మాట్లాడండి... మాట్లాడుతూనే ఉండండి

  • 489 Views
  • 11Likes
  • Like
  • Article Share

పసిపిల్లలకు చక్కటి తెలుగు నేర్పించాలనుకుంటున్నారా? ఆ ప్రయత్నంలో భాగంగా రోజులో అరగంట/ గంట పాటు కథల పుస్తకాలు, పత్రికలను చదివి వినిపిస్తున్నారా? దానికంటే కూడా మీరు ఇంటిపనులు చేసుకుంటూనే పిల్లలతో మాట్లాడుతుంటే, వాళ్లకు చక్కటి భాషా నైపుణ్యాలు అలవడతాయి. చదివి వినిపించడం వల్ల పసివాళ్లకు వచ్చే భాష కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా మీ మాటల వల్ల వాళ్లు నేర్చుకోగలరు. ఐర్లాండ్‌కు చెందిన ‘ఆర్థిక, సామాజిక పరిశోధన సంస్థ’ ఈ విషయాన్ని ప్రకటించింది. 
      ఈ సంస్థ పరిశోధకులు... తొమ్మిది నెలల వయసున్న 7845 మంది పసివాళ్లకు వాళ్ల అమ్మలు భాషను నేర్పిన పద్ధతులను పరిశీలించి మరీ ఈ విషయాన్ని నిర్ధరించారు. పిల్లలు పదకొండు నెలల వయసు నుంచి మాతృభాషకు, ఇతర భాషలకు తేడాను గుర్తించగలరు. కాబట్టి, నెలల వయసు చిన్నారులతో వీలైనంత ఎక్కువ సేపు తెలుగులో మాట్లాడుతూ ఉంటే... పాఠశాలలో చేరే నాటికి వాళ్లకు అమ్మభాష మీద పూర్తి పట్టు వచ్చేస్తుంది. మరోమాట... టీవీ ద్వారా భాష నేర్పించాలనుకోవడం దీర్ఘకాలంలో చేటు చేస్తుందన్నది పరిశోధకుల మాట. రెండు నెలల నుంచి పన్నెండేళ్లలోపు పిల్లలకు టీవీ చూసే అలవాటు చేయకపోవడమే మంచిదంటున్నారు వాళ్లు. ఎందుకంటే, ఆ వయసు చిన్నారులు ఏ కొత్త విషయాన్ని అయినా అనుకరణ ద్వారానే నేర్చుకుంటారు. ముఖ్యంగా భాష విషయంలో... పెద్దల పలుకులనే అనుసరిస్తారు. అదే వాళ్లను టీవీ ముందు కూర్చోపెడితే... అందులో వినపడే అపభ్రంశ ప్రయోగాలు, ‘కట్టె-కొట్టె-తెచ్చె’ రూపంలోని వాక్యాలనే నేర్చుకుంటారు. తస్మాత్‌ జాగ్రత్త!


వెనక్కి ...

మీ అభిప్రాయం