పిట్ట కథలు బుర్ర కథలు

  • 1941 Views
  • 11Likes
  • Like
  • Article Share

ఆమె తెలుగు పాఠాలు చదువుకోలేదు. బడికెళ్లి నేర్చుకున్నదంతా ఆంగ్లంలోనే. చేసేదేమో సమాచార సాంకేతిక రంగ వ్యాపారం! కానీ అమ్మ నేర్పిన తెలుగు అక్షరాలను మాత్రం మర్చిపోలేదు. సరికదా! కథలు రాసే స్థాయిలో అమ్మభాషపై పట్టుపెంచుకున్నారు. ప్రధానంగా ఆమె పిల్లల కోసమే కథలు రాస్తున్నారు. తల్లిదండ్రుల ద్వారా వాటిని  చిన్నారిలోకానికి చేరువ చేయడానికి ఓ బ్లాగును ప్రారంభించారు. పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో... అనే బ్లాగు తెరచి అందులో క్రమం తప్పకుండా కథలను పెడుతున్నారు. ఇంతకీ ఆవిడ ఎవరంటే... బులుసు అనుపమ. ఆమె రాసిన కథలు తక్కువే అయినా... చక్కగా చదివింపజేస్తాయి. 
      అనుపమ బ్లాగులోని ఒక్కో కథను చదువుతుంటే చిన్నప్పటి మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. తాతయ్య, అమ్మమ్మల ఒళ్లో కూర్చుని కథలు వింటూ, ఊ కొడుతూ నిద్రలోకి జారిపోయే సన్నివేశాలన్నీ కళ్లముందు కదలాడుతాయి. కథలు విన్న గుర్తే తప్ప అవి మళ్లీ ఇప్పుడు చెప్పమంటే మన వల్లవుతుందా! ఎప్పుడో చిన్నప్పుడు విన్నవి గుర్తుండొద్దూ! కానీ అనుపమ... తన బాల్యంలో విన్న కథల్ని గుర్తుపెట్టుకున్నారు. వాటినే ఇప్పుడు సరికొత్తగా రాసి, వాటికి బొమ్మలు కూడా స్వయంగా వేశారు. 
      ఆమె బ్లాగులో... అత్యాశకు పోతే చివరికి దుఃఖమే మిగులుతుందంటూ చెప్పే అత్యాశగల కుక్క కథ, బాధ కలిగించే మాటలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదంటూ పిల్లల్లో పరివర్తన తెచ్చే నోరుజారిన మాటలు కథ, చెడ్డవారితో స్నేహం చేస్తే జరిగేది చెడేనంటూ చెప్పే పాము-స్నేహం కథ ఇలాంటి నీతికథలున్నాయి. ఇంకా కప్పా-పాము, కోపం వచ్చిన కోతులు, కన్న మమకారం, ప్రేమలో పడ్డపులివంటి  అన్నిరకాలైన కథలున్నాయి. నాణాల సంచి, అత్తారింటికి దారేది, బీర్బల్‌ జ్వరం, విష్ణు మహిమ, మనస్సాక్షి, తోటలో మొక్కలు: అడవిలో చెట్లు వంటి అక్బరు-బీర్బలు కథలున్నాయి. ఈ కథల్లో  బీర్బలు తెలివితేటలు (సమస్యల పరిష్కారంలో) అబ్బురపరుస్తాయి.
      మీరు కూడా చూడాలనుకుంటే... kathalu.wordpress.com


మా నాన్నగారి పేరు బులుసు రమణారావు. విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త. అమ్మ కృష్ణవేణి. విశ్రాంత ఉపాధ్యాయురాలు. నాన్న ఉద్యోగ రీత్యా అన్ని రాష్ట్రాలు చుట్టేసేవాళ్లం. చివరికి హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. అన్ని రాష్ట్రాలు తిరగడంవల్లనో, చదువుకున్నదంతా ఆంగ్లం వల్లనో తెలుగు చదవడం, రాయడం అంతగా వచ్చేది కాదు. కానీ నేను తెలుగు మర్చిపోకూడదని అమ్మ తెలుగులో కథలు చెప్పేది. అవి వింటూ నిద్రపోయేదాన్ని. పెళ్లాయ్యక అమెరికా వెళ్లిపోయా. మా అమ్మలాగే నేనూ మా పిల్లలకి తెలుగులో కథలు చెప్పాలనుకునేదాన్ని. అందుకోసం తెలుగు పుస్తకాలు, వెబ్‌సైట్లు ఉన్నాయేమో అని వెతికా. నాణ్యమైనవి అంతగా కనపడలేదు. దాంతో చిన్నప్పుడు విన్న కథలను మెల్ల మెల్లగా గుర్తుతెచ్చుకుని అవే వాళ్లకు చెప్పేదాన్ని. అయితే నాలాగే చాలామంది తమ పిల్లలకు కథలు చెప్పాలని ఆశ పడుతుంటారు. సరైన పుస్తకాలు దొరక్క ఇబ్బంది పడుతుంటారు.. అందుకే నాకు తెలిసిన కథల్ని రాయడం మొదలుపెట్టా. వాటన్నింటిని బ్లాగురూపేణా అందరికీ అందుబాటులో ఉంచుతున్నా. మొదట్లో చిన్న చిన్న అక్షరదోషాలు ఉండేవని బ్లాగు చూస్తున్నవాళ్లు చెప్పేవాళ్లు. తప్పులను సరిదిద్దుకుంటూ... తర్వాత్తర్వాత పట్టుపెంచుకున్నా. నాకు ఏదైనా తెలియకపోతే ఇప్పటికీ మా అమ్మ సలహాలు తీసుకుంటుంటాను. అలా 2009లో మొదలుపెట్టిన నా బ్లాగు అతితక్కువ కాలంలోనే చాలామందికి చేరువైంది. వృత్తిపరంగా అయితే... హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్, డెలాయిట్‌ తదితర సంస్థల్లో పనిచేశా. తర్వాత నేను, మావారు కలిసి ‘ఇంటిగ్రిథమ్‌ ఇంక్‌’ అనే ఐటీ సంస్థను సొంతగా ప్రారంభించాం. దాని వ్యవహారాలు చూసుకుంటూనే కథలు రాస్తున్నా.

- అనుపమ


 


వెనక్కి ...

మీ అభిప్రాయం