అక్షరాంగణంలో ‘భీమ’బలుడు!

  • 371 Views
  • 5Likes
  • Like
  • Article Share

    సిరి

  • హైదరాబాదు

దళితుల ఆత్మగౌరవ పతాకాన్ని నింగిని తాకించిన పద్మభూషణుడు బోయి భీమన్న. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత లాంటి విభిన్న సాహితీ ప్రక్రియల్లో 70కి పైగా రచనలను వెలువరించిన భీమన్న భావం సున్నితం! భాష లలితం! ఆశయం అద్భుతం!
‘‘బానిసతనమును
బాపుమురా/ భారతభూమికి భాగ్యము తేరా!/ సకల దేశముల సర్వ మానవుల/ సామ్యము సాధింపుమురా’’ అంటూ తన రచనలతో ఆనాటి అణగారిన సమాజాన్ని అభ్యుదయపథ పయనానికి ప్రేరేపించిన సిద్ధాంతకర్త బోయి భీమన్న. పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభవాలతో, తన మీద పడిన రాళ్లనే మెట్లుగా మలచుకుంటూ కీర్తిశిఖరాలను అధిరోహించిన నిరంతర చైతన్యశీలి ఆయన. అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త, సెప్టెంబరు 19, 1911న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆయన స్వస్థలం. తండ్రి పుల్లయ్య, తల్లి నాగమ్మ. తండ్రి అయిదుగురు కొడుకులకు పంచపాండవుల పేర్లు పెట్టుకున్న క్రమంలో రెండో కుమారుడు ‘భీమన్నే’ అయ్యారు! ‘‘బ్రహ్మ రథముపట్టి, పగటి దివిటీలతో/ వేయించితివి గండపెండెరమును,/ అందించితివి భారతాధ్యక్ష గిరి చేత/ మహనీయమైన పద్మా అవార్డు/ ...../ ధన్యతను గూర్చినావు నా తల్లి! బ్రాహ్మి!/...’’ అని సగర్వంగా ప్రకటించుకోగలిగిన స్థాయికి చేరుకున్నారు. 
      తరతరాలుగా కులం సమ్మెట కింద నలిగిపోతున్న దళిత సమాజంలోంచి తొలితరం కవులుగా దూసుకొచ్చిన వారు కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా, బోయి భీమన్న. ఈ ముగ్గురి లక్ష్యం ఒక్కటైనా, దళిత సమాజం మీద వారు చూపించిన ప్రభావాలు మాత్రం విభిన్నమైనవి. ‘‘ఒక్కసారి చైతన్యవంతులైన హరిజనుల్ని ఇకమీదట ఎవరూ అణచిపెట్టలేరు’’ అని చెప్పి, అలా దళితులను చైతన్యవంతులను చేయడానికి వాళ్లను చదువు వైపు నడిపించిన వేగుచుక్క భీమన్న. విద్యాభ్యాసం పూర్తయిన తొలిరోజుల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారాయన. ఆ తర్వాత జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేశారు. అంబేడ్కర్‌ రాసిన ‘ఎనిహిలేషన్‌ ఆఫ్‌ ది క్యాస్ట్‌’ గ్రంథాన్ని ‘కుల నిర్మూలన’గా తెలుగులోకి అనువదించారు. అంతే త్రికరణశుద్ధితో అంబేడ్కర్‌ సిద్ధాంతవాదాన్ని అనుసరించి, ప్రచారం చేశారు. ‘‘వ్యక్తుల వికాసమే జాతి. జాతుల వికాసమే వసుధ. వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలం’’ అన్నది భీమన్న తాత్విక భూమిక. 
తెలుగు చిగుళ్లు
‘‘కవి ఏ కాలంలో జీవించాడో, ఆ కాలానికి చెందిన సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ అతడి రచనల్లో ప్రతిఫలించాలి’’ అని చెప్పిన బోయి భీమన్న కవిత్వం తెలుగు సంస్కృతికి అద్దంపడుతుంది. అలతి అలతి మాటల్లో పైరుపచ్చల నిసర్గ సౌందర్యాన్ని ఒడిసి పట్టుకుంటుంది. పల్లెటూరి పడుచులు, పంటగట్లు, పచ్చగడ్డి పువ్వులు, ఊడ్పుచేలు, వరివెన్నులు, కొబ్బరితోటలు, మామిడి తోపులు, కోయిల పాటలతో ఆయన కవితలు ఉప్పొంగుతుంటాయి. ‘అనాది కొసనుంచి అనంతత్వంలోకి, రాగవైశాఖి, రాఖీలు, గుడిసెలు కాలిపోతున్నై, భీమన్న ఉగాదులు, భీమన్న కావ్యకుసుమాలు, మోక్షం నా జన్మహక్కు, చివరిమెట్టుమీది శివుడు, రాగోదయం, అకాండతాండవం, గిల్లిచెబుతున్నా, మధుబాల, దీపసభ’ లాంటి రచనలు భీమన్న భాషావైదుష్యానికి మచ్చుతునకలు. ఆయన జాతీయవాదం ఆయన కవిత్వంలో ప్రతిఫలిస్తుంది.
      ‘‘తొట్టతొలిగా నా ఊయల తొట్టినుండి, దూకి పర్విడినాడ నీ లోకమునకు’’ అంటూ ప్రకృతి ఒళ్లోకి పరిగెత్తి, అనంతానుభూతుల్ని సొంతం చేసుకున్నారు భీమన్న. ‘‘నీరుకట్టి, మళ్లుకట్టి, నారుకట్టి, కంచెలును కట్టి, నన్ను పోషించరెవరు, అడవిమొక్కను నేను, స్వేచ్ఛావకాశ వీధులందిష్టమైనట్లు విరియుచుంటి’’ అంటూ తనలోని స్వేచ్ఛాప్రియత్వాన్ని ప్రకటించుకున్నారు. భీమన్న కవిత్వం రాసే కాలంలో పద్యకవిత్వం మీద కొన్ని వర్గాలదే ఆధిపత్యం. ఇతరులెవరైనా దాని ఛాయలకు వస్తే చాలు, హేళన చేస్తూ అవమానించేవారు ఆ పేరుగొప్ప పెద్దలు. అలాంటి పరిస్థితిలో పద్యం ద్వారానే వారికి సమాధానం చెప్పారు భీమన్న. ‘‘కవిత ఒక ప్రక్రియకు ప్రేయసి కాదు, ఒక భాషకు బందీ కాదం’’టారాయన. భాషలోని తీపిని కవిత్వంలో మేళవించిన భీమన్న ‘‘తెలివి తక్కువ చీమలు గింజలకోసం గింజుకు చస్తుంటే, అవి పెట్టిన పుట్టలు పాముల కిరవవుతుంటై’’ అంటూ అన్యాయాన్ని ఎదిరించారు. దళితులందరూ సమైక్యతతో వర్ధిల్లాలనే ఆశను భీమన్న ‘గుడిసెలు కాలిపోతున్నై’ కావ్యంలో వ్యక్తం చేశారు. ‘ఇదిగో ఇదీ భగవద్గీత, జన్మాంతర వైరం, పురాణాల్లో హరి- గిరిజన మనీషులు, ధర్మంకోసం పోరాటం, అంబేద్కరిజం’ తదితర రచనలు ఆయన కవిత్వంలోని విశ్వజనీనతను చాటిచెబుతాయి. వాల్మీకి, వ్యాసుడు, ధర్మవ్యాధుడు తదితరులంతా దళితులేననీ, వాళ్లు రాసిన భారత, రామాయణాలు తమవేనని ‘ధర్మంకోసం పోరాటం’లో వాదించారు భీమన్న. ‘‘రాక్షస రాబందులు రాజ్యమేలుతున్న సమాజంలో ధనికులు ప్రగతినిరోధకుల’’ని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రగులుచున్నది అగ్నిపర్వతమొకొక్క/ శ్రామికుని గుండెలో అది రగిలి రగిలి/ భళ్లుమని బద్దలై అగ్ని బరవునేని/ అపుడు చింతించి లాభమేమైన కలదె?’’ అంటూ ‘కూలిరాజు’ తరఫున హెచ్చరించారు. ఇక భీమన్న ‘డ్రగ్‌ ఎడిక్టులు’ కావ్యం ఆరు కవితల సమాహారం. దీన్లో మతం ప్రధానాంశం. డ్రగ్గును దేవుడితో, ఎడిక్టులను మత విశ్వాసాంధులతో పోల్చారు. ‘‘కోటివిద్యలు..... శతకోటి ఉద్యోగాలు, అనంతకోటి ప్రణాళికలు.. ఇది మానవ జీవితం. దీనికి దేవుడక్కర్లేద’’ని ఘంటాపథంగా చెప్పారు. భీమన్న తన కావ్యాలకు స్వయంగా అద్భుతమైన పీఠికలను రాసుకున్నారు. 
అంబేడ్కర్‌ అడుగుజాడల్లో!
సామాజిక అసమానతలు, కుల, మత, లింగ, వర్గ వివక్షతలు, దళితుల అణచివేత... వీటిన్నింటినీ ఇతివృత్తాలుగా మలచి తన నాటకాల్లో దృశ్యమానం చేశారు భీమన్న. ‘పాలేరు, కూలిరాజు, అసూయ, ప్రగతి, పడిపోతున్న గోడలు, రాగవాసిష్ఠం, ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు, బాలయోగి, చిత్రకళా ప్రదర్శనం, చండాలిక (రవీంద్రుడి చండాలిక అనువాదం)’ తదితర నాటకాలను రాశారాయన. వీటిలో కులనిర్మూలనను బలంగా సమర్థించిన నాటకం ‘పాలేరు’. ఇది అప్పట్లో గొప్ప సంచలనాన్ని రేపింది. ఇందులోని కథానాయకుడు వెంకన్న. ఓ కామందు దగ్గర వెట్టి చేస్తూ, నానా బాధలు పడుతుంటాడు. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బాగా చదువుకుంటాడు. చివరికి ఉన్నతోద్యోగాన్ని సాధించి, వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్ట వేస్తాడు. ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు తమ హక్కులు సాధించుకోవాలనే అంబేడ్కర్‌ ఆశయాన్ని ఈ నాటకం ద్వారా ప్రచారం చేశారు భీమన్న. ఆనాటి దళిత యువకులకు ఈ నాటకం గొప్ప ఉత్ప్రేరకమైంది. వాళ్లని చదువులబాట పట్టించింది. ఈ నాటక ప్రదర్శన కోసమే తెలుగునాట అనేక సమాజాలు ప్రారంభమయ్యాయి. పెత్తందారుల భౌతిక దాడులను ఎదుర్కొంటూనే అవి ఊరూరా ‘పాలేరు’ను ప్రదర్శించేవి!
      భీమన్న నాటకాల్లో ప్రత్యేకమైంది ‘రాగవాసిష్ఠం’. ‘భారతీయులందరూ ఆర్యులే’ అన్న సిద్ధాంతాన్ని దీని ద్వారా ప్రతిపాదించారు భీమన్న. ఆర్య, అనార్య భేదభావాలు స్థలకాలాలను బట్టి ఏర్పడ్డాయన్నది ఆయన అభిప్రాయం. పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకుని సమాజంలో వేళ్లూనుకున్న కులసమస్యను కూలంకషంగా చర్చించి, జాతీయవాదాన్ని నిరూపించే నాటకంగా రాగవాసిష్ఠాన్ని అభివర్ణించవచ్చంటారు నార్ల వెంకటేశ్వరరావు. ఈ నాటకాన్ని రాయడానికి భీమన్న వేదాలు, మనుస్మృతి, అమరకోశం, రామాయణం, మహాభారతాలను అధ్యయనం చేశారు. ‘రాగవాసిష్ఠం’లో అరుంధతి, వసిష్ఠుడు, ప్రాచీనుడు, సంధ్య పాత్రలు ప్రధానమైనవి. అట్టడుగు వర్గాల వారిని అభిశంసిస్తూనే, అవసరాలకు వాళ్లని ఎలా వాడుకుంటారో తెలియజెప్పే పాత్ర కులగిరి. ప్రాచీన ధర్మానికి ప్రాపుగా నిలిచే ప్రాచీనుడు, మానవీయతకు ప్రాతినిధ్యాన్ని వహించే వసిష్ఠుడు.. వీళ్లిద్దరి మధ్య చోటుచేసుకునే సైద్ధాంతిక సంఘర్షణను ఈ నాటకంలో చిత్రీకరించారు భీమన్న. అరుంధతి అస్పృశ్య స్త్రీ. వశిష్ఠుడు ఆర్య జాతీయుడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అరుంధతి కులం గురించి తెలిసి, వసిష్ఠుడు ఆమెకు దూరమవుతాడు. ఆక్రోశంతో అరుంధతి చేసిన తపస్సుకు లోకం అల్లకల్లోలమవుతుంది. ఈశ్వరుడు వచ్చి ప్రాచీనుడి వ్యతిరేకతను పోగొట్టి అరుంధతి, వసిష్ఠుల వివాహాన్ని జరిపిస్తాడు. వాళ్లకు శక్తిమహర్షి జన్మిస్తాడు. శక్తి మహర్షికీ, మాతంగ కన్యకూ పుట్టినవాడు పరాశరుడు. పరాశరుడికీ, సత్యవతికీ జన్మించినవాడు వ్యాసుడు. ఇదీ పరంపర. ‘‘పెరుగుదలలో పరిసరాల ప్రాచుర్యం మినహాయిస్తే, మానవజాతి అంతా ఒక్కటే కదా!’’ అని ఈశ్వరుడి పాత్రతో పలికిస్తారు భీమన్న. ఇలా ఆయన రాసిన నాటకాలన్నీ సామాజిక సమస్యలను చర్చకు పెట్టినవే. 
లలిత జలపాతాలు
ప్రణయతత్వంలో అభ్యుదయాన్ని మేళవించడంలోనూ భీమన్నది అందెవేసిన చెయ్యి. ఆయన రాసిన ‘పైరుపాట’ గేయనాటికే దీనికి నిదర్శనం. దీని కథానాయిక స్నేహ, కామందు ఇంట్లో పనిపిల్ల. కథానాయకుడు శ్రీవత్స చదువుకున్న పెద్దింటి యువకుడు. వీరిద్దరి మధ్య స్నేహం పల్లవించి ప్రణయంగా, చివరకు పెళ్లిగా మారడాన్ని భీమన్న చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఆయన లలిత గేయాల్లో భాష సుందర సుమనోహరంగా, భావం కమనీయంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆకాశవాణి ప్రసారం చేసిన ‘‘ఏ గాలి వడిరాలి ఈ ధూళి దోగినదొ/ ఏ కబరి ముడి సడలి ఈ దారి దాగినదొ/ ఎత్తవోయీ కేల ఈబేల సుమబాల’’ లాంటి పాటలు శ్రోతలను మైమరపింపజేశాయి. ఇక భీమన్న రాసిన ‘‘జయ జయ అంబేద్కర..’’ పాట ఈనాటికీ ఊరూవాడల్లో మార్మోగుతూనే ఉంది. 
      జాషువా గబ్బిలం మీద కావ్యాన్ని రాస్తే, భీమన్న పిల్లి మీద శతకమే రాశారు. పిల్లి నడకలను ఆయన అందంగా అభివర్ణించారు. ‘‘అల్లన తక్కుచు తారుచు, మెల్లన మ్యావనుచు నను సమీపించుటకున్, చెల్లునె యెవ్వరికిని? నా ఇల్లాలికి నీకు తప్ప ఇలలో పిల్లీ!’’ అంటూ పోలిక తెచ్చారు. పాలుపెరుగులను తాగటంలో పిల్లిని బాలకృష్ణుడితో పోల్చారు. ఇక ‘చాటువులు-స్వగతాలు’ పుస్తకంలో ఆయన రాసిన అచ్చతెలుగు చాటువులు చురుక్కుమనిపిస్తాయి. ‘‘మాలనీవు, పూలమాలలు నీకేల/ స్టేటవార్డులేల? సెంట్రలేల?/ నీకు నీవె కాదు మాకును మాలవె/ పద్యమాలనీకు, పర్సుమాకు’’ అంటూ తనకు ఎదురయ్యే వివక్ష గురించి వ్యంగ్యంగా చెప్పుకున్నారు. ‘తెలుగు విశ్వజనని’ అనే చాటువులో ‘‘యూనివర్సిటీలు ఉద్యోగ పదవులు/ పార్లమెంటు, ఆసుపత్రి, కోర్టు/ ఆంగ్లపదములెల్ల ఆంధ్రపు కోడళ్లె/ గుణము చెరుపనేల అనువదించి?’’ అంటూ మన నిత్య వ్యవహారాల్లో కలిసిపోయిన ఆ పదాలకు మళ్లీ అనువాదమెందుకని ప్రశ్నించారు. పల్లెదాకా వ్యాపించిపోయి, జనాలకు పూర్తిగా అలవాటైపోయిన పదాలను మార్చాలనుకోవడం మంచిది కాదన్నది ఆయన వాదన. అదే సమయంలో తెలుగులో అనువాదాలు తప్ప మౌలిక సాహిత్యం లేదనే వారికి ఆయన గట్టిగా సమాధానం చెబుతారు. ‘‘కుల, రాజకీయ, వ్యాపార వైఖరిని వదులుకొని, విశ్వజనీన దృష్టితో పరిశీలిస్తే, తెలుగులో అపూర్వ ప్రతిభా ప్రాభవాలు గల మౌలిక రచనలెన్నో కనిపించక మానవు. అయితే, అలాంటి నిరామయ నిష్పాక్షిక దృష్టిగల పండితులేరి? స్వపర విభేద విష దృక్కులు తప్ప, విద్యా వినయ సంపన్నులెక్కడ? వుంటే, బైటికి రండి! ప్రపంచ సాహిత్యంలోని ఉత్తమ రచనలను మించే ఉత్తమోత్తమ రచనలెన్నో తెలుగులో కనిపిస్తై’’ అని ఘంటాపథంగా చెప్పారు భీమన్న. 
      జాతీయ దృక్పథంతో అక్షరసేద్యం చేసిన భీమన్నను అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వరించాయి. ఆంధ్రవిశ్వకళా పరిషత్తు నుంచి ‘కళాప్రపూర్ణ’, 1973లో ‘పద్మశ్రీ’, 1976లో కాశీ విద్యాపీఠం డాక్టరేట్, 2001లో ‘పద్మభూషణ్‌’ గౌరవాలతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తదితరాలు వాటిలో ముఖ్యమైనవి. ప్రజల మానసిక, భౌతిక సంఘర్షణలకు కారణమైన కుల, మత, వర్గ విభేదాలను అధిగమించాలంటే, అందరూ విద్యావంతులు కావాలంటారు భీమన్న. డిసెంబరు 16, 2005న తుదిశ్వాస విడిచిన ఆయన, తన రచనల్లో కులమతాల కంటే మానవతకు ప్రాధాన్యాన్నిచ్చారు. తెలుగునాట ఆయన కావ్యప్రసూనాలు వెదజల్లిన మధుమాస మాధురులు ఎప్పటికీ మాసిపోవు.


వెనక్కి ...

మీ అభిప్రాయం