ఇవి కథలే... కానీ,  వాస్తవ గాథలు!

  • 954 Views
  • 35Likes
  • Like
  • Article Share

సమాజంలో పైన పెద్దలుంటారు. మేడల్లో ఉంటూ మేఘాల్లో విహరిస్తుంటారు. మధ్యలో మధ్యతరగతి మనుషులుంటారు. ఒకటో తారీఖు కోసం ఎదురుచూస్తుంటారు. కింద పేదలుంటారు. కూలో నాలో చేసుకుని ఏ పూట గంజి ఆ పూట తాగుతారు. ఆ కిందివాళ్లకు కింద కొందరుంటారు! వాళ్లవి చీకటి బతుకులు. చీకట్లో పుట్టి చీకట్లోనే చచ్చిపోతారు. ఆ చీకటి... ‘నేరం’! ఆ ఊబిలోకి వాళ్లెలా దిగబడిపోయారో ‘పైన వాళ్లు’ ఆలోచించరు. కానీ, అసహ్యించుకుంటారు. ‘మధ్యలో వాళ్లు’ పట్టించుకోరు. కానీ, ఆమడ దూరం పెడతారు. ‘కిందివాళ్ల’కు కాస్త తెలుసు. కానీ, వాళ్లూ తిడుతూనే ఉంటారు!!! సమాజంలోంచి... ముఖ్యంగా ‘పైన’ ఉన్న కొందరి స్వార్థంలోంచి... పుట్టిన చీకటిని చూడాలంటే వీళ్లందరికీ భయం. రాచకొండ విశ్వనాథశాస్త్రి(రావిశాస్త్రి)కి అలాంటి భయాలేమీ లేవు. అందుకే ఆయన అట్టడుగు వర్గాల బతుకుల్లోని చీకటి చూశారు. తన ‘ఆరు సారా కథల’ ద్వారా లోకమంతటకీ చూపించారు. 
      ‘జీవితానికి దగ్గరగా ఉండగలిగినవాడే మంచి రచయితగా మిగులుతాడు’ అన్నది రావిశాస్త్రి సిద్ధాంతం. ‘రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించాల్సిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని, చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాన’ని అంటారాయన. రచయిత అంటే మనుషుల్ని చదవాలి. బతుకులను అర్థం చేసుకోవాలి. లోకం లోతులను తడమాలి. రావిశాస్త్రి ఆ పనే చేశారు. ప్రజాస్వామ్యమని పేరుపెట్టుకున్న వ్యవస్థ... ప్రజల్లోని కొంతమందిని ఏ నరక కూపాలకు అంకితం చేసిందో తన ‘ఆరు సారా కథల్లో’ చెప్పారు. ఇంతకూ ఆ కథలేంటంటే...
ఎవరు ‘పాపి’?
ఇద్దరు సారాసురులు. పట్నాన్ని చెరిసగం పంచుకుని సారా పారిస్తున్నారు. ఒకడి రాజ్యంలో మరొకడి సారా చుక్క ఇంకకూడదన్నది వాళ్లిద్దరి మధ్య కట్టుబాటు. కానీ, నీలయ్య కట్టుతప్పాడు! దాసు రాజ్యంలో జెండా పాతాడు. ఖాకీ గుడ్డల పెద్దమనిషిని పట్టుకుని ఎట్టాగో దాసు... ఆ జెండాను పీకేయించాడు. పగబట్టిన నీలయ్య... దాసు గుట్టుమట్ల గురించి ‘సెంట్రల్‌ పోలీసోళ్ల’కి ఉప్పందించాడు. వాళ్లొచ్చి అతని సరకుని, మనుషుల్ని పట్టుకుపోయి కోర్టుకు అప్పగించారు. అక్కడితో ఆగాడా నీలయ్య... లేదు! దాసు ‘సహధర్మచారిణి’ నూకాలమ్మను అల్లరిపాలు చేయించాడు. అంతే... దాసులోని అసురుడూ నిద్రలేచాడు. నీలయ్యను శాశ్వతంగా నిదరోయిస్తానని శపథం చేశాడు. ప్లానేశాడు. తెల్లారితే దాన్ని అమలు చేయడమే! కానీ, ఆరోజే ఓ నల్ల దొరసాని గదిలో, ఖాళీ మందుబుడ్ల మధ్య నీలయ్య శవం కనపడుతుంది. ఆమెవరు? అతనెందుకు చచ్చాడు? ఎవరికీ తెలియదు. కానీ, ఆ చావు వార్తతో దాసు గుండెమండిపోయింది. ఎందుకంటే... నీలయ్య పోయింది శివరాత్రి నాడు!! ఆ రోజు పోయినోళ్లు కైలాసానికి చేరతారంటారు కదా! అదే మరి... దాసు శివభక్తుడాయే! ‘శివరాత్రి-చావు-కైలాస ప్రయాణాన్ని’ నమ్ముతాడాయే! కానీ, ఏం చేయగలడు!! ‘‘మరైతే ఆడు...ఆడు... ఆ నీలయ్యగాడు! ఆడి పాపాలన్నీ ఏటైనట్టు?’’ అంటూ గావుకేక మాత్రం పెట్టాడు. అక్కడితో ‘పాపి’ కథ అయిపోతుంది. 
అంతా ‘మాయే’!
మూర్తి కొత్త ప్లీడరు. తెల్లోళ్లు ఇచ్చిపోయిన ‘భారత న్యాయవ్యవస్థ’ నిజానిజాల గురించి... వాటిల్లోని ‘మాయ’ గురించి సీనియర్‌ న్యాయవాది ఉపన్యసిస్తే... అంతా ఛాదస్తమనుకుంటాడు. ఇంతలో తన దగ్గరికి ఓ కేసొచ్చింది. ముత్యాలమ్మ అని... సారా వ్యాపారంలో బతికిచెడ్డ ‘తల్లి’. సారా ‘మాయ’లో పడి కూతుర్ని కాటికి పంపేసుకుంది. నాటి నుంచి బతుకు మీద విరక్తి పెంచుకుంది. గోరుచుట్టు మీద రోకటి పోటన్నట్లు హెడ్డుగారొచ్చి మామూలడిగాడు. బిడ్డ పోయిన బాధలో ఉన్న ముత్యాలమ్మ... రోకలితో సమాధానమిచ్చింది. దాన్ని కడుపులో పెట్టుకున్న హెడ్డుగారు... ముత్యాలమ్మను తప్పుడు కేసులో ఇరికించాడు. ఈ కేసులోంచి  బయటపడేయమంటూ మూర్తి దగ్గరికి వచ్చింది ముత్యాలమ్మ. సరే అన్నాడు మూర్తి. తర్వాత కోర్టులో బాగా వాదించాడు. బయటికి వచ్చి ‘కేసు వీగిపోతుంద’ని ముత్యాలమ్మకు చెప్పాడు. ‘నిన్న హెడ్డు బాబు హెడ్డుకు కట్నం చదివించుకున్నా... అందుకే ఆయన నీ ముందు నాలుక మడతేశాడు. కేసు తేలగొట్టేశాడ’ంటూ బదులిస్తుంది ముత్యాలమ్మ. మూర్తికి బుర్రతిరిగిపోతుంది. జరగని తప్పు జరిగినట్లు కేసు పెట్టి... కోర్టుకు లాక్కొచ్చి... అబ్బే తప్పు జరగలేదంటూ కోర్టులో ‘నిజం కాని నిజాన్ని’ ఒప్పుకుని... సొమ్ము దండుకునే వ్యవస్థ ప్రతిరూపాలను చూసిన మూర్తి... పెద్ద ప్లీడరు చెప్పిన ‘మాయ’లోని మర్మాన్ని తెలుసుకుంటాడు. ఇదే ‘మాయ’ కథ. 
నోరు లేని ‘న్యాయం’
నలిగిపోయి... వాడిపోయిన పువ్వును పాపం... కోర్టుకు పట్టుకొచ్చారు పోలీసులు. ఆకారానికి ఆడమనిషని తెలుస్తోంది కానీ, ఆమెలో జీవం లేదు. నేరం చేశావా అని న్యాయమూర్తి అడిగితే ‘కేసు వొప్పేసుకుంటానండి’ అందామె. ఆ అంగీకారంలో శతకోటి ప్రశ్నలు... బాణాల్లా వచ్చి న్యాయమూర్తికి తగిలాయి. ఆయనసలే పెద్దింటి వాడు. ఉద్యోగంలోకి వచ్చి నెల్లాళ్లే అయ్యింది. ఈ భూమ్మీద ‘తమలాంటి వాళ్ల’తో పాటు ఇలాంటి మనుషులు కూడా ఉంటారన్న నిజాన్ని ఆయనప్పటికే నమ్మలేకపోతున్నాడు. ఇంతకూ ఆమె నేరం చేసిందా లేదా? ఆ సంగతి చెప్పకుండా ‘కేసు వొప్పేసుకుంటా’నని ఎందుకంటోంది? ‘తంతేకాని వీళ్ళు లొంగరు సార్‌’ అని నిండు కోర్టులో... అదీ తన ముందే అన్న పోలీసుల భయంతోనా? న్యాయమూర్తి ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆమె మెదడులో నరాలకు నిప్పంటుకుంది. పెద్దగా ఏడుస్తూ... కేకలేస్తూ... ‘నా కొద్దీ బతుకు. నన్ను చంపేయండి. ఇంత నీచం బతుకు, హీనం బతుకు నేబతకలేను.... ఒక్క రాత్రికి అంతమంది ఇలా కరిసేసి, రక్కేసి, రక్తం తాగేసి ప్రాణాలు తీస్తే నిన్నరాత్రి- యేబాబొచ్చి అడ్డుకున్నాడ’ని     అడుగుతుంటే న్యాయమూర్తికి మతిపోయింది. ఆమె నిజం చెబుతోంది. అయితే ‘నేరం’ చేసిందెవరు? సమాధానం దొరకదు. కానీ, శిక్ష మాత్రం... ‘ఒక నెల’! అదీ ఆ నలిగిపోయిన... వాడిపోయిన పువ్వుకే! అదీ ఈ న్యాయమూర్తే వేశాడు!!! ‘న్యాయం’ కథలో కనిపించే వ్యవస్థ (అ)న్యాయమిది! 
ఏది ‘మోసం’?
గురవయ్య సారా రవాణా చేస్తున్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. వాణ్ని పట్టుకోవడానికి అర్ధరాత్రేళ మాటేశారు. వాళ్లకు సమాచారం ఇచ్చిన రాకెట్‌ అప్పారావూ అక్కడే ఉన్నాడు. పోలీసులతో కలిసి అతను కూడా గురవయ్య ముఠా కోసం ఎదురుచూస్తున్నాడు. తెల్లారి పోయింది. అయినా... ఏ సారా కనపడలేదు. గురవయ్యా రాలేదు! ఇవాళ కాకపోతే రేపు దొరుకుతాడంటూ పోలీసులు ఇళ్లకెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత వాళ్లకు తెలిసిన విషయం ఏంటంటే... అప్పారావే సారా రవాణా చేయిస్తూ, అటువైపు పోలీసులు రాకుండా చేయడానికి గురవయ్య పేరు చెప్పి వాళ్లను వేరేచోటుకు తీసుకెళ్లాడు! అహం దెబ్బతిన్న ఖాకీలు... అప్పారావును ఎలాగైనా ‘మూసెయ్యాల’ను కోవడంతో ‘మోసం’ కథ ముగుస్తుంది. 
పాపం... ‘పుణ్యం’... ప్రపంచమార్గం!
‘లోకంలో పాపపుణ్యాలు లేవు. లాభనష్టాలే ఉన్నాయి’... అంటాడో న్యాయవాది. ‘మంచి తనం మీద నమ్మకంలేని వెధవ్వి’ అని బదులిస్తాడు మరో న్యాయవాది. వీళ్లిద్దరి మధ్యలో ఓ ముసలి ప్లీడరు. ఈ ముగ్గురి సంభాషణే ‘పుణ్యం’ కథ. కాసులతో తప్ప మంచిచెడ్డలతో పని లేదనుకునే పెద్దమను షుల మనస్తత్వమే ఈ కథకు ముడిసరకు. 
ఎక్కడ ‘మోక్షం’?
రావు గారు... ఓ న్యాయమూర్తి. ఇరవై ఏళ్ల నుంచి తీర్పులు చెబుతూనే ఉన్నారు. చాలావరకూ సారా కేసుల్లోనే. జనం వస్తారు. ఈయన జైలుకు పంపిస్తాడు. సారా ‘కంపు’ను మోసుకుంటూ జనం వస్తారు. వాళ్లకు ఆ కంపును అంటించిన షావుకార్లు మాత్రం రారు. అయినా... జనమే జైలుకు పోతారు. చీమలు చీకట్లోకి పోతున్నాయి. వాటిని అలా చీకట్లోకి నెడుతోంది రావు గారే! ఆ చీమలన్నీ కలిసి చలిచీమలైతే... తనపై పగపడితే... ఈ ఆలోచనతో ఆయనకు పిచ్చెక్కిపోతుంది. నిజంగానే పిచ్చిపడుతుంది. కోర్టులో ఆయన తీర్పులు చెబుతుంటే చేతులు కట్టుకుని నిలబడే పోలీసు జవాన్లే... ఆయన చేతులు పట్టుకుని లాగుతూ పిచ్చాసుపత్రిలోకి తీసుకెళ్తారు. న్యాయాన్ని నిలబెట్టడం కోసం నల్లగౌనేసుకున్న రావుగారికి దొరికిన ‘మోక్షమది’! ఇదే ‘మోక్షం’ కథ. 
      విశాఖపట్నం మాండలికంలో సాగే ‘ఆరు సారా కథల’ను చదివితే ఒళ్లు జలదరిస్తుంది. మధ్యతరగతి మండువాల్లోని ముద్దుమురిపాలే ‘కథ’లనుకునే పాఠకులు... ఈ సారాకథల పుటలను తిరగేస్తే ఉలిక్కిపడతారు. ఎందుకంటే... ఆ కథల్లో కనిపించే జీవితాలు అలాంటివి. ఆ బతుకు ల్లోని కన్నీళ్లకు కారణాలేంటో అర్థమవుతున్న కొద్దీ లోకంపోకడల మీద ఛీత్కారం కలుగుతుంది. ఇలాంటి ‘దుమ్ములగొండి’ వ్యవస్థను మార్చడానికి మన వంతుగా ఏం చేయగలమన్న ఆలోచన మొదలవుతుంది. 
      ఈ సారా కథలన్నీ వేగంగా నడచిపోతాయి. సన్నివేశాలన్నీ కళ్లముందు జరుగుతున్నట్లు కనిపిస్తాయి. రావిశాస్త్రి వ్యంగ్య రచనాశైలి... పాఠకుడి కళ్లను పుటల వెంట పరిగెత్తిస్తూనే ఉంటుంది. ‘సాక్ష్యంతోనే సంబంధం కానీ, సత్యంతో సంబంధం లేదు’, ‘ఈ నోకంలో డబ్బూ యాపారం తప్ప మరేట్నేదు’, ‘గవర్నమెంటంటే వోట్లు. నోట్లు!’, ‘ఈ రోజుల్లో బావుపడాలన్నా, డబ్బుండాలి! మాయుండాలి. డబాయింపు సెక్సనుండాలి! బోధపడిందా! డబ్బులో దేవుడున్నాడు’... లోకం నడతను దగ్గరనుంచి చూసిన రచయిత కలం కాగితం మీదకు వస్తే ఇలాంటి వాక్యాలు అలవోకగా ప్రవహి స్తాయి. రావిశాస్త్రి కలం బలం అంతేనా! ‘ఇయాల వొంట సెయ్యాలంటే ఇంట్లో పొయ్యి తప్ప ఇంకేట్నేదు. అందలైనా బుగ్గితప్ప కర్రపేడైనా నేదు’... నిరుపేదల జీవితాల్లోని నిజాలను ఇలా సూటిగా చెప్పేస్తారు. అరవయ్యో దశకంలో రాసిన కథలైనా... అవి ఇప్పటి వాస్తవ గాథలు కూడా. ఎందుకంటే, నాటితో పోల్చితే సమాజంలో చీకటి ఇప్పుడింకా చిక్కబడింది!!


వెనక్కి ...

మీ అభిప్రాయం