సుందర కవిత్వ నందనం

  • 723 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా॥ దిలావర్‌

  • పాల్వంచ, ఖమ్మం.
  • 9866923294
డా॥ దిలావర్‌

సౌందర నందము! ఎంత అందమైన పేరు! పేరే కాదు, ఈ కావ్య ఇతివృత్తం కూడా అంతే అందమైంది. ఆ ఇతివృత్తాన్ని నిర్వహించిన తీరు ఇంకా అందమైంది. అంతటి అద్భుత సృజన చేసిన వారు పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు. వీరి ‘సౌందర నందము’.. తెలుగు సాహితీ నందనంలో దివ్యకవితా పరిమళాలు గుబాళింపజేసిన కావ్యపారిజాతం!
పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు తమ గురువులు తిరుపతి వేంకట కవుల మార్గాన్నే అనుసరించి జంట కవులుగా ప్రసిద్ధిచెందారు. వీరు 1928లో ‘తొలకరి’ పేరిట తొలి కావ్యం రచించారు. ఆ తర్వాత బుద్ధుడి కాలపు కథతో ‘సౌందర నందము’ను వెలువరించారు. ఈ పేరు వినగానే సంస్కృతంలో అశ్వఘోషుడు రచించిన ‘సౌందరనందం’ గుర్తుకొస్తుంది. అయితే పింగళి, కాటూరి ‘సౌందర నందము’ అనువాద రచన కాదు. సకల కవిత్వ కళావైభవంతో విలసిల్లే స్వతంత్ర కావ్యం. 
‘సౌందర నందము’లో
కథ చాలా చిన్నది. బుద్ధదేవుడు జ్ఞానోదయం తర్వాత కపిలవస్తు పురానికి పునరాగమించడంతో కథ ప్రారంభమవుతుంది. పుర వీధుల్లో ప్రజలకు బౌద్ధధర్మం బోధిస్తూ ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తుంటాడు బుద్ధుడు. ఆ క్రమంలో సుందరీనందుల రాజప్రాసాదం ముంగిలికి కూడా వచ్చి ‘భిక్షాం దేహిమమ’ అంటాడు. లోపల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో యథాప్రకారం తిరిగి పురవీధుల్లోకి వెళ్లిపోతాడు. శృంగారారాధనలో తలమునకలైన సుందరీనందులు తథాగతుడు వచ్చి వెళ్లిన విషయం తెలుసుకోలేకపోతారు. తర్వాత ఓ పరిచారిక ద్వారా ఆ వర్తమానం వింటారు. ‘బుద్ధ భగవానుణ్ని తిరిగి రమ్మని వేడుకుని త్వరగా వస్తాను’ అని సుందరితో చెప్పి వెళ్తాడు నందుడు. ‘నేటికిక భిక్షాటన చాలించాను. రాలేన’ని చెబుతాడు బుద్ధుడు. నిరాశతో వెనుదిరిగిన నందుణ్ని వారించి, విహారానికి తీసుకెళ్లి ‘దీక్ష’ ఇప్పిస్తాడు. నందుడు ఎంతసేపటికీ రాకపోవడంతో తన ప్రాణనాథుడి కోసం బౌద్ధ విహారానికి వెళ్తుంది సుందరి. అక్కడ బోధిసత్త్వుడి ఉపదేశంతో తనూ దీక్ష స్వీకరిస్తుంది. ఇదీ కథ.. చిన్నదో- పెద్దదో- ఎలాంటిదైనా జంటకవులు దీన్ని నడిపించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.
వైరాగ్యమూ.. శృంగారమూ..
తడియారని కళ్లతో, పొడిబారిన నోటితో కుమారుడి చెంతకు ‘తనయా!’ అని పిలుచుకుంటూ వస్తాడు వృద్ధ భూపతి. కుమారుణ్ని ఎత్తుకుని శోకరూపం దాల్చినట్టున్న యశోధర కూడా గౌతమ ముని చెంతకు వస్తుంది. ఆ మహర్షి మాత్రం తరతమ భేదం లేకుండా అందరి పైనా ఒకేలా కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరిస్తూ ఉంటాడు. మమతానురాగాలను తెంచుకున్న సర్వసంగ పరిత్యాగికి ‘నీ- నా’ అనే భేద భావాలుండవు కదా! ఇక్కడ సమస్త బంధనాలకతీతంగా వైరాగ్య భావాలను కూడా ఎంత మృదుమధుర గంభీరంగా వెలయించారో పింగళి, కాటూరి! ‘‘సుతుడంచున్‌ బతియంచున్‌ బాంధవుడటంచున్‌ మోహవిభ్రాంత సం/ గతులై, దుస్తర శోకవార్ధిబడి చీకాకైన యో జీవ సం/ తతులార! కలిపాశ బద్ధులగు నార్త ప్రాణులార! జను/ ర్మృతి సంపీడితులార! సత్యపథమున్‌ మీరెల్ల రాలింపుడీ’’! కేవలం రాగబంధాలను తెంపుకోవడమే కాదు, క్షణభంగురమైన జీవితంలో కోరికలనే మృగతృష్ణ కోసం ఎందుకు పరుగులు తీస్తారు అంటూ ప్రజలకు జ్ఞానోపదేశం చేస్తాడు తథాగతుడు.. ‘‘భావింపన్‌ క్షణ భంగురమ్ములగు జీవవ్రాతమున్‌ నమ్మి వే/ లావి భ్రాంతమతిన్‌ భవాంధువున ద్రెళ్లన్‌ జూతు రయ్యయ్యొ! యీ/ చావుంబుట్టువులేల? కామ్య మృగ తృష్ణా వారికై పర్వు లే/ లా! వే భంగుల సృష్టి నిత్య పద వాచ్యంబున్న విన్పింపుడీ’’! గంభీరమైన వైరాగ్యభావాలను కూడా ఇలా రసనిర్భరంగా చెప్పడం అందరికీ సాధ్యపడదు.
      రెండో సర్గ ‘భిక్షాగమనం’లో శాక్యర్షి కపిలవస్తుపుర వీధుల్లో గడపగడపకూ తిరిగి భిక్షాటన చేయడాన్ని శాంత గంభీరంగా చిత్రీకరించారు పింగళి, కాటూరి. అయితే ఈ సర్గలో ప్రధానంగా సుందరీనందుల శృంగారాన్ని రసరమ్యంగా వర్ణించారు. నవరసాల్లో శృంగారం ‘ఆదిరసం’ కదా మరి! ఆహార నిద్రామైథునాలు సకల ప్రాణికోటికీ సహజమైనవి, శృంగారం లేకుంటే అసలు సృష్టి ప్రసక్తే ఉండదు. అయితే, పింగళి, కాటూరి ఎక్కడా శ్రుతిమించిన శృంగారాన్ని వర్ణించలేదు. పంచేంద్రియ లౌల్యాన్ని ప్రేరేపించేది ఉత్తమ శృంగార వర్ణన కాదు. వాటికి అతీతంగా ఆత్మానందాన్ని కలిగించేదే ఉత్తమ శృంగార రచన. నందుడు, సుందరి ప్రణయాంబుధిలో తాదాత్మ్యంతో వివశులవుతున్న సుందర దృశ్యాన్ని జంట కవులు ఇదిగో ఇలా రూపు కట్టించారు..
పాతరలాడు తద్భ్రుకుటివల్లి యెటుల్‌  చలియించు నట్టులన్‌
చేతము తాండవింప మరచెన్‌ నృప సూనుడు  విశ్వమెల్ల, వే
లాతిగమౌ తదీయ రుచిరాంగ విలాస  సుధాంబు రాశి వీ
చీ తతి దొప్పదోగి నిలిచెన్‌ జెలి చూపుల  పాప పోలికన్‌

      సుందరి కనుబొమ్మలనే తీగ ఎటు కదిలితే నందుడి మనసు అటు కదులుతున్నదట. సుందరి అందమైన శరీర విలాసం అనే సుధాంబు రాశి కెరటాల్లో దొప్పదోగి చెలి చూపుల్లో ‘పాప’ పోలికగా నిలుచున్నాడట! నందుడు రసపిపాసి. సుందరి- అతిలోక సుందరి. ఆ మిథున శృంగారారాధనను ఉదాత్తంగా, శిఖరాయమానంగా ఉన్నతీకరించారు కావ్యకర్తలు. సిద్ధ దంపతుల్లా, రాయంచ జంటగా, పదమూ అర్థంలా, జీవాత్మల్లా అద్వైత సౌఖ్య రసామృతాన్ని గ్రోలడాన్ని ఔచిత్య భరితంగా వర్ణించారు కవిద్వయం.
ప్రత్యక్షరం సుధామయం
సుందరీ నందులు రసజలధిలో ఓలలాడుతూ ప్రపంచాన్నే మరచిపోయిన సమయంలో, అనుకోని కొన్ని సంఘటనలు తుపానులా వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తాయి. తథాగతుడు మధ్యాహ్న భిక్షార్థిగా వీధుల్లో తిరుగుతూ తన సవతి సోదరుడైన నందుడి లోగిలిలో కూడా ఓ క్షణం ఆగుతాడు. ‘అస్తి- నాస్తి’ అని ఏ సమాధానమూ వినపడకపోవడంతో యథావిధిగా వీధుల్లోకి బయల్దేరతాడు. దీన్ని ఓ పరిచారిక చూస్తుంది. ‘అయ్యో! పూజ్య నిగర్హణ నింద, ప్రభువైన నందుని మీద పడుతుందో ఏమో’నన్న భయంతో ఆ యువతి వెంటనే విషయం సుందరీ నందులకు తెలియజేస్తుంది. నందుడు ఒక్కసారిగా కళవళపాటుకు గురవు తాడు. తన ప్రాణకాంత మోమును పుల్కుపుల్కున చూస్తూ- ‘‘అన్నయటే, మహా మహిముడట్టె, జగమ్మున వార లెంతయున్‌/ మన్నన సల్పుచున్‌ గురుడు మాకన, దైవమునా జెలంగు లో/ కోన్నతుడట్టె, యిట్లు నిలయోపగతుండయి, భిక్షవేడి, య/ న్నన్న! మరేమనన్‌ - మగిడెనట్టె, చెలీ! కను నా యభాగ్యతన్‌’’ అంటాడు. లోకమంతా దేవుడని ఆరాధిస్తున్న సాక్షాత్‌ బుద్ధభగవానుడు- తన అన్న- ఇంటి ముందుకొచ్చి భిక్ష లేకుండానే రిక్తహస్తాలతో వెళ్లడం తన దౌర్భాగ్యం గాక ఏంటి? అంటూ వాపోతాడు. ‘అన్న పాదపద్మముల మీద వాలి, తిరిగి ఇంటికి తీసుకొస్తాను. అనుమతించు’ అని సుందరిని వేడుకుంటాడు. ‘మనో నాథా! గురుచరణ సేవ చేయడానికి వెళ్తున్న నిన్ను ఎలా వారించగలను? అలా అని ఎలా పంపగలను? ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరం ఉండలేని ఈ విరహం ప్రాప్తించింది కదా! సరే తప్పేదేముంది? ఇదిగో ఈ ‘విశేషకమ్ము’ తడియారక ముందే రావాలి సుమా!’ అంటూ నిస్సహాయ స్థితిలో వెళ్లడానికి అనుమతిస్తుంది సుందరి.
      ఈ సర్గలోని ప్రత్యక్షరం మాధుర్యాన్ని చిప్పిల్లుతూ సహృదయ మనోరంజకంగా ఉంటుంది. మాధుర్య గుణం లేని రచన రసవిహీనమైన- ఎండు కట్టెలాంటిదే. మధురోక్తులతో కూడినప్పుడే మాధురీ గుణం ఉత్పన్నమవుతుంది. ‘శిరీష కుసుమ పేశల సుధామయోక్తుల’ అన్న వాక్య తాత్పర్యం ఇదే. దిరిసెన పూలలా కోమలత్వం ఉండాలి. సుధామయంగానూ ఉండాలి. సుధ అనేది మాధుర్యానికి సంబంధించింది. సౌకుమార్యం, మాధుర్యం రెండూ కావ్యాన్ని ‘శిరీష కుసుమ పేశల సుధామయం’ చేస్తాయి.
అంతా ‘దేవర చిత్తం’!
ప్రాణసఖిని వదిలివెళ్లడం నందుడికి కూడా ఇష్టం లేదు. కానీ లోక పూజితుడైన శాక్యమునిని కలిసి తన పరాకును క్షమించమని వేడుకునే వరకు తనకు మనశ్శాంతి ఉండదు. ఇక్కడ నందుని మానసిక స్థితిని గొప్ప నైపుణ్యంతో చిత్రించారు కవిద్వయం.. ‘‘ఎడయని ధర్మరాగ మెటులే నొక ముందడుగేయ, రెండు మూ/ డడుగులు ప్రేమ ధర్మమపుడాతని వెన్కకుద్రోయు, నీ గతిన్‌/ విడువక యొయ్యనొయ్య బెను వెల్లువపై నెదురేగునట్టి య/ య్యుడుపము వోలె నేగె నెటులో యడుగడ్గున వెన్కత్రొక్కుచున్‌’’! ధర్మాన్ని ఉల్లంఘించలేక ఒక అడుగు ముందుకు వేయడం- ప్రేమధర్మాన్ని అతిక్రమించలేక మూడడుగులు వెనక్కివేయడం- డోలాయమానంగా ఉన్న నందుని మానసిక స్థితి ఇక్కడ బాగా చిత్రితమైంది. 
      గౌతమబుద్ధుడు యథావిధిగా నగరవీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటాడు. జనసందోహం గౌతముడి చుట్టూ కోలాహలంగా ఉంటుంది. ఆ జన సమూహాలలోకి చొచ్చుకొని పోలేక నిస్సహాయంగా ఉన్న తమ్ముణ్ని కటాక్షించే తలపుతో జనబాహుళ్యాన్ని తప్పించుకొని, నందునికి తనను కలుసుకునే అవకాశం కల్పిస్తాడు తథాగతుడు. వెంటనే నందుడు జరిగింది చెప్పి, క్షమించమని వేడుకుంటాడు. భిక్ష తీసుకోవడానికి తిరిగి రావాలని అర్థిస్తాడు. ‘‘ఇవ్వాళ ఇక భిక్షాటన వేళ ముగిసింది. భిక్షనొల్లను’ అని అంటాడు బుద్ధుడు. ఈ అనంగీకారంతో చిన్నబోయిన నందుడు ‘‘దేవర చిత్తం. పోయి వస్తాను’’ అని వెనుదిరుగుతాడు. అంతలో బుద్ధుడు ‘నిలునిలు’మని కళ్లతో సంజ్ఞ చేసి, తన చేతిలోనున్న భిక్షపాత్రను నందుని చేతులలో పెట్టి మౌనంగా ముందుకు సాగుతుంటాడు. గురువు ఉద్దేశం తెలుసుకోలేక రెండు మూడడుగులు ఆయనతోపాటు వేసి, మళ్లీ వెనుదిరుగుతాడు నందుడు. అంతరింద్రియాలకు, బహిరింద్రియాలకు ఏ మాత్రం పొసగక - తాను ఎటు వెళుతున్నాడో - తిరిగి రాక ఎప్పుడో అని మనసులో దిగులుపడుతుంటాడు.
      నందుని పరిస్థితిని పసిగడతాడు బుద్ధుడు. ‘‘ఎండకన్నెరుగని నిన్ను ఇలా ఉడుగని నడకల పాల్జేశాను. అది కూడా మంచికే అయింది. నీ వాసనా పరంపరలు మాసి విషయోప రాగ రహిత దివ్య జ్ఞాన కళిక సిద్ధించుగాక’’ అని తమ్ముణ్ని ఆశీర్వదిస్తాడు. అతణ్ని మోక్షమార్గ గామిని చేయాలన్న తలంపుతో ‘‘పగబూనిన తాచుపాములా మృత్యువు ప్రాణిని వెంబడిస్తుంది. విధాత కూడా దాని వశమే అంటే ఇక తక్కిన భూత జాలం గురించి చెప్పేదేముంది? ఇక్కడ శాశ్వతమన్నది ఏదీ లేదు. ఈ లోకం కన్నులున్నా చూడలేదు. మృత్యువు తల్లి ఒడిలోని బిడ్డను తస్కరిస్తుంది. బిగి కౌగిట్లో ఉన్న ప్రేమికులను ఎడబాపుతుంది. ఏ మాత్రం దయలేనిది మృత్యువు’’ అంటూ పరిపరివిధాలుగా తమ్ముని మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. ‘సౌమ్య బుద్ధివై ప్రియ విమోహ జలధిని తరించు. నేను నీకు దారి చూపిస్తాను’ అని అనేక విధాలుగా హితవు చెప్పి తన శిష్యునొకణ్ని పిలిపించి ‘కుమార నందునకు ధర్మపథ దీక్షనిమ్ము’ అని ఆదేశిస్తాడు బుద్ధుడు. 
అదంతా క్షణభంగురం
భిక్షు మండలికి చిక్కిన నందుడు వేడుకుని, పెనుగులాడి, బిట్టుగా విలపించి, కసరి, విసిరి, చేష్టలు దక్కి సొమ్మసిల్లిపోతాడు. అలా ‘సుందరి ప్రాణధనం భిక్షులకు దక్కింది’ అని చమత్కరిస్తారు జంట కవులు. ఇక అక్కడ- నందుడి ఎడబాటుతో స్థిమితంగా, కుదురుగా ఉండలేకపోతుంది సుందరి. ఇన్నాళ్లూ తను ప్రాణాధికంగా ప్రేమించిన వాణ్ని తూలనాడుతుంది. జగత్పూజితుడైన శాక్యర్షిని నిందిస్తుంది. ‘‘శోక రూపిణియైన యశోధరాంబ 
కీ తరిన్‌ దోడికోడల నైతి నిజము శాక్యకులమున మెట్టిన సతులకెల్ల 
భర్తృ విరహమె నోముల ఫలమదేవ?’’- ఎడతెగని భర్తృ వియోగంతో విలపిస్తోంది యశోధర. ఈ విషాదంలో నేను నిజంగానే ఆమెకు తోడికోడలునయ్యాను. శాక్య వంశంలో మెట్టిన అతివలందరికీ భర్త ఎడబాటే నోముల ఫలమేమో! అనుకుంటూ తల్లడిల్లుతుంది సుందరి. ఇక్కడ కవిద్వయం లోక వ్యవహారరీతుల్ని స్పృశించడం ఔచిత్యభరితంగా ఉంటుంది. 
      శృంగారాన్ని ఎంత మధురంగా సింగారించారో కరుణను కూడా అంతే ప్రతిభతో పండించారు పింగళి, కాటూరి. ‘అనుతాపం’ అనే సర్గలో నందుడు సుందరిని తలచుకుని వలపోయడం కరుణ రస నిర్భరంగా చిత్రితమైంది. సుందరీ, తానూ శరీరాలు రెండైనా ఒకే ఆత్మగా ఎలా ప్రేమలో ఓలలాడారో, సుందరి సుకుమార లావణ్య తనూలత తననెలా అల్లుకుపోయిందో అన్నకు వర్ణించి చెబుతాడు నందుడు. తన తోడిదే లోకమని భావించిన సుందరి అనుకోని ఈ ఎడబాటుతో ఎంతగా అల్లాడిపోతోందో అని బాధపడతాడు. సోదరుని మీద అపార దయావృష్టి కురిపిస్తూ, మన్మథ సేవ ఎంతటి క్షణభంగురమో, మోక్షప్రాప్తికి మార్గమేదో హృదయానికి హత్తుకునేలా, మృదూక్తులతో నందునికి వివరిస్తాడు శాక్యముని. తార్కికతతో కూడిన బుద్ధదేవుడి వాదన సార్వజనీనమైన సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
      రాజప్రాసాదంలో పొగిలి పొగిలి ఏడ్చి చివరకు ప్రాణనాథుని కోసం బౌద్ధ విహారానికి వెళుతుంది సుందరి. ‘‘నందునికి సత్యమార్గము తెలపడం కోసమే నీ నుంచి విడదీసి దీక్ష ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు. బుద్ధదేవుడు నిన్ను కూడా తప్పక కనికరిస్తాడు’’ అని బౌద్ధ భిక్షువులు నర్మగర్భంగా సుందరితో అంటారు. ‘సుందరి బాహుబంధంలో చొక్కిపోతున్న నిన్ను ఆనాడు కొనిపోయాను. ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నాను. ఈ సుందరిని, ధర్మసోదరిని, అనాథ శిశువులాంటి సుందరిని నీకప్పగిస్తున్నాను’ అని శాక్యర్షి సుందరిని నందునికి అప్పగిస్తాడు. ‘అలాగే ఈ బాలనందుని నీ పరం చేస్తున్నాను’ అని నందుణ్ని సుందరి కప్పగిస్తాడు. ‘ఇద్దరూ, ఆర్తులకు, అనాథలకు, దీనులకూ సేవ చేస్తూ తరించండి’ అని ఆదేశిస్తాడు. ‘‘సుందరీ నందులా బాల నంద సుంద/ రీ కరాబ్జాతముల నూది, వ్రేకనై తొ/ లంకు నానంద వశత గళమ్ము లెత్తి/ జయము పాడిరి దేశిక స్వామికి...’’ అంటూ కథ ముగిసిపోతుంది. పింగళి- కాటూరి జంట కవుల అత్యున్నత భావుకతకు సాక్షీభూతమీ కావ్యం. ఉదాత్త మానసిక భావనలతో, పరిణతి చెందిన రచనా శిల్పంతో కూడిన ‘సౌందర నందము’ ఆధునిక మహాకావ్యం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం