కవిలెకట్టల చరిత్ర

  • 921 Views
  • 22Likes
  • Like
  • Article Share

    డా.పి.ఎస్‌. ప్రకాశరావు

  • తెలుగు ఉపాధ్యాయులు
  • కాకినాడ.
  • 9963743021
డా.పి.ఎస్‌. ప్రకాశరావు

నన్నయ, తిక్కన, పోతన... ఇలా ఏ ప్రాచీన తెలుగు కవిని తీసుకున్నా, ఒక చేతిలో తాళపత్రాలు, మరో చేతిలో ఘంటాన్ని పట్టుకున్న చిత్రాలు, విగ్రహాలే కనిపిస్తాయి. వాటిని చూస్తే శ్రద్ధగా రాయడం అంటే ఇలాగేనేమో అనిపిస్తుంది. చదువులతల్లి సరస్వతి చేతిలో ఉండే పుస్తకం, బ్రహ్మదేవుడి చేతిలో వేదాలకు ప్రతీకగా భాసించేవీ తాళపత్ర గ్రంథాలే. కాగితం వాడకముందు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ దేశంలో కవులకు, పండితులకు, రాజాస్థానాల రాతకోతలకు ఉపయోగపడినవి తాళపత్రాలే.
కాగితాన్ని
ఓ రెండువేల ఏళ్ల కిందట చైనావాళ్లు కనుగొన్నారు. ఆ తర్వాత ఎన్నో వందల సంవత్సరాలకు గానీ ప్రపంచ మంతటా కాగితం వాడకంలోకి రాలేదు. కాగితం రాకముందు దేనిమీద రాసేవాళ్లు? ఎలా రాసేవాళ్లు? అంటే... ప్రతి దేశంలోనూ రాతగాళ్లు రాయీ, రాగీ, మట్టీ, మైనం, చర్మం- ఇలా స్థానికంగా ఏది దొరికితే దానిమీద రాసేవాళ్లు. ఒక్కోసారి రాయించుకునేవాళ్ల ఆర్థికస్థితినిబట్టి సాధనాలు మారిపోయేవి. తాళ్లపాక అన్నమయ్య తన సంకీర్తనల్ని రాగిరేకుల మీద నిక్షిప్తం చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు అధికారికి బంగారురేకుపై లేఖ రాయించి గోవా పంపించాడట! కొంతమంది రాజులు ముఖ్యమైన విషయాలను, ఒప్పందాలను రాసేందుకు సువర్ణపత్రాల్నే వాడేవాళ్లు. బుద్ధుడు అక్షరాలు దిద్దేందుకు గంధపుచెక్క పలకగా ఉపకరించిందట!  
సాధనం ఏదైనా సమస్యలెన్నో
శిలమీద రాసింది ఎక్కువకాలం మన్నుతుంది. కానీ దానిమీద రాయడమూ, వేరేచోటికి తీసుకుపోవడమూ కష్టమే. చర్మంమీద రాయడం విదేశాల్లో ఉంది కానీ మనదేశంలో తక్కువ. ఎందుకంటే కృష్ణాజినం (జింకచర్మం) తప్ప వేరేవి వాడటాన్ని ధర్మశాస్త్రాలు నిషేధించాయి. రోమన్లు మైనపుపలకలు, సుమేరియన్లు మట్టిపలకలు రాయడానికి వాడారు. ఈజిప్టులో పాపిరస్‌ (ఒక రకం నీటిమొక్క) అనే రెల్లుతో చేసిన కాగితాన్ని, కొన్నిచోట్ల పదునుచేసిన గొర్రెతోలు, దూడచర్మం వాడేవారు. చైనాలో వెయ్యేళ్ల కిందివరకూ వెదురు పలకలే (బేంబూ బుక్స్‌) రాతకు సాధనాలు. మన దగ్గర భూర్జపత్రాలు, తాళపత్రాలు వాడుకలో ఉండేవి.
      భూర్జపత్రం అంటే కొండరావి చెట్టు లాంటి ఓ చెట్టుబెరడు. ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి రాయడానికి ఉపయోగించేవాళ్లు. ఇవి ఉత్తర భారతదేశంలో పెరుగుతాయి. అందుకే అక్కడ భూర్జపత్రాలను వాడేవాళ్లు. తాటిచెట్లు దక్షిణభారతంలో ఎక్కువ కాబట్టి ఇక్కడ తాళపత్రాల వాడుక ఎక్కువ. కేవలం రాతకోసమే కాకుండా ఇతర అవసరాలకు కూడా తెలుగునాట తాటిచెట్టుకు ప్రాధాన్యం ఉంది. అందుకే దీనిని ‘ఆంధ్రుల కల్పవృక్షం’ అన్నారు వేటూరి ప్రభాకరశాస్త్రి. తాళపత్రాలను రాతకోసం సిద్ధం చేయడం, వాటిమీద రాసేవిధానం, భద్రపరచడం వంటివి ఆసక్తికరమైన విషయాలు.
తాళపత్రాలను సిద్ధం చేయడం 
తాటాకులలో రాతకు పనికొచ్చేవి సిత్తాళపత్రాలు, లేదా శ్రీతాళపత్రాలు. వీటిని ప్రత్యేకంగా పెంచేవాళ్లు. రెండు అంగుళాల వెడల్పు ఉన్న తాటాకులను పచ్చగా ఉన్నవాటిని కోసి, సమానంగా కత్తిరించి నీడలో ఆరబెట్టేవాళ్లు. దీనిని సంస్కృతంలో ఛాయాశుష్కం అంటారు. ఇలా చేయడంవల్ల అవి పెళుసుబారకుండా ఉంటాయి. తర్వాత పసుపు, వస కలిపిన నీటిలోగానీ ఆవుపంచితంలోగానీ నానబెట్టి ఉడికించేవాళ్లు. ఆ తర్వాత మధ్యలో ఈనెలు తీసేసి గరుకురాయితో రుద్ది, ఆ తర్వాత కాల్చిన తీగతో రెండుపక్కలా కన్నాలుపెట్టి, రెండు చెక్కలను పైనాకిందా ఉంచి ఒక తాడుని రంధ్రంలోకి దూర్చి కట్టేవాళ్లు. కొద్దిరోజులు అలా వదిలేస్తే అవి వంపులు లేకుండా తిన్నగా మారేవి. అప్పుడు వాటికి మెరుగునూనె పూసి, దుమ్మూధూళీ సోకకుండా గుడ్డలో చుట్టి ఉంచేవాళ్లు. ఇవే కవులకూ, పండితులకూ సరఫరా అయ్యేవి.
      తాళపత్రాల మీద రాయడానికి ఉపయోగించే సాధనం గంటం లేదా ఘంటం. ఇది అడుగు పొడవు ఉంటుంది. రాసేవాళ్లు స్తోమతను బట్టి ఇనుము, ఇత్తడి, వెండి, బంగారాలను వీటి తయారీకి వినియోగించేవాళ్లు. గంటం పిడికి చెక్క, దంతం వంటివి వాడేవాళ్లు. ఆకుల ఎగుడుదిగుడులను కోయడానికి కొన్ని గంటాలకు చివర చాకు ఉండేది. కొంతమంది పిడిమీద వాళ్ల పేర్లను చెక్కించుకునేవాళ్లు.
      గంటంతో తాటాకుపై రాయడం అంత ఆషామాషీ విషయమేం కాదు! పుస్తకంలో వచ్చినట్టుగా దిద్దడాలూ కొట్టివేతలూ రాకూడదు. అందుకే గంటంతో రాయడానికి శిక్షణ, సాధన, నైపుణ్యం అవసరమయ్యేవి. అలా రాయడం కళగామారి కళాకారులు తయారయ్యారు. వాళ్లే లిపికరులు, వ్రాయసగాళ్లు. కాలక్రమంలో రాయడం కూడా కొన్ని కుటుంబాలకు వృత్తిగా మారింది. వీళ్లు తాళపత్రాల కట్టలూ, గంటాలూ పట్టుకుని ఊరూరా తిరిగేవాళ్లు. ప్రజలు వాళ్లను గుర్తుపట్టి పిలిచి నకళ్లు రాయించుకునే వాళ్లు. అంత నైపుణ్యం ఉన్నవాళ్లకి కూడా మహాభారతం లాంటిది రాయడానికి ఆరుమాసాలు పట్టేది. ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది. దాంతో ఎక్కువగా ధనవంతులే నకలు రాయించుకునేవాళ్లు. తాళపత్రాలను రాయించి దానం చేయడం పుణ్యకార్యంగా భావించేవాళ్లు. కన్నడ కవిత్రయంలో ఒకడైన పొన్న రచించిన శాంతిపురాణాన్ని అత్తిమబ్బె అనే రాజమాత వెయ్యిప్రతులు రాయించి దానం చేసిందట!
      తాళపత్ర గ్రంథం మొదటిపుటలోనే అందులో ఉండే విషయాన్నిబట్టి రేఖాచిత్రాలు గీసేవాళ్లు. రాయించేవాళ్లు ప్రారంభంలోనే తమ ఇష్టదైవాన్ని చెక్కించేవాళ్లు. దాంతో ఆ పుస్తకాన్ని చూసినవెంటనే అది ఏ మతస్థులు వేసిందో వెంటనే తెలిసిపోతుంది. గంటంతో రాసిన తర్వాత అక్షరాలు స్పష్టంగా కనిపించడానికి బొగ్గుపొడి గానీ కాటుకగానీ పూసేవాళ్లు. కొంతమంది పసరు పూసేవాళ్లు. ఇదే లేపనం. ‘లిపి’ అనే మాట దీన్నుంచి వచ్చి ఉండొచ్చు. పత్రాలు తరచుగా వాడటంతో కన్నాలు పెద్దవై అక్షరాలు చెరిగిపోకుండా మార్జిన్‌ ఎక్కువ వదిలేవాళ్లు. ఇదంతా ఒకెత్తు...  చిరిగిపోకుండా తాటాకులమీద రాయడం ఒకెత్తు. అక్షరాలు ఇంగ్లిషులో ఉన్నట్టు నిలువుగీతలు, అడ్డగీతలు ఎక్కువగా ఉంటే ఆకు చిరిగిపోతుంది. అందుకే తెలుగుతోబాటు చాలా భారతీయ భాషల అక్షరాలు గుండ్రంగా ఉంటాయి. దీనికి తాళపత్రాల మీద రాతలు కారణమంటాడు ఓ పండితుడు. తాళపత్రాల్లో మిగిలిన స్థలాన్ని రకరకాల బొమ్మలతో నింపేవాళ్లు రాయసగాళ్లు. ధృవపత్రాలు రాసేటపుడు అధికారి ముద్ర, సంతకం కూడా వేసేవారు. కొంతమంది సంతకం తర్వాత ‘‘స్వహస్తోమమ’’ (ఇది నా దస్తూరీ) అని రాయటమూ కద్దు.
తెరమరుగైన అలవాట్లు
ఆ కాలంలో కామాలూ, ఫుల్‌స్టాప్‌లూ లేవు. ఇవి ఇంగ్లిషు ప్రభావం వల్ల వచ్చాయి. కామాకి ఒక నిలువుగీత, ఫుల్‌స్టాప్‌కి రెండు నిలువుగీతలు ఉండేవి. బ్రౌన్‌ రాసి అచ్చువేయించిన వ్యాకరణ పుస్తకంలోనూ ఇలాగే ఉంది. అందుకే మన నిఘంటువుల్లో ఫుల్‌స్టాప్‌ అంటే వాక్యం చివర సంపూర్ణ విరామకాలాన్ని సూచించే గుర్తు అనీ, కామా అంటే వాక్య విభాగాలలో వచ్చే విరామ చిహ్నం అనీ నిర్వచనాలున్నాయే కానీ సూటిగా తగిన పదాలు లేవు. అక్షరం సరస్వతి రూపం కాబట్టి తాళపత్రాల్లో తప్పుగా రాసిన అక్షరాన్ని కొట్టివేయడం పాపంగా భావించేవాళ్లు. తప్పుగా రాసిన పదం కింద అడ్డగీత పెట్టేవారు. ఇలా చేయడం వెనుక కొట్టివేస్తే పత్రం చిరిగిపోతుందనే ఆలోచన కూడా ఉండొచ్చు. 
      మన పూర్వీకులు తాళపత్రాలను భద్రపరచేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. అక్షరాల మీద పూసిన బొగ్గుపొడి కొంతకాలానికి రాలిపోయి అక్షరాలు స్పష్టత కోల్పోయేవి. సిరా వెలిసిపోకుండా ఉండేందుకు బొగ్గుపొడిలో నూనె కలిపేవాళ్లు. వాతావరణంలో తేమ ఉష్ణాలవల్ల, కీటకాలవల్ల ఎన్నో తాళపత్ర గ్రంథాలు నాశనమైపోయాయి. ఇప్పుడంటే ఏసీలో పెడుతున్నారు. కీటకాలబారి నుంచి కాపాడటానికి సిట్రొనెల్లా నూనె, కర్పూరతైలం, నిమ్మనూనె వంటివి వాడుతున్నారు. తాళపత్రాల్ని భద్రపరచడానికి చెక్కపెట్టెలు, వెదురుబుట్టలు తయారుచేసే పరిశ్రమలూ ఆ రోజుల్లో ఉండేవి. రాజాస్థానాల్లో వీటిని సంరక్షించేందుకు అక్షపటలికులు (రికార్డు కీపరు) అనే ఉద్యోగులూ ఉండేవాళ్లు.
      ఇక వీటి జీవితకాలం 300- 350 సంవత్సరాలు ఉంటుంది. ఒక తాళప్రతి శిథిలమైపోతే దాని నకలు రాయించేవాళ్లు. మరి శిథిలప్రతిని నేతితో కాల్చడం/ నదిలో పారేయడం చేసేవాళ్లు.
కనిపించే అవశేషాలు
తాళపత్రాల్ని తొలిచే క్రిమిని ‘రామబాణం’ అనీ, రాసే సిరానూ మసినీ ‘పత్రాంజనం’ అనీ, లెక్కలు రాయడం కోసం వాడే తాటాకులను ‘కవిలె’ అనీ అనేవారు. ఇప్పుడీ పదాలు వాడుకలో కనిపించవు. తాళపత్రాల వాడుక ఇప్పుడు లేకపోయినా ఆ పాతవాసనలు మన వ్యవహారంలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. ‘రెండాకులు ఎక్కువ చదవడం’, ‘చదువు కట్టిపెట్టడం’ (పూర్వం చదవడం అయిపోయాక, ఆకులను కట్టిపెట్టేవాళ్లు), ‘మక్కికి మక్కి’, ‘ఆదిలోనే హంసపాదు’ వంటి జాతీయాలు వాడుకలోనే ఉన్నాయి. ఇంకా మనం సాహిత్య పరిభాషలో వాడుతున్న గ్రంథం (కూర్పు), స్కంధం (చెట్టుబోదె), కాండం, శాఖ, పుట (ఆకుదొప్ప), వంటి పదాలూ ఆనాటివే! అంటే వృక్ష సంబంధమైనవే అన్నారు తిరుమల రామచంద్ర. 


వెనక్కి ...

మీ అభిప్రాయం