దారిదీపాలు

  • 482 Views
  • 6Likes
  • Like
  • Article Share

పితృస్వామ్య సమాజాల్లో స్త్రీలపట్ల వివక్ష ఏనాటిదో! సాహితీరంగమూ ఇందుకు అతీతం కాదు! 20వ శతాబ్దం ఆరంభం వరకు వచ్చిన తెలుగు సాహిత్యాన్ని గమనిస్తే రచయిత్రుల స్థానం స్వల్పం. రాసినవాళ్లు కూడా పురుషస్వామ్య చట్రంలోనే రాశారు. గడచిన వందేళ్లుగా ఊపందుకున్న సమాచార విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఉద్యమాల నుంచి తెలుగు రచయిత్రులు కూడా ప్రభావితమయ్యారు. స్త్రీల పక్షాన కథలు, కవితలు, నవలలు... ఇలా వివిధ ప్రక్రియల ద్వారా పురుషాహంకార భావజాలాన్ని రూపుమాపేందుకు నడుంబిగించారు. ఇదే స్త్రీవాద సాహిత్యోద్యమం. 
వెయ్యేళ్ల
తెలుగు సాహిత్యంలో ఎన్నో ధోరణులు... సంప్రదాయోద్యమం, నవ్య సంప్రదాయోద్యమం, సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కాల్పనికోద్యమం, హేతువాదోద్యమం, అభ్యుదయోద్యమం, విప్లవోద్యమం...! వీటి తర్వాత దళిత స్త్రీవాద మైనారిటీ సాహిత్యోద్యమాలు.. ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యోద్యమం... ఇలా వస్తున్నాయి. ‘స్త్రీవాదం’ అంటూ ఒకటి ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో వినిపించని రోజుల్లోనే ‘స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి’ అంటూ గుడిపాటి వెంకటచలం స్త్రీని అర్థం చేసుకోవాల్సిన పద్ధతిని, అవసరాన్ని నేర్పారు.
      లక్షణదేవరనవ్వు, ఊర్మిళాదేవి నిద్ర, సీతమ్మ శోకం వంటివి తొలినాళ్ల స్త్రీ సాహిత్యం. తర్వాత్తర్వాత స్త్రీలు- కావ్యాలు, ప్రబంధాలు, నవలలు, ఖండకావ్యాలు, నాటకాలు, కథలు, గేయాలు.. ఇలా అన్నీ రాశారు. పురుషులకు ఏమాత్రం తీసిపోమని.. పైపెచ్చు కొన్ని ప్రక్రియల్లో వాళ్లదే పై చేయి అని నిరూపించారు. స్త్రీల అభివ్యక్తిలో మూడు దశలు కనిపిస్తాయి. మొదటి దశలో రాసినవారు పితృస్వామ్యం నిర్దేశించిన భావజాలం చట్రంలో ఇమిడి రాశారు. కానీ ఆ రోజుల్లో స్త్రీలు అడుగు ముందుకేసి రాయడమే గొప్ప పరిణామం! ఇక రెండో దశలో తమలోకి తాము చూసుకుని, తమ చుట్టూ ఉన్న సమాజంలో, కుటుంబంలో ఉన్న వివక్షను గమనించడం, మనసుకి పట్టించుకోవడం చూస్తాం. ఈ దశలో అంతర్వీక్షణ, ఆలోచన ఉన్నా ప్రతిఘటన ఉండదు. మూడోదశలో అణచివేతల్ని వివక్షల్ని ప్రశ్నించడం, ప్రతిఘటించడం, తిరస్కరించడం ప్రధానమైంది. నిజానికి ఇది స్త్రీ విముక్తి దశ. దీన్ని ‘దారులేసిన అక్షరాలు’గా కూడా పరిగణిస్తున్నారు. ఇదే... స్త్రీ వాదం. స్త్రీ చైతన్యవాదం. స్త్రీ విముక్తి వాదం. 
కథా సాహిత్యంలో మణిపూసలు
తెలుగునాట మహిళోద్యమాన్ని నిర్మించిన క్రియాశీలక మహిళా మేధావుల్లో భండారు అచ్చమాంబ ఒకరు. తెలుగు కథా సాహిత్యానికి ఆద్యురాలిగా కూడా ఈమధ్య ఆమె పేరు చర్చకు వస్తోంది. పన్నెండు కథలే రాసినా ‘గృహ సంస్కరణ, ప్రేమ ప్రాతిపదికన భార్యాభర్తల మధ్య ఉండాల్సిన స్నేహసంబంధాలు వంటివాటిపై దృష్టి సారించారామె. 
      అచ్చమాంబ మొదలుకుని ఎంతోమంది రచయిత్రులు మణిపూసల్లాంటి కథలందించారు. తెలుగు రచయిత్రుల్లో తొలిసారి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఇల్లిందల సరస్వతీదేవి రెండు వందల యాభైకి పైగా కథానికలు రాశారు. ఆమె ప్రతిష్ఠాత్మక సంకలనం ‘స్వర్ణ కమలాలు’. స్త్రీల పాటలు, బాలల నాటకాలు, ఇందిరాగాంధీ జీవిత చరిత్ర వంటి పలు రచనలూ చేశారు. ఆంధ్ర పత్రికలో ‘వనితాలోకం’, కృష్ణా పత్రికలో ‘ఇయంగేహే లక్ష్మీ’ వంటి శీర్షికలను ఏళ్ల తరబడి నిర్వహించారు. ఇక రేడియో ప్రసంగాలు, నాటికలు సరేసరి!
      యాభై, అరవై దశాబ్దాలలో ఆచంట శారదాదేవి తన రచనల ద్వారా సమాజాన్ని, ముఖ్యంగా మహిళా సమాజాన్ని ఆలోచింపచేశారు. సమాజంలో, కుటుంబంలో మహిళల పట్ల ఉన్న వివక్షను గమనించి, మధనపడి, కొత్త విలువల కోసం, కొత్త జీవితాల కోసం ఆకాంక్షించారు. ఇక మానవ మనస్తత్వంలోని వైచిత్రి, కుటుంబ సంబంధాల్లో ఐక్యత, వైరుధ్యాలు, అంతరంగ కల్లోలాలు, స్త్రీలు తమ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే చైతన్యం, సామాజిక దుర్లక్షణాల మీద తిరుగుబాటు, ఆర్థిక స్వాతంత్య్రం తదితర అంశాలతో గొప్ప కథానికలు రాశారు రంగనాయకమ్మ. ‘అత్తగారి కథలు’ అంటూ డా।। భానుమతీ రామకృష్ణ రాసిన కథానికలు... హాయిగా నవ్వుకోవడానికి ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాయి.
      1965లో స్త్రీ వాదం అన్నది వినబడని రోజుల్లోనే అబ్బూరి ఛాయాదేవి ‘ప్రయాణం’ వంటి రచనలు చేశారు. తండ్రి మాట కాదన్న కూతురును, తర్వాతి కాలంలో అదే స్త్రీ మీద ఆమె స్నేహితురాలి భర్త అత్యాచారం జరపడం.. ఆమెను ప్రేమించిన వ్యక్తి ఆ విషయం తెలిసీ ఆమెను వివాహం చేసుకోవడం.. అప్పట్లో ఈ కథాంశంతో రచన సాహసమే! తమ గతిని మార్చుకోకపోతే ఆడవాళ్లెప్పటికీ కాంతిహీనంగానే ఉంటారని చాలా స్పష్టంగా చెప్పిన అబ్బూరి ఛాయాదేవి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 
ఆరుద్ర అర్ధాంగిగానే కాదు, జీవితంలో అంతర్వాహినులుగా ఉన్న అనేకాంశాలను ఒడిసిపట్టుకున్న రచయిత్రిగా కె.రామలక్ష్మి ప్రసిద్ధురాలు. తన రచనల్లో అంతర్మథనాన్ని చూపడమే కాదు, కొంతవరకు బాహ్య ప్రవర్తన రీతులను శాసించారామె. నవలలు, నవలికలు, ఆంధ్ర పత్రికలో ప్రశ్నలు - సమాధానాలు ద్వారా కూడా ఆమె జీవితానుభవాలు పాఠకులకు అందాయి.
ఆలోచనల్లో అభ్యుదయం
వాసిరెడ్డి సీతాదేవి కథలు ముఖ్యంగా వర్గపీడన, దోపిడి, లింగపరమైన అణచివేతలను ప్రతిబింబిస్తాయి. కొసమెరుపు కోసం రాసే కథలు, పిచ్చి ప్రేమ కథలు, కాలక్షేపం కథల్లాంటివి ఆమె రాయలేదు. అరవయ్యో దశకంలో వెల్లువలా వచ్చిన శుద్ధ రొమాంటిసిజం ఆమెను తాకకపోవటానికి కారణం ఆమెకున్న అభ్యుదయ దృక్పథమే.
      ఆర్‌.వసుంధరాదేవి 1977-1985 మధ్య స్త్రీల జీవితాల్లోని సంఘర్షణను/ దైనందిన కుటుంబ సంబంధాల్లో దాగిన హింసను నిశిత దృష్టితో చిత్రీకరించారు. తెలుగులో స్త్రీవాద కథావస్తువుకు కొత్త జీవిత పార్శ్వాల రంగులద్ది, శిల్పానికి వ్యంగ్య వైభవాన్ని సమకూర్చిన రచయిత్రి పి.సత్యవతి. ఆమె స్త్రీల జీవిత వేదనలను స్పష్టంగా వినిపించారు. వాళ్ల ఆకాంక్షలకు చేయూతనిచ్చారు. అలా ఆమె ‘తమని తాము తెలుసుకోవడం కొరకు స్త్రీలు చేస్తున్న మహా ప్రస్థానాన్ని కథనం’ చేశారు. 
      తెలుగు సాహిత్యంలో 1980 దశకం ఒక ముఖ్యమైన దశ. స్త్రీ పురుషుల అసమానతలు సమాజ నిర్మితాలేనని నిరూపించడం, స్త్రీలు తమ గురించి తాము నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పుకోవడం, స్త్రీలకు సంబంధించి సాహిత్యంలో పేరుకుపోయిన వివక్షాపూరితమైన భావజాలాన్ని సవాలు చేయడం ఈ సాహిత్య లక్షణాల్లో కొన్ని. సంస్కరణోద్యమ కాలం నుంచి విప్లవోద్యమ కాలం వరకూ సాహిత్యంలో తమ జీవితాల చిత్రణను పునఃపరిశీలించి, వాటి లోపాలను, పరిమితులను గుర్తించి... తమ జీవితాలను తమ దృష్టి నుంచి వాఖ్యానించడానికి రచయిత్రులు ఉద్యమించిన కాలమిది. ఈ దశాబ్ది రచయితల్లో ఈ ఉద్యమనాయికల్లో అగ్రభాగాన నిలిచే రచయిత్రి ఓల్గా. 
      ఐ.వి.ఎస్‌.అచ్యుతవల్లి... సమాజపు చీకటి నీడల్లో దాగిన మనోవేదనల్ని మానవతా దృక్కోణంలోంచి పరిశీలించారు. కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, పత్రికల్లో రాసిన శీర్షికల్లో ఆచార సంప్రదాయాలను మన్నిస్తూనే అభ్యుదయం వైపు నడిపించారు. వ్యక్తిత్వవికాసంతో స్త్రీలు ఎదగాలని ఆకాంక్షించారు.
      స్త్రీవాద దృక్పథం రచయిత్రుల్లో తెచ్చిన మార్పు సి.సుజాతలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పాత్రలు నేల విడిచి సాము చేయవు. స్త్రీ పురుష సంబంధాలలోని చాలా సున్నితాంశాలను చర్చకు తెచ్చారు కుప్పిలి పద్మ. జీవితపు పరిశీలనల్లో, విశ్లేషణల్లో సూక్ష్మక్షేత్రాల్ని, సంక్లిష్టతల్ని శక్తిమంతంగా ఆవిష్కరించగలిగారామె. డా.ప్రసన్న, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కొండేపూడి నిర్మల, ప్రతిమ, జి.లక్ష్మి, బి.పద్మజ, వడ్లమూడి దుర్గాంబ, డా.జె.భాగ్యలక్ష్మి, రమాదేవి జాస్తి, గోగు శ్యామల, జాజుల గౌరి, సామాన్య తదితరులు కథా సాహిత్యం ద్వారా స్త్రీ వాద వ్యాప్తికి ఇంకా దోహదం చేస్తున్నారు. 
నవలల్లో నవ్యపథం
శ్రీదేవి తన ‘కాలాతీత వ్యక్తులు’ నవలలో ఇందిర పాత్రని స్వతంత్ర వ్యక్తిత్వమున్న వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఇందిర తను పెళ్లాడబోయే వ్యక్తితో.. ‘ఇద్దరం కలసి ఒకళ్ల కళ్లల్లోకి ఒకళ్లం చూస్తూ కూర్చునేందుకు కాదు ఇలా దగ్గరికి వచ్చింది. ఇద్దరం కలసి ఒకేవైపు చూడగలిగితేనే సార్థకం’ అంటుంది. స్త్రీ చైతన్యానికి ఇంతకన్నా ఏం కావాలి?
      కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి తదితరులు స్త్రీ పురుష సంబంధాలను చర్చకు తెచ్చారు. సంప్రదాయ చట్రం దాటకుండా, తెగేంతవరకూ లాగకుండా, త్యాగాలు, అర్పణలతో సుకుమారంగా పాత్రల చిత్రీకరణ చేశారు. వారికి సమకాలికురాలైన రంగనాయకమ్మ స్త్రీ పాత్రల్ని బుద్ధిజీవులుగా తీర్చారు. ఆలోచనా పరిధిలో విస్తృతిని ప్రదర్శించి, ఆత్మవిశ్వాసం, స్వయం నిర్ణాయక శక్తి కలిగిన పాత్రలుగా మలచారు. ‘జానకి విముక్తి’లో జానకి, ‘రచయిత్రి’లో విజయ, ‘పేకమేడలు’లో భాను, ‘సీత’లో పద్మజ, ‘స్వీట్‌హోం’లో విమల పాత్రలు ఇలాంటివే 
      మాలతీ చందూర్, లత, వాసిరెడ్డి సీతాదేవి, ద్వివేదుల విశాలాక్షి, డి.కామేశ్వరి, డా.సి.ఆనందరామం... ఇలా అనేక మంది రచయిత్రులు మహిళల జీవితాల్లోని వివిధ అంశాల్ని గుర్తించారు. ముఖ్యంగా వాసిరెడ్డి సీతాదేవి నవల ‘మరీచిక’ ప్రభుత్వ నిషేధానికి గురైందన్న విషయం తెలిసిందే. ఎన్నో సామాజిక అంశాల్ని సీతాదేవి తన రచనల్లో చర్చించారు. స్త్రీ నిర్భయంగా సంప్రదాయ శృంఖలాలను ఛేదించుకోవాలన్నది ఆమె వాదన. 
      కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మాలతీచందూర్‌ సృష్టించిన వసంత, శాంతమ్మ, ప్రియంవద, సుమిత్ర, సుభద్ర, రత్నమ్మ, కృష్ణవేణి, రామలక్ష్మమ్మ తదితర పాత్రలు వ్యక్తిత్వ వికాసంతో అలరారినవే. వంటింటి గ్యాస్‌ ప్రమాదంలో కన్నుమూసిన మాదిరెడ్డి సులోచన స్త్రీ విలువల సంరక్షణ కోసం పరితపించిన రచయిత్రి. ఆమె పాత్రలు రేణుక (సజీవ స్మృతులు), జ్ఞాన (తరంగాలు), సరళ (అగ్నిపరీక్ష)... భర్తలతో పాటు సమాన బాధ్యతలు పంచుకుని తమ జీవితాల్ని సుఖప్రదం చేసుకున్న పాత్రలు. ఆలూరి విజయలక్ష్మి రాసింది నాలుగు నవలలే అయినా వాటిలో స్త్రీ పాత్రలకు ఎంతో ప్రాధాన్యం కనిపిస్తుంది. అయితే వీళ్లందరి తర్వాత నవలా ప్రపంచంలో అడుగుపెట్టిన ఓల్గా... స్త్రీ స్వేచ్ఛను వివాహం హరిస్తోన్న వైనాన్ని చర్చకు తెచ్చారు. గాఢంగా చిత్రించారు.
కవిత్వంలో మరింత తీవ్రంగా...
1981లో అచ్చయిన రేవతీదేవి కవితాసంపుటి ‘శిలాలోలిత’ తెలుగులో స్త్రీ వాదానికి ఆరంభమని చేరా మొదలుకుని చాలామంది తీర్మానించారు. జీవితంలోని ఎన్నో కోణాల్ని స్పృశిస్తూ... లోపలి వ్యథను, అశాంతిని, నిరాశను, అసంతృప్తిని ఆమె నిర్మొహమాటంగా వ్యక్తీకరించారు. దాదాపు ఆ సమయంలోనే జయప్రభ... ‘పైటను తగలెయ్యమ’ని స్త్రీ వాద దృక్పథాన్ని కవిత్వంలో ప్రతిబింబించారు.
మనమంటే 34, 34, 35 కొలతలమైన చోట
మొటిమలు మొలవడం, జుట్టురాలడం
నడుం సన్నగా లేకపోవడమే
మన నిరంతరాందోళనలైన చోట
దైహిక సౌందర్య పిపాసే మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట
ఎంత హింస అనుభవిస్తున్నామో కదా..!

      సౌందర్యం పేరిట దేహానికి వేసుకుంటున్న సంకెళ్లను నిరసించే విమల కవిత ఇది. అలాగే వంటింటి శ్రమ, వివక్షల గురించి ఆమె రాసిన ‘వంటిల్లు’ ప్రసిద్ధం. స్త్రీలకు వంటింటి గురించి తప్ప మరో ఆలోచన అక్కర్లేదని... స్త్రీలే నమ్మేలా బిగించిన సామాజిక చట్రాన్ని ఇందులో బద్దలు కొట్టారు.
      ‘హృదయానికి బహువచనం’తో స్త్రీవాద సాహిత్యంలోకి దూసుకొచ్చారు కొండేపూడి నిర్మల. ‘తెల్లారకట్ట కివతల’ కవితలో స్త్రీ పురుషుల మధ్య ఏకైక సంబంధంగా ఉన్న లైంగిక బంధంలో నిజాయతీ లోపించిన వైనాన్ని బట్టబయలు చేశారు.
      తల్లి కడుపులో ఉన్న దశలోనే స్త్రీ మీద కత్తి కడుతోన్న దుస్థితి మన సమాజంలో ఉంది. గర్భ విచ్ఛిత్తి, బాలికల నుంచి పెద్దవయసు మహిళల వరకు అందరి మీద అత్యాచారాలు, అక్రమ తరలింపులతో వేశ్యావృత్తిలోకి బలవంతంగా దించడం, బాల్యవివాహాలు, గృహహింస, కార్యాలయాల్లో హింస, ఎత్తిపొడుపులు, అవహేళనలు.. ఇలా స్త్రీకి అడుగడుగునా అవరోధాలే. స్త్రీవాద కవిత్వం వీటన్నింటికీ బలంగా అక్షరరూపం ఇచ్చింది. మహిళల ఆక్రోశాల్ని నినదించింది!
      ‘బందిపోట్లు’ కవితలో సావిత్రి పురుషాధిక్యతని దెప్పిపొడిచేలా..
‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తా’నని
పంతులు గారన్నప్పుడే భయమేసింది
‘ఆఫీసులో నా మొగుడన్నాడు!
అవసరమొచ్చినా సెలవివ్వడ’ని
అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.
‘వాడికేం?.. మగ మహారాజ’ని
ఆడామగా వాగినప్పుడే అర్థమైపోయింది..

      అంటూ ప్రభావవంతంగా చెప్పారు. 
      ఒక తల్లి స్త్రీగా ఎంత వేదనకు గురవుతుందో పాటిబండ్ల రజని తన కవితలో చెప్పారు. ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకిపోవడానికి మాత్రలుంటే ఎంత బావుండు!’ అనడం కదిలిస్తుంది. 
      పురుషాధిక్య ప్రపంచం వేటినైతే నిషేధించిందో, స్త్రీలు వాటిని కూడా కవిత్వం చేయడం స్త్రీవాదం తెచ్చిన గొప్ప మలుపు! స్త్రీవాదోద్యమ రథసారథుల్లో జయప్రభ, రత్నమాల, ఘంటసాల నిర్మల, వసంత కన్నాభిరాన్, మందరపు హైమవతి, రావులపల్లి సునీత, అనిశెట్టి రజిత, ఊర్మిళ, హిమజ, సుజాత పట్వారి, మహెజబీన్, శిలాలోలిత, ఎన్‌.అరుణ, శీలా సుభద్రాదేవి, షాజహానా, స్వర్ణలత, పరమేశ్వరి, పద్మ, పద్మావతి, వాణీ రంగారావు, సత్యవేణి, సి.భవానీదేవి, అయినంపూడి శ్రీలక్ష్మి, శైలజామిత్ర.. ఇలా అందరూ ఈ మార్గావలంబులే. వీళ్లలో చాలామందికి గతి తార్కిక దృక్పథం లేకున్నా తమ భావజాలాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగారు. తాము అనుభవించిన, అనుభూతికి తెచ్చుకున్న వైయక్తిక, సామాజిక అంశాలను, సమస్యలను తమ కవితల్లో గాఢంగా పలికించారు. ఇలా తెలుగు కవిత్వానికి ఒక నూతన శాఖను నిర్మించారు. 
విమర్శలో పదును
చేకూరి రామారావు మాటల్లో చెప్పాలంటే- స్త్రీవాద విమర్శ ప్రస్తుతం రెండు కోణాల్లో సాగుతోంది. ఒకటి- స్త్రీవాద సాహిత్యంలో విశేషాలు విశ్లేషించటం. రెండు- మొత్తం సాహిత్యాన్ని స్త్రీవాద దృష్టి నుంచి పరిశీలించటం. ఈ కోవలో కాత్యాయనీ విద్మహే, డా.జి సంజీవమ్మ, జె.కనకదుర్గ, జయప్రభ, పి.లక్ష్మి, డా.పి.కుసుమకుమారి, ఓల్గా, మృణాళిని, డా.జె.భాగ్యలక్ష్మి, తుర్లపాటి రాజేశ్వరి తదితరులు చక్కటి కృషి చేశారు. కాత్యాయనీ విద్మహే ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన విషయం తెలిసిందే.
      ఈ రచయిత్రుల స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకోగలిగితే... నవ్య తెలుగు సాహిత్యంలో స్త్రీ గొంతు మరింత బలంగా 
వినిపిస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం