సమగ్ర సాహిత్య సమాహారం

  • 1455 Views
  • 1Likes
  • Like
  • Article Share

తెలుగు సాహిత్యానికి నేటి తరంలో మేటి ప్రదర్శనా సామర్థ్యం ఉన్న సాధనాలుగా వెబ్‌సైట్లు, బ్లాగులూ పరిచయమయ్యాయి. అవి సాహితీ ప్రక్రియల్లో ఏదో ఒకే అంశానికి పరిమితమై ఉండటం కద్దు. ఇలాంటి అననుకూలతకు జవాబుగా... కథ, కవిత, వ్యాసం, పాట, జానపదాలు, పురాణాలూ, సంగీతం, చిత్రలేఖనం తదితర సాహితీ ప్రక్రియలను ఒకే గూటికి చేరుస్తూ వెలిసిందో వెబ్‌సైట్‌. అదే maganti.org
ఈ వెబ్‌సైట్‌ తెరవగానే కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నామనే అనుభూతి కలుగుతుంది. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి దారులున్నట్లు ఇందులో ఒక విభాగం తెరిస్తే మరిన్ని విభాగాలు దర్శనమిస్తాయి. తనకు అవకాశం ఉన్నంతమేర సాహిత్య విజ్ఞాన సర్వస్వమంతా ఒకచోటుకు తీసుకొచ్చారు దీని నిర్మాత మాగంటి వంశీమోహన్‌. ఆయన ఈ పనిని మొదలుపెట్టిన సమయం(2005)లో కంప్యూటర్‌లో తెలుగు రాయడం కష్టంగా ఉండేది. అయినా సరే ఎంతో శ్రమతో తెలుగులో టైప్‌ చేసి ఈ వెబ్‌సైట్‌కు ఒక రూపమిచ్చారు. అమెరికాలో ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో ఒత్తిడికి లోనవుతున్నా, పట్టుదలగా తెలుగువాళ్లకోసం అపూర్వ సాహిత్య సమాచారాన్ని ఓ చోటకు చేర్చాలన్న తపనతో ఈ వెబ్‌సైట్‌కు ప్రాణం పోశారాయన.

maganti.org
పిల్లల పాటల సాహిత్యం మొదలుకొని అలనాటి తెలుగు కవుల పద్య- గద్య రచనలు, శతకాలు, సంస్థానాల విశేషాలతో అలరిస్తుందీ వెబ్‌సైట్‌. నాగీనాగీ నల్లేరు/ నాగిని పట్టుకు తన్నేరు/ ఈదులు ఈదులు తిప్పేరు/ ఈత గంధం పూసేరు.. వంటి అనంతపురం జిల్లాలోని గేలిపాట దగ్గరనుంచీ, పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు/ పాపాయి జులపాలు పట్టుకుచ్చుల్లు/ పాపాయి దంతాలు మంచి ముత్యాలు.. వంటి బుజ్జాయి గీతాల వరకూ ఉన్న పాటలన్నీ ఇక్కడ హాయిగా చదువుకోవచ్చు.
      ‘చిత్రాలు- కథలు’ విభాగంలో రామాయణం అంతా కళ్లకు కట్టినట్లుగా చూపించే చిత్రాలు కనువిందు చేస్తాయి. అందులోనే పి.డి.ఎఫ్‌ రూపంలో ఉన్న తెలుగు అనువాదాల విదేశీ కథలు కూడా చదువుకోవచ్చు. 
      అల్లసాని పెద్దన దగ్గరినుంచి చదలవాడ సుందరరామ శాస్త్రి వరకు 90 మంది కవుల రచనా విశేషాలు తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణ శతకం, వృషాధిపశతకం, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, సుమతీ, దాశరథి వంటి అపురూప శతకాల ఈ-పుస్తకాలున్నాయి.
      చేత వెన్నముద్ద చెంగల్వపూదండ/ బంగారు మొలత్రాడు పట్టుదట్టి/ సందెతాయెతులును సరిమువ్వ గజ్జెలు/ చిన్నికృష!్ణ నిన్ను జేరి కొలుతు.. అంటూ సాగే శ్రీకృష్ణ స్తుతి వంటి 128 రకాల చాటుకవిత్వ భండారమంతా చక్కగా పొందుపరిచారు. సువ్విరార సుందరాంగ సువ్విధీర సుగుణ చంద్ర.. అనే సువ్వి పాట మనకు తెలిసిందే. వీటితోపాటు జోలపాట, కోతలపాట, మంగళహారతి, రామనామము, రామలాలీ మేఘశ్యామలాలీ వంటి 84 రకాల జానపద గీతాలు మైమరపింపచేస్తాయి. 
      సమస్యాపూరణంలో ‘లలితాంగి పంజరమ్మునఁ/ గలచిలుకల హెచ్చరింపఁ గడు మధురముగాఁ/ జిలుకలు కలకల పలికెడు/ పలుకులు గూబలకు మిగుల పండుగసేసెన్‌..’ వంటి 86 కంద పద్యాలు అబ్బురపరుస్తాయి. మేలుకో కృష్ణయ్యా మేలుకోవయ్యా/ బంగారు చెంబుతో పన్నీరు పట్టుక పడతి రుక్మిణి వచ్చే మేలుకో.. అంటూ శ్రీకృష్ణులవారి మేలుకొలుపులతో సాగే మధురమైన జానపదాలు మనసుని రంజింపచేస్తాయి. 
      నాటకరంగ ప్రముఖుల చిత్రాలతో సహా వారి వివరాలను తెలుసుకోవచ్చు. జానపద కళాకారుల ముఖచిత్రాలు కూడా ఇందులో దర్శనమిస్తాయి. జానపద సాహిత్యంతో పాటు లలిత సంగీత సాహిత్యం, వేదాంత పాటల సాహిత్యం మేళవించి ఉంది.  అలనాటి పత్రికల్లో మేరునగ సమానులైన సాహితీవేత్తలు రాసిన వ్యాసాలను సేకరించి ‘అపురూప సాహిత్యం’ పేరిట అందించారు. సంవత్సరాది, దసరాపాట, నాగులచవితి, వరలక్ష్మి పిలుపు, గొబ్బియాలో, శ్రావణ శుక్రవారం వంటి పండుగ పాటల సాహిత్యంలో తెలుగు నిండుదనం కనిపిస్తుంది.
      తెలుగువాళ్లు గర్వించదగ్గ ఆనాటి గద్వాల, వేంకటగిరి, పాల్వంచ, బొబ్బిలి, పిఠాపురం, అమరావతి వంటి సంస్థానాల పూర్తి సమాచారాన్ని చదువుకోవచ్చు. గిడుగు రామమూర్తి, త్రిపురనేని గోపీచంద్, శంకరంబాడి సుందరాచారి, బూర్గుల రామకృష్ణారావులాంటి 67మంది దిగ్గజ కవుల వివరాలు తెలుసుకోవచ్చు. సినీ రచయిత పింగళి నాగేంద్రరావు రాసిన వ్యాసాలు, ఉత్తమ ఛాయాచిత్ర గ్రాహకుడు మార్కస్‌ బార్ట్లే తీసిన అలనాటి పాత సినిమాల చిత్రాలు ఔరా అనిపిస్తాయి.
అలా మొదలయ్యింది..
మాగంటి వంశీమోహన్‌ స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం. తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబంతో హైదరాబాద్‌ వచ్చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్యం అంటే అభిమానం. అందుకు కారణం వాళ్ల నాన్న మాగంటి శివరామశర్మ ప్రోత్సాహమే. ఆ తర్వాత ఆ అభిమానాన్ని పెంచి పోషించినవారు తన పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయిని కరుణమ్మ. ఈ వెబ్‌సైట్‌ను రూపొందించడానికి కారణమేంటని అడిగితే...
      ‘నేను ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లినప్పుడు అక్కడ తెలిసినవారు కానీ మిత్రులు కానీ ఎవరూ లేరు. అందుకని ఎక్కువగా పుస్తకాలతోనే కాలక్షేపం చేసేవాణ్ని. ఒకరోజు అంతర్జాలంలో వాడపల్లి శేషతల్పసాయి ఆంధ్రభారతి వెబ్‌సైట్‌ను చూశాను. దాంతో నాకొక ఆలోచన వచ్చింది... అమెరికాలోని తెలుగువారికి మనవంతు సాయంగా తెలుగు వెబ్‌సైట్‌ పెడితే బాగుంటుందని. ముందుగా దేంతో ప్రారంభించాలన్నది అప్పుడు నాముందున్న ప్రశ్న. నాకు పిల్లల కథలంటే చాలా ఇష్టం. అదీకాక అప్పట్లో పిల్లల కథలున్నా అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌లు లేవు. అందుకే పిల్లలకు కావాల్సిన సమాచారంతో 2005లో మాగంటి.ఆర్గ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించాను’ అని గుర్తుచేసుకున్నారు. తర్వాత అందులో సాహిత్యం, సంగీతం... ఇలా ఒక్కోటీ చేరుస్తూ వచ్చారు. ఇందులోని అంశాలు కొన్ని ఆయనకు గుర్తున్నవి, ఇంకొన్ని వాళ్ల నాన్నగారి డైరీల్లోవి, మరికొన్ని ఆయా రచయితలను సంప్రదిస్తూ.. ఇలా పలురకాలుగా సేకరించారు.
      ‘ఉద్యోగం చేసుకుంటూ విరామంలో రోజుకు మూడు గంటలు దీని గురించి పని చేసేవాడిని. ప్రతి శని, ఆదివారాలు కొత్తవి జతపరుస్తూ ఉంటాను. అయితే టైపింగుకు చాలా సమయం పట్టేది. ఆ తర్వాత ప్రూఫ్‌ రీడింగ్, దాన్ని ప్రచురించడం ఇలా ప్రతిదానికి చాలా సమయం పట్టేది’ అంటూ సాధక బాధకాలను వివరించారు.
      ఇప్పుడంటే యూనికోడు అందుబాటులోకి రావడం వల్ల కంప్యూటర్లో తెలుగు రాయడం తేలికైపోయింది. కానీ అప్పట్లో కంప్యూటర్లో తెలుగు రాయడం కష్టంగా ఉండేది. ఎందుకంటే ఒకటో రెండో సాఫ్ట్‌వేర్లు మాత్రమే ఉండేవి. అవీ ఒక్కోసారి పనిచేసేవి, ఒక్కోసారి పనిచేసేవికావు. అయినా తనకున్న సాహిత్యాభిమానం, పట్టుదల ముందు ఇవేం పెద్ద కష్టాలుగా అనిపించలేదని అంటారు వంశీ. ఈ సైట్‌ను ఇప్పటికి దాదాపు 55 లక్షలమంది చూశారని చెప్పడం వెనక ఆయన ఇష్టకష్టాలు చిరునవ్వులుగా పెదవుల మీదికి చేరాయి...!


వెనక్కి ...

మీ అభిప్రాయం