శ్రీకాకుళాంధ్ర దేవా

  • 1039 Views
  • 13Likes
  • Like
  • Article Share

ప్రాచీన వారసత్వ సంపద మనకు గర్వకారణం. అలాంటిది ఒక జాతి తొలిపాలకుడుగా ప్రసిద్ధి చెంది, ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిపోయిన రాజు ఆంధ్రమహావిష్ణువు. అలాంటి దేవుడి ఆలయం బాగోగులు చూసేవాళ్లు లేకపోయే సరికి, ఆవేదన చెందిన ఓ కవి ఏకంగా ఓ శతకాన్నే వెలువరించారు. ఆలయానికి పునర్వైభవం వచ్చేలా చేశారు. ఆ కవి కాసుల పురుషోత్తమ కవి. ఆ శతకం ఆంధ్రనాయక శతకం.
తెలుగువాళ్ల
తొలిరాజుగా చెప్పుకునే ఆంధ్ర విష్ణువు శ్రీకాకుళం (కృష్ణా జిల్లా) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. ఆయన నిశుంభుడనే రాక్షసుణ్ని చంపి, తన రాజ్యానికి ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం మీదుగా ఓ పెద్దగోడను కట్టాడట. ఈ మూడూ శైవక్షేత్రాలు అవడంవల్ల తెలుగునేల త్రిలింగదేశంగా ప్రసిద్ధిగాంచింది. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. దాంతో ఆయన దేవుడయ్యాడు. ఈ వృత్తాంతాన్నే ‘ఆంధ్ర ప్రశస్తి’లో తొలి ఖండికలో వర్ణించారు విశ్వనాథ సత్యనారాయణ. మొత్తానికి ఒకజాతి పేరుమీద దేవుడుండటం విశేషం.
తెలుగులో ప్రసిద్ధి చెందిన శతకాల్లో ‘ఆంధ్రనాయక శతకం’ ఒకటి. ఇది వ్యాజస్తుతి (నిందలో స్తుతి ఉండటం) అలంకారంలో నడిచిన శతకం. రచించింది 18వ శతాబ్దికి చెందిన కాసుల పురుషోత్తమ కవి. అసలుపేరు పుల్లమరాజు. కృష్ణాజిల్లాలోని పెదప్రోలు ఆయన స్వగ్రామం. వీళ్లది భట్టురాజుల వంశం. తల్లిదండ్రులు రమణమాంబ, అప్పలరాజులు. గురువు అద్దంకి తిరుమలాచార్యులు. ఈ కవి చల్లపల్లి రాజా మొదటి అంకినీడు బహద్దర్‌ ఆస్థానంలో ఉన్నాడు. ఈ శతకం చివరి పద్యంలో తాను ‘హంసలదీవి గోపాల, మానసబోధ, రామా భక్త కల్పద్రుమా శతకాలు’ రచించానని చెప్పుకున్నాడు కాసులకవి. హంసలదీవి గోపాల శతకం లభిస్తోంది. చివరి రెండూ అలభ్యాలు.
      శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలో భాగంగా ఒకనాడు (1518లో) శ్రీకాకుళంలో నిద్రించాల్సి వచ్చింది. అప్పుడు ఆంధ్రవిష్ణువు కలలో కృష్ణరాయలకు దర్శనమిచ్చి, ‘దేశ భాషల్లో తెలుగు లెస్స’. అందుకని ఆ భాషలో ఏదైనా గ్రంథాన్ని రాయమని ఆదేశించాడట. రచనను మాత్రం ఇష్టదైవానికి అంకితం ఇవ్వమన్నాడట. అలా రాయల చేతినుంచి జాలువారిన ప్రౌఢ ప్రబంధమే ‘ఆముక్తమాల్యద’. రాయలు ఈ దేవాలయం పోషణకు ఎన్నో దానాలు చేశాడు. అయితే కాలక్రమంలో ఆ వైభోగమంతా మాసిపోయి... ఆలయంలో ధూప, దీప నైవేద్యాలూ కరవైపోయేంతగా దిగనాసిల్లింది పరిస్థితి. 
నువ్వెలా గొప్ప... నీ గొప్పేంటి?
శ్రీకాకుళంలో ఉన్న ఆలయం 108 దివ్య తిరుపతులలో ఒకటి (ఈ శతకం 12వ పద్యంలో కవి దీనిని వక్కాణించారు). అలాంటి ప్రసిద్ధ ఆలయం శిథిలం కావడం, మూలవిరాట్టుకు నిత్యపూజలు ఆగిపోవడం, ఎవ్వరూ ఆలయ పునరుద్ధరణకు పూనుకోకపోవడంతో పురుషోత్తమకవికి దేవుడి గొప్పతనం మీద వ్యంగ్యం పొడుచుకొచ్చింది. ఆ వ్యంగ్యంలోంచి పుట్టిందే ఈ స్తుతినిందాపూర్వక శతకం. దేవుణ్ని నిందించినట్లు కనిపిస్తున్నా, నిజానికి అయ్యా! ఆంధ్ర మహావిష్ణూ మేమెవ్వరమూ నీ బాగోగులు చూడలేకపోతున్నాం. అన్ని అవతారాలు ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేశావు. అదేచేత నీ ఆలయాన్ని, ఆలయ సంప్రదాయాలను, ఉత్సవాలను నువ్వే ఉద్ధరించుకో అన్న ఆవేదన ఉంది. సీస పద్యాల్లో, ‘చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ/ హతవిమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ’ అన్న ద్విపాద మకుటంతో సాగుతుందీ శతకం.
అంచితాఖండ దీపారాధనల చేత
      దీపించునెప్పుడు దేవళంబు
అగరు సాంబ్రాణి ధూపార్పణంబుల చేత
      భవనం బదెప్పుడు బరిమళించు
నతి నృత్య గీత వాద్యస్వనంబుల చేత
      నెప్పుడు గోవెల యెసక మెసఁగు
నఖిలోపచార సమర్పణంబుల చేత
      మెఱయు నెప్పుడు దిరుమేను కళల
నిపుడొకించుక లోభిత్వ మెనసినట్లు
దోఁచు చున్నాఁడ విట్టి యద్భుతము గలదె...

      ఎడతెరపి లేకుండా దీపారాధనలు, సాంబ్రాణి ధూపాల పరిమళాలు, నృత్యగీత వాద్య రావాలతో దేవాలయం అలరారేది. ఇక నీ విగ్రహమైతే సకల ఉపచారాలు, సంతర్పణలతో మెరిసిపోయేది. ఇప్పుడేమో నువ్వు కొంచెం పిసినారివైనట్లున్నావు. ఇలాంటి అద్భుతం ఏమన్నా ఉందా? అని దెప్పిపొడుస్తాడు. తిరునాళ్లు దగ్గరపడ్డాయి. నువ్వేమో బోసిపోయి ఉన్నావు. రథోత్సవానికి, చక్రస్నానానికి ఏర్పాట్లు, వచ్చిన భక్తులకు ప్రసాదాలు ఎవరు ఏర్పాటు చేస్తారు. నీకు నువ్వే చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే నీ వంశచరిత్రను బట్టబయలు చేసి నిన్ను గేలిచేస్తాను అంటాడు పురుషోత్తమ కవి. 
      అన్న బలరామునికి నాగలి, రోకలి, తాటిటెక్కెం ఇచ్చి మద్యపానానికి అలవాటుపడేలా చేశావు. నువ్వేమో పంచాయుధాలు, గరుడధ్వజాన్ని తీసుకున్నావు. పాలుపెరుగులు మెక్కావు. అందుకే ‘తగవరివె యన్నదమ్ముల ధర్మమీవె/ తీర్పవలెగాని మరియొండు దీర్పగలడె..’ అన్నదమ్ముల తగవు తీర్చడం నీకు తప్ప వేరొకరికి సాధ్యంకాదు సుమా! అంటూ కౌరవ పాండవుల తగవును కృష్ణుడు తీర్చిన విధానాన్ని వ్యంగ్యం ఉట్టిపడేలా రాశాడు. తిరుమల వేంకటేశ్వరుడు, మంగళగిరి పానకాలస్వామి, సింహాద్రి అప్పన్న మూర్తుల్లా నువ్వెందుకు మూర్తిమత్వాన్ని చూపట్లేదు? అని ప్రశ్నిస్తాడు. ఒకవేళ నీకేమైనా కీర్తి లభించిందంటే... అది నీ భార్య లక్ష్మీదేవి, కొడుకు బ్రహ్మదేవుడు, కూతురు గంగల గొప్పతనమే కానీ, నీ గొప్పేం లేదయ్యా అని మేలమాడతాడు. 
      భూమిమీద ఏ వస్తువు రూపాన్నయినా వర్ణించవచ్చు. కానీ నీ రూపాన్ని మాత్రం తెలుసుకోలేం. సత్వ రజో తమో గుణాలతో అన్ని లోకాలను సృష్టించి పాలించి లయం చేసుకుంటావు. ఇంత చేసినా నువ్వు మాత్రం అంటీ ముట్టనట్లు ఉంటావు. మరి నిన్నెలా తెలుసుకోవాలి? ఎలా చూడాలి? తాబేలు ఆకారం దాల్చి మందర పర్వతాన్ని నిలబెట్టిన నువ్వు, మోహిని రూపంలో వచ్చి దేవతలకు మాత్రమే అమృతం పంచావు కదా. ఇదేం పక్షపాతమయ్యా? అలా చేయవచ్చా? రాక్షసులు నిన్ను నమ్మమంటే ఎలా నమ్ముతారు (అందుకే వాళ్లతో దీర్ఘకాల వైరం అన్న ధ్వని ఉంది)? ఆ తర్వాత పద్యాల్లో దశావతారాల- అందులోనూ రామావతారం, కృష్ణావతారాల వర్ణన ప్రధానంగా సాగుతుందీ శతకం. 
      ‘దుర్జన భంజనోద్యుక్త సుదర్శన ధారివే నీవు యథార్థముగను...’ పద్యంలో పాంచజన్యం పూరించి శత్రువుల గుండెల్లో భయాన్ని సృష్టించి, సుదర్శన చక్రం, కౌమోదకి గద, నందక ఖడ్గం ధరించి వాళ్లను దునుమాడతావు. అదే నిజమైతే ఈ శ్రీకాకుళంలో ఇలా స్తబ్ధుగా ఉన్నావేంటి? కొంచెం నీ ఆలయ బాగోగులు పట్టించుకోవయ్యా, ఓ ఆంధ్రదేవా! అని స్తుతిలోనే నింద చేశాడు. చివరికి వచ్చేసరికి, శంఖం, గద, నందకం, కౌమోదకాలను నీ నాలుగు చేతుల్లో ధరించి ధర్మస్థాపన చేస్తానంటావు. ఇక్కడేమో ఇలా పూజా పురస్కారాలు లేకుండా పడి ఉన్నావేమయ్యా? అని ఎత్తిపొడుస్తాడు.
పూర్వకవీంద్రుల పుణ్యఫలం బేమొ
       సాక్షాత్కరించి యస్మత్పరంబు
గా గద్యపద్యముల్‌ గల్పించుమని నీవు
       వరమొసంగితి వండ్రు వాంఛజేసి
నేర్చినట్లుగ నేను గూర్చి కవిత్వంబు
నీకంకితముఁ జేసి నెనరు దోఁపఁ... 

అంటూ ‘పూర్వకవులు (కృష్ణదేవరాయలు) నువ్వడిగితే కావ్యాలు రాశారంటారు. మరి నేనైతే నువ్వు అడగకున్నా నీమీద ఈ శతకం అల్లి నీకు అంకితం చేశాను. ఎన్నటికీ తరగని నీ కృపకు పాత్రుణ్ని చేయవయ్యా’ అని ప్రార్థిస్తాడు. ‘శబరి ఎంగిలిపళ్లను రుచిచూసిన దయ, కుబ్జ ఇచ్చిన గంధపు పూత పూసుకున్న కరుణ, ద్రౌపది ఇచ్చిన మెతుకును తిన్న దయ, యశోద ఇచ్చిన ఉగ్గుపాలు తాగిన కృప, మాలాకారుడు ఇచ్చిన పూలదండ ధరించిన ప్రేమ, కుచేలుడు కూరిమితో పెట్టిన అటుకులు తిన్నప్పటి స్నేహం, గుహుడు పాదాలు కడుగుతానంటే పొంగుకొచ్చిన సంతోషం, ఉడుత సేవను అంగీకరించినట్లే దీనినీ అంకితం తీసుకోవయ్యా’ అని వినయంగా విష్ణువును అడుగుతాడు కవి.
      ఈ శతకంలోని పద్యాలు తేలికగా ఉంటాయి. ఈ కవికి ఉన్న భాగవత పరిజ్ఞానం అపారం. అందుకే ‘ఒకవేళ భాగవతం పోతన రాయకుండా ఉండి ఉంటే, ఆ కార్యాన్ని కాసుల కవి పూర్తిచేసే వాడు’ అంటారు విశ్వనాథ. ‘ఆంధ్ర మహావిష్ణువు’ గుడి నిత్య పూజాదికాలకు నోచుకోలేని దుర్దశను చూసి ఈ శతకాన్ని రచించినందుకు ఫలితం దక్కింది. అప్పటి చల్లపల్లి రాజా తెలుగు వల్లభుడి ఆలయాన్ని పునరుద్ధరించాడు. పురాతన వారసత్వ సంపదను, మనదైన సంస్కృతిని పరిరక్షించు కోవాలన్న స్ఫూర్తిని ప్రకటించిన ఈ శతకం ఆంధ్ర సరస్వతి కంఠంలో నిజంగా కాసులపేరే.


వెనక్కి ...

మీ అభిప్రాయం