రావిరేకలతో మొదలు బొబ్బిలికాయలతో ఆఖరు

  • 1115 Views
  • 12Likes
  • Like
  • Article Share

పట్టుచీరలో మెరిసిపోయే ఇల్లాలి ముక్కుకు ముక్కెర... మెడలో పచ్చలపేరు... చేతులకు పసిడి గాజులు... ఓహ్‌! లంగావోణీ కట్టుకుని... అరవంకీలు పెట్టుకుని... వడ్డాణం చుట్టుకుని... కాలి అందియలు ఘల్లుఘల్లుమన నడిచివచ్చే అమ్మాయి అయితే సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మే! సరే కానీ, మనకు ఉన్నవి ఈ కొద్దిపాటి ఆభరణాలేనా? మన పూర్వీకులందరూ వీటితోనే సరిపెట్టుకున్నారా? కాదు. ఒకటికి పది రకాల చొప్పున ఎన్నో ఎన్నెన్నో నగలను ధరించారు. అదీ ఏ స్థాయిలో అంటే, ఆ భూషణాల సోయగాలు నాటి కవులను కూడా కట్టిపడేశాయి. నేరుగా కావ్యాల్లోకీ వచ్చేశాయి. వాటిని పరిశీలిస్తే మనకిప్పుడు తెలియని... అసలు పేర్లే విననివెన్నో కనిపిస్తాయి.   
ఆదివారం
కెంపుల కమ్మలు, హారాలు... సోమవారం ముత్యాల హారాలు, గాజులు... మంగళవారం పగడాల దండలు, ఉంగరాలు... బుధవారం పచ్చల పతకాలు, గాజులు... గురువారం పుష్యరాగపు కమ్మలు, ఉంగరాలు... శుక్రవారం వజ్రాల హారాలు, ముక్కుపుడక... శనివారం నీలమణి హారాలు... ఇవీ ఏడువారాల నగలు! వీటికి తోడు కాసులపేర్లు, కనకపు చంద్రవంకలు, చెంపసరాలు...! ఇనప్పెట్టె తెరిస్తే చాలు, వీటి ధగధగలతో ఇల్లు ఇల్లంతా వెన్నెలమయమయ్యేది. జేజమ్మ నుంచి అమ్మమ్మకు, అమ్మమ్మ నుంచి అమ్మకు... లేకపోతే, అత్తగారి నుంచి పెద్దకోడలు దగ్గరికి ప్రయాణం చేసేవి. తరాల మధ్య అనుబంధాల వారధి కట్టేవి. 
      ఏడువారాల నగలు తదితరాల గురించి కాస్తో కూస్తో తెలుసు. కానీ, వాటికి మించిన ఆభరణాలెన్నో తెలుగునాట మెరుపులు మెరిపించాయి. వాటిలో చాలామటుకు ఇప్పుడెక్కడా కనపడట్లేదు. కావాలంటే కేతన ‘దశకుమార చరిత్ర’ చూడండి... ఎన్ని భూషణాల ప్రస్తావన ఉంటుందో! కన్నరడాలు, గట్టినూళ్లు, సుద్దసరితీగె, మినుకులు, సందిదండ, చేకట్టు పాళెలు, సరిపెణలు, ఆలక్తం... ఇవీ నాటితరం అలంకరణాలు. తిక్కన కాలంలో స్త్రీ, పురుషులిద్దరూ మట్టెలు ధరించేవాళ్లు.  ‘....లలితంబులగు మట్టియలు చప్పుడింపారనంచ కైవడి నలనల్లవచ్చి...’, ‘మట్టియ లొండొంటి బిట్టు దాకగ నేల నందంద మునిగాళ్ల నప్పళించుచు’ అంటూ ఆంధ్ర మహాభారతం విరాటపర్వంలో ఓ వర్ణన ఉంది. ఈ మట్టెలకు అదనంగా కాసుల పేర్లు, కంటెలు వంటి వాటిని స్త్రీలు ధరిస్తే, మగవాళ్లు చెవిపోగులు, పూసల వరుసలు, మెడహారాలు, కడియాలు అలంకరించుకునేవాళ్లు. 
అయ్యలరాజు ఆభరణాలు 
భద్రకారకుడనే స్వర్ణకారుడి భార్య ఎన్నేసి నగలతో వెలిగిపోయేదో ‘హంసవింశతి’ ఏడో కథలో వర్ణిస్తాడు అయ్యలరాజు నారాయణకవి. ఆమె ధరించినవే కాకుండా ఆ కవి పేర్కొన్న మరికొన్ని ఆభరణాలను కూడా లెక్కేస్తే ఎన్ని తేలతాయో చూడండి ... కుప్పె (సవర కుప్పె. సిగపై/ కొప్పు చుట్టూ ధరిస్తారు), రాగిడిబిళ్ల (బంగారం రేకుతో చేసే జడబిళ్ల), సూసకం (పల్లేరు పువ్వు/ సిగపువ్వు), కుంకుమరేఖ (లలాటాభరణం), రావిరేక (పాపిటబిళ్లకు దగ్గరగా ధరించే పతకం) బుగడలు (చెవుల కోసం బంగారం, ముత్యాలతో చేస్తారు), సరిపెణలు (సర్పాకార కర్ణభూషణం), గౌడసరాలు (హస్తభూషణాలు - చెంపసరాల్లాంటివి), కుతికంటు (కన్యలకు ప్రత్యేకమైన బంగారు కంఠాభరణం), గుండ్లపేరు, మెడనూలు (బంగారు తీగల హారం), సరిగె (ముంజేతి హారం); హంసకంబులు (కాళ్లకు కట్టుకునే గజ్జెల కడియాలు), బొబ్బిలికాయలు (కాలి బొటనవేలికి ధరిస్తారు)! వీటిలో ఇప్పుడు వినియోగంలో ఉన్నవెన్ని? 
      రెడ్డి రాజుల కాలంలో స్త్రీలు నత్తు, కమ్మలు, పచ్చపూసలు అలంకరించుకునే వారని శ్రీనాథ చాటువులు సాక్ష్యమిస్తున్నాయి. వడ్డాణం, దానికి గజ్జెల గొలుసు, నూపురాలు (కాళ్ల గొలుసులు), మూడు పేర్ల దండ, కంకణం, కమ్మలూ ఆ కాలంలో కనిపించేవి. కాకతీయుల కాలంలో ముక్కర, వంకీలు, దండ కడియాలు, మట్టెలు, పిల్లేల్లు సర్వసాధారణం. ఓరుగంటి స్త్రీలకూ తాటంకాలు (దంతంతో చేసిన చెవి కమ్మ), ముత్యాల కమ్మలు, కాంచీనూపుర కంకణాలు, తిసరాలు, మెరవంక కడియాలూ అలంకారాలయ్యాయి. 
విజయనగర మణిహారాలు
విజయనగరం కాలం నాటి మహిళలైతే నత్తు, ముక్కెర, వంకీ కమ్మలు, నెత్తిబిళ్లలు, హారాలు, దండకడియాలు, కంకణాలు, కాలి కడియాలు, మట్టెలు, బొబ్బిలికాయలతో సింగారించుకునే వాళ్లు. ఇక తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యం’లో నిగమశర్మ సంగతి తెలిసిందే కదా. ఇంట్లో ఉన్న నగా నట్రా, చివరికి అక్క ముక్కెర కూడా తీసుకుని పారిపోతాడు. అతను మూటగట్టుకు పోయిన వాటి విలువ ‘అమూల్యం’.  
గోమేధికోపలాంకూర మానితములు
పుష్యరాగచ్ఛటా పుంఖితములు
వైఢూర్య సంధాన వర్ణనీయంబులు
హరినీల కీలనాభ్యంచితములు
కురువింద సందర్భ గురుతరంబులు, 
చతుర్విధ వజ్రదళ సమావేల్లితములు
మహనీయత హరిన్మణిపరీతంబులు
సకలుషస్థూల మౌక్తిక యుతములు
పద్మరాగ పరీరంభ భాస్వరములు,
దండవిద్రుమ కృత సముద్గత భృతములు
మాతృభూషలు, నత్తికామండనములు
నిజ యువతి దాల్చు సొమ్ములన్నియు 
హరించి...

‘‘...గ్రొత్తగాఁజేయించుకొన్న ముక్కరకు వై/ యడలు దుర్వారయై యాడు బిడ్డ’’ అని నిగమశర్మ అక్క మొరపెట్టుకుంటుంది. 
      ‘పసమించు ముత్యాల పాపట బొట్టు/ పౌజుల కమ్మలు పల్లేరు పూలు/ రాజిల్లు రత్నాల రాగిడి వెట్టి/ కెంపుల ముక్కర గిలక సరంబు/ సొంపుతో వజ్రాల జోడు హారములు/ బంగారు పట్టెడ బన్న సరములు.....’’ అంటూ సమకాలీన ఆభరణాలను ‘సారంగధర చరిత్ర’ కావ్యనాయికకు అలంకరించాడు కూచిమంచి తిమ్మకవి. మరోవైపు... ‘ఇందుమతీ పరిణయం’లో అంగద బసవయ్య, ‘క్రీడాభిరామం’లో వినుకొండ వల్లభరాయుడు, ‘రామాభ్యుదయం’లో అయ్యలరాజు రామభద్రుడు, ‘శుకసప్తతి’లో కదిరీపతి తదితరులూ తెలుగువాళ్ల నగల నిగనిగలను అక్షరీకరించారు. 
జానపదుల మాట
బాలరాముణ్ని కౌసల్య ముస్తాబు చేసిన తీరును ‘పుత్రకామేష్టి’ పాటలో వర్ణిస్తారు జానపదులు. ‘అందమైన పాదములకు అందేలు మూగాలు/ కుందనంపు కడియాలు జైమ్నిగొలుసులూ/ మద్దికాయలు చెవులాకు మకర కుండలమ్ములు/ ముద్దురావిరేక నొసట మొలకు గంటలూ/ పచ్చపట్టు బట్ట గట్టి పగిడి మొలకట్టు కట్టి/ వన్నెమీర బంగారు వత్తులేసియు...’  అంటూ చెప్పుకొస్తారు. ఇవే కాదు, కంఠమాల, పులిగోరు, నాగసరాలు, ముత్యాలపేర్లు, హారమణులు, వజ్రాలజోడు కవచాలు కూడా పెడతానని పిల్లాణ్ని ఊరిస్తుంది ఆ తల్లి. ఆ సంగతి అలా ఉంచితే, ‘కాటమరాజు’ కథలో గోసంగి దళాల వేషభూషణాలివి... 
కొమరొప్పగా నంత క్రొత్త చల్లడము
కమనీయమగు చంద్రకావి దట్టీలు
పులితోలు బిరుదులు పూని కాసెలును
జెలువైన సరిపెనల్‌ చెంపగంధాలు
గాటంపు టరిగెలు గంటగాలమును
నీటైన కుడిసిగలు నిలువు నామములు
సిగల బువ్వులచెండ్లు సింహమరిగెలును
నొకకాల నొరలేటి నొఱను రుమాళ్లు
నొరలు గోసిన కత్తులొనర జేపట్టి
కిరుచు చేకత్తులు గీరు గంధాలు
బొగడ పచ్చలపేరు బేజు బంధువులు
తగిన గవ్వల పేర్లు దండకడియములు
వెలుగు తలాటములు వేడ్క భుజములును
నెలుగు చర్మంబులు నెన్నగాగటిని
నెడపగ బిరుదులన్నియు సవరించి
యెడమ చేతను గొమ్ముయిరవొక్కవేరు
కోపంపు జూపును కోరమీసమును
దాపిన నవరత్న దండకడియములు
రంగుమీరిన వన్నె రావి రేకలను...

      చంద్రకావి దట్టీలు, పొగడ పచ్చలపేరు, గవ్వలపేర్ల ఆనవాళ్లు ఇందులో కనిపిస్తాయి. పచ్చల కడియాలు, పటలం (బెల్టు), పుంజాలదండలు (కంఠాభరణాలు), పూదెల (బంగారు పూసల) కడియాలు, నీలాల కంఠసరులు,  మొగ పూలతీగెలు, సందుల దండలు, యెత్తులు, బన్నసరులు (కట్లదండ), చేరుబొట్లు (పాపటబొట్లు), తాళీలు, చెవులపువ్వులు, కదలు మట్టెలు, గిలుకు మెట్టెలు, బంగారుపూల హారాలు, బావిలీలు (చెవులకు పెట్టుకునేవి), నానుగ్రోవులు (కంఠహారం); కట్లు (చిన్నపిల్లల చేతులకు కట్టే బిళ్లలు), మండగొలుసులు... ఇవన్నీ మన పెద్దలు ధరించి మురిసిపోయిన ‘మేలిమి బంగారాలే’!
      పూర్వీకుల దగ్గర ఆభరణాల తయారీ నేర్చుకోకపోవడమో, ఆనాటి ‘ఆకృతు’లను (డిజైన్లు) ఆభరణాలుగా మలిచే వాళ్లు లేకపోవడం వల్లనో మనవైన నగలన్నీ కనుమరుగయ్యాయి. 
      నిజానికి ఆభరణాలన్నీ అందం కోసమే. ఆ అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం. అందులోనూ మనకే ‘ప్రత్యేకమైన’ ఆభరణాలంటే వాటి అందమే వేరు. వాటిని ధరించడంలోని ఆనందమైతే ఇంకా ప్రత్యేకం. 
      అందుకే, వీటి గురించి తెలిసిన వాళ్లు మిగిలిన వారికి సమాచారం ఇచ్చినా... నాటి భూషణాలను పరిశోధించి తిరిగి తయారుచేయించగలిగినా మన సాంస్కృతిక వారసత్వ సంపద తిరిగి ప్రాణం పోసుకుంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం