కడప గడపకు తెలుగు తోరణం

  • 1157 Views
  • 13Likes
  • Like
  • Article Share

    సి.శివారెడ్డి

  • సహాయ పరిశోధకుడు, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం,
  • కడప.
  • 9440859872
సి.శివారెడ్డి

కలమళ్లలో శిలాక్షరమైన ప్రాచీన తెలుగు... తాళ్లపాకలో జ్ఞానపథమైన జానపద తెలుగు... అంతా ఆ వసుధ వెలుగే! పెద్దన జిగిబిగి అల్లికలు... వేమన ఉపమానాలు... అన్నీ ఆ మట్టి మెరుపులే! ఒంటిమిట్ట కోదండరాముడు... నందలూరు బుద్ధుడు... దానవులపాడు తీర్థంకరుడు... అందరూ ఆ నేల వేల్పులే! బ్రహ్మం గారి మఠం... గండికోట దుర్గం... పుష్పగిరి ఆలయ సముదాయం... ‘సురభి’ నాటకం... బ్రౌను గ్రంథాలయం... అన్నీ జాతి వారసత్వ సంపదలే! అది కడప... దేవుని గడప!! అక్కడి ప్రజల తెలుగు పలుకులు... పంచదార పలుకులు.
‘దేహళిపుర’ పేరు విన్నారా?
వేదాంత దేశికుల ‘మాట’ ప్రకారం అదే కడప. ‘దేహళి’ అంటే గడప. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులు... ‘దేవుని గడప’లో ఉన్న ఆయన ప్రతిరూపాన్ని సందర్శించుకుని వెళ్లడం అప్పట్లో ఆనవాయితి. అందుకే ఈ ప్రాంతం తిరుమలకు తొలిగడప అయింది. గడపే క్రమేణా కడపగా మారిందంటారు! ‘దేవుని గడప’లోని వేంకటేశ్వరుడి విగ్రహాన్ని కృపాచార్యులు ప్రతిష్ఠించారు. దాంతో ఈ ప్రాంతం కృపానగరమైంది. ఈ ‘కృప’లోంచే ‘కరిగె, కరిపె’ అనే పేర్లు పుట్టి, చివరికి అవి కడపగా మారాయన్నది మరో వాదన! క్రీ.శ. రెండో శతాబ్దంలో ఇక్కడ పర్యటించిన ‘టాలమీ’ తన గ్రంథంలో ఈ ప్రాంతాన్ని ‘కరిగె’/ ‘కరిపె’గా పేర్కొన్నాడు. ఏది ఏమైనా... అన్నమాచార్యుల కాలానికే ఇది కడపగా స్థిరపడిపోయింది. ‘దేవుని గడప’ శ్రీనివాసుణ్ని కీర్తిస్తూ... ‘కాదనకు నా మాట కడపరాయ/ నీకు గాదె బోసె వలపులు కడపరాయ’ అన్నాడాయన. 
      రాయలసీమలోని మిగిలిన జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరుల భాష, ఆచార వ్యవహారాల్లో... తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల ప్రభావం కనబడుతుంది. అవి ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటం వల్ల ప్రజల మధ్య రాకపోకలు, వలసలు, వ్యాపారాలు సర్వసాధారణం. దాంతో ఆ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో మిశ్రమ వాతావరణాలు ఏర్పడ్డాయి. కడప జిల్లా మాత్రం దీనికి అతీతం. ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలన్నీ నాటి నుంచి నేటి వరకూ ‘స్వతంత్రం’గానే మనగలుగుతున్నాయి. కొద్దికాలం ‘మయానా నవాబు’ల పరిపాలనలో ఉండటం వల్ల కడప తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు మాత్రం వినపడతాయి. ఇక్కడి తెలుగులో కలిసిపోయిన ఉర్దూకు కొన్ని ఉదాహరణలు...
      ‘మల్లయుద్ధం’ వంటి క్రీడల్ని నేర్చుకునే స్థలాలను ఇప్పటికీ ‘తాళెం కొట్టం’ అని పిలుస్తుంటారు. దీనికి మూలం  ‘తాలింఖానా’. ‘ఏక్‌ దమ్మున అంత డబ్బు ఎక్కణ్నించి వస్తుంద’నే మాట ఇక్కడ వాడుకలో ఉంది. ఉర్దూ ‘ఏక్‌దమ్‌’ నుంచి ఈ ‘ఏక్‌ దమ్మున’ (ఉన్నట్లుండి ఒక్కసారిగా) వచ్చింది. లడాయికి పోయి కొంప మీదకు తెచ్చుకున్నాడు, వానితో పెద్ద తకరారుగా ఉంది, పది ఎకరాల జమాబంది మొత్తం ఇచ్చాడా? ఎవరి ఇలాకారా అబ్బీ?... ఇవన్నీ కడప తెలుగుతో ఉర్దూకు ఉన్న దోస్తీకి నిదర్శనాలే. లడాయి (గొడవ), తకరారు (వాదులాట), జమాబంది (పన్ను), ఇలాకా (సంబంధం)లతో పాటు కస్బా/ కసుబా (పెద్దస్థలం), కట్టవ (ఆనకట్ట), కర్బారు (వ్యవసాయం) లాంటి పదాలూ వినిపిస్తుంటాయి.
తెలుగులో తియ్యందనం
కడప తెలుగు ఉచ్చారణ కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ‘వాడు అక్కడికి వచ్చాన్యాడా?’ అంటారు. ‘వచ్చినాడా?’ అనేది అసలు రూపం. మరోవైపు ‘వచ్చిండాల్నే!’ అంటూ పై ప్రశ్నకు కొన్నిసార్లు సందేహార్థాన్నీ జతచేస్తారు. అంటే... ‘వచ్చే ఉండాలి కదా!’ అని అర్థం. ఇంతవరకూ ఏ విషయమూ తెలియలేదు అనే అర్థంలో ‘ఇంతవరకూ సుతిల్యా గతిల్యా’ అంటుంటారు. ఇక్కడ ‘ల్యా’ అంటే ‘లేదు’. కొన్నిపదాల మధ్య పూర్ణస్వరాన్ని చేర్చి పలుకుతారు. ఉదాహరణకు ‘ఇక’... ‘ఇంక’ అవుతుంది. ‘ఇంక పాండ్రా పోదాం’/ ‘ఆలస్యం అయ్యింది ఇంక పారా పోదాం’ అన్నవి ఇక్కడి సాధారణ ప్రయోగాలు. అన్నట్టు... ‘పాండి/ పాండ్రా’ అంటే ‘పదండి/ పదండ్రా’. అదే ‘పదరా’ దగ్గరికి వచ్చేసరికి ‘పారా’ అవుతుంది. 
      ‘ఆబువ్వ’, ‘ఆయి బువ్వ’లను తిన్నారా ఎప్పుడైనా? మరేమీ లేదు... ‘ఆబువ్వ’ అంటే వరి అన్నం. నెయ్యి కలిపిన అన్నమేమో... ‘ఆయి బువ్వ’! నెయ్యిని ఇక్కడ ‘ఆయి’ అంటారు. ‘నువ్వు వూరకే అర్సాకు’ అన్నదీ కడప పలుకే. అర్సాకు అంటే అరవకు! ‘కచ్చి’ అంటే కక్ష. సాధారణంగా ఎవరితోనైనా గొడవైతే కోపంలో ‘నీతో కచ్చి’ అని అంటూనే ‘ఖా’ (నీతో ఖా...) అనే శబ్దం చేస్తారు. ఎందుకంటే, ‘నీతో ఇక స్నేహం లేదు’ అని గట్టిగా చెప్పడం! ‘అమ్మాయిని అత్తారింటికి అంపియ్యాల’ (అమ్మాయిని అత్తారింటికి పంపాలి)... ‘దేవునిగుడి ఎదిరీకి ఉండే ఇల్లు మాది’ (గుడి ఎదురుగా ఉండే ఇల్లు మాది) ... ‘నాకు అన్నం కాబట్టదు’ (నాకు అన్నం తినడం ఇష్టం లేదు)... ‘దున్నడానికి కాడి దొరకాలంటే కసాలుగా ఉంది’ (దున్నడానికి వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంది)... ‘నాకు కూడా బంగి రేగిందంటే’ (నాకు కోపం వస్తే)...  ‘బెన్నేవస్తా’ (త్వరగా వస్తా)... ఇలా చెప్పుకుంటూ వెళ్తే కడప తెలుగులో కనిపించే, వినిపించే ప్రత్యేకతలెన్నో!
కడపలో మాత్రమే
ఒంటిమిట్ట ప్రాంతంలో ‘నాన్నకు నాన్న’... అదే తాతను ‘జేజినాయన’ అంటారు. పులివెందుల, పరిసర ప్రాంతాల్లో మాత్రం ‘అబ్బ’ అని పిలుస్తారు. ‘అబ్బ నాన్న’ను ‘ముదెబ్బ’ అని సంబోధిస్తారు. వయసులో చిన్నవాడైన మగపిల్లాణ్ని ‘అబ్బీ’ అని, ఆడపిల్లను ‘అమ్మీ’ అని పిలవడం జిల్లా అంతటా సాధారణం. అనంతపురంలో అబ్బికి బదులుగా ‘అప్ప’ అంటారు. వేరుశెనక్కాయల్ని ఈ ప్రాంతంలో ‘చెనక్కాయలు’ అంటే, కర్నూలు జిల్లాలో ‘బుడ్డలు’ అని పిలుస్తారు. డబ్బును ‘లెక్క’ అని పిలిచేది కేవలం కడప జిల్లాలోనే. చుట్టపక్కల ఉన్న సీమ ప్రాంతాల్లో... పశువులకు వేసే గడ్డిని ‘కసువు’ అని పిలుస్తారు. కానీ, కడప జిల్లాలో మాత్రం కసువు అంటే చెత్త. ‘చెత్తను శుభ్రం చేశావా’ అనే అర్థంలో ‘కసువూడ్చావా’ అంటుంటారు. ఇంకో మాట... ‘మెట్లు’ అంటే ఏంటి? కడపలో మాత్రం ‘చెప్పులు’! మరి అసలు మెట్లను ఇక్కడేమంటారో తెలుసా... ‘తాపలు’.
      ఎత్తైన భవనాలను ‘మాడీ’లంటారు. ‘మేడ’ అనే పదమే కడప జిల్లా వాడుకభాషలో ‘మాడీ’గా మారింది. ఇంటిలోపల తలుపులు తెరవకుండా అడ్డంగా రోకలి లాంటి పెద్ద కొయ్యను గోడ లోపలికి వెళ్లేట్లుగా అమరుస్తారు. దీనిని ఆ ప్రాంతంలో ‘గడిమాను’ అని అంటారు. గడియలాగా ఏర్పాటు చేసేది కాబట్టి ఇది ‘గడియమాను’. దీంట్లోంచే గడిమాను, గెడె తదితర పదాలు వచ్చాయి.
      ఈ జిల్లాలో మాత్రమే వినిపించే సామెతలూ ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి... ‘అడుగులోనే అరక విరిగినట్లు’! అరక అంటే ఎద్దులబండిని నడిపే వ్యక్తి కూర్చునే స్థలం. బండి అడుగు దూరం వెళ్లిందో లేదు ఈ అరక విరిగిపోయిందట! అంటే... ఇలా పని మొదలుపెట్టామో లేదో అలా ఆటంకం రావడం. మరో సామెత... ‘అడుక్కునే వానికి అంతా వరికూడే! ఇక్కడ ‘వరికూడు’ అని ప్రత్యేకించి అనడానికి కారణం... ఈ ప్రాంతంలో కొర్రలతో, సజ్జలతో కూడా అన్నం వండుకుంటారు. ‘గడార్లు గాలికి పోతాంటే అప్పడాల గతి ఏమాయె?’... ఇక్కడ తరచుగా వినపడే సామెతల్లో ఇదీ ఒకటి. గడ్డపార/ గునపాన్నే స్థానికంగా ‘గడారు’ అని పిలుస్తారు. బలవంతులే తట్టుకోలేకపోతున్నప్పుడు బలహీనుల సంగతి చెప్పక్కర్లేదన్నది దీని అంతరార్థం.
ఆంగ్ల మాటలకు బదులుగా...
షార్టు, బాత్రూమ్‌... ఇలా ఇతర ప్రాంతాల్లో వినపడే ఆంగ్ల పదాలు కడపలో వినిపించవు. స్నానాలగదిని ‘జాలాడి’ అంటారు. ‘షార్టు’(పొడుగు నిక్కరు)నేమో ‘సల్లాడం’ అని పిలుస్తారు. గేదెలు, ఎద్దులు వంటి వాటిని కొనేటప్పుడు కొంత డబ్బును ఆ విక్రేతకు ముందుగానే అందజేస్తారు. ఆ పశువులను అతను ఇతరులకు అమ్మకుండా ఉండటానికి ఇచ్చే ఈ సొమ్మును ‘సంచకారం’ అంటారు. ‘అడ్వాన్సు’కు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. తినుబండారాలను నిల్వ ఉంచడానికి ఉపయోగించే కుండను ఇక్కడ ‘వాడికాగు’ అంటారు. 
      సొడ్డు (తప్పు చేసినప్పుడు తప్పించుకోడానికి చెప్పే అబద్ధం/సాకు), న్యాదరపిల్లోడు (అయిదేళ్లలోపు పిల్లాడు), సొయ్యం (పొగరుమోతుతనం), ఉసిలేక (ఖాళీ సమయం లేక/ సమయం దొరక్క), అబ్బిళ్లు కొరకడం (కోపంగా చూడటం), ఆగిత్యం చేయడం (చిన్న విషయానికే అతిగా స్పందించడం), అంగలేయడం (కోపగించుకోవడం), అఠానికి (కావాలని మొండితనంగా ప్రవర్తించడం), యల్లబారేటప్పుడు (ఎక్కడికైనా బయలుదేరేముందు)... ఇలా కడపలో వాడుకలో ఉన్న పదాలు, పదబంధాలెన్నో. అన్నీ ‘అల్పాక్షరాల్లో అనల్పార్థాల’ను ఇచ్చేవే. 
      ‘కడప గడపలోన కవుల గడపలు మెండు’ అన్నది లోకోక్తి. దాన్ని కొంచెం మార్చుకుంటే... కడప గడపలోన తెలుగుకు తియ్యదనం మెండు! తరాలు గడిచినా ఆ తీపి తగ్గదు. అందులో ‘చేదు’ కలవదు!


వెనక్కి ...

మీ అభిప్రాయం