పద్య, గద్య కవితా ప్రవీణుడు

  • 306 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అమ్మిన శ్రీనివాసరాజు

  • తెలుగు ఉపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
  • ఖమ్మం జిల్లా
  • 9441317694
అమ్మిన శ్రీనివాసరాజు

పద్యంలో ఆధ్యాతిక భావాలను, వచన కవిత్వంలో సామాజిక స్పృహను రంగరించిన ఉభయ కవితా ప్రవీణుడు కావూరి పాపయ్యశాస్త్రి. విశ్వనాథ సత్యనారాయణ అంటే మెండైన ఆరాధన ఉన్న ఆయన ‘రామాయణ కల్పవృక్షం’లోని పద్యాలన్నీ కంఠతాపట్టారు. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము - శ్రీరాముని మనుజ ధర్మము’ అంశం మీద 1991లో కేతవరపు రామకోటిశాస్త్రి పర్యవేక్షణలో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన చేశారు. 
      ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో 1952లో పాపయ్యశాస్త్రి జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత నాటి ఖమ్మం జిల్లా వరరామ చంద్రాపురంలో హిందీ పండిట్‌ ఉద్యోగంలో చేరారు. అయితే, మాతృభాష మీద మక్కువతో తెలుగు ఉపాధ్యాయుడయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకుడిగా తెలుగు పాఠాలు బోధించారు. స్వగ్రామానికి సమీపంలోని పులిగొండ నృసింహస్వామిని స్తుతించే ‘శ్రీ పులిగొండ లక్ష్మీనృసింహ మధ్యాక్కరలు’తో కావూరి రచనా ప్రస్థానం మొదలైంది. తర్వాత సుమారు 16 కవితా సంపుటాల వరకు సాగింది. శతకాలు, గేయాలు, దీర్ఘకవితలను కూడా కావూరి సృజించారు.
      పద్యం ఎంత హృద్యంగా రాయగలరో, అంతే రమ్యంగా ఆలపించగలరు పాపయ్యశాస్త్రి. ఆయన పద్యం ఆలపిస్తుంటే ఆబాలగోపాలం పారవశ్యం చెందాల్సిందే! గోదావరి పరివాహక ప్రాంతాల్లో తన ఉద్యోగ జీవితాన్ని గడిపిన ఆయనకి గౌతమీనదితో ఆత్మీయ అక్షర అనుబంధం ఉంది. దాన్ని తన ‘రంగుల నది, నా గోదావరి, నాద గోదావరి’ వచన, పద్య, దీర్ఘ కవితల్లో అందంగా ఆవిష్కరించుకున్నారు. నదుల పరిరక్షణ ఆవశ్యకతనూ వీటిలో వివరించారు. ‘ప్రవాహ గీతం’ కవితా సంపుటి కావూరి సామాజిక స్పృహకు మచ్చుతునక. ఇందులో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడికి నీరాజనాలు పలుకుతూ ‘వీర మరణం’ కవిత రాశారు. ‘‘ఇప్పుడా ఫొటోపైన/ వేళ్లాడుతున్నదొక పూలదండ!/ ఆ దండలో పూలు ఆ ఇంటి వాళ్ల గుండెలు/ ఆ దండలో దారం ఆ ఇంటి వాళ్ల కన్నీళ్లు...’’ అంటూ గుండెను బరువెక్కిస్తారు ఈ కవితలో. 
      శ్రీశ్రీ అన్నా కూడా పాపయ్యశాస్త్రికి ఎనలేని అభిమానం. ‘‘ఛందో బందోబస్తులు/ ఎందుకు కవనానికనుచు ఎదిరించిన నీ/ కందంగా వ్రాసిచ్చెద/ కందాలొక వంద గూర్చి కాన్కగ శ్రీశ్రీ’’ అంటూ వంద కంద పద్యాలతో ‘శ్రీశ్రీ శతకం’ రాశారు. ఆయనలోని హాస్యప్రియత్వానికి ఇదో మచ్చుతునక. సామాజిక అవకరాలను కూడా ఇందులో పట్టిచూపారు. కావూరి సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ఆయన ‘మహతి’ గేయ సంపుటిని చూడాల్సిందే. ఒకప్పుడు ప్రతి లోగిలి ముందు కువకువలతో సందడి చేసిన పిచ్చుక అంతర్థానానికి కుమిలిపోతూ ‘పిచ్చుకా! పిచ్చుకా!!’ దీర్ఘ కవిత వెలువరించారు. తెలంగాణ సాహితీమూర్తుల చిరు పరిచయాలను ‘కోటి రత్నాల వీణ’లో పలికించారు. వ్యాఖ్యాతగా కూడా ఆకాశవాణ,¨ దూరదర్శన్‌లలో తన పలుకులు వినిపించారు. 2017 ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రశంసలు అందుకున్నారు. శ్రామిక జీవుల మీద కావూరి రాసిన ‘అధోజగత్‌ సహోదరులు’ కవితా సంపుటి ఇటీవలే ప్రచురితమైంది. తుదిశ్వాస వరకూ చక్కని భావ కవితా విరులు పూయించిన పాపయ్యశాస్త్రి ఈ జూన్‌లో స్వర్గస్థులయ్యారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం