే వినాలనిపిస్తుంది. వాళ్లతో ఇంకా ఇంకా మాట్లాడించాలనిపిస్తుంది. చిన్నారుల ఆ చిలుక పలుకులకు తళుకుబెళుకులద్దేది అమ్మలే. దీనికోసం వాళ్లూ పసిపిల్లలుగా మారిపోతారు. 
      అమ్మ ఎంత చదువుకున్నా, భాషలో తనకు ఎంత పటుత్వం ఉన్నా తన బిడ్డలతో మాట్లాడేటప్పుడు పెద్దపెద్ద వాక్యాలను, అర్థం కాని పదాలను ఉపయోగించదు. ఆమె భాషలో ఎంతో లాలన, ఆప్యాయత, వాత్సల్యం, ప్రేమ తొంగి చూస్తాయి. ‘అసలు కంటే వడ్డీ ముద్దు’ అన్నట్లు అసలు పేరుని వదిలేసి ‘కన్నా, నాన్న, రాజా, బుజ్జి, బుజ్జోడ, చిన్నా, చిట్టి, చిట్టోడా, బంగారం, తండ్రీ, నాన్నలు, తల్లులు, పెద్దా’ అంటూ ముచ్చటగా ముద్దుపేర్లతో బిడ్డను ముంచెత్తుతుంది. ఇలా మనోహరంగా ఉండే తెలుగు పేర్లతో పాటు స్వీటీ, హనీ, పింకీ, బడా, ఛోటు, మున్నా, మున్నీ, బబ్లు, బబ్లీ, బేటా, లాలు, మేరీ, జాన్‌ వంటి అన్య భాషా పదాలతోనూ పిలుస్తున్నారిప్పుడు! ఎలా పిలిచినా... అమ్మ పిలుపులోని కమ్మదనం మాత్రం చిన్నారిని హత్తుకుంటుంది. 
లాలపోసుకున్నావా...?
రెండు, మూడేళ్ల పిల్లలకు మాటలు నేర్పుతున్నప్పుడు ‘అన్నం తింటావా, పడుకుంటావా, స్నానం చేస్తావా?’ లాంటి వాటిని కూడా సులువుగా చెబుతుంది అమ్మ. పిల్లలు తేలికగా అర్థం చేసుకోవడం కోసమే... పదాల్లో ఆప్యాయతను రంగరించి ప్రయోగిస్తుంది. పాలు తాగుతావా? అనడానికి ‘బాయి తాగుతావా’ అని మురిపెంగా అడుగుతుంది. నిద్రపొమ్మనడానికి ‘బజ్జో’, ‘బబ్బో’ అని; స్నానం చేయిస్తాననడానికి ‘లాలపోస్తా’ అని మార్చి పలుకుతుంది. భయపడినప్పుడు అంటూ ‘థూ థూ’ అని వీపు మీద చిన్నగా తడుతుంది. వీపంతా నిమురుతుంది కూడా.
      వచ్చీరాని నడకలతో పిల్లాడు తడబడుతూ నడుస్తూ పడిపోతే, లేవనెత్తి గుండెలకు హత్తుకుంటుంది. ‘పరిపోయావా.../ పప్పోయావా’ అంటుంది. ‘ఏలుత్తున్నావా!’ అంటూ ‘మా బంగారాన్ని పరేత్తావా ఆయ్‌’ అంటూ నేలను కొట్టినట్లు నటిస్తుంది. దెబ్బ తగిలితే ‘బబ్బూ అయిందామ్మా’ అంటూ ఉత్తుత్తి మంత్రం వేస్తుంది. ‘బువ్వ తిందాం’ అనో... ‘ఆం తిందా’మనో పిలిచి ముద్దార గోరుముద్దలు పెడుతుంది. ‘అప్పితాగు’ అని మంచినీళ్లందిస్తుంది. జ్వరమొస్తే బిడ్డను ఎత్తుకొని... ‘ఆయొచ్చిందా? తగ్గిపోతుందిలే’ అంటూ తాను తల్లడిల్లిపోతూనే బిడ్డకి ధైర్యాన్నిస్తుంది. 
కొత్త లోకానికి...
తెలియని వస్తువులను పిల్లలకు పరిచయం చేసేటప్పుడూ అమ్మలో ఎంతో సృజనాత్మకత కనిపిస్తుంది. రైలును చూపిస్తూ ‘ఛుక్‌-ఛుక్‌’ బండి అంటుంది. పువ్వులను ‘పువ్వాయి’లని, ఆవు, గేదె దూడలను ‘తువ్వాయి’లని చెబుతుంది. కాకులను ‘కా..కా’,  కుక్కలను ‘భౌ..భౌ’, కోళ్లను ‘కొక్కొరొకో’ అంటూ తనకు తెలియకుండానే, అవి చేసే ధ్వనులను పరిచయం చేస్తుంది. 
      అలాగే అల్లరి చేసే పిల్లలను సరదాగా ‘బూచోడొస్తాడని’ బెదిరిస్తుంది కూడా. మట్టిలో, చెత్తలో చేతులు పెట్టే చిన్నారులకు  ‘ఛీ... యాక్‌’ అంటూ వారిస్తుంది. చివరికి మలమూత్ర విసర్జనను కూడా ‘జియ్యకెల్తావా’, ‘సుస్సు’ పోస్తావా?’ అని లాలింపు మాటలతోనే చెబుతుంది. 
      పిల్లలు పెద్దయ్యేకొద్దీ ముద్దుముద్దు మాటలనుంచి అసలు మాటల అర్థాలు గ్రహిస్తారు. తర్వాత తల్లి కూడా మామూలుగానే మాట్లాడటం మొదలెడుతుంది. అయితే అప్పటి వరకూ తల్లీబిడ్డల సంభాషణల్లో దొర్లే ఆ అందమైన పలుకులెప్పటికీ తీపి జ్ఞాపకాలే. అమ్మభాషకు అరుదైన అందాలనద్దే ఈ ‘బుజ్జాయి వ్యాకరణా’నికి విలువ కట్టలేం. ఎందుకంటే అది అమ్మప్రేమలోంచి పుట్టేది కాబట్టి!


వెనక్కి ...

మీ అభిప్రాయం