పిల్లా పెద్దా... ఆడేద్దాం పులీమేకా!!

  • 772 Views
  • 1Likes
  • Like
  • Article Share

వేసవొస్తే, సెలవులొస్తే.. నలుగురు స్నేహితులని వెంటపెట్టుకొని నాలుగు చింతపిక్కలు అరగతీసుకొని, విరిగిన గాజు ముక్కలనే నప్పులుగా పెట్టుకొని ఇష్టంగా ఆడిన అష్టాచమ్మా ఒకప్పటి బాల్యానికి అందమైన చిరునామా. మొబైళ్లు, టాబ్‌లు, పీసీల్లో... క్యాండీక్రష్‌లు, టెంపుల్‌రన్‌లు, సబ్‌వే సర్ఫర్‌లతో గడచిపోతున్న ఇప్పటి ఒంటరి బాల్యానికి వాటి గురించి చెబితే అర్థం కాదు. అందుకే మనవైన తెలుగు ఆటల్ని పరిచయం చేసి చూపిస్తే మేలనుకొన్నారు యువ వైద్యురాలు ‘రమ్య సూరపనేని’. ‘స్పర్థగేమ్స్‌’తో పేరుతో ఒకప్పటి మన ఆటల్ని తిరిగి ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. తన ప్రయత్నానికి స్ఫూర్తి, నేపథ్యం, అనుభవాలను ‘తెలుగు వెలుగు’తో పంచుకున్నారిలా...
మా తాతగారిది
కృష్ణా జిల్లా నిమ్మకూరు. చాలా ఏళ్ల కిందటే మా కుటుంబం అక్కడి నుంచి వచ్చేసి... ఆదిలాబాదు జిల్లా మంచిర్యాలలో స్థిరపడింది. ఇంటర్మీడియెట్‌ వరకూ విజయవాడలోనూ, ఆ తర్వాత బీడీఎస్‌ (దంతవైద్యం) ఖమ్మం మమత వైద్య కళాశాలలో చదివా. వైద్య విద్య పూర్తిచేసి, క్షణం తీరిక లేని ఈ వృత్తిలో స్థిరపడేవరకూ... నా చిన్నతనమంతా ఆటల మధ్యే ఎక్కువగా గడిచిపోయింది. అదీ మన తెలుగు ఆటల మధ్యే! నాకు మూడేళ్లున్నప్పుడు మా నాన్నగారు ఓ ప్రమాదంలో చనిపోయారు. నాన్న లేని లోటు తెలియకుండా ఉండటానికి... నన్ను ఆడిస్తూ ఆనందంగా ఉంచడానికి.... నాతో ఎక్కువ సమయం గడిపేవారు తాతగారు. ఆయనకేమాత్రం తీరిక ఉన్నా ‘రా ఇద్దరం కలిసి దాడి ఆట ఆడుకుందాం’ అని పిలిచేవాళ్లు. వీధి అరుగుమీదో, చావిట్లోనో కూర్చుని అలా గంటల తరబడి ఆడుకునేవాళ్లం. మా అమ్మా, పిన్నులూ, అత్తయ్యలూ ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా అష్టాచమ్మా ఆడేవాళ్లు. నేనూ వాళ్లతో కలిసేదాన్ని. తాతయ్య తమ్ముళ్లందరూ కలిసినప్పుడు.... వామనగుంటలూ, ఇప్పటి లూడోను పోలిన పచ్చీస్‌ ఆటలు ఆడేవాళ్లు. బంధువులు వచ్చినా, మేం వాళ్ల ఇంటికి వెళ్లినా ఎవరి మానాన వాళ్లు ఇప్పటిలా టీవీ చూసుకొంటూ గడిపేవాళ్లం కాదు. సుద్దముక్కతో అక్కడికక్కడే గీతలు గీసుకుని చక్కగా ఆ ఆటలన్నీ ఆడుకునేవాళ్లం. ఓడిపోయినప్పుడు ఉడుక్కోవడం, గెలిచినప్పుడు సంబరపడటం... కొన్ని సార్లు తొండి, దొంగాట అంటూ గొడవలు పడటం... ఇలా సందడే సందడి!
ఓటమి మంచిదే..
అలా ఆటల్లో ఎదురైన ఓటములు, నా చదువుల్లో చాలాసార్లు ఉపయోగపడ్డాయి. ర్యాంకులు రానప్పుడు తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోకుండా ఓటమి మామూలేగా... మళ్లీ గెలవొచ్చుగా అని ధైర్యం తెచ్చుకునేదాన్ని. కానీ ఈతరం వాళ్లు అలా కాదు. మంచి ర్యాంకు రాకపోతే చాలు... ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి పిల్లలయితే పార్కులకు వచ్చినా, ఇంట్లో ఉన్నా... ఎవరితోనూ కనీసం మాట్లాడకుండా, ఒంటరిగా కూర్చొని సెల్‌ఫోనుల్లో ఆటలు ఆడుకుంటూ గడిపేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆ సెల్‌ఫోన్‌ నుంచి వచ్చే నీలి వెలుతురు నిద్రని పాడుచేస్తుంది. వీడియోగేముల్లో హింస, వేగం ఎక్కువగా ఉంటాయి. మెదడుకి ఎక్కడా పని ఉండదు. పైగా ఈ ఆటల్లో ఎక్కడా ఓడిపోవడమంటూ ఉండదు. దానివల్ల పిల్లలు నిజంగా ఓటమి ఎదురైతే తట్టుకోలేకపోతున్నారు. 
వారధి కడితే...
భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతారు. వాళ్లకు పిల్లలతో మాట్లాడే సమయం ఉండదు. ఇక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల గురించి ఏం ఆలోచిస్తారు! ఆ పెద్దలకేమో ఎవరితోనైనా మనసువిప్పి మాట్లాడాలని ఉంటుంది. వాళ్ల అనుభవాలను ఎవరితోనైనా పంచుకోవాలని ఉంటుంది. పిల్లలైనా వాళ్ల ‘మాట’ వింటారనుకుంటే... వీడియోగేముల్లో మునిగిపోతున్నారు! అదే ఈ ఇద్దరికీ కలిపి ఓ వేదిక ఉంటే? చదరంగం, వామనగుంటలూ, పులీమేకా, పచ్చీస్, దాడి వంటి మన తెలుగు ఆటలు ఈ అవకాశం కల్పిస్తాయి. వాటిని పిల్లలూ, పెద్దలూ కలిసి ఆడుకోవడం వల్ల చిన్నారులు మేధోపరంగా ఎదుగుతారు. తోటి మనిషితో మాట్లాడగలుగుతారు. అందుకే కనీసం నాకు తెలిసిన వాళ్లకైనా ఈ ఆటలను కానుకగా ఇద్దామని ఈ తరహా బోర్డ్‌గేమ్స్‌ కోసం చాలా చోట్లకి తిరిగాను. కానీ ఎక్కడా దొరకలేదు. దొరికినా ప్లాస్టిక్‌లో ఉన్నాయి. అనుకొన్నంత బాగా లేవు. వైకుంఠపాళి లాంటివి దొరికినా అవి నలుపు తెలుపు కాగితాల్లో పల్చగా పట్టుకొంటే చిరిగిపోయేట్టుగా కనిపించాయి. దాంతో ఆ ఆటవస్తువులను అందంగా, హుందాగా అందించాలనే ఆలోచన వచ్చింది. ఎప్పటికీ పాడవ్వకుండా... కానుకలుగా ఇచ్చుకొనేలా టేకు చెక్కతో అందించాలనుకున్నా. అలా ఏడాది కిందట ‘స్పర్థగేమ్స్‌’ ప్రారంభమైంది. యాభైవేల రూపాయల పెట్టుబడి, ఇద్దరు పనివాళ్లతో వీటి తయారీ మొదలుపెట్టా. మొదట్లో అందరికీ తెలిసిన చదరంగం బల్లనీ చేసేవాళ్లం. ఆ తర్వాత పచ్చీస్‌. దీనిని వస్త్రంతో చేయాలి. వీటిని జర్దోసీ, ఎంబ్రాయిడరీ పని తెలిసిన గృహిణులకు ఇచ్చి కాటన్, సిల్క్‌ల మీద జర్దోసీతో ఈ పచ్చీస్‌ ఆటలను తయారుచేసేవాళ్లం.
సీతాదేవి ఆడిన వామనగుంటలు
ఆటవస్తువులను తయారుచేయాలంటే వాటి మూలాల గురించి తెలుసుకోవాలి కదా! కొంతవరకూ ఆ అధ్యయనం చేశాను. తెలిసిన పెద్దవాళ్లను కలిసి మాట్లాడాను. మన తెలుగు ఆటల్లాంటివి భారతదేశమంతా ఉన్నాయి. అయితే... ప్రాంతానికి ప్రాంతానికి మధ్య ఈ ఆటలు ఆడే విధానాల్లో చిన్నపాటి తేడాలు కనిపిస్తాయి. బేలూరులోని చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో 20 రకాల పురాతన బోర్డుగేములు కనిపించాయి. అలాగే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ మహాలక్ష్మీ ఆలయంలోనూ ఆసక్తికరమైన ఆటల ఆనవాళ్లు లభించాయి. ఒడిశా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, వారణాసి, బాదామీ, ఐహోళె, పట్టడకల్‌లలో ఇలాంటి బోర్డుగేములు చాలా కనిపించాయి. వామనగుంటలైతే... ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన ఆట. ఇలాంటి సంప్రదాయ ఆటలు మన దేశంలోనే కాదు, గ్రీసులోనూ ఎప్పటి నుంచో ఉన్నాయి. అక్కడ ఓ ప్రాచీన దేవాలయంలో తవ్వకాలు జరిపినప్పుడు మొత్తం 50 రకాల బోర్డుగేములు బయటపడ్డాయి. అందులో మన చదరంగాన్ని పోలిన పెంటాగ్రాన్‌ ఉంటుంది. చదరంగాన్ని ఇద్దరు ఆడితే ఇందులో అయిదుగురు ఒకేసారి ఆడతారు. అప్పట్లో ఈ ఆటలను రాజులు తమ మేధోసంపత్తిని పెంచుకోవడానికి ఎక్కువగా ఆడేవారు. అంతెందుకు సీతాదేవి కూడా వామనగుంటలు ఆడిందనే రామాయణ కథలు ఉన్నాయి.
      మేం తయారు చేసిన ఆటవస్తువులకు మొదట్లో పెద్దగా ఆదరణ లేదు. కానీ క్రమంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో అబ్బాయి తరఫువాళ్లు అమ్మాయికి పచ్చీస్‌ ఆటను కానుకగా ఇస్తారు. అందుకే పెళ్లి మంటపాల్లో వీటిని పరిచయం చేసేవాళ్లం. అందమైన జర్దోసీతో, సిల్క్‌తో చేసిన ఈ ఆటవస్తువులను కానుకలుగా అందించడానికి ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఆచార్యులొకాయన తన విద్యార్థులకు వీటిని కొనివ్వడం చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం అష్టాచెమ్మా, వామనగుంటలు, పులీమేకా, దాడి, పచ్చీస్, వైకుంఠపాళీ, చదరంగం తదితర ఆటవస్తువులను తయారు చేస్తున్నాం. అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మావారు డాక్టర్‌ పాండురంగాచారి. ఆయన కూడా దంతవైద్యులే. నా ప్రయత్నానికి ఆయన మద్దతూ తోడైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులొకరు ఈ ఆటలంటే తనకు చాలా ఇష్టమని... మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఆడుకుంటూ ఉంటానని చెప్పారో సారి. ఇలాంటి స్పందనలెన్నో!  ఎంతైనా... మన ఆటలు మన ఆటలే! ఆనందానికి ఆనందం... విజ్ఞానానికి విజ్ఞానం. కాదంటారా!


వెనక్కి ...

మీ అభిప్రాయం