సీతమ్మ.. బతుకమ్మ!

  • 372 Views
  • 9Likes
  • Like
  • Article Share

బతుకమ్మ అంటే ప్రకృతి పండగ. పుడమితల్లికి నీరాజనాలర్పించే పూల పండగ. అందుకేనేమో ఆ వసుంధర తనయ కూడా స్వయంగా ఈ పండగ చేసుకుంది. తోడికోడళ్లతో కలిసి బతుకమ్మ ఆడింది. సీతమ్మకూ బతుకమ్మకూ ఉన్న ఈ ఆసక్తికర అనుబంధానికి సంబంధించిన విశేషాలు తాటికొండ విష్ణుమూర్తి పరిశోధనాత్మక గ్రంథం ‘బతుకమ్మ పండగ పాటలు’ నుంచి... 
      ‘‘సీతమ్మ  అయోధ్యలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది. అప్పుడు ఆమె కూడా బతుకమ్మ ఆడుకోడానికి వెళ్తుంది. ఈ సందర్భంగా పాడే పాట:
దశరథ మహరాజు కోల్‌    
సుమిత్ర గట్టిందే     కోల్‌    
కౌసల్య తోడిందే     కోల్‌    
తంగేడు పూవుల్లు    కోల్‌     
తరుణీతాబాయె    కోల్‌ 
గుమ్మడి పూవుల్లు     కోల్‌    
గుణవతితాబాయె    కోల్‌     
ఉద్రాక్ష పూవుల్లు    కోల్‌    
ఉర్మిళతాబాయె    కోల్‌     
మల్లాయిపూవుల్లు    కోల్‌    
మాళవితాబాయె    కోల్‌    
చేమంతి పూవుల్లు    కోల్‌    
శ్రుతకీర్తితాబాయె    కోల్‌    
తివాసులేయించే    కోల్‌    
వాయనాలిప్పించే    కోల్‌    
నగరూ ముందారా కోల్‌
సుక్కల దర్వాజ      కోల్‌
సక్కానిబాయి      కోల్‌
సిబ్బిల పేరించి       కోల్‌
సీతాతోనాడ       కోల్‌
సిబ్బిల పేరించి     కోల్‌
సీతాతోనాడ     కోల్‌
సిబ్బిల పేరించి    కోల్‌
సీతాతోనాడ        కోల్‌

      సీతమ్మ... కౌసల్య, సుమిత్రల ప్రియమైన కోడలే కాదు- జానపదుల ముద్దుబిడ్డ. బతుకమ్మ పండగ జరుపుకోవడంలో కలిగే ఆనందం కంటే సీతమ్మ సాహచర్యమే కౌసల్య, సుమిత్ర, ఊర్మిళ, మాండవి (మాళవి), శ్రుతకీర్తి మొదలైన వారికి ఎక్కువ సంతోషం కలిగిస్తుంది. అందుకే సీతమ్మతో కలసి ఆడుకోవడానికి, తంగేడు పూవులతో సుమిత్ర, గుమ్మడి పువ్వులతో కౌసల్య, ఉద్రాక్ష పువ్వులతో ఊర్మిళ, మల్లాయి పువ్వులతో మాండవి, చేమంతి పువ్వులతో శ్రుతకీర్తి బతుకమ్మలను పేర్చుకుని బయలుదేరుతారు.
      సమష్టి కుటుంబంలోని స్త్రీలంతా ఒకరికొకరు సహకరించుకుంటూ పండగలు, వ్రతాలు జరుపుకుంటారు. సీతమ్మ కూడా బతుకమ్మ పండుగను వ్రతంగా జరుపుకుని ముత్తయిదువలకు వాయనాలిచ్చింది. ఇక్కడ అత్తగారలైన కౌసల్య, సుమిత్రలను పేర్కొన్నారు కాని, కైకేయిని పేర్కొనలేదు. బహుశా సీతమ్మ కష్టాలకు కైకేయి కారణం అని భావించిన జానపదులు ఆమెను మరచిపోవడంలో ఆశ్చర్యం లేదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం