అలరించే కళారూపం... చిందు

  • 645 Views
  • 3Likes
  • Like
  • Article Share

గజ్జెలు కట్టుకున్న కాళ్లు రంగమెక్కి వాయిద్యాలకు అనుగుణంగా పాడుతూ ఆడుతూ ఉంటే... చూసేవాళ్ల కాళ్లు కూడా అప్రయత్నయంగా చిందులేస్తాయి. పాటకు తగ్గ ఆట... ఆటను రక్తిగట్టించే పాటలతో మెరిపించి, మురిపించే ఆ జానపద కళే చిందు యక్షగానం. అలాంటిది ఆధునికత, ప్రపంచీకరణల ధాటికి ఆదరణ కోల్పోయి, మిగతా కళల్లాగే కనుమరుగయ్యే దశకు చేరుకుంది. దీనికి మళ్లీ వైభవం కల్పించేందుకు సంకల్పించింది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. అందులో భాగంగా హైదరాబాదు రవీంద్రభారతిలో ఫిబ్రవరి 19 - 28 మధ్య చిందు యక్షగాన ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన ఎందరో కళాకారులు తమ ప్రదర్శనలతో ఆ పది రోజుల పాటు ఆహూతులను కట్టిపడేశారు.
‘శ్రీగణనాథా
శ్రీగణనాథా యోగివరద మమ్మేలు శ్రీగణనాథా/ విద్యలధిపా విద్యలధిపా..’ అని పాడుతూ మద్దెల, తాళాలు, హార్మోనియం వాయిద్యాలకు తోడుగా గజ్జెలు ఘల్లుమంటూండగా చిందు తొక్కుతారు వాళ్లు. దీని నుంచే ఈ కళాకారులకు చిందులు అని పేరు వచ్చి ఉంటుంది. వీళ్ల గోత్రం గంగధారి, వంశం మునివంశం, బొట్టు నామాలు. ఒకప్పుడు వీళ్లు దళిత వర్గమైన మాదిగవారి మీద ఆధారపడి జీవించేవాళ్లు. ఆ తర్వాత కాలానుగుణంగా వీళ్ల ప్రదర్శనలు వివిధ రంగాల మీద గజ్జెకట్టాయి. వశిష్టుడు అరుంధతిల కుమారుడైన శక్తి సంతానమే చిందులని ఓ పౌరాణిక కథ కూడా ఉంది. వీళ్లకు జాంబవంతుడికీ రక్తసంబంధం ఉందంటారు. వీళ్ల భాష సంస్కృతి, ప్రత్యేకం. అనాదిగా తెలుగుజాతిని తమ ఆటపాటలతో అలరిస్తున్న ఈ చిందుల కళానైపుణ్యానికి ఆ రోజుల్లో రాజులూ మంత్రముగ్ధులయ్యే వాళ్లు. అదంతా చరిత్ర!  
      చిందులు ఎక్కువగా ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో ఉంటారు. రామాయణ, భారత, భాగవత కథల్ని నృత్య నాటకాలుగా ప్రదర్శిస్తారు. ఇవి పగటి వేషాల కోవకు చెందుతాయి. స్త్రీలు పురుషులు ఇద్దరూ పాల్గొంటారు.  వంశపారంపర్యంగా ఈ కళను కొనసాగిస్తున్న చిందులు... యాభై యక్షగానాల వరకు ప్రదర్శిస్తారు. ప్రదర్శన సామగ్రిని సొంతంగా తయారు చేసుకుంటారు. మృదంగం, తాళం, చిప్పలు, గజ్జెలు, హార్మోనియం ప్రధాన వాయిద్యాలు. వీటికి నటుల నేపథ్య గానం అదనపు ఆకర్షణ. ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా ఎల్లమ్మ ఆట తప్పనిసరి. ఏ ప్రాంతంలోనైతే చిందులు ఈ ఆట ఆడతారో... అక్కడ కరవు రాదని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు.
ప్రదర్శించే నాటకాలు
మోహినీ రుక్మాంగద, సారంగధర, చెంచులక్ష్మి, వీరాభిమన్య, అల్లీరాణి, భక్తప్రహ్లాద, సుందరకాండ, సతీ సావిత్రి, మైరావణ వధ, గంగా గౌరీ సంవాదం చిందు కళాకారులు ప్రదర్శించే ముఖ్యమైన నాటకాలు. ప్రదర్శనలో మధ్యమధ్య ప్రజల సమస్యలను సందర్భోచితంగా చొప్పించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. ఎవరి పాత్ర సందర్భం వచ్చినప్పుడు వాళ్ల వాళ్ల పాటలు, పద్యాలు ఆలపిస్తారు. స్త్రీలు తాళాలు వాయిస్తారు. చిందు ఎల్లమ్మ, శ్యాం, గోపాల్‌ బృందాలు ఈ కళారూపానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టాయి. నిజామాబాదు జిల్లా ఆర్మూరు కళాకారులు సారంగధర నాటకాన్ని రసవత్తరంగా ప్రదర్శిస్తారు.  
చిందులోళ్ల ఎల్లమ్మ
వర్తమాన కాలంలో చిందు యక్షగాన కేతనాన్ని శిఖరస్థాయిలో ఎగరేసిన వాళ్లలో చిందు ఎల్లమ్మ ముఖ్యులు. ఆమె అసలు పేరు సరస్వతి. చదువుల తల్లి సరస్వతీదేవి కొలువుతీరిన బాసరలోనే ఈ ‘సరస్వతీ’ జన్మించారు. పన్నెండో ఏటనుంచే తల్లిదండ్రులతో కలిసి ఊరూరు తిరుగుతూ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె ప్రభావతీ విలాసం, చెంచులక్ష్మీ, సుగ్రీవ విజయం మొదలైన వాటిని ప్రదర్శించే వారు. ఎల్లమ్మ ప్రదర్శనను చూసిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, తనను దిల్లీకి ఆహ్వానించారు. చిందు యక్షగానంలో ఆమె సేవలకుగాను 2004లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిభ పురస్కారం లభించింది. వాస్తవానికి ఈ కళను ప్రభుత్వం గుర్తించేలా చేసింది నటరాజ రామకృష్ణ. కొందరు పెద్ద కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నా... అప్పట్లో ఈ కళ ప్రజల ఆదరణకు దూరమైంది. అంతర్ధానానికి చేరువైంది. రామకృష్ణ చొరవ తీసుకుని, ప్రభుత్వ గుర్తింపు లభించేలా చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కళాకారులను ప్రోత్సహించేందుకు సంసిద్ధమైంది. 
ప్రదర్శనలకు కొత్తకోణం...
రవీంద్ర భారతి ఘంటసాల ప్రాంగణం వేదికగా చిందు కళాకారులు వివిధ యక్షగానాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, చిందు యక్షగాన కళాకారుల సంఘం సంయుక్తంగా నిర్వహించాయి. ఇందులో రోజుకు రెండు బృందాల చొప్పున మొత్తం ఇరవై చిందు యక్షగానాలు ప్రదర్శితమయ్యాయి. కాకతీయ చరిత్ర, బాణాసుర వధ, సతీ తులసి, బతుకమ్మ, భూకైలాస్, మైరావణ వధ, శశిరేఖా పరిణయం తదితర యక్షగానాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమ నేపథ్యంగా ‘మన ఊరు- మన చెరువు’ యక్షగానమూ ప్రదర్శితమైంది. చిందు ప్రదర్శనలో ఇది కొత్తకోణం. 
      ‘మన ఊరు - మన చెరువు’కు తెలంగాణ జానపద కథ ‘చిన్నమ్మ కథ’ ప్రేరణ. దీనిలో సంభాషణలకే ప్రాధాన్యం ఇచ్చారు. పూర్వం ఓ రాజ్యాన్ని రాజు ధర్మంగా పాలిస్తుండేవాడు. ఆయన కోడలు చిన్నమ్మ. ఓ సారి కుండపోతగా వర్షం కురుస్తుంది. దాంతో అక్కడి చెరువు తెగిపోతుంది. పంటలు మునిగిపోతాయి. అప్పుడు ప్రజలు చెరువు దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తారు. దానికి జలదేవత రాజు కోడలు చిన్నమ్మను తనకు సమర్పిస్తే మళ్లీ ఎప్పట్లా అయిపోతానంటుంది. దాంతో ప్రజలు రాజు దగ్గరికి వెళ్లి విషయం విన్నవించుకుంటారు. ప్రజలా కుటుంబమా అన్న సందేహంలో మునిగిపోతాడు రాజు. చివరికి ప్రజలవైపే మొగ్గుతాడు. తన కోడలికి ఆ సంగతిని చెబుతాడు. దానికి ఆమె ‘నా ప్రాణాలు రాజ్యాన్ని కాపాడతాయంటే అలాగే కానీయండి’ అంటుంది. ప్రజలందరూ వెంటరాగా చెరువులోకి ప్రవేశిస్తుంది. ఆమె నీళ్లలో మునిగిన ప్రదేశంలో ఒక పువ్వు వికసిస్తుంది.(ఆ పువ్వుకు గుర్తుగానే బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారట) అప్పుడు చెరువు మామూలుగా అయిపోతుంది. చెరువు దేవత ప్రత్యక్షమై మీరు చెరువుల ప్రాధాన్యం తెలుసుకునేందుకే చిన్నమ్మను సమర్పించమన్నాను. అంతే తప్ప ఇంకేమీ లేదు. మీరు ఇకనుంచైనా చెరువును కాపాడుకోండి... అన్న సందేశాన్నిస్తూ సాగుతుంది ఈ చిందు యక్షగానం. ఇది ప్రాచీన కళ ఆత్మ చెరిగిపోకుండా, సమకాలీన అవసరాలకు అనుగుణంగా మలచి ప్రదర్శించారు. ఇందులో పర్యావరణ ప్రయోజనం, సామాజిక భద్రత, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతోపాటు జానపదం కూడా కలిసిపోయింది. ఇలా కళాకారుల ఆటపాటలతో, నవరసాలు పలికించే హావభావాలు, ఔరా అనిపించే సంభాషణలతో సాగిన ఈ చిందు కళా ప్రదర్శనలు ఆద్యంతమూ ప్రేక్షకులను అలరించాయి.
      తరతరాలుగా గ్రామీణులను తమ పనుల నుంచి సేదదీర్చి, వాళ్లకు ఉపశమనం కల్పించేందుకు పుట్టిన జానపద కళలకు రోజురోజుకూ ఆదరణ తగ్గుతోంది. వృత్తులు కూడా తమ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఇలాంటి దశలో ఈ కళలను కాపాడేందుకు బడులు, కళాశాలల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తే... కళలు కనుమరుగు కాకుండా కొనసాగుతాయి. అంతేకాదు వంశపారంపర్యంగా మౌఖికంగా వస్తున్న ఈ కళా సాహిత్యాన్ని గ్రంథస్థం చేసి, ఈ కళకే ప్రత్యేకమైన పదబంధాలు, జాతీయాలు, ఇతర భాషా విశేషాలు ముందు తరాలకు అందించాలి. అటు ప్రజలనుంచి, ఇటు ప్రభుత్వాల నుంచీ ఏ విధమైన ప్రోత్సాహం లేకున్నా... ఇప్పటికీ ఈ కళనే నమ్ముకున్న కళాకారులకు ఎంతో రుణపడి ఉన్నాం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం