‘పొట్టా’భిషేకం

  • 927 Views
  • 14Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండెరకములు’’ అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు. ఇది ముత్యాల ‘స్వరం’గా అన్నప్పటికీ అసలు కుదరదు. ఎవరు మంచి? ఎవరు చెడ్డ? అని ఎవరు తేల్చి చెప్పగలరు? ఒకప్పుడు మంచిగా ఉన్నవాడు ఇంకొకప్పుడు చెడ్డవాడిగా ఉండవచ్చు.. ఒకప్పుడు చెడ్డగా ఉన్నవాడు ఇంకొకప్పుడు ‘పొరపాటున’ మంచివాడిగానూ మారిపోవచ్చు. కాబట్టి గురజాడ లెక్క సరికాదు. అయితే  ‘మార్క్సిస్టాత్ములు’ జనాన్ని ఉన్నవాళ్లు (Haves), లేనివాళ్లు (Havenots)గా విభజిస్తారు. ఒకప్పుడు ఆర్థికంగా బాగా ఉన్నవాడు దెబ్బతిని కొంతకాలానికి లేనివాడు కావచ్చు. నిష్టదరిద్రుడు కష్టపడి పైకొచ్చి ఉన్నవాడు కావచ్చు. కాబట్టి ఇదీ చెల్లదు. ఈ వరుసలోనే బుర్ర ఉన్నవాళ్లు, బుర్రలేనివాళ్లు అన్న విభజనా కుదరదు. మరి ఏది కుదురుతుంది? 
      ఇప్పుడు జనాలందరి బుర్రలూ 24×7 బొర్రల చుట్టూ తిరుగుతున్నాయి. బొర్ర ఉన్నవాళ్లూ బొర్ర లేనివాళ్లుగా మనుషుల్ని విడదీస్తే మహామేలు. బొర్రలున్న వాళ్లని ఎగతాళి చేస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. మనుషులు బయట తిరుగుతున్నంతసేపూ ఎవరి పొట్టకొడదాము అని ఆలోచిస్తూంటారు. ఇంట్లోకొచ్చాక తన పొట్ట కొట్టుకోవడం ఎలా అని జుట్టు పీక్కోవడం ఎందుకు? అయినా పొట్ట అనేది కన్నబిడ్డ లాంటిదే. అందుకనే కన్నబిడ్డను పెంచుకున్నట్టే పొట్టను కూడా తడిమి తడిమి ‘పెంచుకుంటారు’. అయితే ఎటొచ్చీ పొట్టలున్న వాళ్లు తరచు నవ్వుల పాలు కావడం బాధాకరం. ఈ జీవితం జానెడు పొట్టకోసం అని అందరూ అంటుంటారు. ఆ జానెడు పొట్ట కాలానుగుణంగా ‘ఇంతింతై’ అన్నట్టు బారెడో మూరెడో అయితే సంతోషించాల్సింది పోయి బాధపడటం ఎందుకు? ‘అధికస్య అధికం ఫలం’. పొట్ట వ్యవహారంలోనూ ‘అంతేగా! అంతేగా’! కాబట్టి ఊబకాయమా జిందాబాద్‌ అనక తప్పదు. 
      పొట్ట ఉన్నవాళ్లకు లేని వాళ్లకూ మధ్య తేడా గమనిస్తే స్థూలకాయుల వైభవం స్థూలంగానే కాదు, సూక్ష్మంగానూ తేటతెల్లమవుతుంది. పొట్టివాడు గట్టివాడు అంటారుగానీ పొట్ట ఉన్నవాళ్లు అంతకన్నా గట్టివాళ్లు. పొట్ట ఉన్నవాడికి ఉన్న ‘వెయిట్‌’ పొట్టలేని వాడికి ఎక్కడేడ్చింది! ‘వెయిట్‌’ అర్థతాత్పర్యాల గురించి ఇంగ్లీషు వాడిని అడిగితే చాలు గూబ గుయ్య్‌ మంటుంది. ‘ఊబ’ ‘జై’ అంటుంది.
      పొట్ట ఉన్నవాడు నీతిగా నిజాయితీగా ఉండక తప్పదు. తప్పుడు పనిచేసే వాడు సన్నగా ఉంటే తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. కానీ పొట్ట గలవాడు పరిగెత్తలేడు. తప్పు చేస్తే తప్పకుండా పట్టుబడతాడు. అందువల్ల ఏ తప్పూ చేయకుండా బుద్ధిమంతుడిలా ఉంటాడు. పొట్టవల్ల ధర్మం నిలబడుతుంది. పొట్టో రక్షతి రక్షతః. పొట్టను మనం రక్షించు కుంటే అది మనల్ని రక్షిస్తుంది. కీచకుణ్ని పొట్టన పెట్టుకున్న భీముడు ఎలా ఉన్నాడూ! ‘‘నింగియు నేలయు తాళము ల్‌గా జేసి. ఏపునరేగి వాయించి ఆడ’’ అన్నట్టు ఉన్నాడట. నాజూగ్గా, పిట్టలా ఉన్నవాడు ఇలాంటి పనులు చేయగలడా?
      ఊబకాయుడు కూర్చున్నా, పడుకున్నా ఎక్కువ స్థలం ఆక్రమిస్తాడు. సన్ననివాడు అతనితో ఏం పోటీ కొస్తాడు? ఏం ధాటి చూపిస్తాడు? ఊబకాయుడు ‘వైద్యోనారాయణో హరిః’ అనిపించుకున్న డాక్టర్లను పోషిస్తాడు. ఆసుపత్రులను రక్షిస్తాడు. మందుల దుకాణాలకు ఆపన్నహస్తం అందిస్తాడు. రివటగా, ఆరోగ్యంగా ఉన్నవాడి వల్ల డాక్టర్లకుగానీ, ఆసుపత్రులకు గానీ, మందుల దుకాణాలకుగానీ ఏం ఒరుగుతుంది? పొట్టగల వాడు నిదానమే ప్రధానం అనుకుంటాడు. హడావుడి ఏమీ ఉండదు. తొందరపడకు సుందరవదనా అనిపించుకోడు. పొట్ట ఉన్నవాళ్లను మనం కాలదన్నుకుంటే, మనకు ఇంతమంది రాజకీయనాయకులు దొరికేవాళ్లా? పొట్టలు ఉంటే కుదరదంటే మనకు ఇంతమంది పోలీసులు ఉండేవాళ్లా? బానపొట్ట ఉన్నవాడికి కుర్చీ ఉంటే చాలు, ప్రత్యేకంగా బెంచి అవసరం లేదు. ఊబకాయుడు తన పొట్టను బెంచీగా చేసుకుని రాతకోతలకు ఉపయోగించుకోగలడు. పొట్ట ఉన్నవాళ్ల వల్ల వస్త్ర పరిశ్రమ లాంటివీ అభివృద్ధి చెందుతాయి. వస్త్రం ధరించడమంటే నాగరికత. ఎక్కువ వస్త్రాలు ధరించడ మంటే నాగరికతను పెంచుకోవడమే. అందువల్ల పొట్టలున్నవాళ్లు నాగరికతను పెంచడానికి దోహదం చేస్తారు. అంతేకాదు, వాళ్లు చేసే పర్యావరణ సేవ అంతా ఇంతా కాదు. వాళ్ల పొట్టల కింద చిన్న చిన్న ప్రాణులు ఎంచక్కా సేద తీర్చుకోవచ్చు. ఎండావానల బారినుంచి ఎంత రక్షణ పొందవచ్చు! ఇవన్నీ ఎందుకు? గిరీశం వాదనా పటిమను పుణికి పుచ్చుకుంటే పొట్ట వారిదే గెలుపు. అతగాడిదే మలుపు. గణాధిపత్యం పోరులో ‘పొట్ట’ గుర్తుతో పోటీకి దిగిన వినాయకుడే గెలిచాడు కదా. నాజూకుగా ఉన్న సిక్స్‌ప్యాక్‌ కుమారస్వామి అడ్రస్‌ లేడు. అలా గణపతి ఆది దేవుడనిపించుకున్నాడు. అందరికీ ఆరాధ్యుడయ్యాడు. పొట్ట ఉన్నవారికి ఇంతకంటే అండదండలు ఏముంటాయి? అదేదో పాటలో ఉన్నట్టు అతిరథ మహారథులైన నాయకులు ‘వినాయకుడు మా నాయకుడన్నారు’. వినాయకుడి భక్తుడు ఏమని పాడుకుంటాడు? ‘‘ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య’’ అని కదా! ప్రార్థిస్తాడు. అదేగనక వినాయకుడికి అంత పొట్ట ఉండి ఉండకపోతే, ఈ పాట వచ్చేదా? వినాయకుడికి అంత గౌరవం దక్కేదా! అందువల్ల పొట్ట ఉన్నవాడితో అది లేనివాడు పొరపాటున కూడా పోటీకి రాలేడు. వచ్చినా తట్టుకోలేడు. పొట్టయ్యా! నీకు ఎవరు సాటయ్యా (సాటి+అయ్యా).
      పొట్ట ఉన్నవాడికి తిండి పుష్టి ఎక్కువ. ‘ఉన్నది పుష్టి మానవులకో యదు భూషణ ఆలజాతికిన్‌ తిన్నది పుష్టి’ అని తిరుపతి వెంకట కవులు అన్నారు గానీ అది అన్యాయం! మనుషులకు కూడా తిన్నదే పుష్టి. పొట్ట ఉన్నవాడు తెగ తింటాడు. ‘అన్నం పరబ్రహ్మస్వరూపం’ అనుకునే అన్నాన్ని ఆరాధిస్తాడు. అందువల్ల పరబ్రహ్మస్వరూపానికి న్యాయం జరుగుతుంది. తిండి వాడకం పెరిగిందంటే అన్నదాతలను ఆదరించినట్టే. అంత గొప్పవాడు కాబట్టే, ఊబకాయుడికి నేలబారు చూపులుండవు. అతడు ఆకాశాన్ని అయినా చూస్తాడు తప్ప! స్థాయిని దిగజార్చుకుని కిందకు చూడలేడు. అంతేకాదు తనలాంటి శిష్యుల్నే తయారుచేసుకుంటాడు. ఒక గురువుగారు శిష్యసమేతంగా ఒక గృహస్థు ఇంటికి వెళ్లి సుష్టుగా భోంచేసి, బయటికొచ్చి తన చెప్పుల అన్వేషణలో పడ్డాడు. పొట్ట కారణంగా కిందికి చూడటం నామోషీ. తన చెప్పులు వెతికి పట్టుకురమ్మని ప్రియ శిష్యుణ్ని ఆదేశించాడు. అతగాడు విధినిర్వహణలో గురువుని ముంచినవాడు. ఆకాశంవైపు చూసి గురువుగారూ, మీ చెప్పులు ఎక్కడా కనబడటంలేదు అని జవాబు చెప్పాడు. దాంతో గురువర్యుడు ‘వెధవా! చెప్పుల కోసం కింద చూడకుండా ఆకాశంలో చూస్తావేంట్రా!’ అని శిష్యుణ్ని కసురుకున్నాడు. శిష్యుడేమో ‘తక్కువ తిన్నవారెవ్వరు గురువుగారూ!’ అన్నాడు. గురువు పొట్టకు శిష్యుడి పొట్ట పోటీ! ఎంత రసవత్తరం! పొట్ట మనిషి ఆత్మగౌరవాన్ని నిలబెడుతోంది. 
      తిండి గలిగితె కండగలదోయ్‌..  కండగల వాడేను మనిషోయ్‌ అన్నారు గురజాడవారు. అలాకాకుండా ‘తిండి పెరిగితే పొట్టగలదోయ్, పొట్టగలవాడేను నేతోయ్‌’ అని ఉంటే పొట్టకు ఎంత తధిగిణ తోమ్‌! 
      పొట్ట పెరిగితే కష్టమూ లేదు. నష్టమూ లేదు. ‘యథా స్థూలం... తథా సుఖం’ అని తాతముత్తాతలు ఎప్పుడో చెప్పారు. లావుగా ఉంటే సుఖం పలావు. అందుకనే ఇప్పుడు కారల్‌మార్క్సు ఏ లోకంలో ఉన్నా దిగివచ్చి ‘‘ప్రపంచ ఊబకాయులారా! ఏకంకండి. పోరాడితే పోయేదేమీలేదు. మీ పొట్టలు ఎవరూ కొట్టలేరు’’ అని పిలుపు ఇస్తేసరి!


వెనక్కి ...

మీ అభిప్రాయం