అభిమానమంటే ఇదీ...!

  • 888 Views
  • 10Likes
  • Like
  • Article Share

సినారెను జ్ఞానపీఠమెక్కించిన ‘విశ్వంభర’ను అంతర్జాలంలోనే చదువుకోవాలంటే...? 
అరవైల నాటి ‘నన్ను దోచుకుందువటే’ నుంచి నిన్నమొన్నటి వరకూ సినారె రాసిన పదిహేడు వందల చలనచిత్ర గీతాలను మనసారా ఆస్వాదించాలనుకుంటే...?
శ్రోతల మనసులను సుతిమెత్తగా మీటే సినారె ఉపన్యాసాలను వినాలనుకుంటే...?
ఇవన్నీ ఒకఎత్తు... సినారె మాటల్లోనే ఆయన జీవితానుభవాలను తెలుసుకోవాలంటే...?
ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం...drcnarayanareddy.com 
తెలుగు సాహిత్యాభిమానులందరికీ శుభవార్త...! సినారె సాహిత్యప్రస్థాన సమస్త సమాచారమంతా ఒకేచోట కొలువుదీరింది. కొలబద్దల్లో ఇమడ్చలేని ఆ కవి మానసపుత్రికల వివరాలన్నీ ‘మౌస్‌ క్లిక్కు’ దూరంలోకి వచ్చేశాయి. పైన చెప్పుకున్న వెబ్‌సైట్‌ను తెరిస్తే... సినారె సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే! ఇంతకూ ఈ వెబ్‌సైట్‌ను తయారుచేసింది  ఓ అభిమాని. తనకు ఇష్టమైన సరస్వతీపుత్రుడికి అంతర్జాల వేదికపై అక్షరాభిషేకం చేయడానికి రూ.వేలల్లో సొంతడబ్బును, సంవత్సరానికి పైగా సమయాన్ని, శ్రమనూ వెచ్చించిన ఆ అభిమాని... డా.జుర్రు చెన్నయ్య. తెలుగు విశ్వవిద్యాలయ ప్రజాసంబంధాల అధికారి. 
వెబ్‌సైట్‌లో ఏముంటాయి?
సినారె జీవిత విశేషాలన్నీ సేకరించి ఇందులో పొందుపరిచారు. మూడున్నర గంటలసేపు సినారె స్వయంగా మాట్లాడిన వాగ్రూపాలూ ఉంచారు. అనేకానేక ప్రక్రియల్లో సినారె చేసిన సాహితీ సేద్యంలో పండిన పంటల సమగ్ర వివరాలు... వాటిలో కొన్నింటికి ఆడియో రూపాలూ ఇక్కడ కనిపిస్తాయి. కర్పూర వసంతరాయలు, విశ్వంభర, నాగార్జున సాగరం తదితర సినారె సృజనల ‘ఈ-పుస్తకాల’ను ఇందులోంచి దింపుకోవచ్చు. మారుటెన్నడో/ విషంపు గుండెలీ జగాన/ మారుటెన్నడో అంటూ పాఠశాల స్థాయిలోనే తొలిగేయం రాసిన సినారె... తర్వాత ఎన్ని మధురగీతాలను సృజించారో తెలిసిందే. చలనచిత్రాల కోసమే దాదాపు 1700 పాటలు రాశారు. వాటిని ఇక్కడ వినవచ్చు. సినారె వ్యాసాలు, దాశరథితో సినారెకి ఉన్న అనుబంధం వంటి విశేషాలనూ వివరించారు. వీటన్నింటితో పాటు ఆయన ఛాయాచిత్రాలు, వీడియోలనూ అందుబాటులో ఉంచారు. వీటిలో సినారె సకుటుంబ సపరివార ఛాయా చిత్రం వెబ్‌సైట్‌కు ప్రత్యేక ఆకర్షణ.


ఎంత అభిమానమో!
చెన్నయ్యకు చిన్నప్పట్నుంచి తెలుగు భాషా సాహిత్యాలంటే ఇష్టం. తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసిన సినారె అంటే ఎనలేని అభిమానం. సినారె వస్తున్నారంటే చాలు... ఎక్కడెక్కడ జరిగే సాహితీ సమావేశాలకూ వెళ్లిపోయేవారు. ఒకరోజు సినారె ఆరోగ్యం బాగోలేకపోయినా ఓ సభలో ప్రసంగించారు. అది చూసిన చెన్నయ్య ఆయనకు ఫోన్‌ చేశారు.  ‘ఆరోగ్యం బాగోలేదు కదా... విశ్రాంతి తీసుకోలేకపోయారా’ అన్నారు. ‘సాహిత్యం... సాహిత్య సమావేశాల ముందు ఈ అనారోగ్యమెంత’ అంటూ సినారె బదులిచ్చారట. అప్పట్నుంచి చెన్నయ్యకు సినారె మీద అభిమానం ఇంకా పెరిగింది. అలా వాళ్లిద్దరి పరిచయం మొదలై 30 ఏళ్లు గడిచిపోయాయి. ఈ మధ్యలో చెన్నయ్యకి ఒక ఆలోచన వచ్చింది. ‘ఎన్నో తెలుగు వెబ్‌సైట్లు ఉన్నాయి కదా! మరి తెలుగు సాహిత్యంలో ఇంత కృషి చేసిన సినారె కోసం ఓ వెబ్‌సైట్‌ ఎందుకు ఉండకూడదు. నాలాంటి అభిమానులందరూ ఆయనకు సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకోవాలి’ అని. ఆ తర్వాత సంవత్సర కాలం శ్రమించి సినారె సమాచారం మొత్తాన్ని సేకరించారు. ఈ ఏడాది జనవరి 19న వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీని రూపకల్పనకు దాదాపు రూ.80 వేలు ఖర్చయ్యాయి. వెబ్‌సైట్‌ను చూసిన సినారె అభిమానులే కాదు... అమెరికా, మలేషియా దేశాల్లోని తెలుగు భాషాభిమానులూ చెన్నయ్యను అభినందించారు. సినారె కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఒక అభిమానిగా సినారె కోసం చెన్నయ్య వెబ్‌సైట్‌ను రూపొందించినా... పరోక్షంగా తెలుగు సాహిత్యాభిమానులందరికీ ఎంతో మేలు చేశారు. సమకాలీన తెలుగు సాహిత్య రంగంలో మేరునగమైన సినారె సాహిత్యం మొత్తాన్ని ఒకచోటుకి చేర్చడమంటే విలువకట్టలేని పెన్నిధిని భావితరాలకు అందించడమే!


 


వెనక్కి ...

మీ అభిప్రాయం