మా ఇంటి ఇలవేల్పు... మాలోనే వేల్పు

  • 537 Views
  • 10Likes
  • Like
  • Article Share

ఇంద్రకీలాద్రిపై ఇసుకేస్తే రాలని సమయమిది... కలకత్తా కాళీఘాట్‌లో కాలుమోపాలన్నా కుదరని కాలమిది... ఆసేతు హిమాచలం అమ్మశక్తి ఆరాధనలో తరించే తరుణమిది. సృష్టికి మూలాధారమైన ‘అమ్మ’ను ఆబాలగోపాలం అర్చించే వేళ దేవీ ఆలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. భక్తజన హృదయాలన్నీ దుర్గమ్మకు మంగళహారతులు పాడతాయి. పాట అంటే గుర్తొచ్చింది... దసరా వచ్చిందంటే ఒకప్పుడు తెలుగు లోగిళ్లలో పాటలు పరవళ్లు తొక్కేవి. జానపద గీతాల సందడితో విజయదశమి వేడుకలు మట్టి పరిమళాన్ని అద్దుకునేవి. మాతృదేవతారాధనపై తమకున్న విశ్వాసాన్నే పాటగా మార్చి, ఆ జగజ్జననికి గళార్చన చేయడం మన జానపదుల ప్రత్యేకత. భక్తిని మించిన బంధంతో ఆ తల్లికి తియ్యని తెలుగు మాటల నైవేద్యం పెట్టిన వారి నైపుణ్యం అద్భుతం.
కాల మిత్రురాలివి ఖడ్గాన దుర్గవి
నమ్మిన వారికి ఇమ్మున వస్తానన్నావు తల్లీ
నమ్మని వారికి రొమ్ములోకి గాలమైపోతావు తల్లీ
మా ఇంటి ఇలవేల్పు మాలోనే వేల్పు తల్లీ

      కాల ప్రవాహంలో కలువలు పూస్తాయి... కళ్లారా చూసుకునేలోపే కనుమరుగైపోతాయి! ప్రేమాభిమానాలతో కట్టుకున్న ఆశల సౌధాలను కనికరం లేకుండా తన్నుకుపోతున్న కాలాశ్వానికి కళ్లెం బిగిస్తుందన్న నమ్మకంతో కాళికకు మొక్కుతున్నారు జానపదులు. కాలం ఆగితే కన్నీళ్లూ ఆగుతాయన్న ఆశ వారిది. అది మానవ సహజం కూడా. 
      మనల్ని మించిన మహాశక్తి ఏదో మహిని పరిపాలిస్తోందన్న నమ్మకమే మతానికి పునాది. ఆ మతం పుట్టకముందే మాతృదేవతారాధన మొదలైంది. హరప్పా నాగరికత అందుకు ఆనవాళ్లందిస్తోంది. సృష్టించే ‘తల్లే’... జీవితానికి భద్రతనూ ఇస్తుందన్న సామాన్యుడి తర్కంలోంచి ‘తల్లి పూజ’ ప్రారంభమైంది. అమ్మకు మొక్కడం సంస్కారం. తల్లి ముందు తలెగరేయడం తిమ్మిరితనం. దానికి శిక్ష... ‘రొమ్ములోకి గాలం’. తప్పు చేస్తే దండించే అమ్మ అంటే సగటు పిల్లవాడికి ఉండే భయమే ఈ మాటకు మూలం. భూగోళానికి అవతలి వైపు ‘మదర్స్‌డే’ ముచ్చట్లు మొదలవడానికి వేల ఏళ్లకు పూర్వమే అమ్మను ఆదిదేవతగా ప్రతిష్ఠించిన భారతీయ సాంస్కృతిక ఔన్నత్యానికి ప్రతీక ‘మాలోనే వేల్పు’. 
      అవును... దసరా అంటే,  కనపడని దేవతకు కొలువులు జరిపే పర్వదినం కాదు. కనిపించే దేవతను మనసారా కొలవాలని చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠం. 
తొమ్మిది రాత్రుల పండుగ...
బొమ్మల దసరా పండుగ
ఆయుధపూజలు ఊరూరా...
అంబకు సేవలు మనసారా
పప్పూ బెల్లం పిల్లలకు...
వరహా దక్షిణ గురువులకు
జమ్మిని కొట్టుట వేడుక...
జతలను కట్టుట వాడుక
పందిరిలో హరికథలు...
సందడితో ఇక మొదలు
ఎంతో నిండుగ పండుగ... 
అంతా కన్నుల పండుగ

      రెండు మూడు దశాబ్దాల కిందటి వరకూ విజయదశమి అంటే ఊరూరా ఇంతటి సందడి ఉండేది. ఈ సంబరాలతో పాటు రాముడు రావణున్ని కొట్టడం (రామ్‌లీలా), బతుకమ్మని నీటిలోకి పంపడం కూడా దసరా ప్రత్యేకాలే. శరన్నవరాత్రుల శోభకు బొమ్మలకొలువులు వన్నెచిన్నెలద్దుతున్న వేళ ఇంట్లోని వాహనాలను పూజించడం ఆనవాయితీ. జమ్మిచెట్టు మీద దాచిన ఆయుధాలను అర్జునుడు ఈ పుణ్యకాలంలోనే కిందకు దించాడన్న నమ్మకమే ఆయుధపూజకు ఆది. ఇక ‘శమీ శమయతే పాపం’ అనుకుంటూ శమీ వృక్షానికి (జమ్మిచెట్టు) మనసారా నమస్కరిస్తే పాపాలన్నీ పరిహారమవుతాయన్నది విశ్వాసం. పండుగ నాడు జమ్మి చెట్టు ఆకులను ‘బంగారం’గా భావించి తోటివారికి ఇస్తారు. శుభాకాంక్షలు చెబుతారు. ఇంతకూ ఈ ఆకులకూ స్వర్ణానికి ఏంటి సంబంధం? ఏమీ లేదు. కానీ, ఆరోగ్యపరంగా చూస్తే ఆ పత్రాలు బంగారపు రేకులకంటే విలువైనవే. నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పుల నుంచి చర్మ సమస్యల వరకూ ఎన్నింటికో ఇవి మంచి ఆయుర్వేద ఔషధాలు. అందుకే వాటిని పండుగలో భాగం చేశారు పెద్దలు. 
      ఆది పరాశక్తిని పూజించిన తర్వాతే రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లాడని, విజయదశమి నాడు ఆ లంకాధిపతిని పడగొట్టాడని ప్రతీతి. అందుకే ఉత్తర భారతంతో పాటు తెలంగాణలో రామ్‌లీలా ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహిస్తారు. ‘పప్పూ బెల్లం’ విషయానికొస్తే, వీధిబడులు ఉండే రోజుల్లో దసరానాడు తమ విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లేవారు. ‘అయ్యవారికి చాలు అయిదు వరహాలు... పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు’ అంటూ పిల్లలు పాటందుకునేవారు. ‘ఘనముగ కట్నము గ్రక్కున ఇచ్చి/ సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగానూ’ అంటూ కాస్త గడుసుగానే అడిగేవారు. ‘గురునకు దక్షిణల్‌ కోరి యీదలచి/ వెరవు తోడుత మిమ్ము వేడవచ్చితిమి’ (మాకు చదువు చెబుతున్న ఉపాధ్యాయుడికి గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాం. వేరే ఉపాయం దొరక్క మిమ్ముల్ని ప్రార్థిస్తున్నాం) అంటూ ముద్దుమాటలతో పిల్లలు నమస్కరించేసరికి గృహస్థులు కూడా చిరునవ్వుతో తోచినంత ఇచ్చి పంపేవారు. ఆనందంతో పిల్లలు కూడా ఇలా పాడుకుంటూ ముందుకు సాగిపోయేవారు... 
దసరా పండుగ వచ్చింది
దర్జాలెన్నో తెచ్చింది
దండిగ డబ్బులు వచ్చినవి
కోరికలన్నీ తీరినవి 
పాలుగారే బొమ్మలు 

దసరాకు పర్యాయపదం బొమ్మల కొలువు. ఉంటే చందనం... లేకపోతే సాధారణ కొయ్య... దేనితో చేసినా విజయదశమి ‘బొమ్మల’ విలువ మాత్రం అమూల్యం. పెళ్లీ పేరంటాలు లాంటి భవిష్యత్తు కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం, వ్యక్తిత్వ నిర్మాణం వంటి వాటిపై పిల్లల్లో అవగాహన పెంచడానికి ఉద్దేశించినవే బొమ్మల కొలువులు. శరన్నవరాత్రుల కాలంలో అప్పట్లో ప్రతి ఇంటా ఇవి తప్పనిసరి. ఎక్కడ ఎవరింట్లో ఈ కొలువు పెట్టినా చుట్టుపక్కల పిల్లలంతా అక్కడికి చేరేవాళ్లు. వినసొంపైన పాటలు పాడుతూ సందడి చేసేవాళ్లు. 
చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు
పెద్దన్న పెట్టెనే పెట్టెల్ల సొమ్ము
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్క కొమ్ము
పోతునే బొమ్మ నీకు పొన్నేఱునీళ్లు
కట్టుదునె బొమ్మ, నీకు కరకంచు చీర
తొడుగుదునె బొమ్మ, నీకు తోపంచు రవిక
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు
అత్తవారింటికి పోయి రమ్మందు

      చిన్నారి బొమ్మను పెళ్లికూతుర్ని చేస్తూ పాడే పదమిది. పసుపు కొమ్ములు నూరి ముఖమంతా రాయడం, పొన్న చెట్టు ఆకులను  కలిపిన నీళ్లు పోయడం ఇందులో ప్రధానం. పసుపు రోగనిరోధకం అన్న సంగతి తెలిసిందే. ఇక పొన్న ఏమో... చర్మం మీద వ్రణాలను, గాయాలను నయం చేస్తుంది. ఆచార వ్యవహారాల పేరిట ఆరోగ్యానికి అగ్రాసనమేశారు పెద్దలు. ఆ విజ్ఞానం భావితరానికి తెలియాలన్న ఆశతో పాటల్లో పదాలుగా కూర్చారు. ఆధునికత పేరిట వారసత్వ సంపదలను దూరం చేసుకుంటున్న మనం... ఆ విజ్ఞానఖనిని అర్థం చేసుకోలేక పనికిరానిదాని కింద లెక్కగడుతున్నాం!
వీధిలో ముడివిప్పి ముడవబోకమ్మ
పల్లెత్తి గట్టిగా పలుకబోకమ్మ
పొరిగిళ్లకెప్పుడూ పోవకే బొమ్మ
నలుగురీ నోళ్లలో నానకే బొమ్మ

      బొమ్మల పెళ్లి తంతు చివరి దశలో పెట్టే అంపకాలివి. పిన్నలతో పాటు పెద్దలూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలివి. గొడవలు పడటం, సంసారాన్ని గాలికొదిలేసి స్నేహితులతో కబుర్లాడటం, చెడు పనులు చేసి సమాజం దృష్టిలో పలుచన అయిపోవడం (భర్తలకూ వర్తిస్తాయి)... బతుకుదీపాన్ని ఆర్పడానికి ఇంతకు మించిన విసనకర్రలేం కావాలి? అలాంటి బుద్ధితక్కువ పనులకు దూరంగా ఉండమని పిల్లలతో ‘బొమ్మ’కు చెప్పిస్తూ... పనిలో పనిగా భవిష్యత్తులో సంసారులు కాబోయే ఆ చిన్నారులకూ సుద్దులు చెప్పారు పూర్వీకులు. పసివారికి ఇదంతా వివరించాల్సిన అవసరమేంటంటే... మాట వినేది మొక్కే కానీ, చెట్టు కాదు కదా!
తల్లీ... వందనం!
ముగ్గురమ్మల మూలపుటమ్మ... బెజవాడ కనకదుర్గమ్మ! త్రిమూర్తుల శక్తినంతటినీ తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ జగజ్జనని అంటే భక్తులకు మహా ప్రీతి. పండుగ నాడు సరదాగా ఎన్ని ఆటలాడినా అమ్మ పూజ దగ్గరికి వచ్చేసరికి నిష్ఠగా చేస్తారు. మనసారా ప్రార్థిస్తారు. 
మేలు మేలు ముత్యాల కులుకులు
మెడలో హారములు ముక్కుపుల్లలూ
చెవుల గెంటీలు నీ కిచ్చెదనమ్మా
అంతరంగమున వేడితి నీ దయ
 
      కానుకలిచ్చి అమ్మ దయకు పాత్రులవ్వాలన్న ఆశ ఆ అతివది. ‘పసుపు కుంకుమ తెచ్చి పూజ చేసేను/ పచ్చాని ఐదోవతనము మాకివ్వవే’ అని వేడుకుంటూనే ‘పూట పుష్పాలు తెచ్చి పూజ చేసెద/ పుత్రసంతానము మాకివ్వు తల్లీ’ అంటూ మనసులోని కోరికను ఆ అమ్మతో పంచుకుంటుంది. ‘జోలలు పాడేటి భాగ్యమివ్వు తల్లీ’ అని భక్తితో నమస్కరిస్తుంది. కొత్తగా పెళ్లయిన స్త్రీలు పాడే పాట ఇది. ఈ పాట చివరి పంక్తి... మనం కట్టుకునే ఆశల మేడలకు ప్రతిబింబం. ఇంతకూ అది ఏంటంటే... ‘రాజరాజేశ్వరీ రాజమనోహరీ/ రాజ్యము లేలేటి భాగ్యమివ్వు తల్లి’!
మహిషాసుర మర్దిని...
అసుర ముఖాలచీర అమరంగ గట్టి
కనక సూదులరయిక కనియింపు దొడిగి
తట్టా పండ్రెండామడ జడలు బరిచించి
వెంటిక్కి వెయ్యి కండ్లు కలిగింది
చిత్రకన్ను నొసట ధరియించి
ఆయాత కన్ను అరికాల ధరియించి
శూలమొక చేత గాలమొక చేత
డక్కి వకచేత డమరక మొకచేత
దుర్దల మర్దించు దుడ్డుగోల వకచేత
హంసల మర్దించు అంబు వకచేత
చేడెల మర్దించు చెండు వకచేత
శిరసము కప్పెరము వకచేత
ఏడు బండ్లమీద పోయేనాటి గజాశలము

      రౌద్రాకారంగా మారిన జగజ్జనని విశ్వరూప సందర్శనమిది. కడప జిల్లా జానపదుల ఊహాచిత్రమిది. మందిని కొట్టి బతుకుతున్న మహిషాసురుణ్ని వధించడానికి బయల్దేరిన అమ్మ ఇలాగే ఉందన్నంత స్థాయిలో వర్ణించారు గ్రామీణులు. పన్నెండు ఆమడల పొడవైన జడలు, వెయ్యి కళ్లు, శూలం, గాలం, దుడ్డుగోల (దుడ్డుకర్ర), బాణం, కప్పెర (కపాలం)లతో ప్రళయభీకరంగా ఉన్న ఆ తల్లిని దర్శించుకున్నారు జానపదులు! 
      అయితే, రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ తల్లిని శాంతింపజేయడమెలా? పైపెచ్చు అదంత సులభమూ కాదు. అయితే, దానికీ తరుణోపాయం ఆలోచించారు పల్లీయులు. 
నీళ్లుబోనలు నీకు చెల్లింతురమ్మ
వేటదున్నలు నీకు వేడ్క తోడుతను
వేడుకతో తిరునాళ్లు వెలబడచేయ
విరివిగా సిరులిచ్చి మేలుకొను మమ్మ
ధరణిలో జనులకు తల్లివిగదమ్మ
యిమ్మహిని నీవు మాయిలవేల్పువమ్మ
మమ్మేలు జయ మహికనకదుర్గాంబ

      మరోవైపు, ‘తల్లి రావే తల్లి ఉయ్యాలో... తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో... నాకును కష్టాలు ఉయ్యాలో... ఎందమ్మా తల్లి ఉయ్యాలో...’ ఇలా సాగే పాటలతో, బతుకమ్మ ఆటలతో తెలంగాణవ్యాప్తంగా దసరా సంబరం అంబరమంటుతుంది. (‘బతుకమ్మ’ విశిష్టత, ఆ పండుగ పాట ప్రత్యేకతలపై పూర్తి వ్యాసం అక్టోబరు 2012 ‘తెలుగు వెలుగు’ సంచికలో చూడవచ్చు)
      చిన్న చిన్న పదాల్లోనే లోతైన అర్థాలు, తాత్విక ఆలోచనలను ఇమిడ్చి జానపదులు కట్టుకున్న పాటల్లో భక్తిరసమే కాదు నిండైన తెలుగుదనమూ దర్శనమిస్తుంది. తెలుగింటి ఆచార వ్యవహారాల ముచ్చట్ల నుంచి ఆరోగ్య సూత్రాల వరకూ అన్నింటినీ విడమరచి చెప్పే ఈ పాటలు మన జాతి అస్తిత్వ చిహ్నాలు. ఎందుకంటే... విజయదశమి నాడు ఆ దుర్గమ్మను భారతీయులందరూ పూజిస్తారు. వాళ్లందరిలోకి ప్రత్యేకంగా మనవైన ‘పద’పుష్పాలతో ఆ తల్లిని అర్చించే అవకాశమిస్తున్నాయి కాబట్టి! ఆ పాటలను కాపాడుకోవడంతో పాటు అలాంటి వాటిని మరిన్ని సేకరించి భావితరాలకు అందించడమే మన కర్తవ్యంగా స్వీకరిస్తే ఈ దసరా పండుగకు మరింత ఉత్సాహం వస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం