‘మహాత్ముల బాటలో’ అసామాన్యుడు

  • 481 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఎనిమది పదుల వయసులో ఒంటిచేత్తో నిఘంటువులను నిర్మించిన వ్యక్తి... జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణలతో ప్రత్యక్ష ముఖాముఖీలు తీసుకున్న పాత్రికేయుడు... చిన్నారిలోకానికి విజ్ఞానామృతాన్ని పంచడానికి పుస్తకాలు రాసిన అక్షరహాలికుడు... విద్యార్థుల్లో అంతఃచేతనను మేల్కొలుపుతూ విద్యాబోధన చేసిన ఉపాధ్యాయుడు... వచ్చే నాలుగు జీతం రాళ్లతోనే పిల్లల కోసం పత్రికలు నడిపిన సంపాదకుడు... స్నేహితులైన ఎన్టీఆర్, జగ్గయ్యలతో కలిసి గుంటూరు ఏసీ కళాశాలకు ‘శోభ’ తెచ్చిన విద్యార్థినాయకుడు... సంఘసేవకుడు చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఎన్నో కోణాలు! ఎన్నెన్నో నైపుణ్యాలు! బహుముఖ ప్రజ్ఞకు పర్యాయపదమైన ఆయనే ముదునూరి వెంకటేశ్వరరావు. ఇప్పుడాయనకు తొంభై రెండేళ్లు. కానీ, భాషా సాహిత్య సమాజ సేవకు ఉరకలెత్తే ఆయన మనసుకు మాత్రం ఇరవై రెండేళ్లే!! 
‘విద్యార్థిగా
ఉన్నప్పుడే ఆయన సాంస్కృతిక, సాహిత్య సంఘాలను నిర్వహించాడు. శోభ అనే చేతిరాత పత్రికను నడిపాడు. అతను స్వతస్సిద్ధంగానే నాయకుడు, ప్రోత్సాహాన్నిచ్చే, ఒప్పిదమైన, ఓర్పు కలిగిన వ్యక్తి. పనిలో విశ్రాంతి ఎరుగని వ్యక్తి’... అప్పట్లో ముదునూరి వెంకటేశ్వరరావు గురించి అడవి బాపిరాజు చెప్పిన మాటలివి. ముదునూరి ప్రస్థానాన్ని తరచిచూస్తే బాపిరాజు అభిప్రాయంలో అణువంత అతిశయోక్తి కూడా కనిపించదు. 
      వెంకటేశ్వరరావు 1923 జూన్‌ 4న కృష్ణాజిల్లా ముదునూరులో జన్మించారు. చంద్రశేఖరయ్య, కామేశ్వరమ్మ దంపతులు ఆయన తల్లిదండ్రులు. ఆంధ్ర, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ బి.ఇడి కళాశాలల్లో ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. సమాజాన్ని మార్చాలంటే అది ‘సమాచారం’తోనే సాధ్యం అని నమ్మిన ఆయన ఎక్కడికి వెళ్లినా, అక్కడ కూడలిలో వార్తలు తెలుసుకునేందుకు విద్యార్థులతో ఒక బోర్డు ఏర్పాటు చేసేవారు. మంచి వ్యక్తిత్వం ఉంటేనే దేశం, ప్రపంచం బాగుంటాయన్నది ఆయన విశ్వాసం. అందుకే విద్యార్థి దశ నుంచే పత్రికలు నడపడం మొదలుపెట్టారు. అలా 1943లో జ్ఞాన, శోభ మాసపత్రికలు నడిపారు. 1954- 60ల మధ్య బాల సాహిత్య అకాడమీ తరఫున బాలరాజ్యం, తెలుగు బాల, బాల ప్రతిభ అనే మూడు పత్రికలు నిర్వహించారు. 1963- 69ల మధ్య పిల్లల్లో పరిశీలనా సామర్థ్యాన్ని పెంచేందుకు ‘చిన్నారి గూఢచారి’ అనే బాలల డిటెక్టివ్‌ కథల సంపుటిని, కవుల చరిత్రను ప్రచురించారు.
చిన్నారుల కోసం... 
పిల్లల కోసం ప్రత్యేకంగా తన సొంత డబ్బులతో ‘బాలానందం’ పత్రికను నిర్వహించారు. ఈ పత్రికను పిల్లల ఉద్యమ పత్రికగా నిర్వహించాలన్నది ముదునూరి ఆలోచన. ఈ పత్రిక చదివిన పిల్లలు పెద్దయ్యాక మంచి ‘సంఘ నిర్వాహకులు’ - అంటే మంచి రచయితలు, వక్తలు, మేధావులు, చిత్రకారులు, కార్టూనిస్టులు, కథారచయితలు, విజ్ఞానఖనులు- కావాలన్నది ఆయన ఆశయం. దీనికోసం పిల్లలే సొంతంగా రాసిన కవితలు, కథలు, ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.  ‘వైజ్ఞానిక లేఖల’ వసంతరావు వెంకటరావు, శ్రీపాద లక్ష్మీనారాయణశాస్త్రి, బి.వి.నరసింహారావు, ‘బాల’ పత్రిక సంపాదకుడు న్యాయపతి రాఘవరావు, గీతా సుబ్బారావు తదితరులు ఈ పత్రిక నిర్వహణలో ముదునూరికి సహకరించారు. ఆయన జీతంలో చాలావరకు బాలానందం నిర్వహణకే ఖర్చు చేశారు. ఆర్థికంగా తలకుమించిన భారం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మూడేళ్ల తర్వాత పత్రికను ఆపేయాల్సి వచ్చింది. 
విలువకట్టలేని పుస్తకాలు...
జవహర్‌లాల్‌ నెహ్రూ స్ఫూర్తితో తన మనుమరాలికి విశ్వవిజ్ఞానాన్ని వివరిస్తూ ‘తాతయ్య లేఖలు’ రాశారు ముదునూరి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కోరిక మేరకు, తెలుగు ఆంగ్ల భాషల్లో ‘డా.కలాం స్వర్ణభారతికి పిలుపు’ పేరుతో పుస్తకం తీసుకొచ్చారు. పదవీ విరమణచేసినా ఆయన తన అధ్యయనాన్ని, రచనల్ని మాత్రం ఆపలేదు. 2005లో అంటే ఎనభై ఏళ్ల వయసులో ఇంగ్లిష్‌- ఇంగ్లిష్‌- తెలుగు నిఘంటువును ప్రచురించారు. 2008లో ఇంగ్లిష్‌- ఇంగ్లిష్‌- తెలుగు నిఘంటువును 1200 పేజీలలో రూపొందించారు. దీనిని వీజీఎస్‌ సంస్థ ప్రచురించింది. అంతేకాదు ముదునూరి తయారుచేసిన త్రీ ఇన్‌ ఒన్‌ నిఘంటువును నీల్‌కమల్‌ సంస్థ అచ్చొత్తింది. ఇక ఆయన తన విస్తృత పరిజ్ఞానంతో వివిధ అంశాల మీద రాసిన ‘విజ్ఞాన భారత్‌... రేపటి పౌరులకు నిన్నటి కథ’ అయితే విజ్ఞాన సర్వస్వమే! భక్తితత్పరులైన ఆయన పిల్లల కోసం తేలికగా అర్థమయ్యేలా ‘శ్రీరామకథ’, ‘గీతాసారం’ పుస్తకాన్ని రచించారు. 
వాళ్ల అడుగుజాడల్లో...
వెంకటేశ్వరరావు జీవితం మీద గాంధీజీ, నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణల ప్రభావం ఉంది. దేవాలయ ప్రవేశోద్యమంలో భాగంగా గాంధీజీ కృష్ణాజిల్లాలో పర్యటించారు. అప్పుడు ఆయనను సందర్శించారు. స్ఫూర్తిపొందారు. గుంటూరు ఏసీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పుడు ఎన్టీరామారావు, జగ్గయ్యలు ముదునూరి స్నేహితులు. ఆ సమయంలోనే ‘శోభ’ పత్రికను నడిపారు. దీనికి జగ్గయ్య వ్యాసాలు రాసేవారట! ఆ తర్వాత కొద్దికాలం పాటు ముదునూరి హైదరాబాదు ‘మీజాన్‌’ పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశారు. ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు దగ్గర లేఖకుడిగా ఉన్నారు. తర్వాత కాలంలో ఆయన కరుణశ్రీ సంపాదకత్వంలో వచ్చిన ‘సుభాషిణి’ పత్రికలో మహిళల ప్రత్యేక కథనాల రచయితగా బాధ్యతలు నిర్వర్తించారు. భూదానోద్యమంలో భాగంగా ఆచార్య వినోబాభావే 1955లో విజయవాడకు వచ్చారు.  ఆయన మీదున్న గౌరవంతో ముదునూరి ‘వినోబాజీ’ బుర్రకథను రచించారు. దాన్ని వినోబాకి స్వయంగా అందజేశారు. 1957లో జవహర్‌లాల్‌ నెహ్రూ, అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణయ్యలను ఇంటర్వ్యూ చేశారాయన. ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూ తీసుకుంది అబ్దుల్‌ కలాందే (2004లో) కావడం... ఆయన ఎంచుకున్న ‘విలువ’లకు నిదర్శనం! 
      ఇంతమంది మహనీయులతోపాటు, కుటుంబ వారసత్వంగా అందిన ధార్మికత, నైతికతే తన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయంటారు ముదునూరి. ‘నేను ఒక్కణ్నే కానీ, నాలోపల చాలా మంది మహానుభావులు ఉన్నారు’ అంటారాయన. ముదునూరి కుటుంబం కొద్దికాలం అమరావతిలో నివాసం ఉంది. అప్పట్లో ఆయన సహోద్యోగి జంధ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ)కి మశూచి సోకింది. ఆయనకు కాస్త సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దాదాపు వీధి వీధంతా ఖాళీ అయ్యింది. ఆ పరిస్థితుల్లో వెంకటేశ్వరరావు, ఆయన అక్కయ్యలే కరుణశ్రీకి సేవచేశారు. ఆయన జీవితం ఇంతమంది పెద్దలతో పెనవేసుకుపోయినందుకే... తన అనుభవాల సమాహారాన్ని ‘మహాత్ముల బాటలో’ అని అక్షరీకరించారు. అది రెండో ముద్రణకు కూడా వెళ్లింది.  
కృషికి గుర్తింపు
బాలల వికాసానికి చేసిన సేవకు ‘బాలబంధు’ అయ్యారు ముదునూరి. ‘మహాత్ముల బాటలో’ పుస్తకాన్ని ఉత్తమ జీవిత చరిత్రగా ఎంపిక చేసి, అప్పటి లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి ‘విశిష్ట సాహిత్య పురస్కారం’తో సత్కరించారు.  ఇక ఆయన ఎంతో శ్రమకోర్చి రూపొందించిన అయిదు నిఘంటువుల వెనక ఉన్న కృషికి గుర్తింపుగా ‘21వ శతాబ్దపు డిక్షనరి శంకరనారాయణ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ బిరుదు లభించింది. బాలల కోసం పనిచేస్తున్న వ్యక్తిగా జాతీయస్థాయి గుర్తింపునూ పొందారు. స్వాత్రాంత్యానికి పూర్వమే బడుగువర్గాలకు చదువుచెప్పిన ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌ గాంధీ’ అయ్యారు. మరోవైపు... 1998- 2002 మధ్య నూజివీడు సబ్‌ కోర్టు ‘లోక్‌ అదాలత్‌ ఎగ్జిక్యూటివ్‌గా ‘మెజిస్టీరియల్‌’ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. 
      ఒక మనిషి తన జీవితంలో ఎంత పని చేయగలడు? ఎన్నేళ్ల పాటు దాన్ని కొనసాగించగలడు? తొలినాళ్లలోని ఉత్సాహంతోనే అన్నేళ్ల పాటు ఆ పనిని చేస్తూవెళ్లగలడా? చాలామందికి ఈ ప్రశ్నల్లో పరిమితులు కనిపిస్తాయి. కానీ, ముదునూరికి మాత్రం అపరిమిత అవకాశాలు దర్శనమిస్తాయి. అందుకే వయసు మీద పడిన తర్వాతా పనిచేస్తూనే ఉన్నారు. ఇలాంటి వాళ్లను గౌరవించు కుంటూనే... స్ఫూర్తిప్రదాతలుగా యువ తరానికి వాళ్లను పరిచయం చేస్తే... నవతరానికి విలువల పాఠాలు చక్కగా బోధపడతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం