తల్లో నాలుక కంట్లో నలుసు

  • 1101 Views
  • 9Likes
  • Like
  • Article Share

    జి.రామచంద్రరావు

  • జి.రామచంద్రరావు తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రేపల్లె
  • గుంటూరు.
  • 898589411
జి.రామచంద్రరావు

మనసులోని భావాలని ఎదుటివారికి తెలియజెప్పే సాధనం భాష. అయితే, కేవలం మామూలు పదాలతో కాకుండా జీవితానుభవాలు, ప్రాకృతిక అంశాలతో పోలికపెట్టి చెబితే అవతలి వారికి విషయం సులువుగా బోధపడుతుంది. జానపదుల సృజనాత్మకతకు గీటురాయిగా నిలిచే ఇవి జాతీయాలుగా స్థిరపడ్డాయి. మానవ అవయవాలకు సంబంధించి కూడా కొన్ని జాతీయాలు తెలుగులో కనిపిస్తాయి! మనిషి చేష్టల్ని, మనోరీతుల్ని శక్తిమంతంగా వివరించడానికి వీటికి మించిన నిధి మరొకటి లేదు. 
సామెతలు
, జాతీయాలు భాషకు మరింత సొబగునిస్తాయి. మానవ అవయవాల పేరిట ఏర్పడిన జాతీయాల్లోనూ ఆ భాషా సౌందర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తల నుంచి పాదాల వరకు విభిన్న భావ వ్యక్తీకరణలతో తెలుగులో జాతీయాలు న్నాయి. కేవలం పదాల రూపంలో వాటి అర్థం ఒకటైతే, వాటి వెనకున్న అసలు అర్థాలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. 
      ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి తలెత్తిందనుకోండి... ‘జుట్టుపీక్కున్నాడు’ అంటాం. నిజంగానే ఊడొచ్చేసేలా జుట్టు పీకేసుకుంటే కొబ్బరినూనె, షాంపూ కంపెనీలవాళ్లు ఏమయిపోవాలి! ఇక్కడ ‘జుట్టుపీక్కోవడం’ అంటే ఒక అయోమయ, గజిబిజి పరిస్థితిని సూచించడం. ఇలాంటప్పుడు నిజంగానే కొందరు రెండు చేతుల్తో పట్టుకుని జుట్టు పీక్కుంటారు కూడా. కానీ, ఊడిపోయి వచ్చేసేలా మాత్రం కాదు! అలాగే ఏం చెయ్యాలో పాలుపోని/ అర్థంకాని సందర్భంలో ‘బుర్ర గోక్కున్నాడు’ అంటాం. ఇలా గోక్కున్న ప్పుడు పుండు పడిందా లేదా అన్నది వాళ్లకున్న గోళ్లమీద ఆధారపడి ఉంటుంది.
      నచ్చిన వ్యక్తులు ఎదురైనప్పుడు ‘కళ్లు విప్పార్చి’ మరీ చూస్తాం. అదే నచ్చనివారు కళ్లబడితే, వెంటనే ‘నొసలు చిట్లించి’ తప్పుకుంటాం. కంటి నొసలు వంటి సూక్ష్మ విషయాలను కూడా జాతీయాల్లోకి తేవడం గ్రామీణుల బుద్ధికుశలతకు నిదర్శనం. అలాగే మనకి ఇష్టమైన వ్యక్తి సమయానికి రాకపోతే, ‘కళ్లు కాయలు కాసేలా’ ఎదురుచూస్తాం. నిజంగా కంట్లో కాయలుకాస్తాయా?! ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమకొద్దీ రాత్రంతా నిద్ర మానుకొని/ చాలా సమయం వరకు ఎదురు చూశారని చెప్పడమే ఇందులోని అసలు ఉద్దేశం.
      ఏకాంతంగా కూర్చొని ఉన్నప్పుడు దూరంగా ఎక్కడినించో ఏదైనా పాట మనకి వినిపించిందనుకోండి... దాన్ని ‘చెవులు రిక్కించి’ వింటాం. మరి మనకి బాగా నచ్చిన సంగీతమైతే... ఏకంగా ‘చెవులు కోసుకుంటాం’. ఇతర జంతువుల్లాగ చెవుల్ని రిక్కించడం మానవులకి సాధ్యమా! కాదుకదా. ఇక్కడ ‘రిక్కించి వినడం’ అంటే తీక్షణంగా ఆలకించడమని అర్థం. ‘చెవులు కోసుకోవడం’ అంటే నిజంగా కత్తి తీసుకొని కసాకసా కోసేసుకోవడం కాదు! సంగీతం పట్ల ఇష్టాన్ని తెలియజేసే జాతీయమిది. 
నిజంగా అరుగుతాయా?! 
ఆశ్చర్యకర సంఘటన ఎదురైతే ‘నోరు తెరచి’ చూస్తాం. ఇలాంటప్పుడు ‘నోరు మూసుకో ఈగలు దూరతాయి’ అని పక్కవాళ్లు తమాషాలు ఆడిన సందర్భాలు దాదాపు అందరికీ ఎదురయ్యే ఉంటాయి. అదే ఒళ్లు జలదరింపజేసే దృశ్యమైతే ‘వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి’ అంటాం. అందని దానికి ఆశపడితే ‘ఆర్రులుచాచాడ’ని అంటాం. చేసిన తప్పు గురించి తెలుసుకున్న తర్వాత ‘నాలుక కరుచుకున్నాడ’ని చెబుతాం. నిజంగా నాలుక కరుచుకుంటే అన్నమెలా తింటాడు! తప్పు తెలుసుకున్నాడని గట్టిగా చెప్పడమే ఇక్కడ అసలు ఉద్దేశం! స్వయంగా చేసిన తప్పువల్ల నష్టపోతే ‘చేజేతులా చేసుకున్నాడ’ంటాం.  
      ఉద్యోగం కోసమో, పెళ్లి సంబంధం కోసమో విసుగూ, విరామం లేకుండా తిరుగుతుంటే ‘కాళ్లరిగేలా తిరుగుతున్నా డ’ంటాం. నిజంగా కాళ్లు అరిగిపోతే మనుషులంతా ఏంకావాలి! చెప్పుల కర్మాగారాల వాళ్లు ఎటుపోవాలి! చాలా తీవ్రంగా తిరిగాడని చెప్పడమే ఇక్కడ అసలు ఆంతర్యం. ఇలా తిరగడంలో, ఇతరత్రా సందర్భాల్లో ఎంత కష్టం ఎదురైనా ‘పంటి బిగువున భరించడం’ మన సహనానికి నిదర్శనం అన్నమాట.  
      అందరికీ సాయపడేవాడు ‘తల్లో నాలుక’ అయితే, ప్రతి పనికీ అడ్డుపడేవాడు ‘కంట్లో నలుసు’. ఇక ఆడిన మాటను తప్పేవాడిది ‘నరంలేని నాలుక’. పక్కవాళ్లకి అనుమానం కలగకుండా దొంగతనం చేయడం ‘చేతి వాటం ప్రదర్శించడం’. ఏ పనైనా నైపుణ్యం తో చెయ్యటం ‘చెయ్యి తిరగటం’. నిజంగా చెయ్యి తిరిగిపోతే అసలు పనెలా చేస్తాడూ! ఇక్కడ అసలు అర్థం ఏంటంటే, ఎంతటి కష్టమైన పనైనా నైపుణ్యంతో చేస్తాడని! 
      ‘పొట్టకొట్టటం, పొట్టనపెట్టుకోవటం’ రెండూ పాపకార్యాలే. మొదటిది ఎదుటి వ్యక్తికి నష్టం కలిగించేదైతే, రెండోది ఏకంగా ప్రాణాలు తీసే వ్యవహారం. అయితే ‘కడుపులో పెట్టుకుని చూసుకో వటం’ అంటే మిక్కిలి ప్రేమతో వ్యవహరిం చడం. తల్లి తన బిడ్డల్ని అలాగే చూసు కుంటుంది. ‘ముక్కుపచ్చలారక పోవటం’ పసితనాన్ని తెలియజేస్తే, ‘కాటికి కాలుచా చటం’ పండు వృద్ధాప్యానికి సంబంధిం చింది. ‘జబ్బలు చరచడం, తొడగొట్టడం, మీసం మెలెయ్యడం’ వీరత్వాన్ని, గొడవ పడాలనే అభిలాషని తెలియజేస్తాయి.
      రహస్యాన్ని బిగ్గరగా చెప్పకపోవటానికి కారణం ‘గోడలకు చెవులుండటం’. పెద్దవారి పట్ల అమర్యాదగా నడవడమంటే ‘కళ్లు నెత్తికెక్కడం’. పోలీసులకు దొరికిపోతామనుకున్నప్పుడు దొంగలు ‘కాళ్లకు బుద్ధిచెబుతారు’. వృద్ధాప్యంలో చేతికి కర్ర రావటం ‘మూడోకాలు మొలవటం’. ఆకతాయి అల్లరి పనుల్ని కట్టడి చేసే ప్రయత్నం ‘ముక్కుతాడు వేయటం’. అవయవాల సాయంతో చక్కటి భావాలని వ్యక్తంచేసే ఇలాంటి జాతీయాలు తెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. భాషకి బలాన్నిచ్చే ఇలాంటి ఎన్నో రసగుళికలు వాడుక నుంచి క్రమంగా జారిపోతున్నాయి. వీటన్నింటినీ కాపాడుకోవడం మనందరి బాధ్యత.


అవయవాలకు సంబంధించిన కొన్ని జాతీయాలు, వాటి అర్థాలు...
తలా తోకా లేకపోవడం    -     అర్థం పర్థం లేకపోవడం
మొహం చిన్నబోవడం    -    తప్పు తెలుసుకుని సిగ్గుపడటం
మొహాన నెత్తురుచుక్క లేకపోవడం  -  అపరాధ భావం
కన్నెర్రచేయడం    -    కోప్పడటం
కన్నేయడం     -    కోరుకోవడం
కన్నుకుట్టడం    -     అసూయపడటం
గుడ్లురిమిచూడటం    -    భయపెట్టడం
ముక్కుపుటాలు అదరడం    -    కోపానికి సూచన
నోరు పారేసుకోవడం   -     తిట్టడం
పళ్లు కొరకడం    -    కోపానికి సూచన
బుగ్గలు ఎరుపెక్కడం   -     సిగ్గుకు సూచన
చెవులు కొరుక్కోవడం    -    గుసగుసలాడటం
పెడచెవినపెట్టడం   -     వినిపించుకోకపోవడం
చంకలుకొట్టుకోవడం    -    ఆనందానికి సూచన
చెయ్యివ్వడం    -     మోసంచేయడం
నాలుగు వేళ్లూ నోట్లోకి పోవడం -   రోజు గడవడం
ఛాతీ ఉప్పొంగడం   -  గర్వం/ ఆనందం
కడుపుచిచ్చు  -  గర్భశోకం
కడుపుతీపి  -  కన్నప్రేమ
ముందరి కాళ్లకి బంధం  -  నిలువరించడం
కాలూ చెయ్యీ ఆడకపోవడం  -   దిక్కుతోచని స్థితి
కాళ్లబేరం  -  రాజీ/క్షమాపణ
మడమతిప్పడం  -  పారిపోవడం/ వెనక్కితగ్గడం
పిక్కబలం చూపించటం  -  పారిపోవడం
గుండెల మీద కుంపటి  -  భారమైన బాధ్యత
గుండెలు బాదుకోవడం  -  బాగా రోదించడం
గుండెల్లో రాయి పడటం  -  అనుకోని విషాదం ఎదురవడం  
గుండె చెరువవ్వడం  -  తీవ్ర విషాదం
రక్తం కళ్లచూడటం/ నెత్తురు తాగడం   - పగ తీర్చుకోవడం
కండలు కరిగించడం -   కష్టపడి బతకడం
కాళ్లా వేళ్లా పడటం  -   బాగా బతిమాలటం

- టి.చంద్రశేఖరరెడ్డి, హైదరాబాదు 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం