విజ్ఞానశాస్త్ర బోధన... చిత్తశుద్ధే నిచ్చెన

  • 515 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। సమ్మెట గోవర్ధన్

  • వరంగల్లు
  • 9949038471
డా।। సమ్మెట గోవర్ధన్

‘‘విజ్ఞానశాస్త్రాన్ని అమ్మభాషలో బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను త్వరగా అర్థం చేసుకోగలరు...’’ ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పిలుపు. 
వైజ్ఞానిక రంగం మీద నవతరంలో ఆసక్తి పెంచాలన్నా... ఆ రంగంలో వాళ్లను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నా... కలాం సూచనను అనుసరించక తప్పదు. అయితే, ఇప్పటివరకూ ‘తెలుగులో విజ్ఞానశాస్త్ర బోధన’లో సాధించిన ప్రగతి ఎంత? మన అమ్మభాషను విజ్ఞానశాస్త్ర బోధనాభాషగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎదురవుతున్న అవరోధాలేంటి? వాటిని అధిగమించడం ఎలా? 
దేశాభివృద్ధికి
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే వెన్నెముక. దాన్ని అత్యుత్తమస్థాయిలో ఒడిసిపట్టుకోవాలంటే, ఉన్నతశ్రేణికి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు కావాలి. అలాంటి వాళ్లు తయారవ్వాలంటే... పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయుల్లో విజ్ఞానశాస్త్ర బోధన అమ్మ భాషల్లో సాగాలి. అంటే, తెలుగునాట తెలుగులో సైన్సు పాఠాలు చెప్పడం తప్పనిసరి! 
      మొదటి తరగతి నుంచి స్నాతకోత్తర స్థాయిదాకా తెలుగులో విజ్ఞానశాస్త్ర బోధన సాగితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అతి సంక్లిష్టమైన శాస్త్రాంశాలను సైతం మాతృభాషలో బోధించడం వల్ల... ‘విషయాన్ని’ విద్యార్థి సులభంగా, పరిపూర్ణంగా, ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేకుండా గ్రహించగలుగుతాడు. వాస్తవానికి, విజ్ఞానశాస్త్ర బోధన ఆంగ్లంలోనే జరిగి తీరాల్సిన అవసరం లేదు. శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్న దేశాలను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. జపాన్, జర్మనీ, రష్యా తదితర దేశాలు మాతృభాషల్లోనే బోధన సాగిస్తున్నాయి. 
      సర్వసాధారణంగా మన ఊహలన్నీ మాతృభాషలోనే రూపుదిద్దు కొంటాయి. విజ్ఞాన శాస్త్రానికి ఆ ఊహలే ఊపిరి. అయితే, వాటికి భిన్నంగా... అధ్యయనం చేసేది, వినేది, రాసేది అన్యభాష అయినప్పుడు విద్యార్థి మీద ఒత్తిడి పెరుగుతుంది. తరగతి గదిలో విన్న, పాఠ్యపుస్తకంలో చదివిన విషయాలను మాతృభాషలోకి అనువదించుకుని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇదో అనవసరపు మేధోశ్రమ. అదే నేరుగా మాతృభాషలో అధ్యయనం చేస్తే ‘విషయం’ తేలిగ్గా ఒంటబడుతుంది.
పదండి... పదసృష్టికి!
విజ్ఞానశాస్త్ర బోధనాభాషగా తెలుగు పూర్తిస్థాయిలో రాణించాలంటే సంబంధిత వనరులను సమకూర్చుకోవాలి. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువగా ఆంగ్లంలోనే ఉంది. మరోవైపు, తెలుగులో విజ్ఞానశాస్త్ర భావవ్యక్తీకరణకు తగిన సాంకేతిక పదాలు తక్కువగా ఉన్నాయి. పాఠ్యగ్రంథాలు, సంప్రదింపు గ్రంథాలు, బోధనోపకరణాలు అందుబాటులో లేకపోవడం వల్ల తెలుగులో సైన్సు బోధన నత్తనడకన నడుస్తోంది. 
      చిన్నారులు మన భాషలో విజ్ఞానాన్ని ఆపోశన పట్టాలంటే, పారిభాషిక పదసృష్టి మీద వెంటనే దృష్టిపెట్టాలి. అలా అని మక్కీకి మక్కీ అనువాదం ద్వారా కఠిన పదాలను ఖాయం చేస్తే అసలుకే ఎసరొస్తుంది. సూటిగా భావాన్ని విడమరిచే సులువైన మాటలను తయారుచేసుకోవాలి. దీనికోసం తెలుగు పండితులు, విజ్ఞానశాస్త్ర నిపుణులు కలిసి కృషి చేయాలి. ఒకవేళ, ఏవైనా కొన్ని భావాలను వ్యక్తీకరించడానికి తగిన మాటలు లభ్యం కాకపోతే ఇతర భాషా పదాలను తీసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అంతర్జాతీయ భాషల్లోని పదజాలాన్ని ఉపయోగించుకుంటూ మన పారిభాషిక పదజాలాన్ని పెంపొందించుకోవాలి. ఇలా సాంకేతిక పదాలు అందుబాటులోకి వస్తే తప్ప తెలుగులో విజ్ఞానశాస్త్ర బోధన సులువు కాదు! అయితే, ఈ క్రమంలో నూతన పదసృష్టికే ప్రాధాన్యమివ్వాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ‘ఆదానం’ మీద ఆధారపడాలి. 
      అన్ని శాస్త్ర విభాగాలకూ విడివిడిగా తెలుగు నిఘంటువులు అందుబాటులోకి తేవడమూ ముఖ్యమైందే. గతంలో దీని మీద తెలుగు అకాడమీ కృషి చేసింది. దాన్ని కొనసాగించాలి. విజ్ఞానశాస్త్ర నిఘంటువులను వార్షికంగా విస్తరిస్తూ,  ఎప్పటికప్పుడు పునర్ముద్రించాలి. తెలియని సైన్సు పదాలకు అర్థం తెలుసుకోవడానికి విద్యార్థులకు ఇవెంతగానో ఉపకరిస్తాయి. 
పాఠ్యపుస్తకాల్లో నాణ్యత
ప్రారంభంలో తెలుగులో శాస్త్రబోధనకు పదో తరగతి దాకా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు... ఆ పై స్థాయుల్లో తెలుగు అకాడమీ పొత్తాలు అందుబాటులో ఉండేవి. డిగ్రీ సైన్సు పుస్తకాలు మాత్రం ఎన్నో లోపాలతో అసమగ్రంగా తయారయ్యేవి. శాస్త్ర విషయాల వివరణలో స్పష్టత, ప్రామాణికత లోపించేవి. దీంతో అధ్యాపకులు ఆంగ్ల పుస్తకాలను ఆశ్రయించి ప్రత్యేకంగా నోట్సు రాసుకోవాల్సిన దుస్ధితి! ఇక విద్యార్థులకైతే గైడులే దిక్కయ్యేవి! మరోవైపు... పాఠశాల, ఇంటర్, డిగ్రీ పాఠ్యపుస్తకాల్లోని సాంకేతిక పదాల మధ్య సారూప్యత లేకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడేవారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. అన్ని స్థాయుల్లో దాదాపు ఒకేవిధమైన పారిభాషిక పదాలు వినియోగంలోకి వచ్చాయి. అయితే... శాస్త్ర సమాచారాన్ని కచ్చితంగా, అసందిగ్ధంగా చెప్పగలిగే పాఠ్యపుస్తకాలు కావాలి. విజ్ఞాన శాస్త్రాంశాలను ముక్కుసూటిగా, నిర్దిష్టంగా తక్కువ పదాలతో చెప్పగలగాలి. 
      తెలుగు భాషలో బాగా పట్టున్న, తెలుగు సైన్సు రచన-బోధనలో అనుభవం ఉన్న అధ్యాపకుడే... వివిధ శాస్త్ర గ్రంథాల్లో నిక్షిప్తమైన అనేకానేక విషయాలను విమర్శనా దృష్టితో పరిశీలించి, విద్యార్థులకు సుబోధకంగా అందజేయగలడు. అలాంటి అధ్యాపకులనే పాఠ్యపుస్తకాల రచయితలుగా ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన అధ్యాపకులకు కార్యశాలలు, గోష్ఠులు, సమావేశాలు నిర్వహించాలి. వాళ్లు మంచి రచయితలుగా ఎదగడానికి అవకాశాలు కల్పించాలి. నేషనల్‌ బుక్‌ట్రస్టు, తెలుగు అకాడమీ, స్టేట్‌ రిసోర్సు సెంటర్‌ తదితరాలు ఈ దిశగా పనిచేస్తున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు, వయోజనులు, నూతన అక్షరాస్యులకు ఉపయోగపడే అనేక పాపులర్‌ సైన్సు గ్రంథాలు, పాఠ్యపుస్తకాలు, చిరుపొత్తాలను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిన నేపథ్యంలో ఈ కృషి మరింత వ్యవస్థీకృతంగా జరగాలి. 
పాఠాలెలా చెబుతున్నారు?
ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని తెలుగులో విజ్ఞానశాస్త్రాన్ని బోధిస్తున్న గురువుల బోధనా సామర్థ్యం ఆశించినంతగా లేదు. మాతృభాషపై పట్టులేకపోవడంతో వాళ్లు తరగతి గదిలో తమకు తోచిన రీతిలో బోధిస్తున్నారు. ఆంగ్లంలో ఆలోచిస్తూ, అనువాద రూపంలో విద్యార్థులకు బోధించడం వల్ల సమయం వృథా తప్ప, ఉపయోగమేదీ ఉండదు. ఉపాధ్యాయుడు/ అధ్యాపకుడు తెలుగులో ఎంత సరళంగా బోధిస్తే... విద్యార్థి కూడా అంతే సులువుగా అర్థం చేసుకుంటాడు. చెప్పే విషయాన్ని ఆసక్తికరంగా, శ్రద్ధతో చెబితేనే మంచి ఫలితాలొస్తాయి. ఉపాధ్యాయుడు/ అధ్యాపకుడు మొదటగా తాను బోధించాల్సిన పాఠ్యాంశాల గురించి విస్తృత సమాచారం సేకరించుకోవాలి. గ్రంథాలయాలకు వెళ్లాలి. పునశ్చరణ తరగతులకు హాజరు కావాలి. సైన్సు బోధనా సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. కొత్తగా విధుల్లో చేరిన వారితో పాటు సీనియర్‌ గురువులకు సైతం వృత్త్యంతర శిక్షణ తరగతులను నిర్వహించాలి. శాస్త్రాంశాలను తెలుగులోనే చర్చించే చర్చావేదికలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఉపాధ్యాయులు/ అధ్యాపకుల వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయి. 
      అయితే, గురువులకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. శాస్త్ర బోధనలో కీలకపాత్ర పోషించే బోధనోపకరణాలు మన భాషలో లభించట్లేదు. స్లైడ్‌లు, ఛార్టులు, వీడియో టేప్‌లు... అన్నీ ఆంగ్లంలోనే ఉంటున్నాయి. కాబట్టి, తెలుగులో బోధనకు తోడ్పడే దృశ్య, శ్రవణ ఉపకరణాల రూపకల్పన మీద తక్షణం దృష్టిపెట్టాలి. బోధనోపకరణాలను తయారుచేసే వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు దీనికి నడుం బిగించాలి. 
మరో రెండు...
విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు అవసరమైన సంప్రదింపు గ్రంథాలు (రిఫరెన్సు బుక్స్‌) అందుబాటులో లేకపోవడం... తెలుగులో విజ్ఞానశాస్త్ర బోధనకు మరో ఆటంకం. డిగ్రీ తెలుగు సైన్సు పుస్తకాలు ఈ కోణంలో ఇంటర్‌ విద్యార్థులకు కొంత ఉపకరించినా... డిగ్రీ విద్యార్థులకు సంప్రదింపు గ్రంథాలుగా ఉపయోగపడే పీజీ తెలుగు సైన్సు  పొత్తాలు అందుబాటులో లేవు. అనువాదాల మీద దృష్టి పెడితే కొద్దిమేరకు ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. 
      అలాగే, శాస్త్ర పరిశోధనల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలిపే తెలుగు సైన్సు పత్రికలూ ఎంతో అవసరం. తెలుగు అకాడమీ ప్రచురిస్తున్న ‘తెలుగు’ వంటి జర్నళ్లు మరిన్ని రావాలి. అయితే, ఈ ‘తెలుగు’లోనూ అన్ని శాస్త్రాల అంశాలు ఉంటున్నాయి. అలా కాకుండా కేవలం సైన్స్‌ అంశాలతోనే పక్ష/ నెలవారీ పత్రికలను ప్రచురించాలి. అప్పుడే విద్యార్థులకు, గురువులకు శాస్త్రసాంకేతిక రంగాల తాజా సమాచారం అందుతుంది. 
ఇవన్నీ జరిగితేనే...
అమ్మభాషలో విజ్ఞానశాస్త్ర బోధన సాగాలని ప్రభుత్వాలు మనస్ఫూర్తిగా కోరుకుంటే తక్షణం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. వాటి అమలు కోసం భాషాభిమానులు ఒత్తిడి తేవాలి. 
*  విజ్ఞానశాస్త్రాన్ని బోధించే వాళ్లకు తెలుగు భాషా పరిజ్ఞానం అలవడేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే, తెలుగులో సైన్సు బోధన మెలకువలను వివరిస్తూ అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ‘కరదీపికలు’ రాయించి ప్రచురించాలి.
*  సైన్సు బోధనకు అవసరమయ్యే తెలుగు పాఠ్యపుస్తకాలు, సంప్రదింపు గ్రంథాలు, పరిశోధనా వ్యాసాలతో కూడిన పత్రికలు, పారిభాషిక పదకోశాలను అందుబాటులోకి తేవాలి. 
*  బహుళాదరణ పొందిన ఆంగ్ల, ఇతర విదేశీ భాషల శాస్త్ర గ్రంథాలు, పాఠ్యపుస్తకాలు, సంప్రదింపు గ్రంథాలు, ప్రసంగ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు, పరిశోధన పత్రాలను తెలుగులోకి అనువదింపజేయాలి. 
*  ప్రతి అయిదు సంవత్సరాలకోసారి అన్ని స్థాయుల్లోని తెలుగు సైన్సు పాఠ్య పుస్తకాలను సమగ్రంగా పరిశీలించాలి. లోటుపాట్లను సరిదిద్ది పునర్ముద్రించాలి.
* తెలుగులో శాస్త్ర విషయాలను వివరించే వ్యాసాలు, పుస్తక రచనల పోటీ నిర్వహించాలి. దీనివల్ల వైజ్ఞానిక సమాచారం మన భాషలోకి వెల్లువెత్తుతుంది. 
      ఏ అవయవమైనా సరే, వినియోగంలో ఉన్నంతవరకే సక్రమంగా పనిచేస్తుంది. లేకపోతే అవశేష అంగంలా తయారై కాలక్రమంలో అంతరించిపోతుంది. భాష కూడా అంతే. ప్రస్తుతం అన్ని రకాలుగా తెలుగు వినియోగం తగ్గిపోతుండటం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. అమ్మభాషను సంరక్షించుకోవాలంటే, దాన్ని చదవాలి. వినాలి, మాట్లాడాలి, రాయాలి. ముఖ్యంగా విద్యావ్యవస్థలో తప్పనిసరిగా వినియోగించాలి. విజ్ఞానశాస్త్రాన్ని తెలుగులో బోధిస్తే, కొత్తతరంలోంచి నైపుణ్యమున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉద్భవిస్తారు. తెలుగు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు, ప్రభుత్వం, భాషా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు... అందరూ చేతులు కలిపి, భాషాభిమానాన్ని చేతల్లో చూపిస్తేనే మన అక్షరం అజరామరం అవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం