జామురాతిరీ జాబిలమ్మా..!

  • 736 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పెద్దాడ మల్లికార్జునరావు

  • సత్తుపల్లి, ఖమ్మం.
  • 9652495356
పెద్దాడ మల్లికార్జునరావు

నింగిలోని చందమామను చూసినప్పుడు ఆనందంతో పులకరించిపోతాం. ఏ పగడపు దీవుల్లోకో పోయి విహరించినట్టు, వెన్నెల మైదానాల్లో జాజిపూల అత్తరు దీపాల చెంత సేదతీరినట్టు భావిస్తాం. అయితే, ఆ నీలాల చంద్రుడు వెండితెర మీద వెన్నెల కురిపిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందీ! అందని చందమామ అందినట్టే అనిపిస్తుంది కదూ! ఆ సినీ వినీలాకాశపు చందమామ పంచిన మనోల్లాసపు మధువులివి..!
ఆమధ్య
మన ఇస్రో వాళ్లు చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతే చివరి క్షణంలో సాంకేతిక సమస్యతో అది కాస్తా ఆగిపోయింది. ఆ తర్వాత కొద్దిరోజులకే రాకెట్‌ మళ్లీ నింగిలోకి దూసుకెళ్లిందనుకోండీ! కానీ, అసలు ఉపగ్రహం చంద్రుణ్ని ముద్దాడాలంటే అంతరిక్షంలో ఇంకా కొన్ని రోజులు చక్కర్లు కొట్టాల్సిందే. చూశారా, నిజజీవితంలో చందమామను అందుకోవాలంటే ఎన్ని అవరోధాలో! ఎన్నెన్ని సవాళ్లో! కానీ, కవుల ఊహా జగత్తులో మాత్రం చందమామ మన పెరటి జామచెట్టు చివరనో, చూపుడువేలుతో చూపిస్తూ పిలిస్తే పలికేంత దూరంలోనో కనువిందు చేస్తూ ఉంటుంది. మనం చెప్పే ఊసులు, వెలిబుచ్చే విరహ వేదనలను విసుగు లేకుండా వినడానికి సిద్ధమవుతుంది. ఆఖరికి చంటిపిల్లాడికి అన్నం తినిపించే సమయంలో కూడా నేనున్నానంటూ ధైర్యం చెబుతుంది! అందుకే, ఆహ్లాదానికీ, గుండె లోతుల్లో గూడుకట్టుకున్న భావాల గుట్టు విప్పడానికి జాబిల్లిని చల్లని ఆత్మీయ నేస్తంగా చేసుకున్నారు మన కవులు. తెలుగు సినీ గీతాల్లో కూడా ఇలాంటి భావ మధురిమలు పంచే జాబిల్లి గీతాలు చాలానే కనిపిస్తాయి.
      వెన్నెలంటే భయపడి అట్టే బయటికిరాని వారు సైతం ఏకాంతంలో చంద్రుడితో మాటలు కలపక తప్పదు. ఉన్నట్టుండి ఊసులు మోసులు కట్టి చంద్రుడితో ఏవేవో చెప్పాలనుకుని అవన్నీ పాటలాగా గొంతుజారితే అది భావగీతమవుతుంది. తమ ఆవేదనకి నిశాకేతుణ్నే బాధ్యుణ్ని చేసి పాడితే అది విరహగీతమవుతుంది. వెన్నెల మహిమో, మోహ పరిమళాల అగరు ధూపమో తెలీదుగానీ జాబిల్లి గీతాలు అనగానే ఒకానొక తన్మయత్వపు తీరాల్లో మనసు విహరిస్తుంది.
అంతా ఎరుకే!
‘‘వినుటయెగాని వెన్నెల మహిమలు/ అనుభవించినే నెరుగనయా/ నీలో వెలసిన కలలూ కాంతులు/ లీలగ ఇపుడే కనిపించెనయా/ ఏమిటొ ఈ మాయ’’ (‘మిస్సమ్మ’లో పింగళి పాట) అంటూ జాబిల్లి గురించి పాడుకుంటే అది ఒట్టి పాట మాత్రమే కాదు మది తలపుల ఊట అనుకోవాలంతే! ‘చందురుని మించు అందమొలికించు చిట్టిపాపాయి’ బుగ్గను నిమిరినట్టే మధువులొలికే చందమామను చూసేకొద్దీ అట్టే విసుగనిపించదు. కవి అయితే శూన్యంలో కూడా చంద్రదీపాన్ని వెలిగిస్తాడు. అందులోనూ భావకవి అయితే వెన్నెలసోన కోసం పరితపించే చకోర పక్షిలా విహరిస్తాడు. మరి సినిమాకవి అంటారా! అరక్షణంలో నింగిలోని చందు రుని తుంచి ప్రేయసి చేతిలో పెట్టి నీలాగ కూడా వెలగలేకపోతున్నాడే ఇతగాడు! అంటూ ఉక్కిరిబిక్కిరి చేసెయ్యనూగలడు! అది కవిసమయం మరి!
      ‘తూర్పు పడమర’లో సి.నారాయణరెడ్డి రాసిన ‘‘రాగాల సిగలోన సిరిమల్లివి/ సంగీత గగనాన జాబిల్లివి’’ పాటను వింటే ప్రేమ తాలూకూ గాఢత ఎలాంటిదో తెలుస్తుంది. ఇందులో ప్రేమించిన అమ్మాయి పట్ల ఆరాధనా భావాన్ని అబ్బాయి పాటలాగా వినిపిస్తే పరవశించిపోయి చందమామంత ముఖం చేసుకుని చూస్తుందామె. ప్రేమరాగాలాపనలో ఎవరెలా ఉన్నా వెన్నెల మాత్రం వేడెక్కిపోతుంది. శిలలు ద్రవించి ఏడుస్తాయి. చంద్రకాంతశిలలు జాలిగా హాయిపూల మెత్తలు పరుస్తాయి. కావ్యాలంకారాల్లో చందమామ అందరికీ అందదు కానీ, తెర మీద చందమామ ఇట్టే వొదిగిపోతుంది. అందరి వేదననూ తనలో పలికిస్తుంటుంది. ‘‘జాబిలితో చెప్పనా!/ జామురాతిరి నిదురలోనా నీవు చేసిన అల్లరి చెప్పనా!’’ (‘వేటగాడు’లోని వేటూరి రచన) అంటూ ఎవరికీ చెప్పుకోలేనివి కూడా చందురునితో చెప్పుకుంటే మనసు తేలికపడుతుంది. 
      ఎల్లరి కథలూ వినేందుకు ఎవరికి తీరికుందిప్పుడు. చెప్పుకోవాలేగాని ఎవరి కథ వారికే బరువు. ఆ బరువు దించుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. అందుకు ఆర్ద్ర హృదయం ఉన్న ఆత్మీయులు అవసరం! ఇంటిగుట్టు పెరుమాళ్లుకెరుక అన్నారు గాని చంద్రునికి అంతా ఎరుకే! అందుకే ‘‘రావోయి చందమామ/ మా వింతగాథ వినుమా!’’ అంటూ కొత్త దంపతులు తమ కొంటె కలహాలన్నీ ఏకరువు పెడుతుంటే ఎంత శ్రద్ధగా వింటాడో ఆ శీతకరుడు!
చందమామే సాక్షి!
ఎంతటి పున్నమి చంద్రుడైనా గ్రహణం పట్టినప్పుడు మసకబారిపోతాడు. కష్టాల గాడ్పులు విసిరికొడితే సలసలా కాగిపోయి అంతలోనే చల్లగాలికి సేదదీరినట్టుగా చీకటి తెరలను చీల్చుకుని పసిపాపలా నవ్వుతాడు. చీకటి వెలుగుల ఇంద్రజాలం ఎరిగిన చంద్రుడు ఎవరి కథ విన్నా స్పందిస్తాడు. ఒక నిర్భాగ్యుడు తన ఒక్కగానొక్క బిడ్డకు జోలపాడుతూ.. ఆలకిస్తున్న చందమామ వైపునకు తిరిగి ‘‘మామా! చందమామా!/ వినరావా నాకథ!’’ అంటూ గోడు వెళ్లబోసుకుంటాడు. ‘‘నీ రూపము ఒకదీపము/ గతిలేని పేదకు/ నీ కలలే సాటిలేని పాఠాలు ప్రేమకు/ నువులేక నీవురాక విడలేవు కలువలు/ జాబిల్లి నీహాయి పాపలకు జోలలు’’ (సంబరాల రాంబాబు) అంటూ సామాన్యులకు చందమామతో ఉన్న అనుబంధాన్ని తెలియజెబుతాడు. 
      మనం చెప్పేవన్నీ అక్షరం పొల్లుపోకుండా వినే మృగాంకుడు, ఒక సందేశాన్ని కాస్తంత మోసుకుని వెళ్లమంటే కాదనకుండా ఉండగలడా! అందుకే, హంసరాయబారాలూ మేఘసందేశాల మాదిరిగానే చందమామతో తన అన్నకు సందేశం పంపాలనుకుందో చెల్లి. ఈ విషయంలో చంద్రుణ్ని కార్యదక్షత కలవాడిగా ఆమె భావించింది కాబోలు. ‘‘కొండెక్కిపోవోయి కురువేరు తేవోయి/ పండువెన్నెల పిండి పానకం తేవోయి/ తిన్నగ పోవోయి జాబిల్లి/ అన్నను తేవోయి జాబిల్లి’’ (దేవత) అంటూ సితాంశువుకు పెద్ద మొత్తంలోనే పనులు అప్పగించిందా పడుచు. అయితే, ఆ చెల్లి ఆరాటాన్ని చూడబుద్ధేసేమో కదిలీకదలనట్టు అట్లాగే నిలిచిపోతాడు చంద్రుడు!
      ‘బండరాముడు’ చిత్రంలో ఎందుకీ చీకటి బతుకు! దొంగతనం మాని దొరలాగా బతకొచ్చుకదా! అంటే వినడం మాట అటుంచి మగడు మరీ శ్రుతిమించిపోతాడని ఆ ఇల్లాలు ఆ రాత్రి ఏం చేసిందీ! నల్లపిల్లిలా జారిపోతున్న భర్తని ఉద్దేశించి ఇలా పాడుతుంది! ‘‘ఒకసారి ఆగుమా! ఓ చందమామ!!/ మనసారా నామాట ఆలించిపొమ్మా!’’ అంటూ రాత్రికరుణ్ని నెపంగా పెట్టుకుని ఇలా హితబోధ చేస్తుంది. ‘‘పరులసొమ్మును హరియించినవాడే/ పగటిపూటను ఇలువిడలేడోయి/ మంచిగా మనవోయి జాబిలి/ మలినమ్ము ఇకనైనా తొలగించుకొమ్మ’’ అని ఏకంగా చంద్రుణ్ని పగలు బయటికి కనిపించని దొంగని చేసేసింది. పాల జిలుగుతో తళతళలాడే చలివెలుగుకు కళంకం ఆపాదించేసింది. అయితే, ఆమె ఆవేదనను అర్థం చేసుకునేంత చల్లని మనసున్న నేస్తం చందమామ. కాదంటారా!? 
విరహాగ్ని జ్వాలల్లో..
విరహవేదన నిలువెల్లా దహించి వేస్తున్న ప్పుడు అంతా నీవల్లే! అంటూ చంద్రుణ్ని నిందించడం ప్రబంధాల్లో చదివాం. అదే పరిస్థితి తెరమీద చూస్తే ఒకానొక సమ్మోహనం మదిని తాకుతుంది. తనలోని దాహానికీ తాపానికీ కారణమైన చంద్రుణ్ని ఒక నాయిక ఎలా నిలదీస్తుందో చూడండీ! ‘‘నీ ఎదుటనేనూ/ వారెదుట నీవు/ మా ఎదుట మామ!/ ఎప్పుడుంటావూ!’’ అంటూ ఇలా మనవి చేసుకుంటుంది... ‘‘చల్లని వెన్నెల దొరవంటారు/ తీయని నవ్వుల సిరివంటారు/ మా వెన్నెలలోని వేడిగాడ్పులు/ నవ్వులలోని నిప్పురవ్వలు అనుభవించి అనమంటాను/ వయసుకి వైరివి నీవంటాను’’ (తేనె మనసులు) అంటూ రాజరాజును ఏకంగా వయసుకు శత్రువుగా చిత్రించేసింది. నిలువెల్లా చల్లదనమే తప్ప వేరొకటి ఎరుగని చందమామను ఇంత మాట అనేసిందంటే ఆమెలో విరహబాధ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ విరహం కంటే వియోగభారం మనసుని మరింత అతలాకుతలం చేస్తుంది. ప్రేమతాలూకూ గాఢత ఎంత లోతైనదో తెలియాలంటే ఇద్దరి మనసుల మధ్య కాస్త ఎడం అవసరం అన్నారు పెద్దలు. ‘‘కలువకు చంద్రుడు ఎంతో దూరం/ కమలానికి సూర్యుడు మరీ దూరం/ దూరమయ్యేకొలదీ పెరుగును అనురాగం/ విరహంలో ఉన్నది అనుబంధం’’ (చిల్లరదేవుళ్లు) పంక్తులు ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. అందరాని దూరంలో రేరాయుడు అక్కడెక్కడో ఆకాశంలో మెరిసిపోతుంటాడు. నేల మీదున్న కలువ భామ అతణ్ని ఏనాడూ అందుకోలేదు. కానీ, ఆ దూరమే ఇద్దరి మధ్యా ప్రేమను రెట్టింపుజేసే సాధనం. అందుకే తమ్మిదాయ వచ్చీ రాగానే అరవిరిసి తన అనురాగాన్ని వ్యక్తం చేస్తుంది ఉత్పలం. అలా రాత్రంతా దూరం నుంచే వారి మధ్య ప్రేమాయణం సాగుతుంది. సూర్యుడు, తామరల విషయంలో కూడా ఇదే అనురక్తి కనిపిస్తుంది! వియోగాలు నిజమైన ప్రేమకు పరీక్షపెడతాయి. ఆ బంధం పదికాలాలూ నిలబడేందుకు ఆలంబనగా నిలుస్తాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, ఎప్పటికీ కలిసుంటామనే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. కాబట్టే... ‘‘వెన్నెలెంతగా విరిసినగాని చంద్రుణ్ని విడిపోలేవు/ కలిసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకి విడిపోలేవులే’’ (అల్లూరి సీతారామరాజు) అంటుంది రామరాజుకోసం ఎదురుచూస్తున్న సీత. 
మనసు బాగుంటే చందమామ అందంగా కనిపిస్తుంది. లోలోపల దిగులు పేరుకుపోతే శరత్కాలపు వెన్నెల సైతం బహుళ పంచమ జ్యోత్స్నలా భయపెడుతుంది. చూసే దృష్టిని బట్టే అందమూ ఆనందమూను. ‘‘ఏమండీ! వెన్నెల ఎందుకింత చల్లగా ఉందీ!’’ అన్నది భార్య చంద్రుణ్ని చూస్తూ. ‘‘చెప్పనా! వేడి పుట్టించడానికే!’’ అని అతను చెప్పగానే, ఆ తరుణి ‘‘ఔనా!’’ అన్నట్లు ఇలా గొంతు శ్రుతి చేసింది. ‘‘ఆకాశవీధిలో అందాల జాబిలి’’ అని ఎత్తుకుని... ‘‘జలతారు మేలిమబ్బు పరదాలునేసి తెరమాటుచేసి/ పలుమారు దాగిదాగి పంతాలు పోయి పందేలు వేసి/ అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే’’ (మాంగల్యబలం) అనగానే నిజంగానే చంద్రుడు మబ్బుచాటుకుపోయి తొంగి చూడకుండా ఉంటాడా! 
      చంద్రుని పొడ సోకితే చాలు యవ్వనాలు వికసిస్తాయి. అప్పుడిక విరహగీతాలు మీగడ తరగల్లా ప్రవహిస్తాయి. ఆ వెల్లువలో తడవని రసజీవులుంటాయా! మరి అలాంటి వెన్నెలవాత పడిన ఈ బావా మరదళ్లు ఎంత హాయిగా ఆడుతూ పాడుతూ విహరించారో మీరే చూడండి.. ‘‘జాబిల్లి చూసెను నిన్నూ నన్నూ/ నాకెంతో సిగ్గాయె బావ బావ’’ అని మరదలు అనగానే ‘‘ముద్దు మురిపాలతో భావ రాగాలతో/ యవ్వనం పువ్వులా నవ్వనీ’’ (మహాకవి క్షేత్రయ్య) అంటాడు బావ. ఇలా ఆ ఇద్దరూ చిందులేసేస్తుంటే నేనూ అలా ఆడలేకపోయానే అని నిట్టూర్చుతాడు నెలరాజు.
వాళ్లు చిన్నతనంలో వెన్నెలకుప్పలాట ఆడుకున్నారు. ఇసుకలో గుజ్జనగూళ్లు కట్టుకున్నారు. మల్లెల పొదల మాటున దాగుడుమూతలాడారు. వయసుకొచ్చాక ‘‘లాహిరి లాహిరి లాహిరిలో’’ అంటూ నౌకావిహారం చేస్తున్నారు. ఆ ఆనందపు పరవళ్లు ఎలాంటివో, ఆ ఉల్లాస కెరటాల వెల్లువలో ఎలా సాగిపోయారో చూస్తే నిండు చందురుడు మన మదిలోనూ తిష్ఠవేస్తాడు. ‘‘తారాచంద్రుల విలాసములతో/ విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో/ పూల వలపుతో ఘుమఘుమ లాడే/ పిల్లవాయువుల లాలనలో..’’ అంటూ వాళ్లు విహారం చేస్తుంటే ఎంతహాయిగా ఉంటుందీ! మాయాబజార్‌ చిత్రం కోసం పింగళి రాసిన ఈ పాట వింటుంటే మనసులో ఒక రసానుభూతి. ఆ రసపట్టులో తర్కం విడిచిపెట్టి పెద్దలు కూడా వెన్నెల విహారం చేశారంటే అదంతా ఆ చందురుని చలవే కదా!
చల్లని నేస్తం!
      రోజూ కనిపించి వెన్నెల మధువు పంచే చందమామ కనిపించకపోతే గుండె తల్లడిల్లుతుంది. అదీ ఆవేదనలో ఉన్నవారికైతే ఆ బాధ వర్ణనాతీతం. అందుకే ‘‘చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి/ మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి/ వెళ్లనివ్వరా వెన్నెలింటికీ/ విన్నవించరా వెండి మింటికీ/ జోజో లాలీ... జోజో లాలీ’’ అంటూ ఆ ‘పిచ్చి’పిల్ల దీనంగా జోల పాడింది. ‘ఆపద్బాంధవుడు’ కోసం సిరివెన్నెల అందించిన ఈ గీతంలో చందమామకోసం చుక్కల్ని అడిగిన తీరు కొత్తగా ఉంటుంది. 
      తన ప్రేమ విషయంలో ఆమె మనసెందుకో కరిగేలా కనిపించడంలేదు. ఆమె పట్టుదల ఆమెది! అతని ఆరాటం అతనిది. ఇలాంటి సమయంలో తన గోడు వెళ్లబోసుకోవడానికి అతనికి జాబిలే సరైన నేస్తంగా కనిపించింది. మరుక్షణం ఆలస్యం చెయ్యకుండా ‘‘జాబిలమ్మ నీకు అంత కోపమా/ జాజిపూల మీద జాలి చూపుమా/ నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే/ అల్లాడిపోదా రేయి ఆపుమా!’’ (‘పెళ్లి’లోని సిరివెన్నెల పాట) అంటూ తన ఆవేదన గుప్పించేశాడు. ప్రియురాలిని జాబిల్లితో, తనను జాజిపూలతో పోల్చుకోవడం ఇందులోని గమ్మత్తు. 
      చందమామలాంటి అమ్మాయి పక్కనుంటే, ఆందోళనతో నిద్ర కరవై ఆమె బిక్కుబిక్కుమంటూ ఉంటే మనసున్న ఏ వ్యక్తి మాత్రం చూస్తూ ఉండగలడు. అందుకే ‘‘జాము రాతిరీ జాబిలమ్మా/ జోల పాడనా ఇలా/ జోరుగాలిలో జాజికొమ్మా/ జారనీయకే కలా/ వయారి వాలుకళ్ల లోనా/ వరాల వెండి పూల వానా.../’’ అంటూ పాట అందుకున్నాడా అబ్బాయి.  ‘క్షణం క్షణం’ సినిమా కోసం సిరివెన్నెల రాసిన ఈ పాటను విన్నా, వెండితెర మీద చూసినా మనసంతా పున్నమి వెన్నెల పరచుకోకమానదు! 
      పాలమీగడలా, మూకుట్లో జున్నులా మెరిసిపోయే చందమామను అందుకోవా లని ఎవరికుండదు! ముఖ్యంగా పిల్లలకైతే జాబిల్లి తమ కోసం దిగిరావాలని మరీ కోరిక. ‘‘చందమామ రావే... జాబిల్లి రావే’’ అని పాడుతూ గోరుముద్దలు తినిపించే అమ్మ పలుకులు వారి ఆకాంక్షను మరింత రెట్టింపు చేస్తాయి. పుట్టుకతోనే చూపు కోల్పోయిన ఆ పాపకు కూడా చందమామ తన కోసం దిగిరావాలని ఆకాంక్ష. అయితే, ఒట్టి చేతుల్తో అలా వచ్చేస్తే ఉపయోగం ఏంటీ! అందుకే ‘‘చలువ చందనముల పూయ చందమామ రావే/ జాజిపూల తావినీయ జాబిల్లి రావే/ కలువ చెలువ కలలు విరియ కొండలెక్కి రావే/ గగనపు విరితోటలోన గోగుపూలు తేవే’’ (సిరివెన్నెల) అంటూ పెద్ద పనులే అప్పజెప్పిందా అమ్మాయి. అయితే, అవన్నీ జాబిల్లికి ఇష్టమైన పనులే కదూ! అలాగే ‘చంటి’ చిత్రం కోసం సాహితి రాసిన ‘‘జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే/ గంగలలో తేనెలలో కడిగిన ముత్యము లే...’’ పాటకి హాయి పొందని వారు ఉండరు. చిన్నారులను నిద్రపుచ్చడానికి పుచ్చపువ్వులాంటి వెన్నెల లాంటిదే కన్నతల్లిపాడే జోలపాటంటూ అమ్మప్రేమ ఎంత చల్లనిదో చెబుతుందీ గీతం.
      ఇలా తెలుగు చలన చిత్రాల్లో వందల సంఖ్యలో గీతాలకి జాబిల్లి ఆలంబన అయ్యింది. మదిలోని వేదనలకీ, పురివిప్పే ఆనందాలకీ, జీవితంలో తారసపడే అనేకానేక అనుభవాలకి చందమామ సాక్ష్యంగా నిలిచింది. మది బరువు మోయ లేక ముప్పిరిగొన్న గతానుభవాల గాఢతకి వేదికయ్యింది. ఈ చల్లని చూపుల దీవెనలో ముందుతరాలు కూడా తడవాలి. పాటల పూదోటలో మధురమైన భావ వెన్నెలలను జాబిల్లి నిత్యం విరబూయిస్తూనే ఉండాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం