సజీవరూప శిల్పి

  • 440 Views
  • 3Likes
  • Like
  • Article Share

కొందరు ఇంటిపేరుతో చెలామణి అయితే మరి కొందరు సొంతపేరుతో ప్రసిద్ధులవుతారు. కేశవరెడ్డి (1946 మార్చి 10- 2015 ఫిబ్రవరి 13) సొంతపేరే అందరికీ తెలుసు. ఆయన ఇంటిపేరేమిటి అన్న ఆలోచన ఆయన అభిమానులకే కాదు మిత్రులకూ పట్టలేదు. చిత్తూరు జిల్లా తలపులపల్లిలో జన్మించినా ఉద్యోగరీత్యా ఎక్కువకాలం ఆయన నిజామాబాదు డిచ్‌పల్లిలోనే గడిపారు. వృత్తిరీత్యా వైద్యుడైనా కేశవరెడ్డి రచయితగానే ప్రసిద్ధుడు. అలాగని ఆయన వృత్తిలో తక్కువవాడేమీ కాదు. తన వైద్య వృత్తితో పాటు శాస్త్రీయ విషయాల్లో కూడా ఆయనకు అపారమైన అభినివేశం ఉండేది. విజ్ఞాన సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. శాస్త్ర విషయాల రచయితగా ఆయనకు పేరుండటమే కాదు ఓ ప్రసిద్ధ సైన్స్‌ పత్రిక ఆయన ముఖచిత్రాన్నే ప్రచురించింది.
      ఆయన బాల్యం గడిచిన రాయలసీమ ప్రాంతమే ఆయన రచనలకు ఇతివృత్తం, నేపథ్యం. ఇందుకు ప్రధాన కారణం తనకు బాగా తెలిసిన జీవితాన్నే చిత్రించాలన్న నిబద్ధతే కావచ్చు. ఆయన సాహిత్యం అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకున్నా ఆయన ఎన్నడూ ఏ సాహిత్య ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవారు కాదు. సాహిత్య వివాదాల జోలికెళ్లకుండా నిశ్శబ్దంగా తన సృజనాత్మక వ్యాపారానికే పరిమితమయ్యారు. అలాగని సిద్ధాంత ప్రాతిపదిక లేదనలేం. సోషలిజం మాత్రమే మానవాళికి అంతిమంగా విముక్తి కలిగిస్తుందని గట్టిగా నమ్మారు. సోషలిస్టు దేశాలు పతనమైనా, మనదేశంలో వామపక్ష పార్టీలు డీలా పడిపోయినా ఆయనకు సోషలిజం మీద విశ్వాసం సడలలేదు. ప్రపంచ వ్యాప్తంగా సోషలిజం ఎప్పుడో ఒకప్పుడు విజయ కేతనం ఎగురవేస్తుందన్న సిద్ధాంత బలిమి కేశవరెడ్డిది. సాహిత్య వివాదాల, సిద్ధాంతాల ఆవరణకు ఆవల ఆయనకు ఆశేష పాఠకాదరణ ఉంది. 
      ఆయన రచనలు వాస్తవ జీవితానికి ప్రతిబింబాలే కాదు అన్యాపదేశంగా మార్గదర్శకాలు కూడా. తాను చూపదలుచుకున్న మార్గాన్ని వాచ్యం చేసేటంతటి బలహీనుడు కాదు కేశవరెడ్డి. అందుకే ఆయన నవలలన్నీ అమితాదరణకు నోచుకున్నాయి. ఆయన నవలలు విస్తృతమైనవి కాదుగానీ వాటిలోని సౌందర్యాత్మకత బలీయమైంది. పాఠకుడిని కట్టిపడేస్తుంది. వాస్తవ పరిస్థితిని ఆయన రచనలు ఎంత నిక్కచ్చిగా చిత్రిస్తాయో భవిష్యద్దర్శనాన్ని అంతే సొగసుగా రూపు కట్టిస్తాయి. తాను వైద్య విద్యనభ్యసించిన కాలాన్ని చిత్రించిన ‘సిటీ బ్యూటిఫుల్‌’, రామాయణంలోని బాలకాండలో ఒక ఉదంతాన్ని తీసుకుని రాసిన ‘మూగవాని పిల్లనగ్రోవి’ నవలలు తప్ప మిగతా ఆరు నవలలూ అణగారిన వర్గాల బతుకు చిత్రాలే. స్వేచ్ఛా భావన కేవలం అపోహేనంటాయి ఆయన రచనలు. చారిత్రకంగా, వ్యవస్థాపరంగా, సామాజికంగా మనిషికి అనేక నిగళాలున్నాయని ఆయన అంటారు. అయితే నిత్య పీడనకు గురవుతున్న అణగారిన వర్గాలలోని తిరుగుబాటు ధోరణిని వాస్తవిక దృక్పథంతో చిత్రించిన ఆయన నవలలు మనిషిలోని ఆశావాదానికి ప్రతీకలే. అస్వతంత్రుడైన మనిషి నిరంతరం స్వాతంత్య్రం కోసం పరితపించడాన్ని చిత్రించిన ఆయన రచనలు పురోగమన భావాలతో తొణికిసలాడుతుంటాయి.
      ఆయన ప్రసిద్ధ నవల ‘అతడు అడవిని జయించాడు’ రేడియో నాటకంగా విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈ రచనపై అమెరికా రచయిత ఎర్నెస్ట్‌ హెమింగ్వే రచన ‘ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ద సీ’ ప్రభావం ఉంది. ఈ మాట కేశవరెడ్డే అంగీకరించారు. ఈ నవల ఓ రోజు సాయంత్రంతో మొదలై మరుసటి రోజు పొద్దుపొడవడంతో ముగుస్తుంది. ప్రకృతిని జయించడానికి మనిషి పడే పాట్లు ఆర్ద్రంగా చిత్రించిన నవల ఇది. అడవి వాతావరణాన్ని రూపుకట్టించిన తీరు పాఠకాసక్తిని ఇనుమడింప చేస్తుంది. 
      ‘మూగవాని పిల్లనగ్రోవి’ నవల ఇంగ్లీషు అనువాదాన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించింది. అనువాదకుడు రచయితే. ‘ఇంక్రెడిబుల్‌ గాడెస్‌’, ‘శ్మశానం దున్నేరు’ నవలల్లో ఫ్యూడల్‌ సమాజం, కులవ్యవస్థ మానవాభ్యుదయానికి కల్పిస్తున్న నిగళాలను సమర్థంగా చిత్రిస్తాయి. ‘మూగవాని పిల్లనగ్రోవి’కి దెంచనాల శ్రీనివాస్‌ రంగస్థల రూపం ఇవ్వడం వల్ల మరింత ప్రచారం వచ్చింది. ఆయన నవలలన్నింటిలోనూ నవలకుండాల్సిన లక్షణాలన్నింటితో పాటు ‘కావ్యేశు నాటకం రమ్యం’ అన్న రీతిలో నాటకీయత అలుముకునే ఉంటుంది.
      ఆయన నవలల్లోని మన్నుగాడు, రంపాల రామచంద్రుడు, బైరాగి, అర్జునుడు పాఠకులకు చిరకాలం గుర్తుండి పోయేవే. కథలే కాదు పాత్రలూ గుర్తుండేట్లు మలచడంలో ఆయన చూపిన ప్రతిభ అతి కొద్దిమంది రచయితలలో మాత్రమే కనిపించే విశిష్ట లక్షణం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం