ఇచ్చుకున్నోడు ఈగ.. పుచ్చుకున్నోడు పులి!

  • 1551 Views
  • 4Likes
  • Like
  • Article Share

    డా।। కాలువ మల్లయ్య

  • సాహిత్య పరిశోధకుడు
  • హైదరాబాదు
  • 9182918567
డా।। కాలువ మల్లయ్య

తెలంగాణ భాష మాండలికం కాదు. అది జీవద్భాష.. గలగల పారే సెలయేరు నీటిలాంటిది. ఇందులో చక్కటి లయ ఉంటుంది. ప్రాంతీయ ముద్ర ఉంటుంది. విశ్వజనీన భావుకతుంటుంది. ఈ భాషలో తెలంగాణ ప్రజలు తమ జీవితానుభవాలు, చారిత్రక సామాజిక పరిస్థితులను బట్టి అద్భుతమైన సామెతలను సృష్టించుకున్నారు. నులక మంచాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ సామెతల వరదలు పారించేవారెంతో మంది ఉన్నారు. రచ్చబండ మీద కూర్చుని చుట్టలు తాగుతూ, పంచాయితీలు చేస్తూ మధ్యమధ్యలో సందర్భోచిత సామెతలు వాడేవారూ కొల్లలు. తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి- సెప్టెంబరు 9) సందర్భంగా ఇక్కడి సామెతల ఆమెతల ఘుమఘుమలివి..!
భాషకయినా ‘అనర్ఘరత్నాలు’ లాంటివి జాతీయాలు, సామెతలు. జాతీయాలను నుడికారాలు, పలుకుబడులు, పదబంధాలు అని కూడా అంటారు. ఇవి రెండుమూడు పదాల కలయికగా ఉంటాయి. సామెతలు చిన్న వాక్యంగా ఉంటాయి. సామ్యం (పోలిక)తో చెప్పేవి సామెతలు. పదబంధాలు, సామెతలు అల్పాక్షరాల్లో అనల్పార్థాన్నిచ్చే భాషా విశేషాలు. ఒక పేరా, ఓ పేజీలో చెప్పలేనంత విశాలమైన, విస్తృతమైన అర్థాన్ని ఓ జాతీయం, సామెత ద్వారా చెప్పవచ్చు. ఇవి జనం అనుభవాల్లోంచి వచ్చే స్థల, కాలాల చైతన్యమున్న పద సంపదలు. ఆయా ప్రాంతాల జీవితాన్ని సజీవంగా చిత్రించడానికి, ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడానికి, ఆయా జనం అనుభవాలసారాల్లోంచి వచ్చిన పదబంధాలు, సామెతలు ఉపయోగపడతాయి. తెలంగాణ సామెతలకు ఆ జీవద్భాషా సౌరభముంది. వీటి ద్వారా తెలంగాణ సమాజాన్ని, సంస్కృతిని, ప్రాకృతిక విశేషాలను, జీవన సౌరభాన్ని చదవవచ్చు. అలా అని, తెలంగాణలో వినిపించే వేలాది సామెతలన్నింటినీ స్పృశించడం సాధ్యం కాని పని. జనజీవనంలో వాడుకలో ఉన్న పురాణ, వ్యవసాయ, స్త్రీపురుష, ముస్లిం జీవన, ప్రకృతి, ఆర్థిక, న్యాయ, మానవ సంబంధాలకు సంబంధించిన, వరుసలకు చెందిన కొన్ని సామెతలు జనం అనుభవాలసారాలుగా ఎలా వ్యవహారంలో ఉన్నాయో పరిశీలిద్దాం.
      రామాయణ, మహాభారత సంబంధిత కథలు తెలంగాణ జానపదుల్లో విశేషంగా ప్రచారంలో ఉన్నాయి. రాముడు అడుగు పెట్టని నేల, సీత బట్టలు ఆరేయని స్థలం కనబడదు. ఈ కావ్యాలు, పురాణగాథలకు సంబంధించి అనేక సామెతలు ప్రచారంలో ఉన్నాయి. ‘శ్రీరాముడి కోతుల్లో బోడ కోతిలా’ అనేది ఓ సామెత. అంటే రామదండులో ఉన్న వేల కోతుల్లో ఓ కోతిలాంటి పరిస్థితి. తనకు ప్రాముఖ్యత లేనప్పుడు ‘నా సంగతి శ్రీరామకోతుల్లో బోడకోతిలా అయిపోయింది’ అని వాడుతుంటారు. కోటిలో ఒక్కడిగా కాకుండా కోటికొక్కడిగా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కోటిలో ఒక్కడైపోయాడన్న ప్రాధాన్యం లేని విషయాన్ని ఈ సామెత తెలుపుతుంది. ‘వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి’ అనేది మరో సామెత. తెలంగాణలో దసరా పండగకు తప్పకుండా ప్రతి కుటుంబమూ గారెలు చేసుకుంటుంది. గారెలంటే బియ్యపు పిండిలో పెసర, బొబ్బెర లేదా శనగపప్పు వేసి కలిపి చేసేవి. ముద్దగారెలు కూడా చేస్తారు. పచ్చిలేత మొక్కజొన్న విత్తులతో మక్కగారెలూ వండుతారు. గారెలు తింటే ఎంత రుచిగా ఉంటుందో భారతం విన్నా చెవులకు అంత విందుగా ఉంటుందని భావిస్తారు. ‘ఒక్కనాటి బాగోతానికి మూతిమీసాలు గొరుక్కున్నట్టు’ అనే సామెత ఒక్కరోజు బాగోతంలో వేషం వేయడానికి పెంచుకుంటున్న మీసాలను గొరుక్కోవడమేంటన్న దాన్నుంచి వచ్చింది. తాత్కాలిక అవసరం కోసం శాశ్వతంగా ఉండాల్సిన దానిని పోగొట్టుకోవడం మంచిది కాదు అనే ఉద్దేశంలో ఈ సామెత పుట్టింది.
అంబలి తాగే తాసీల్దారుకు...
తెలంగాణ భాషపై, సమాజంపై ఉర్దూ ప్రభావం ఎక్కువ. సంస్కృతి మీద ముస్లిం సంస్కృతి ప్రభావమూ ఉంది. తెలుగు సమాజంలోని ఈనాటి ఆంధ్రప్రదేశ్, ఇతర తెలుగు ప్రాంతాలు బ్రిటిష్‌ పాలనలో ఉంటే, తెలంగాణ అయిదారు వందలేండ్లుగా ముస్లింరాజుల పరిపాలనలో ఉంది. తద్వారా తెలంగాణ వాడుకభాషలో ఉర్దూ పదాలు కలగలిసిపోయాయి. ఇది ఉర్దూ అని విడదీయలేనంతగా మిశ్రమం చెందాయి. ఆ ప్రభావం తెలంగాణ సంస్కృతి, చరిత్ర, భాష, సాహిత్యాలపై పడింది. ఆ ప్రభావంలోంచే కొన్ని సామెతలుగా వాడుకలోకి వచ్చాయి.
      ‘అలిగిపోయిన అలీసాబ్‌ పిలువబోయిన పీర్‌సాబ్‌ అటే’- తెలంగాణలో సర్‌కు బదులు అధికారులను సాబ్‌ అని సంబోధించే వాళ్లు. ముస్లిం అధికారులనైతే తప్పనిసరిగా అలాగే పిలిచేవారు. అలా ఊళ్లోకొచ్చిన ఓ అధికారి అలీయే సామెతలోని అలీసాబ్‌. ఆ అధికారి అలిగిపోతే అతన్ని పిలవడానికి మరో వ్యక్తి పీర్‌సాబ్‌ వెళ్లాడు. ఎంతసేపైనా ఇద్దరూ తిరిగి రాలేదు. ఒకతన్ని పిలవమని ఇంకోకతణ్ని తోలితే అతడూ పత్తా లేకుండా పోవడాన్ని ఇలాంటి సామెతల ద్వారా వ్యక్తం చేస్తారు. ‘అంబలి తాగే తాసీల్దారుకు మీసాల్లేపే మాలూకదార్‌’ అనే సామెత కూడా నైజాం పాలన కాలంలో వచ్చిందే. తెలంగాణ సామెతలు నర్మగర్భితంగా కాకుండా సూటిగా ఉంటాయి. నైజాం కాలంలోని భూస్వామ్య వ్యవస్థలో ఉళ్లో దొరలు జమీందార్లుగా, దేశ్‌ముఖ్లుగా ఉండేవారు. వాళ్ల పనులన్నీ పాలేర్లు, వెట్టిపని వాళ్లే చేసేవారు. ఈ పెద్దలకు అభిజాత్యముండేది. దొర చుట్ట తాగుతుంటే అది కాలిపోయి మీసాలు కాలుతున్నా తీసేవాడు కాడు. పాలేరును పిలిచేవాడు. ఆ పని పాలేరే చేయాలి. అయితే పై సామెత ముస్లింల రాచరికం తగ్గింతర్వాతి స్థితిని తెలుపుతుంది. తాసీల్దారు పరిస్థితే అంబలి తాగే స్థితిలో ఉందంటే ఆ అంబట్లో మీసాలు తడవకుండా లేపి పట్టుకోవడానికి మరో అధికారి కావాల్సి వచ్చిందని వ్యంగ్యంగా చెప్పే సందర్భం. ఇలాంటి సందర్భాల నుంచే ‘పాపమని పచ్చిపులుసు పోత్తె - నేతిబొట్టు లేదని లేసిలేసి ఉరికిండట’, ‘పేదోనికి గోధుమరొట్టె అద్దుక తినుటానికి ఆవు నెయ్యి...’ లాంటి అనేక సామెతలొచ్చాయి.
మాగికాలం కైకిలి
ఆధునికత, యంత్రాలు తెలంగాణలో ప్రవేశించక ముందు రైతులు ప్రకృతితో నడిచేవారు. సమయాన్ని చూరు నీడలు, పందిరి గుంజల ఆధారంగా లెక్కించేవారు. చుక్కపొద్దు, మూలచుక్క, గోరుకొయ్యలు లాంటి వాటితో రాత్రి సమయాన్ని జాముల్లో లెక్కించేవారు. కోడికూతతో, కాకుల అరుపులతో తెల్లవారుతుందని తెలుసుకునేవారు. పశువుల గమనాన్ని, పక్షుల అరుపులను బట్టి వాన రాకడను, కరువులను గుర్తించేవారు. ఈ అనుభవాల్లోంచి అనేక సామెతలు పుట్టాయి.
      ‘వానరాకడ పానం బోకడ తెలువది’ అనేది ఓ సామెత. ఎంత జ్ఞానమున్నా, ఏం చేసినా వాన ఎప్పుడొస్తుందో అలాగే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదనే తాత్వికతలోంచి ఈ సామెత పుట్టింది. ఇలాంటిదే ‘ఇతూల్ల ఇంట్ల రేపుమంట్లె’ అనే సామెత. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదని దీని భావం. ‘మాగికాలం కైకిలి మరువక సెయ్యాలె..’ అనేది మరో సామెత. మాగి కాలమంటే ‘చలికాలం’. చలికాలంలో కైకిలి (కూలికి పోవడం) తప్పకుండా చేయాలని గ్రామీణులు భావిస్తారు. దీనికి కారణముంది. కూలిపనికి పోవడానికి అప్పట్లో గడియారాలు లేవు. పొద్దున లేచి పనులన్నీ తీర్చుకొని, భోజనం చేసి ‘అంబటాల్ల’ దాటిన తర్వాత పనికి పోయేవారు. పొద్దుగూట్లో పడేంత వరకు పని చేసి తిరిగొచ్చేవారు. చలికాలం రాత్రి ఎక్కువగా ఉంటుంది. పగలు తక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో ఏడు గంటలకే సూర్యాస్తమయమైతే చలికాలంలో అయిదు గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. అంటే రెండు గంటలు తక్కువ. కూలి అంతే. తక్కువ సమయం పనిచేయడం వల్ల రోజుకూలి అంతే వస్తుంది కాబట్టి మాగి (చలికాలం) కైకిలి మరువక చెయ్యాలె అనే సామెత వచ్చింది. ఇలాంటి అర్థవంతమైన ఎన్నో సామెతలు తెలంగాణ సమాజంలో వాడుకలో ఉన్నాయి.
      ‘మృగశిర చినుకు- మగ ఉరుము..’ అనే సామెతుంది. వర్షాకాలం ఆరంభం మృగశిర కార్తితో ప్రారంభమవుతుంది. మృగశిర కార్తి ప్రవేశించిన రోజు నాలుగు చినుకులు పడ్డా సరే ఆ సంవత్సరం మంచి వర్షాలు పడతాయని జానపదుల నమ్మకం. అలాగే మఖ (మగ) కార్తిలో ఉరుములతో కూడిన వర్షాలుంటాయి. వర్షాల కంటే మఖ కార్తిలో ఉరుములే ఎక్కువ. పుబ్బ కార్తిలోనైతే బాగా వర్షాలు పడతాయన్న నమ్మకం. అంటే ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరిగితే మంచిదని జానపదుల నమ్మకం. ‘అస‌లెట్ల‌ ముసలెడ్లు రంకెలేత్తయి’ అనేది మరో సామెత. ఇది రైతు జీవితానుభవంలోంచి వచ్చిన మంచి మాట.
      ఆశ్లేష కార్తిని తెలంగాణలో అసలేరంటారు. ఈ సమయంలో ముసలిఎడ్లు కూడా రంకెలేస్తూ బలంగా ఉత్సాహంగా ఉంటాయని భావం. ఎందుకంటే ఎండాకాలంలో రోహిణి చివరి వరకు కూడా విపరీతమైన ఎండలుంటాయి. పశువులకు మేత కూడా కరవే. పచ్చగడ్డి అసలే దొరకదు. ఎండుగడ్డిని, చొప్పను మేతగా వేస్తారు. పశువులన్నీ వేసవిలో బక్కపడతాయి. మృగశిరలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఆరుద్ర కార్తెలో ఎక్కువవుతాయి. భూమి పచ్చదనం అద్దుకుంటుంది. తర్వాత వచ్చే ఆశ్రేష కార్తిలో పచ్చగడ్డి పశువులు మేసే స్థితికి ఎదుగుతుంది. ఆ గడ్డిని తిని పశువులు బలంగా తయారవుతాయి. అలా ముసలి ఎడ్లు కూడా రంకెలేస్తూ పరుగెత్తే స్థితిలో కొస్తాయన్న భావనలోంచి ఈ సామెత పుట్టింది. ఇది వాస్తవం కూడా.
      ‘ఎండల్ల ఏకులడుకుడు వానల్ల వడ్లు దంచినట్టు’, ‘గాలచ్చినప్పుడే తూర్పారబట్టాలె’, ‘ఈనగాసిన చేనును నక్కల పాల్జేసినట్టు’, ‘ముప్పయారు రోగాలకు మందు సురుకువెట్టుడే’..  ఇలా వ్యవసాయ సంబంధమైన అనేకమైన అర్థవంతమైన సామెతలు తెలంగాణ సమాజంలో వాడుకలో ఉన్నాయి, వ్యవసాయం ప్రకృతితో ముడివడి ఉంది కాబట్టి సంబంధిత పదబంధాలు, సామెతలు పరస్పరాశ్రితాలుగా ఉంటాయి.
పురుషస్వామ్యానికి ప్రతీకలు
తెలంగాణ సమాజంలో అణగారిన (బహుజన) కులాల సంఖ్య మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కువే అయినా మిగిలిన దేశంలోలాగా పురుషస్వామ్యమే రాజ్యమేలుతుంది. ఈ పురుషస్వామ్య కోణంలోంచే స్త్రీ పురుష సంబంధాలు, తద్వారా కొన్ని సామెతలు వాడుకలో ఉన్నాయి. ఈ సామెతల్లో స్త్రీని పురుషుడి కంటే తక్కువ స్థాయిలో చూపడం కనిపిస్తుంది. మాతృసామ్య వ్యవస్థ స్థానంలో పితృస్వామ్యం వచ్చిన కాలంలో ఇలాంటి సామెతలు పుట్టి ఉంటాయి.
      ‘ముప్పైఆరు జుట్లు కలిసుంటయి కాని మూడు శిఖలు కలవయి’ అనేది బాగా వాడుకలో ఉన్న సామెత. ముప్పయిఆరు మంది పురుషులు (జుట్లు అంటే జుట్టు ఉన్నవాళ్లు. నడితలపై పొడవుగా వెంట్రుకలుంచుకునేవారు ఒకప్పుడు) కలిసుంటారు కాని ముగ్గురు స్త్రీలు కలిసుండరనేది దీని సారాంశం. స్త్రీలలోని అనైక్యతను చెప్పే మాట. ఇందులోని వాస్తవం మాటెలా ఉన్నా ఇది పురుషస్వామ్యానికి ప్రతీక. ‘అత్త కొట్టిందని కాదు కాని యారాలు నవ్విందని’ అన్నది మరో సామెత. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అన్నదమ్ములందరూ కలిసుండేవారు. ఇంటికి అత్త పెత్తనముండేది. మామూలుగానే అత్తాకోడళ్ల మధ్య, తోడికోడళ్ల నడుమ చిన్న చిన్న తగవులుండేవి. కొట్లాడుకునేవారు. అలా అత్త కొట్టినందుకు కాదు ఆవిడ దుఃఖం, తన తోడి కోడలు (యారాలు) చూసి నవ్వినందుకని దీనర్థం. ‘యారాలు చిన్నదయితె పాలు చిన్నదయితదా..?’ లాంటి స్త్రీలకు సంబంధించినవే మరికొన్ని సామెతలూ ఇక్కడ వాడుకలో ఉన్నాయి. అలాగే, కులాలకు సంబంధించిన సామెతలూ వినపడతాయి. వీటిలో చిన్న కులాలను కించపరిచేవిగా కొన్నుంటే మరికొన్ని వృత్తి ఔన్నత్యాన్ని తెలిపేవీ ఉన్నాయి. కులాలను కించపరిచే సామెతలు భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న సమయంలో పుట్టి ఉంటాయి. ఇప్పుడవి అభ్యంతరకరమే.  
జీవితానుభవాల సారాలు
తెలంగాణ సమాజంలో, ఏ సమాజంలోనైనా న్యాయసంబంధమైనవి, మానవ సంబంధాలను ఉన్నతీకరించే సామెతలెన్నో ఉన్నాయి. ‘వానికష్టమంత గుట్టకు కట్టెలు మోసినట్టే’ అయింది అనేదో సామెత. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదన్నది దీనర్థం. కొందరి బతుకులిలాగే ఉంటాయని నిరాశ నిస్పృహలతో అన్న మాటలివి.
      ‘నలుగురున్నకాడ న్యాయమున్నదంటరు’, ‘దిక్కులేనోనికి దేవుడే దిక్కు’, ‘ఇచ్చుకున్నోడు ఈగ, పుచ్చుకున్నోడు పులి’ లాంటి సామెతలూ ఇక్కడ వినిపిస్తాయి. అన్నదమ్ముల మధ్యనో, పక్కవారితోనో, భార్యాభర్తల మధ్యనో.. సమస్యలు వచ్చినప్పుడు నలుగుట్లో పడక తప్పదు. తమ మధ్య పరిష్కారం కానప్పుడు పంచాయితీలు తప్పవు. నలుగుట్లో పడటమంటే పంచాయితీ పెట్టుకోవడమే. అక్కడ పెద్ద మనుషులు చర్చించి న్యాయం చేస్తారని నమ్మకం. ఒకప్పుడు ఊళ్లలో ఇలాంటి పంచాయితీలే రోజూ ఉండేవి. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ని జ్ఞాపకం చేసుకోవడం మామూలు విషయమే. ఏ దిక్కు లేనోనికి దేవుడే దిక్కన్న ఆశావహ దృక్పథం నుంచి ఈ సామెత పుట్టింది. ఇక బాకీలు తీసుకునేటప్పుడున్న మంచితనం తీర్చేటప్పుడుండదు. తన డబ్బు పరుల చేతుల్లోకి పోయింతర్వాత దాన్ని రాబట్టుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. తీసుకున్నోనిదే పైచేయి అవుతుంది. అలా ఇచ్చుకున్నోడు ఈగగా మారిపోతే, పుచ్చుకున్నోడు పులిలా తిరుగుతుంటాడు. 
      ‘దుడ్డున్నోనిదే బర్రె అన్నట్టు’, ‘నియతున్నోనికే బర్కతుంటది’, ‘రోలువొయ్యి మద్దెలతోని చెప్పుకున్నట్టు’.. ఇలా మానవసంబంధాలను, కాలగమనాన్ని న్యాయసంబంధమైన విషయాలను తెలిపే సామెతలు కోకొల్లలు. అంతేకాకుండా మానవ జీవితానుభవాల సారాలు అనదగే సామెతలెన్నో తెలంగాణ సమాజంలో వాడుకలో ఉన్నాయి. ‘అప్పులేనోడే అసలైన ధనికుడు’, ‘గొంగట్ల తినుకుంట ఎంటికలేర్తనంటెట్ల?’, ‘ఎంటికలున్న కొప్పు ఎటుమడ్సిని అందమే’, ‘తవ్వడిచ్చినోడు తంగెలు పీకమంటే పీకాలె’, ‘సచ్చినోని ముడ్డి ఎల్లెలుకలైతేంది; బోర్లబొక్కలైతేంది?’ లాంటివి అలాంటివే. 
      అప్పు ప్రమాదకరం. అప్పుల పేరు మీద వడ్డీకి పావుశేరన్నట్టు వసూలు చేసేవారు. స్వల్పమైన అప్పుకు భూములు, ఆస్తులు కోల్పోయినవారు, వెట్టివాళ్లుగా బతికిన వారు తెలంగాణ సమాజంలో ఉన్నారు. ధనవంతుడెవరంటే పైసా అప్పులేనివాడే అన్నది ఇలాంటి అనుభవాల్లోంచి వచ్చిందే. అప్పు ఎప్పుడైనా ఎక్కడైనా ముప్పే. కాని మన జానపదులకున్న జ్ఞానం ప్రభుత్వాలకు లేదా? మన ప్రభుత్వాలు అప్పులు చేయకుండా పరిపాలన సాగించలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. దేశాన్నే తాకట్టుపెడుతున్నాయి.
      లోపభూయిష్ఠమైన సమాజంలో బతుకును వెళ్లదీస్తూ ఆ దుష్ఫలితాలు తనను తాకకూడదనుకోవడం వృథా అనే అర్థాన్నిచ్చే సామెత ‘గొంగట్ల తినుకుంట ఎంటికె లేర్తనంటెట్ల?’. గొంగళంటేనే వెంట్రుకల (బొచ్చు)మయం. దాంట్లో అన్నం తింటున్నప్పుడు ఆ గొంగలి వెంట్రుకలు అన్నంలో రాకుండా ఉండవు కదా! ఇక బాగా వెంట్రుకలుంటే ఆ కొప్పును ఎంత అందంగానైనా ముడుచుకోవచ్చు, మలచుకోవచ్చు. చేతినిండా డబ్బుంటే, మంచి అవకాశాలుంటే ఏమైనా చేయగలుగుతాం అనే విషయాన్ని తెలిపే సామెత ఇది. డబ్బు (జీతం, కూలి) తీసుకుంటున్నప్పుడు యజమాని చెప్పిన పని చేయాల్సిందే అనే భావంలోంచి ‘తవ్వగిచ్చినోడు తంగెల్లు పీకమంటె పీకాలి’ అనే సామెతొచ్చింది. చనిపోయిన తర్వాత ఎలా పడుకోబెడితే మాత్రమేం అనేది సచ్చినోని.. సామెతకర్థం. చచ్చేదాక నిర్లక్ష్యం చేసి చనిపోయిన తర్వాత కర్మ ఘనంగా చేస్తే ఒరిగేదేముంది!
      ‘పలుగురాళ్ల మీద పల్లేరుగాతల పందిరి’, ‘బర్రెకు మ్యాతేసి గాడిదకు పాలుపిండినట్టు’, ‘తన మొకం బాగలేక అద్దం నేలెకు గొట్టినట్టు’, ‘మంది మాటలు విని మారుమానం బొయినట్టు’, ‘పుట్టని బిడ్డ బారెడుండె నన్నట్టు’.. ఇలా జానపదుల, తెలంగాణ ప్రజల అనుభవాల సారంగా వేలాది సామెతలు తెలంగాణలో వాడుకలో ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా గ్రామీణ జీవన సౌరభాన్ని తెలిపేవిగా ఉండటం విశేషం. పట్టణ జీవిత అనుభవాల నుంచి వచ్చిన సామెతలు అతి స్వల్పం. ఈ సామెతలతో పాటు తెలంగాణలో ‘ఆగమాగమయింది, బతుకుదెరువు లేకుంటయింది, మందమీద తోడేలు వడ్డట్టు, చెప్పెత్తే కుండ తాకది’ లాంటి వేల సంఖ్యలో పదబంధాలున్నాయి. లక్షపదాలతో నిఘంటువును తయారు చేయగలిగేంత జీవద్భాషా సంపదుంది. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్నిచ్చే ఈ పదసంపదనంతా పుస్తకాలకెక్కించి భావితరాలకు అందించడం నేటి చారిత్రకావసరం.


వెనక్కి ...

మీ అభిప్రాయం