గద్యానికి చిన్నయ

  • 461 Views
  • 2Likes
  • Like
  • Article Share

సన్నని యంచు పంచయును చక్కని కోటును ఉన్న శాల్వయున్‌
తిన్నని ఊర్ధ్వపుండ్రములు నేత్రములందు సులోచనమ్ములున్‌
చెన్ను వహింప ఛత్రమును చేత ధరించి సశిష్యుడౌచు యా
చిన్నయ సూరి నిత్యమును చెన్నపురిన్‌ జను పాఠశాలకున్‌
సన్నని
అంచు పంచె, కోటు, పైన శాలువా, నుదుట ఊర్ధ్వపుండ్రాలు, కళ్లద్దాలు అందంగా అలరారుతుండగా చేతిలో గొడుగుతో శిష్యులు వెంటరాగా... రోజూ మద్రాసు నగరంలో బడికి వెళ్తాడని వర్ణించాడో కవి. ఈ పద్యంలోని వర్ణన చూస్తే తెలుగు వచన రచనకు ఆదిగురువుగా నిలిచిన చిన్నయసూరికి అతికినట్టే సరిపోతుంది కదా! 
      నన్నయకు ముందే తెలుగులో పద్యకవిత్వం ఉంది. అయితే అది గాసటబీసటగా ఉంది. అలాంటి దానికి నిర్దిష్టమైన రూపురేఖలు సంతరించి పెట్టింది నన్నయ. అందుకే ‘పద్యానికి నన్నయ’! అలాగే చిన్నయసూరికి ముందే తెలుగులో గద్యకావ్యాలు ఉండి ఉండొచ్చు. కానీ వచన రచనకు పెద్దపీట వేసింది మాత్రం చిన్నయే. అందుకే ‘గద్యానికి చిన్నయ’ అంటాం. 
      చిన్నయ పూర్వీకులు ఉత్తరాంధ్ర నుంచి బతుకు తెరువుకోసం తమిళనాడు వలస వెళ్లారు. పరవస్తు రంగరామానుజాచార్యులు వైష్ణవ మతానుయాయి. చెన్నై నగరంలో ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఉంటూ బోధకులుగా జీవనం సాగించేవారు. అప్పటి పెద్దలు  ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు, ఆయన్ను చెన్నపట్టణం సమీపంలోని శ్రీపెరంబుదూరు గ్రామం పంపించారు. రంగరామానుజాచార్యులు, శ్రీనివాసాంబలకు 1806లో చిన్నయసూరి జన్మించాడు. పదహారేళ్ల వరకు చదువు సంధ్యలు లేవు. కంచి రామానుజాచార్యులు చిన్నయ పరిస్థితి తెలుసుకొని, సున్నితంగా మందలించాడు.
      చిన్నయ మదనపడి, తనకు చదువు చెప్పించమని తండ్రిని వేడుకున్నాడు. దీంతో రంగరామానుజాచార్యులు ఆ బాధ్యతను కంచి రామానుజాచార్యులకే అప్పగించారు.  చిన్నయ ఏకాగ్రతతో చదువుతూ తెలుగు, సంస్కృత, తమిళ భాషలలో పాండిత్యం సంపాదించాడు. వ్యాకరణం మాత్రం తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. వీటితోపాటు తర్క, మీమాంస, వ్యాకరణాలు ఆకళింపు చేసుకున్నాడు. వేదాధ్యయనంతో జ్ఞానాభివృద్ధి చేసుకున్నాడు. చెన్నపట్టణంలో గాజుల లక్ష్మీనరసుశెట్టి అనే వ్యాపారి చిన్నయ తండ్రి ప్రతిభను గుర్తించి ఈస్టిండియా కంపెనీ సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పించాడు. తండ్రితోపాటు చిన్నయ మద్రాసు వచ్చాడు.  
సూరి అయిన చిన్నయ
మనదేశానికి పరిపాలన నిమిత్తం వచ్చిన ఆంగ్ల అధికారులు స్థానిక భాషలు నేర్చుకోవాల్సి ఉండేది. అప్పట్లో ఇంగ్లిషు వచ్చిన తెలుగు పండితులు తక్కువ. అందుకని చిన్నయ ఆంగ్ల అధికారులకు తెలుగు నేర్పుతూ వారి మన్ననలు పొందాడు. 1836లో తండ్రి మరణంతో కుటుంబ భారం చిన్నయపై పడింది. 
      1840లో ఆదీ ఆప్టన్‌ పాఠశాలలో క్రైస్తవ మత బోధకులకు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసే అవకాశం లభించింది చిన్నయకు. ఆయన విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవడంతో చిన్నయ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అప్పటి మద్రాసు పట్టణ ప్రముఖులైన న్యాయాధికారి కలువలపల్లి రంగనాథశాస్త్రి, లక్ష్మీనరసుశెట్టి, పచ్చయప్ప ట్రస్టు సభ్యులైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై వంటివారు చిన్నయ అంటే ప్రత్యేక అభిమానం చూపడమేగాక, సాహిత్యసభలకు ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. తర్వాత చిన్నయ పచ్చయప్ప కళాశాలలో (1845- 1848) తెలుగు పండితుడిగా నాలుగేళ్లపాటు ఉద్యోగం చేశాడు. బోధనలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, ప్రాచీన సాహిత్యం గురించి విశదీకరించేవాడు. వాటిలో దాగి ఉన్న మానవతా విలువల్ని విపులీకరించే వాడు. విద్యార్థులలో అవగాహన, ఆసక్తి పెంపొందిస్తూ వాళ్లను ఉత్తమ గుణ సంపన్నులుగా తీర్చిదిద్దేలా ఉండేది ఆయన బోధన. స్వయంకృషితో ఆంగ్లం మీద పట్టు సాధించాడు. బ్రౌనుదొరతో స్నేహం చేశాడు.
      తర్వాత కొంత కాలానికి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చిన్నయ అధ్యాపక బాధ్యతలు చేపట్టాడు. ఆంగ్ల పండితులను తర్క, న్యాయ, వ్యాకరణాలలో తీర్చిదిద్దే ప్రయత్నం చేసేవాడు. ఆ సంస్థ అధ్యక్షునిగా ఎ.జె.అర్బత్‌నట్‌ అనే ఆంగ్లేయ అధికారి ఉండేవాడు. ఆయన కాశీ నుంచి పండితులను రప్పించి చిన్నయ ప్రతిభను పరీక్ష చేయించాడు. పరీక్షలో చిన్నయ పాండిత్యానికి అర్బత్‌నట్‌ విస్తుపోయాడు. గౌరవసూచకంగా లండన్‌ నుంచి తెప్పించిన బంగారు కంకణంపై చిన్నయ‘సూరి’ అని చెక్కించి, బహుమతిగా ఇచ్చాడు. సూరి అంటే పండితుడు అని అర్థం. అప్పటినుంచి చిన్నయ ‘చిన్నయసూరి’ అయ్యారు. 1857లో మద్రాసు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. దాని అనుబంధ కళాశాలలో చిన్నయసూరిని తెలుగు అధ్యాపకుడిగా నియమించారు. 
పేరు తెచ్చిన పంచతంత్రం
దూబగుంట నారాయణ కవి ‘హితోపదేశం’, విష్ణుశర్మ ‘పంచతంత్రం’ కథల ఆధారంగా చిన్నయసూరి ‘నీతి చంద్రిక’ను రాశారు. 1834లో రావిపాటి గురుమూర్తి ‘నీతి చంద్రిక’ను రాశారు. దీనిని సెయింట్‌ జార్జి ఉన్నత పాఠశాలలో పాఠ్యపుస్తకంగా చిన్నయసూరి బోధించారు. చిన్నయసూరి తాను రాసిన ‘నీతి చంద్రిక’ను ‘మిత్రలాభము’, ‘మిత్రభేదము’, ‘సంధి’, ‘విగ్రహము’ అని నాలుగు భాగాలుగా విభజించారు. మిత్రలాభం, మిత్రభేదం రచన చేసి సొంత ప్రింటింగ్‌ ప్రెస్‌ ‘వాణీ దర్పణం’లో అచ్చొత్తారు. మిగిలిన రెండు రాయక ముందే మరణించారు. సంధి, విగ్రహాలను 1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు, 1872లో కందుకూరి వీరేశలింగం పంతులు పూర్తి చేశారు. ఆ తర్వాత చాలా మంది పంచతంత్ర కథలను రాశారు. నీతిచంద్రికలో ఆంగ్ల రచనా విధానం కనిపిస్తుంది. అంతవరకు తెలుగులో పేరాల విభజన లేదు. చిన్నయసూరి నీతిచంద్రికను పేరాలుగా విభజించి రాశారు. విద్యార్థులకు పేరాలుగా రాయటం నేర్పించారు. అలా తెలుగు రచనాశైలిలో నూతన సంప్రదాయాన్ని నెలకొల్పారు. 
      చిన్నయసూరి వచన శైలి ఒకే విధంగా ఉంటుంది. కఠిన పదాలు ఉండవు. అలాగని తేలిక పదాలూ కనిపించవు. సంస్కృత పదాలు, అచ్చ తెలుగు పదాల సమన్వయంతో సమపాళ్లలో ఆయన రచన సాగుతుంది. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని నీతి చంద్రిక రచన సాగించారు. 1853 మొదలు ఇప్పటివరకు ఏదో ఒక తరగతిలో నీతి చంద్రికను ఒక్క పాఠంగానైనా చదువుకొంటున్నాం. నీతిచంద్రికలోని మిత్రలాభంలో స్నేహం వల్ల లాభాలు, అత్యాశ వల్ల నష్టాలు, తొందరపాటు పరికిరాదని ప్రబోధించారు. మిత్రభేదంలో కరటక, దమనకులు అనే నక్కల పాత్రలతో సామాజిక న్యాయం, రాజకీయ నీతిని తెలియజేశారు. వాటిలో స్నేహంలో గల కష్టనష్టాలు వివరించారు. ఉపకారం చేయడం వల్ల కలిగే లాభం, స్వార్థం వల్ల దుష్ఫలితాలు, పరుల చెడు కోరేవాళ్లకే చెడుపు జరుగుతుందని నీతిచంద్రికలో అద్భుతంగా మలచారు.
చిన్నయసూరి చదివారా?
చిన్నయసూరి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది బాల వ్యాకరణం. నన్నయ ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించినట్లు తెలుస్తోంది. కేతన రచించిన ‘ఆంధ్ర భాషా భూషణం’ తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం. క్యాంబెల్, కేరి, బ్రౌను వంటి ఆంగ్ల పండితులు తెలుగు వ్యాకరణాన్ని సులభ శైలిలో రాశారు. అయితే చిన్నయసూరి బాల వ్యాకరణం తరతరాలు నిలిచే రచన. మొట్టమొదట ఆయన సంస్కృత, తెలుగు భాషలలోని సారాంశాలు తీసుకొని పుస్తకాలు రచించారు. ఆ అనుభవం బాల వ్యాకరణం రాయడానికి ఎంతో ఉపయోగపడింది. ఇది 1858లో వెలుగు చూసింది. బాలవ్యాకరణం ఎంత ప్రసిద్ధి చెందిందంటే... బాల వ్యాకరణం చదివారా అనేందుకు బదులుగా చిన్నయసూరిని చదివారా? అని అడిగేంత. దీనికి బాలవ్యాకరణం అని పేరు పెట్టినా బాలల కంటే ఎక్కువ స్థాయిది. అయితే ఇందులోని సూత్రాలు కంఠస్థం చేసేందుకు అనువుగా ఉండి దీన్ని ప్రామాణిక గ్రంథంగా నిలిపాయి. 
నిఘంటు నిర్మాణ సారథి
17వ శతాబ్దం నాటికే తెలుగులో నిఘంటువు నిర్మాణం ప్రారంభమైంది. మొదటి నిఘంటువుగా లక్ష్మణ కవి రచించిన ‘ఆంధ్రనామ సంగ్రహా’న్ని పేర్కొంటారు. ఆయనకు ముందు అడిదము సూరకవి- ఆంధ్ర నామ శేషము; కవి చౌడప్ప రచించిన చౌడప్ప నిఘంటువు మొదలైన నిఘంటువులు వచ్చాయి. ఇవి ఆధునిక విద్యా ప్రణాళికకు అనుగుణంగా లేవు. కావ్య రచనకు దోహదపడేట్లు ఉంటాయి. దాంతో కొత్త నిఘంటువు రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. 1824లో క్యాంబెల్‌ మొదలుపెట్టిన నిఘంటువు 1849లో ముద్రణకు నోచుకుంది. 
      ఆధునిక విద్యా వ్యవస్థ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చిన్నయసూరి ‘అకారాది క్రమం’లో తెలుగు నిఘంటువు రాయడం మొదలుపెట్టారు. అది పూర్తికాక మునుపే అనారోగ్యంవల్ల 1862లో తనువు చాలించారు. దీనిని ఆయన శిష్యుడు బహుజనపల్లి సీతారామాచార్యులు ముందుకు తీసుకెళ్లి ‘ఆంధ్రశబ్ద రత్నాకరము’గా రూపొందించారు. అయితే సీతారామాచార్యులు చిన్నయసూరి నిఘంటువులోని అంశాలు కొంతైనా ఎత్తిరాసి ఉంటారని అపవాదు ఉంది. కానీ నిఘంటువు ముందుమాటలో సీతారామాచార్యులు తన గురువుగారైన సూరికి కృతజ్ఞతలు తెలుపుకోవడంతో ఆ అపవాదు తొలగి... ఆయనకు సూరి పట్ల ఉన్న గౌరవాన్ని తెలుపుతుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణానికిగాను మానవల్లి రామకృష్ణకవి చిన్నయసూరి నిఘంటువును ఇచ్చినట్లు తెలుస్తోంది. సూర్యరాయాంధ్ర నిఘంటువులో పదాల దగ్గర ఉండే చి.ని.(చిన్నయసూరి నిఘంటువు) సంకేతాక్షరాలే దీనికి నిదర్శనంగా నిలుస్తాయి. 
      చిన్నయసూరి నీతిచంద్రిక, బాలవ్యాకరణమే కాకుండా పచ్చనృప యశో మండనం అనే గ్రంథాన్ని రాశారు. ఆయనకు సంగీతంలోనూ ప్రవేశముంది. విద్యార్థులకు, పండితులకు వచ్చే సందేహాలు తీర్చేందుకు నూటాయాభై సంవత్సరాల క్రితమే ‘సుజనరంజని’ అనే మాస పత్రిక వెలువరించడం సూరి సేవాభావానికి మచ్చుతునక.
      బ్రిటిష్‌వారి రాకతో భారతదేశంలో అన్ని రంగాల్లో ఆధునిక పోకడలు మొదలయ్యాయి. వాటి ప్రభావం తెలుగు భాష మీదా పడింది. పద్య రచన స్థానంలో వచనం అభివృద్ధి చెందడమూ ఈ కోవలోదే. అలాంటి సమయంలో ‘నీతిచంద్రిక’ను వచనంలో రాసి తెలుగులో వచన రచనకు ఆద్యుడయ్యాడు చిన్నయసూరి. కాలానికి తగినట్లు భాష కూడా మారాలి. దీనికి ముందుండి మార్గనిర్దేశం చేసిన సూరిని ‘గద్యానికి చిన్నయ’ అనడం స్వభావోక్తే కానీ అతిశయోక్తి కాదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం