బంగారు బతుకమ్మ...ఉయ్యాలో

  • 1185 Views
  • 32Likes
  • Like
  • Article Share

    దుర్గం రవీందర్‌

  • హైదరాబాదు
  • 9346454912
దుర్గం రవీందర్‌

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఓ పెద్దముత్తైదువ పాటందుకోగానే... చిన్నపూలకొండను తలపించే బతుకమ్మ చుట్టూ చేరిన మహిళలందరూ గొంతు కలిపి పాడతారు ఆడతారు. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు తెలంగాణలో ఏ ఊరికి వెళ్లినా ఈ ఆటపాటలు కనిపిస్తాయి. మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. 
      అనేక రకాల పూలతో చూసేవారి కళ్లకు విందు చేస్తూ బతుకమ్మ పండుగ ముచ్చటగొలుపుతుంది. ఇది పూల పండుగే కాదు, చెరువుల పండుగ కూడా. చెరువు బతుకు నిస్తుంది. కాబట్టి ఇది బతుకమ్మ పండుగ. చెరువులు గ్రామీణుల అవసరాలకు, పంట పొలాలకు, పశువులకు నీటిని అందించి సామాజిక ఆర్థిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి ప్రతిగా ఊరి మహిళలందరూ కలిసి చెరువమ్మకు కృతజ్ఞతలు తెలిపే పండుగ ఇది. 
      ఆశ్వయుజ మాసంలో 9 రోజులపాటు జరుపుకునే ఈ పండుగ సాధారణంగా అక్టోబరులో వస్తుంది. అప్పటికి వర్షాలు తగ్గుతాయి. పంటకోతలు దాదాపుగా పూర్తయ్యే సమయం. అంటే వ్యవసాయ పనుల హడావుడీ తగ్గుతుంది. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తాయి. అంతటా పచ్చదనం పరచుకుని ఉంటుంది. తెలంగాణ మెట్ట ప్రాంతం. ఎక్కడ చూసినా తంగేడు, గునుగు, బంతి, గన్నేరు పూలు విస్తారంగా పూసి ఉంటాయి. పెరళ్లలో గుమ్మడి, ఆనప, నేతిబీర పాదులనుంచి పాకి ఉంటాయి. మొత్తానికి గ్రామాలన్నీ తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి. 
ఈ పండుగలో బతుకమ్మకు పూజతోపాటు ఆటాపాటా మిళితమై ఉంటాయి. నామ-రూప భేదాలతో కొంచెం అటు ఇటుగా ఈ పండుగ భారతదేశమంతటా కనిపిస్తుంది. గర్బా, దాండియా, తీజ్, ఓనం, అట్లతద్ది, బొడ్డెమ్మ తదితర రూపాల్లో ఉంటుంది. బతుకమ్మ పండుగ చెరువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంటుంది.
      బతుకమ్మ మొదట గ్రామదేవత. గ్రామీణులు సృష్టించిన అమ్మదేవత. తర్వాత శైవం ఆమెకు శివుని సతిస్థానం ఇచ్చి గౌరమ్మని చేసింది. ఆ తర్వాత వచ్చిన వైష్ణవం సాక్షాత్తూ లక్ష్మీదేవే బతకమ్మ అని ప్రస్తుతించి ప్రచారంలో పెట్టింది. 
      ఈ పండుగకు నీటికి ఉన్న సంబంధం ఏంటంటే? తంగేడు, గునుగు, పసుపుముద్ద, తమలపాకులు చెరువునీటిని శుద్ధిచేయడమే కాకుండా, అవి కుళ్లి నీటి అడుగుకుపోయి చెరువు మట్టిని సారవంతం చేస్తాయి. వేసవిలో ఈ మట్టిని రైతులు పొలాల్లో వేయడం వల్ల పొలాలు సారవంతం అవుతాయి. ఇది ప్రతి ఏడూ జరిగే ప్రక్రియ. అందుకే ఇది చెరువుల పండగ. ఇది నూరు శాతం మహిళల పండుగ. అచ్చమైన అస్తిత్వ పండుగ. ఇలా ఊరి వారందరికీ బతుకును ఇచ్చే అమ్మ బతుకమ్మ. ఈ భావనకు కొంత దైవత్వం -కొంత మహత్తు ఆపాదించి గౌరమ్మను చేసి ఆ తరువాత శైవ -వైష్ణవ భావజాలాలను కలిపి ఇప్పుడున్న ‘బతుకమ్మ’ను రూపొందించారు.
అలంకరణ ఓ కళ
మొదట తాంబాళం లేదా తబుకుపై గుమ్మడి ఆకులు పరుస్తారు. వాటికింద నూలు దారాలను రెండు వరుసల్లో ప్లస్‌ ఆకారంలో వేస్తారు. గోపురాకారంలో పేర్చిన బతుకమ్మ పూలు జారిపోకుండా ఈ దారాలను ఆధారంగా కడతారు. బతుకమ్మను పేర్చడానికి గుమ్మడి ఆకు, తంగేడు, గునుగుపూలు తప్పనిసరిగా ఉండాలి. మొదటి వరుసలో తంగేడు పూలను పెడతారు. మధ్యలో తుంచిన పూల కాడలు, ఆకులను వేస్తారు.
      సాధారణంగా ప్రతి రెండో వరుసా తంగేడు పూలదే ఉంటుంది. గునుగు పూల చివరలు చిదిమేసి పది-పన్నెండు పూలను ఒక కట్టగా కట్టి, కొన్ని వరుసల్ని పేరుస్తారు. గునుగు పూలు అరతెలుపు రంగులో ఉంటాయి. అందుకని వీటిని ఆకుపచ్చ, గులాబీ, నీలిరంగులో ముంచి వర్ణరంజితం చేస్తారు. ఇలా ఒక వరుస తంగేడు, ఇంకో వరుస గునుగు పూలను మూడు, నాలుగు వరుసల్లో గోపురాకారంలో పేరుస్తారు. ఆ తర్వాత లభ్యతను బట్టి బంతి, చేమంతి, గన్నేరు పూలను పేరుస్తారు. పైన తమలపాకుల్లో త్రిభుజాకారంలో పసుపు ముద్దకు కుంకుమ, పసుపుబొట్లు పెడతారు. అగరువత్తులు అంటించి బతుకమ్మకు అలంకరణ పూర్తిచేస్తారు. అందుకే ‘‘పసుపులో పుట్టిన గౌరమ్మ/పసుపులో పెరిగిన గౌరమ్మ/పసుపులో వసంతమాడేవా...’’ అంటూ పాడతారు.
      ఇలా అలంకరించిన బతుకమ్మను ఇంటి వాకిట్లోకి తీసుకొస్తారు. మొదట ఎవరి ఇళ్ల వద్ద వాళ్లు ఆడాక ఆ ఊరిలో ఉండే గుడి వద్దకు చేరతారు. అక్కడ డప్పులు, కొమ్ము వాయిద్యాలు గంభీరంగా నినదిస్తుంటే చప్పట్లతో అంతా కోలాహలంగా ఉంటుంది. రంగురంగుల చీరలతో ముస్తాబై వచ్చిన స్త్రీల సందడితో ఆ ఊరంతా వీరి వెంటే ఉందా అన్నట్లు ఉంటుంది అక్కడి వాతావరణం. ఒకావిడ ‘ఒక్కేసి పువ్వేసి సందమామ/ ఒక్క జామాయె సందమామ...’ అంటూ పాటందుకుంటుంది. మిగిలిన వారందరూ ఆమెను అనుకరిస్తూ బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ ఒంగి ఒకసారి, లేచినప్పుడు రెండుసార్లు చప్పట్లు చరుస్తూ ఆడతారు. ఆ అడుగులకు, ఒంగి లేవడానికి, చప్పట్లకు అనువుగా లయబద్ధంగా ఉండే పాటలు వినడానికి ఇంపుగా, అర్థవంతంగా ఉంటాయి. కనీసం నలుగురు కలిసి ఆడే ఆట ఇది. ప్రేమలు, ఆప్యాయతలు పంచుకుని ఆత్మీయతలను వ్యక్తం చేసుకునే పండుగ ఇది. ఇక అక్కడి నుంచి స్త్రీలంతా ఆ ఊరి చెరువుకు బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి తరలివెళ్తారు. తమ వెంట ఎవరికి వీలైన సద్దులను (ఫలహారాలను) వారు తీసుకెళ్తారు. అందుకే మహర్నవమి నాటి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. 
      చివరకు ‘పోపో బొడ్డెమ్మ/ పోయిరా బొడ్డెమ్మ/మల్లెన్నడత్తవ్‌ బొడ్డెమ్మ...’ అంటూ బతుకమ్మను సాగనంపుతూ నిమజ్జనం చేస్తారు. సంధ్యాసమయంలో సాధారణ సమయాల్లో అంత సందడిగా ఉండని చెరువు తనపై అలాఅలా తేలుతూ మునుగుతున్న బతుకమ్మలతో నిజంగానే సంతృప్తి చెందిందా అన్నట్లు శోభిల్లే దృశ్యాన్ని చూడాల్సిందే... కానీ వర్ణించలేం. బతుకమ్మను చెరువులో వేసిన తరువాత ఖాళీ తబుకులను ఒక చోట పెట్టి మరోసారి ఆడిపాడిన తరువాత సద్దులు విప్పుకుని తింటారు. ఈ రోజు కార్యక్రమం నిజంగా ఉత్సాహంగా, కోలాహలంగా ఉంటుంది. పంచుకుని తినడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించే సందర్భం అది.
      సాధారణంగా మలీద, సున్నుండలు, సర్వపిండి, పోలెలు, తియ్యటప్పాలు, పులిహోర, అటుకులు, పేలాలు, నానబెట్టిన పెసలు, శనగలు, అరిసెల వంటివి సద్దులుగా తీసుకెళ్తారు. 
      ఇంకొందరేమో మొదటిరోజున వాయనంగా ఆకువక్కలు, తులసి దళాలు ఇచ్చుకుంటారు. రెండో రోజున పప్పు బెల్లాలు, మూడో రోజున ఉడికించిన బెల్లం శనగపప్పు (పూర్ణం), నాలుగో రోజున పాలల్లో నానబెట్టిన బెల్లం బియ్యం, ఐదో రోజున అట్లు, ఆరో రోజున అరిసెలు, ఏడోరోజున బజ్జీలు, ఎనిమిదో రోజున నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలి (వెన్నముద్దలు), తొమ్మిదో రోజున పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మ  కాబట్టి  పులిహోరా, చిత్రాన్నం లేదా ప్రధానవంటకాన్ని నైవేద్యంగా చేస్తారు.
      కొందరు ఆరో రోజున ‘ఆరెము’ అనే పేరుతో బతుకమ్మను పేర్చరు. ఆరెము అంటే అలగడం. 
బతుకమ్మ పాట... బతుకు ఘోష
బతుకమ్మ పాటల్లో జానపదులు వారి జీవితాలను ఆవిష్కరిస్తారు. వారి వెతలను వెళ్ల్లబోసుకుంటారు. దీంతో వారి మనసులు తేలిక పడతాయి. 
      ఆడి పాడటానికి, గట్టిగా మాట్లాడటానికి మామూలు రోజుల్లో మహిళలకు అనేక కట్టుబాట్లు ఉంటాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు కట్టుబాట్లను మరచి ఆడిపాడాలన్న ఆర్తిని తీర్చుకుంటారు. అయిదు పదేళ్ల చిన్నారుల దగ్గర నుంచి డెబ్భైయ్యేళ్ల ముతైదువ వరకు పట్టు పీతాంబరాలు కట్టుకుని, తలనిండా పూలు పెట్టుకుని ఆనందంగా పరవశించి ఆడి పాడతారు. మెట్టినింటి వారి మంచి చెడులను పాటల్లో వివరిస్తారు. తమ ప్రాంత వైశిష్ట్యాన్ని ఆ పాటల్లో పొందుపరుస్తారు. తమ ప్రాంతాల్లో జరిగిన ప్రధాన సంఘటనలు, ప్రమాదాలు, త్యాగాలు, దానాలను పాటల్లో అల్లుతారు. సున్నిత హాస్యాలు, పరిహాసాలు, గేలిచేయడాలు కూడా కొద్ది పరిమాణంలో ఉంటాయి.
      కాకతీయ రాజులు చెరువుల నిర్మాణానికి పెద్దపీటవేశారు. ఇది బహుశ వారికాలంలో పుట్టిన పండుగై ఉంటుంది. నాటినుంచి నేటివరకూ జానపదులు ఈ పండుగ సంప్రదాయాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. చిన్న మార్పులతో ఆనాటి మూల పండుగనే నేటికీ జరుపుతున్నారు. కొందరు మొదటి రోజు ఆటను ‘ఎంగిలి పూవు బతుకమ్మ’ అనగా మరికొందరు రెండో రోజున ఇలా అంటారు. తొమ్మిదో రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అంటారు. ఇదే బతుకమ్మ పండగ. సాధారణంగా మొదటి ఎనిమిది రోజులు చిన్నపిల్లలు, కన్యలు ఆడతారు. పెద్ద బతుకమ్మ రోజే ఊరి ముత్తైదువలందరూ నిష్ఠగా, ఉత్సాహంగా ఆడతారు. చిన్న పిల్లలను బతుకమ్మల మధ్య కూర్చోబెట్టి వారిని బతుకమ్మలుగా భావిస్తారు. కొన్ని గ్రామాల్లో ఏడు, ఎనిమిదో రోజు మహిళలంతా ఒకే రంగు చీర కట్టుకుని బతుకమ్మ ఆడతారు. 
పాటల్లో సమాజం
బతుకమ్మ పాటలు సరళ తాత్వికాంశానికి లేదా వారి జీవితాలకు సంబంధించినవై ఉంటాయి. కొన్ని పాటలు శైవ, వైష్ణవ వస్తుగతంగానూ ఉంటాయి. కొన్ని సరదా, ప్రకృతి ఆరాధన పాటలు, మరికొన్ని వారి జీవితాల్లోన్ని వెతలు, వర్తమాన ప్రధాన సంఘటనలపై ఉంటాయి. ఇవి ఉయ్యాల, చందమామ, గౌరమ్మ, కోలు, వలలో, అల్లోనేరేడల్లో తదితర పదాలతో ముగుస్తాయి. ఇక కొంత నేర్పు ఉన్న మహిళలైతే అప్పటికప్పుడు పాటలు అల్లిపాడతారు. ఆ పాటలోని అంశం నచ్చితే ఇతర స్త్రీలు దాన్ని నేర్చుకుని స్థిరపరుస్తారు. తమకు వీలైన పద్ధతిలో మార్చి పాడే వెసులు బాటు ఈ పాటల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే 25-30 కి.మీలకు పాటల్లో పదాలు, పాదాలు మార్పు చెందుతుంటాయి. గాంధీ, నెహ్రూల మీద, రైలు మార్గం వేసిన కొత్తలో ఒక పుణ్యస్త్రీని బలిచ్చిన సంఘటన, ఆలేరు-జనగామ రైలు ప్రమాదం తదితర అంశాలను పాటలుగా స్థిరపరిచిన వైనాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. మొత్తమ్మీద బతుకమ్మ పాటల్లో శైవానికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఉంటాయి. సీతారాములు, కృష్ణుడి పాటలు తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తాయి.
      మనిషికి ప్రకృతికి ఉన్న సంబంధం మనం జరుపుకునే పండుగల్లో వ్యక్తమవుతుంటుంది. ఇలాంటి పండుగలు తర తరాలకు ప్రవహిస్తూ మన తెలుగు సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అలాంటిదే బతుకమ్మ పండుగ. 


వెనక్కి ...

మీ అభిప్రాయం