జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతమ్ముగా వెలిసె ఉయ్యాలో

  • 756 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా.తిరునగరి దేవకీదేవి

  • విశ్రాంత ప్రధానాచార్యులు
  • హైదరాబాదు.
  • 9949636515
డా.తిరునగరి దేవకీదేవి

ఈ నేలతల్లి అంతరాత్మ బతుకుతెరువు. జనాన్ని బతకండర్రా అంటూ దీవించడమే దాని సహజ లక్షణం. ఆ కారణంగానే అన్ని ప్రాంతాల వాళ్లనూ కడుపులో (వాళ్ల) చల్ల కదలకుండా కాపాడింది. అదే లక్షణంతోనే పండగలుంటే అందులో ఆశ్చర్యమేముంది. ఆ పండగే ‘బతుకమ్మ’. నేలతల్లి అంతరాత్మకు ప్రతీక ఈ పండగ.
ధీరచోళ
దేశ రాచబిడ్డగా, కన్యకాపరమేశ్వరిగా, కాపుబిడ్డగా, రుద్రమదేవిని రక్షించిన సేవకురాలిగా (బలిదానమైన)... ఎన్నెన్నో కథలు బతుకమ్మ పండగ నేపథ్యాన్ని వెంటాడు తున్నాయి. నేపథ్యమేదైనా తెలంగాణా సంస్కృతిని, కుటుంబ సామాజిక సంబంధాలను అద్దంలా చూపించే పండగ ఇది. 
      బతుకమ్మ ఓ పూలపండుగ. ఆంధ్ర ప్రాంతంలోని గొబ్బెమ్మ, లంబాడీల తీజ్, మలయాళీల ఓనమ్‌ పండగలూ పూలపండగలే. బతుకమ్మకు ఈ పండగలతో కొంత పోలిక ఉన్నా అంతరం చాలానే ఉంది. బతుకమ్మ ఆటలో ఊరు ఊరంతా ఒకేచోటికి చేరుకుంటుంది. ఆడవాళ్లకీ అవకాశం చాలా అరుదైనది కదా! ఓరకంగా వాళ్లకిదో ఆటవిడుపు.
      చాలామంది బతుకమ్మ, బొడ్డెమ్మలను పర్యాయపదాలుగా వాడతారు. కానీ ఈ రెండు వేర్వేరు పదాలే కాదు, పండగలు కూడా. బతుకమ్మకు పూర్వమే ఈ బొడ్డెమ్మ పండగ వస్తుంది. ఓ పాటలో ‘బాలలకు వచ్చింది ఉయ్యాలో బొడ్డెమ్మ పండగ ఉయ్యాలో/ పెద్దలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండగ ఉయ్యాలో’ అంటూ పాడుకుంటారు. పాటలోనే ఆ తేడా చాలా స్పష్టంగా ఉంది. వినాయక నిమజ్జనానంతరం వచ్చే పౌర్ణమికి ‘బొడ్డెమ్మల పున్నమ’ అని వ్యవహారం. ఈ పౌర్ణమి తర్వాత బొడ్డెమ్మ ఆడే ఆనవాయితీ ఉన్నవాళ్లు ఇంట్లో బొడ్డెమ్మను వేస్తారు. ఈ బొడ్డెమ్మల్లోనూ పీట, పందిరి, బాయి, గుంట బొడ్డెమ్మలనే తేడాలూ ఉన్నాయి. బొడ్డెమ్మను వేసిన వాళ్లింటికి ఆ చుట్టుపక్కల కన్నెపిల్లలు వస్తారు. ఆ బొడ్డెమ్మ చుట్టూ చేరి చప్పట్లతో కోలాటంతో ఆడతారు. కొందరు తొమ్మిది రోజులాడితే మరికొందరు పదిహేను రోజులు ఆడతారు. ఎవరి కుటుంబ పద్ధతులు వాళ్లవిగానే కొనసాగిస్తారు.
అల్కటల్కటి పూలతో... 
ఇక బొడ్డెమ్మ నిమజ్జనమవుతూనే బతుకమ్మ షురూ! భాద్రపదం ముగింపు ఆశ్వీయజం ఆరంభకాలం పెత్రమావాస్య బతుకమ్మ ఎంగిలిపూల పండగ. అష్టమి రోజు వరకూ ఆటే ఆట. ఆరో రోజు మాత్రం ఆట ఉండదుగాక ఉండదు. ఆ రోజు బతుకమ్మ అలిగిందంటూ ఓ కథనం. ముఖ్యంగా ఈ పండక్కి అత్తవారింటి నుంచి తమ బిడ్డలను తోలుకొచ్చుకోవటం పరిపాటి. తోడుకొని రావటం రూపాంతరమే తోలుకరావటం. తెలంగాణలో ప్రాణమున్నవాటిని తోలు(డు)క వస్తారు. ప్రాణం లేని వాటిని తీసుకువస్తారు. అదే తేడా. ఈ ఆడపిల్లలంతా తమతోపాటు బతుకమ్మలను అందంగా అలంకరించి, వాటితో బయల్దేరుతుంటే పాత స్నేహితుల కలయిక, మొహాలు విప్పారటం, ఆ ఆటలోని అచ్చట్లు ముచ్చట్లు చప్పట్లు తలచుకుంటేనే హృదయం పొంగిపోతుంది.
      తంగేడు, గునుగు కట్ల, గోరింట, రుద్రాక్ష వంటి తేలికైన పూలే బతుకమ్మ పూలు. ఈ పూలన్నీ ఔషధ గుణాలు కలిగినవే. అంతేకాదు నిమజ్జనం చేసిన బతుకమ్మ అందంగా తేలుతూ పోతూంటే వాటితో కనులవిందు. అందుకే ఈ అల్కటల్కటి పూలు. అంతేకాదు ఇవి నీళ్లు పోయకుండానే పెరిగేవి. తొందరగా వాడిపోనివి కూడా. అంటే సహజ సౌందర్యానికి ప్రతీకే కదా! 
పాటల పరవళ్లతో...
బతుకమ్మలోని గౌరమ్మను నీళ్లలో ఓలలాడించిన తర్వాత అందరూ పసుపూ కుంకుమలనిచ్చుకుని తాము తెచ్చుకున్న వంటలనూ వినిమయం చేసుకుంటారు. స్వామి కార్యంలో స్వకార్యంలా ఆటలో ఆరోగ్య రహస్యంగా వ్యాయామం. పాçలేమన్నా తక్కువా! స్త్రీల పాటలు కదా ఏ విషయాన్నీ వదల్లేదు. మొదటగా పండగ ప్రస్థానంగా ఈ పాట...
శ్రీలక్ష్మీ దేవియు ఉయ్యాలో సృష్టి బతుకమ్మాయె ఉయ్యాలో/ పుట్టిన రీతి చెప్పె ఉయ్యాలో బట్టు నరసింహకవి ఉయ్యాలో/ ధరచోళ దేశమున ఉయ్యాలో ధర్మాంగదుడమరాజు ఉయ్యాలో/ ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతియండ్రు ఉయ్యాలో/ నూరు నోములు నోచి ఉయ్యాలో నూరుమందిని గాంచె ఉయ్యాలో/ వారుశూరులయ్యి ఉయ్యాలో వైరులచె హతమైరి ఉయ్యాలో...
      కొడుకులు చనిపోయిన తర్వాత ఆ దంపతులు.. కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో/ ఘనత పంబొనరించి ఉయ్యాలో/ ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికె వరమడుగమనె ఉయ్యాలో/ వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది గర్భంబున ఉయ్యాలో/ పుట్టుమని వేడగా ఉయ్యాలో సత్యవతి గర్భంబున ఉయ్యాలో/ సత్యవతి గర్భంబున ఉయ్యాలో శ్రీలక్ష్మి జన్మించె ఉయ్యాలో... 
      ఆ శ్రీలక్ష్మీనే... ‘సిరిలేని సిరులతో ఉయ్యాలో ఆ దంపతులు సంతోషమొంద ఉయ్యాలో/ జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతమ్ముగా వెలిసె ఉయ్యాలో’ అంటూ బతుకమ్మ నేపథ్యాన్ని ఈ పాటరూపంలో ప్రచారం చేస్తున్నారీ పడతులు.
అలుకూతచేసి ఉయ్యాలో 
‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ’ అంటూ ఎంతో లయబద్ధంగా కమ్మని స్వరాల మేళవింపు తో సాగుతుందో బతుకమ్మ పూల పాట. ఇలా పూల పరిచయం చేసే పాటలనేకం. పూలు తెచ్చిన పుత్తడిబొమ్మలు బతుకమ్మను పేర్చడం ఆసక్తికరం. 
      ‘తొమ్మిదీ రోజులు ఉయ్యాలో నమ్మికా తోడు ఉయ్యాలో/ అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగులూ వేయించిరి ఉయ్యాలో/ గోరంటపూలతో ఉయ్యాలో    గోడలూ కట్టించిరి ఉయ్యాలో/ తామరపూలతో ఉయ్యాలో ద్వారాలు వేయించిరి ఉయ్యాలో/ మొగిలి పూలతోని ఉయ్యాలో మొగరాలు వేయించిరి    ఉయ్యాలో/ వాయితా పూలతో ఉయ్యాలో వాసాలు వేయించిరి ఉయ్యాలో/ పొన్న పూలతోని ఉయ్యాలో ఇల్లునూ కప్పించిరి ఉయ్యాలో/ దోసపూలతోని ఉయ్యాలో తోరణాలు కట్టించి ఉయ్యాలో/ పసుపు ముద్దతోని ఉయ్యాలో గౌరమ్మను నిలిపి ఉయ్యాలో/ చేమంతి పూలతో ఉయ్యాలో చెలియను పూజించిరి ఉయ్యాలో/ సుందరాంగులెల్ల ఉయ్యాలో సుట్టూత తిరిగిరి ఉయ్యాలో/ ఆటలు ఆడిరి ఉయ్యాలో పాటలు పాడిరి ఉయ్యాలో/ నా చిన్ని బాలలకు ఉయ్యాలో పాలు లేవు రాజ ఉయ్యాలో/ శుక్రవారం నాడు ఉయ్యాలో పొద్దుపొద్దున్న లేచి ఉయ్యాలో/ అలుకూతచేసి ఉయ్యాలో ముత్యాల ముగ్గులేసి ఉయ్యాలో/ తలస్నానం చేసి ఉయ్యాలో గంగదేవికి మొక్కి ఉయ్యాలో/ గంగదేవికైతె ఉయ్యాలో పాలకాయకొడితె ఉయ్యాలో/ గంగ పారినట్లు ఉయ్యాలో పాలువారునమ్మ ఉయ్యాలో’ అంటూ శాస్త్రీయతను పక్కనపెట్టి సర్వం ఈశ్వరేచ్చ అన్న ధోరణితో కోకొల్లలుగా దేవుడికి సంబంధించిన పాటలు పాడుకుంటారు. 
పుట్టింటి నుంచి అత్తింటికి....
జనకు జనకూనింట్ల కోల్‌/ పాజనకూనింట్లా    కోల్‌/ పుట్టూతు ఆ సీత కోల్‌ పురుడే కోరింది కోల్‌/ పెరుగూతు ఆ సీత కోల్‌ పెండ్లీ కోరింది కోల్‌...
ఇట్లా ఈ పాటలో ఓ ఆడపిల్ల ప్రతినిధిగా సీతను చూపిస్తారు. ఆమె పుడుతూ పుడుతూనే స్త్రీత్వాన్ని ఆవహించుకుంది. ఇక ఆమె లక్ష్యమంతా పెళ్లి మాత్రమే. కానీ, దాంతో లక్ష్యం పూర్తిగా నెరవేరదు. అత్తగారింట్లో ఆమె ఒద్దిగ్గా నడుచుకోవాలి. అందుకే అప్పగింతల్లోనే ఆడపిల్లలకు అత్తారింట్లో నడుచుకోవాల్సిన బుద్ధుల్ని ఏకరవుపెడతారు. ‘...పుట్టీనింటికి కీర్తిని తెస్తి మళ్లీ నిన్ను తోలుకవస్త/ మా యమ్మ గౌరిదేవి పోయి రావమ్మ/ మాయమ్మ లక్ష్మీదేవి మళ్లీ రావమ్మా’ అంటూ పాడే పాటలనేకం. అత్తగారింట్లో ఆడవాళ్లు తమ బాధ్యతలను గుర్తించి మసలుకోవటం తప్పనిసరి. లేదా తల్లిదండ్రులకు అపకీర్తి వస్తుందని, ఆ పద్ధతిలో నడుచుకున్ననాడే పుట్టింట్లో స్థానాన్ని పదిలపరచుకోగలరని అర్థాంతరంగా చెప్పుకుంటారు. 
      అత్తవారింట్లో స్వతంత్ర భావనలకు అవకాశం లేదు. అందరి పెద్దవాళ్ల కనుసన్నల్లో మసలుకోవాల్సిందే. ఆ విషయాన్ని తెలిపే పాట... ‘కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో’. ఇందులో ‘పచ్చీసులాడేటి ఉయ్యాలో ఓ అత్తాగారు ఉయ్యాలో/ మా యన్న లొచ్చారు ఉయ్యాలో మమ్మంపుతార ఉయ్యాలో’ అని అడుగుతుందా కలవారి కోడలు. ‘వస్తె వచ్చిరిగాని ఉయ్యాలో ఏమి తెచ్చినారు ఉయ్యాలో’ అని ఆరాతీస్తుంది అత్త. వియ్యంకులు ఏం పంపినారనే వర్తమానాన్ని రాబట్టుకున్నాక ‘అట్లయితె నాకెరుకలె ఉయ్యాలో నీ మామనడుగు ఉయ్యాలో’ అంటుంది. ఆ తర్వాత ఆ ఇంటి కోడలు పట్టెమంచం మీద పడుకున్న మామను, వంటశాలలున్న అక్కను, భాగోతం చదివేటి బావగార్ని అడిగి చివరగా తన రాజేంద్ర బోగి దగ్గర అనుమతిని సాధించుకుంటుంది. ఇందరి అనుమతి అయితేకాని ఆమెకు పుట్టింటికి పోయే అవకాశం చిక్కదు. ఆ రోజుల్లో సమష్టి కుటుంబంలో అట్లా ఒద్దికతో నడుచుకోవాల్సిందే.  
తొట్లెండ్ల బాలుడూ ఉయ్యాలో
అత్తవారింట్లో కుదురుగా కాపురం చేస్తూనే పండంటి పిల్లవాణ్ని కనివ్వాలి. లేదంటే మగవాడి సంతానప్రాప్తి సామర్థ్యాన్ని పక్కనపెట్టి స్త్రీని గొడ్రాలని తప్పుపడుతూ అవమానాల పాలు చేస్తూ మరో పెండ్లి ప్రయత్నాలు కొనసాగటం అతిసాధారణం. 
      ‘సూర్యుడు చంద్రుడూ ఉయ్యాలో సుట్టమై వచ్చిరి ఉయ్యాలో/ మాకును అన్నలూ ఉయ్యాలో బలగమై వచ్చిరి ఉయ్యాలో/ వస్తు వస్తూనే సూచి ఉయ్యాలో అన్నా అని పిలిచె ఉయ్యాలో/ చేయికి నీళ్లిచ్చి ఉయ్యాలో చేయివార సూపె ఉయ్యాలో/ కాళ్లకూ నీళ్లిచ్చి ఉయ్యాలో కన్నీళ్లు నింపె ఉయ్యాలో’...  పుట్టింటివాళ్లు అత్తింటికొచ్చినపుడు ఆడపిల్ల పడే ఆరాటాన్ని కళ్లకు కడుతుందీ పాట. భోజనానంతరం అన్న తీరిగ్గా చెల్లెల్ని కన్నీటి కారణాలను ప్రశ్నిస్తూ... ‘తొట్లెండ్ల బాలుడూ ఉయ్యాలో తొలుకాడెదాక ఉయ్యాలో/ ఆకిట్ల బాలుడూ ఉయ్యాలో అంబాడేదాక ఉయ్యాలో’ అంటూ అప్పటి దాకా కష్టాలు తప్పవని, వీలైనంత తొందరలో సంతానవతివి కమ్మని ఉదారబుద్ధితో ఓ సలహాను విసిరేస్తాడు! 
      మరోపాటలో ఓ స్త్రీ పుట్టకు పాలు పోస్తూ.. ‘గుడ్లు తీయకు నాగ గొడ్డురాలిని కాదు’ అంటూ వేడుకుంటుంది. గొడ్రాలంటే సామాజికులకే కాదు ప్రకృతి జీవరాసులకూ తక్కువ చూపే అంటూ తమ్ము తాము కాపాడుకునే ప్రయత్నమిది. కలలు ఫలించి గర్భవతి అయిన స్త్రీకి శరీరంలో కలిగే మార్పువల్ల సాధారణ రుచులు గిట్టవు. సహానుభూతి కలిగిన తోటి స్త్రీలుగా వాళ్ల రుచులెట్లా ఉంటాయో ‘ఒక్కో మాసం నెల తన గర్భిణి ఓనగాయలడిగె’ పాట ద్వారా ప్రచారంలోకి తెచ్చారు.
పుట్టింటి సారె...
ఎంత చాకిరీ చేసినా ఎన్ని పెట్టుపోతలతో వచ్చినా ఏదో ఓ సందర్భంలో మెట్టింటి వాళ్లు పుట్టింటివాళ్లను దెప్పడం సాగుతూ వస్తూనే ఉంది. ఆ విషయాన్నే సుభద్రార్జునుల పేరిట ‘అర్ధరాత్రి పూట ఉయ్యాలో ఒక జాము దాటి ఉయ్యాలో/ ఆలికి మగనికి ఉయ్యాలో అలుకవేళాయె ఉయ్యాలో’ పాటలో పాడుకుంటారు. ‘తవ్వతో తవ్వెడూ ఉయ్యాలో ఇచ్చిరా మీవాళ్లు ఉయ్యాలో...’ ఇలా అర్జునుడు దెప్పుతూ ఉంటే సుభద్రకు కోపం వస్తుంది. ‘కలిగినా వోరింట ఉయ్యాలో పెండ్లాడకూడదా ఉయ్యాలో’ అంటుంది. దాంతో అర్జునుడు ‘ఎడమకాల్దీసి పెక్కున తంతాడు’! కళ్ల కాటుక జార కన్నీరు పెట్టిన సుభద్ర ఆ అర్ధరాత్రి పూట కాలినడకనే తల్లిగారింటికి పోతుంది. అక్కడ అన్న కృష్ణుడికి తన భర్తపెట్టిన కయ్యాన్ని వివరిస్తుంది. దాంతో ఆయన పాడి పంటలతో పాటు సారె పోయిస్తాడు. సంతోషంతో సుభద్ర పెద్దింటి పెద్దొదినకు, నడిపి వదినలతో పోయివస్తానని చెప్పి చివరగా సత్యభామకూ చెప్పబోయింది. 
      ఆడపడుచు ఇలా వచ్చి సారె తీసుకుపోవడం ఇష్టంలేని సత్యభామ ‘మమ్ము మా పిల్లలను ఉయ్యాలో అమ్ముకాపోవమ్మ ఉయ్యాలో/ ఎసట్లో బియ్యమూ ఉయ్యాలో పోసుకాపోవమ్మ ఉయ్యాలో’ అంటూ దెప్పుతుంది. దానికి బాధపడుతున్న చెల్లిని ‘కొని తెచ్చినదానితో ఉయ్యాలో కోపమేమిటికె చెల్లి ఉయ్యాలో’ అంటూ సముదాయిస్తాడు కృష్ణుడు. ఆస్తి పంపకాలు లేని రోజుల్లో సారె పేరిట ఆడపిల్లలకు పుట్టింటి నుంచి కలిగినంత పెట్టడం ఈ పాటలో కనబడుతుంది. ఆ పెట్టిపోతలను చూసి గడుసు కోడలు కుతకుత ఉడికింది. ఎకసెక్కమాడింది. ఆమెను లెక్కచెయ్యాల్సిన అవసరమే లేదన్నది అన్న సలహా. పైగా ఆమెను కన్యాశుల్కమిచ్చి తెచ్చుకున్నట్టు ఈ పాట మరో సమాచారాన్నీ ఇస్తుంది.
తూరుపుదిక్కునా ఉయ్యాలో 
జానపద సాహిత్యమంటే జానపదులు పాడుకునేవి. అజ్ఞాత కర్తృత్వంగా ఉండేవి. ఈ బతుకమ్మ పాటలను స్త్రీలు పాడుకున్నా మగవాళ్ల నోటిద్వారానో, లేదా వాళ్ల (పురుష స్వామ్య) భావజాలంతో వచ్చినట్టు, ఆనాటి కుటుంబ వ్యవస్థకు అనుగుణంగా పాడుకున్నట్టు కనపడుతుంది. అయినప్పటికీ స్త్రీలు పాడుకుంటున్న క్రమంలో తమ మనోభావాల కనుగుణంగా అల్లుకున్న పాటలు లేక పోలేదు.
      ‘తూరుపుదిక్కునా ఉయ్యాలో తులసివానలు కురిసె ఉయ్యాలో’ పాటలో ఊరిచెరువు నిండి కట్టమీది మైసమ్మ ఓ బలిని కోరితే గ్రామపెద్ద నీళ్లు తెచ్చే నెపంతో చెరువుదగ్గరికి పంపి ఆమెను బలివ్వడాన్ని కరుణరసాత్మకంగా పాడతారు. రేణుకాదేవి ఎల్లమ్మ కథా అలాంటిదే. ‘ఇద్దరక్క చెల్లెండ్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో’ పాటలో అన్నాచెల్లెండ్ల అనుబంధంతో పాటు అఘాయిత్యాలు చేసే దుర్మార్గుల వల్ల ఆడపిల్లల అగచాట్లు ప్రతీకాత్మకంగా కనపడతాయి. ‘ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగలాబాయికి ఉయ్యాలో/ కొంగలా బాయికి ఉయ్యాలో నీళ్ల కంటూ పోతె ఉయ్యాలో/ కొంగలన్నీ కూడి ఉయ్యాలో కొంగంతా చింపె ఉయ్యాలో...’ అట్లే, హంసల బాయివద్ద హంసలు అంచంతా చింపినవి, చిలుకలాబాయి వద్ద ఏకంగా చీరనే చింపినవి చిలకలు అని పాడతారు. ఊరిబయిట కాపుకాసిన దుర్మార్గులను కొంగలు, హంసలు, చిలుకలని ప్రతీకాత్మకంగా చెప్పుకోవడంలో వాళ్ల అవసరం కనపడుతుంది.
ఉద్యమ శంఖారావం
కాలానుగుణంగా రాజకీయ సామాజిక సాంఘిక సమస్యలన్నీ ఈ పాటల్లో తమ స్థానాన్ని పదిలపరచుకున్నాయి. స్వాతంత్య్రోద్యమం, విమోచనోద్యమం, ప్రమోదాలు, ప్రమాదాలు దేన్నీ బతుకమ్మ పాటలు వదల్లేదు. కాదేదీ పాటకనర్హం అన్నట్లుగా అన్ని వస్తువులూ ఇందులో వచ్చి చేరినాయి. మలితరం తెలంగాణ ఉద్యమ సంబంధమైన పాటల్లో బతుకమ్మ పాటలూ చేరిపోయినాయి. 300 ఏళ్ల తెలంగాణ చరిత్రను ఏడేడు తరాల గాధగా ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అంటూ సీడీ రూపొందించినారు వరవరరావు. ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి శరత్‌ 2009లో ‘నా తల్లి తెలంగాణా ఉయ్యాలో ఉయ్యాలో తల్లడిల్లుచున్నాది ఉయ్యాలో ఉయ్యాల’ అంటూ మంచి పాట రాశాడు. ‘ముగ్గురక్క చెల్లెండ నుయ్యాలో ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో/ ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో ఒక్కనికె ఇచ్చిరి ఉయ్యాలో’ అంటూ తెలంగాణ దీనగాథను పాడుకున్న వనితామణులూ ఉన్నారు.
      ఇక జానపదాలుగా వీటిని పరిశీలిస్తే... పేరు జానపదులదే అయినా శిష్టుల చేతుల్లోనూ రుపుదిద్దుకున్నాయి. పాటలు పాడుకున్న వర్గాన్ని బట్టి భాష ఉంటుంది. రాగయుక్తంగా లయబద్ధంగా పాడుకోవ డానికి ప్రాధాన్యం ఇచ్చిన క్రమంలో దీర్ఘం ఉండాల్సిన చోట లేకపోవడం, లేని చోట్ల దీర్ఘముండటాన్ని చూడొచ్చు. ఆగమాలకు, ఆదేశాల లోపాలకూ కొదువుండదు. ప్రచారం మౌఖికంగా ఉండటంవల్ల ఒక పాట ఇంకోపాటలోకి చొచ్చుకరావడమూ కనబడుతుంది. కొన్ని చోట్ల సమన్వయం లేకపోవడాన్ని, ఆ పదమేంటో అర్థం కానంతగా మారిపోవడాన్నీ చూడొచ్చు. 
      ఏది ఏమైనా ఈ బతుకమ్మ పండగ సంస్కృతీ సంప్రదాయాలతో పాటు స్త్రీల మనోభావాలనూ ప్రచారంలోకి తెచ్చింది. విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత వలసపాలకులు, ప్రజలు ఆధిపత్యధోరణితో తెలంగాణ సంస్కృతిని న్యూనతా భావంతో చూడటంలో విజయం సాధించారు. కొంతకాలం ఈ పండగ, ఈ సంస్కృతి వెలవెలబోయింది. కానీ మలితరం తెలంగాణ ఉద్యమకాలంలో ఆత్మగౌరవంలో భాగంగా తెలంగాణ పండగలకు, పాటలకు విశిష్ట స్థానం లభించింది. బతుకమ్మ పండగకు సమున్నతస్థానం కల్పించే దిశగా కల్వకుంట్ల కవిత బాగా కృషి చేశారు. ఈ మనోభావాలను మరింత విశ్లేషణాత్మకంగా తీసుకపోవాల్సిన బాధ్యత ఈ కాలం రచయిత్రులదే మరి.


వెనక్కి ...

మీ అభిప్రాయం