బాపూ బోధన విని ఉంటే..!

  • 673 Views
  • 10Likes
  • Like
  • Article Share

గాంధీజీ ఏ కార్యక్రమాన్నైనా తాను విశ్వసించిన మౌలిక సిద్ధాంతాల పునాదిపైనే ఆవిష్కరించేవారు. భాషల విషయంలోనూ ఆయన ప్రత్యేక శైలినే అనుసరించారు. బాపూ జాతీయ భాషగా హిందీని ఆమోదించానా, ఎవరికి వారు తమ మాతృభాష వికాసానికి కృషి చేయాలని బోధించారు. వైస్రాయ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో హిందీలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిన భాషాభిమానం ఆయనది. ఆ సమావేశంలో తిలక్‌ ఆంగ్లంలో మాట్లాడం నచ్చక ‘‘తిలక్‌ హిందీలో మాట్లాడితే బాగుండేది. ఆయన హిందీ నేర్చుకోవాలి’’ అన్నారు నిస్సంకోచంగా. మరోమారు కాంగ్రెసు మహాసభలలో ఇంగ్లిషులో మాట్లాడిర మదన్‌ మోహన్‌ మాలవ్యానూ వదల్లేదు. ‘‘కాంగ్రెసు సభలలో హిందీలో మాట్లాడకపోవడం సబబుగా లేదు. ప్రయత్నిస్తే ఆయన వచ్చే సభల్లో తప్పకుండా హిందీలో మాట్లాడగలరు’’ అని బాపూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
      జాతీయ భాషగా హిందీ పట్ల గాంధీ ఎంత అభినివేశాన్ని ప్రదర్శించారో మాతృభాషల పట్ల అంతకుమించి ఆసక్తి చూపారు. దేశ భాషలకు సముచిత స్థానం లభించాలని, అందుకు శ్రమించాలని ప్రబోధించారే కానీ ఇంగ్లిషు పట్ల వైరభావం ప్రకటించలేదు. ‘‘ఇంగ్లిషు మీద శత్రుత్వం లేదు. అదో భాండారం. అయినా ప్రతి భారతీయుడూ దాన్ని నేర్వక్కర్లేదని నా అభిప్రాయం. మన వ్యవహారాలన్నీ మాతృభాషల్లోనే జరగాలి’’ అని చెప్పారు. 1918లో బీహారు ప్రాంతీయ విద్యార్థి సమ్మేళనంలో అధ్యక్ష ప్రసంగం చేస్తూ గాంధీజీ, ‘‘ఈ సమ్మేళనం కార్యకలాపాలన్నీ ప్రాంతీయ భాషలో జరుపుతున్నందుకు అభినందిస్తున్నాను. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. మనం మన మాతృభాషల పట్ల ఆదరణ చూపడం లేదు. ఇది ముమ్మాటికీ అలక్ష్యమే. దీని దుష్ఫలితాను మనం అనుభవించక తప్పదు. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తల్లిని అవమానించడంతో సమానం. అలాంటి మాతృద్రోహిని దేశభక్తుడనడానికి వీల్లేదు’’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దేశభాషల్లో తగిన పదజాలం లేదనే వాదనను గాంధీజీ ఖండించారు. ‘‘అన్ని భావాలనూ వ్యక్తం చేయడానికి కావాల్సిన పదజాలం తమ మాతృభాషలో లేదని చాలా మంది అంటూంటారు. ఇది సరికాదు. ఒక దశలో ఇంగ్లిషులోనూ తగిన పదజాలం లేదు. దాన్ని ఆంగ్లేయులు పెంపొందించుకున్నారు. అలానే మనమూ మన భాషలను అభివృద్ధి చేసుకోవాలి. మన భాషల్లో భావప్రకటన శక్తి లేదని ఇంగ్లిషులోనే ఉందని అనుకున్నంత కాలం మనం బానిసలుగానే ఉండిపోతాం’’ అని హెచ్చరించారు బాపూజీ.
బోధనామాధ్యమంగా...
గాంధీ వాంఛించింది దేశభాషల సమగ్ర వికాసం. ఆయన కోరింది పాలనలో, విద్యలో, ప్రజా వ్యవహారాల్లో ఆ భాషలకు ప్రాధాన్యం. ఆయన వ్యతిరేకించింది బ్రిటిషర్ల సామ్రాజ్యాధికారం, దేశభాషలకు స్థానభ్రంశం కలిగించే వారి ధోరణులనే. బోధన మాధ్యమంగా మాతృభాషలు ఉండాలని గాంధీ అనేక సార్లు చెప్పారు. 1928 జులై 5న ‘యంగ్‌ ఇండియా’లో రాసిన వ్యాసంలో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. 
      అప్పట్లో హైదరాబాద్‌ సంస్థానంలో విద్యాశాఖ సంచాలకులుగా పని చేస్తున్న నవాబ్‌ మసూర్‌ జంగ్‌ బహదూర్, కార్వే మహిళా విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన జరగాలని కోరారు. దానిపై ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పాఠకుడొకరు స్పందిస్తూ రాజా రామ్మోహన్‌ రాయ్‌ నుంచీ గాంధీ వరకూ భారతీయులు సాధించిన ఔన్నత్యానికి పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే కారణమని రాశాడు. దానికి గాంధీ ఇలా సమాధానమిచ్చారు.
      "ఈ పాఠకుడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని ప్రస్తావించాడు తప్ప ఉన్నత విద్యలో బోధనా మాధ్యమంగా ఇంగ్లిషు గురించి చెప్పలేదు. నవాబ్‌ గానీ, నేను గానీ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం లేదని అనడం లేదు. మేం నిరసించేది పాశ్చాత్య సంస్క×తి వల్ల భారతీయ వేద ప్రాచ్య సంస్కృతి ప్రభావం కావడాన్నే. నాపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఉందని నేనిదివరకే అంగీకరించాను. కానీ నేను నా దేశ ప్రజలకు ఏ మాత్రమైనా సేవ చేశానంటే అందుకు నాలో అంతర్భాగంగా ఉన్న ప్రాచ్య సంస్కృతే కారణమని గట్టిగా చెప్పగలను. జాతీయత సన్నగిల్లి నేను ఆంగ్ల మానసపుత్రుడిగా మారి ఉంటే ప్రజల ముందు నిష్ప్రయోజకుడిగా మిగిలే వాడిని. చైతన్య, కబీర్, నానక్, తులసీదాస్‌ వంటి మహాపురుషులు ఇంగ్లిషు పాఠశాలల్లో చదివి ఉంటే ఏం సాధించేవారో ఊహించవచ్చు. ప్రస్తుతాంశం బోధనా మాధ్యమం. యువతరం ఒక జాతిగా పరిఢవిల్లాలంటే అన్ని స్థాయిల్లోనూ విద్యాబోధన దేశభాషల్లోనే జరగాలన్నది నా నిశ్చితాభిప్రాయం.
      ప్రజలకు అర్థమయ్యే భాషల్లో వారు విద్యార్జన చేయకపోతే ప్రజానీకంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోలేరు. విదేశీ భాషలో ప్రవేశం పొందడం వల్ల, ఆ నుడికారం నేర్వడం వల్ల దైనందిన జీవితంలో ఒనగూరే ప్రయోజనం శూన్యం. తమ సాహిత్యాన్ని అలక్ష్యం చేసి, ఇవి నేర్వడం కోసం యువత కాలాన్ని ఎంత వృథా చేస్తోందో చెప్పక్కర్లేదు. మాతృభాషలో శాస్త్ర విషయాలనో, మరో అంశాన్నో అభివ్యక్తం చేయలేము అనడం కన్నా వేరే మౌఢ్యం ఉండదు. ఒక భాష దాన్ని మాట్లాడే ప్రజల స్వభావానికీ, వికాసానికీ ప్రతిబింబంగా ఉంటుంది. విదేశీ భాషా మాధ్యమాన్ని మన దేశ యువతపై రుద్దడం విదేశీ పాలన మూలంగా ఏర్పడిన అనర్థం. దీని వల్ల ఎంత హాని జరిగిందో మున్ముందు చరిత్రే చెబుతుంది. ఈ విదేశీ మాధ్యమం జాతి శక్తియుక్తుల్ని పీల్చి వేసింది. విద్యారు-ల విద్యాకాలాన్ని హరించింది. వారిని జన బాహుళ్యానికి దూరం చేసింది. విద్యార్జనను వ్యయంతో కూడుకున్నదిగా మార్చేసింది. మాతృభాషల పట్ల శ్రద్ధ వహించకపోతే, ఈ ప్రక్రియ ఇలాగే సాగితే, కొంత కాలానికి జాతి ఆత్మనే పోగొట్టుకునే దౌర్భాగ్యం పట్టవచ్చు. అందుచేత విద్యావంతులు విదేశీభాషావ్యామోహం నుంచి ఎంత శీఘ్రంగా విముక్తం అయితే దేశానికీ, ప్రజానీకానికీ అంత శ్రేయోదాయకం."
      దశాబ్దాలకు పూర్వమే జాతీయ భాష, మాతృభాషలు, బోధనా మాధ్యమాలపై బాపూజీ వెలిబుచ్చిన భావాలివి. ఆయన ఆందోళన నిజమేనని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది. అప్పుడే ఆయన మాటలు చెవికెక్కించుకుని ఉంటే ఇప్పుడు మాతృభాషలకూ, సంస్కృతులకూ ఈ దుర్గతి పట్టి ఉండేది కాదు. కనీసం ఇప్పటికైనా నేటి పరిస్థితులకు అనువైన భాషా విధానాన్ని రూపొందించుకుని, కట్టుదిట్టంగా అమలు చేసుకోవాలి. ఈ విషయంలో బాపూ బోధనలే మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం