మట్టిలో మాణిక్యం

  • 433 Views
  • 6Likes
  • Like
  • Article Share

అతను ఒకప్పుడు రోజూ కూలీ, కాంక్రీటు తట్టలు మోసేవాడు. ఇసుక, సిమెంటు కలిపి మేస్త్రీలకు ఆందించే పని చేసేవాడు. ఆ రోజుల్లో అతని ఆదాయం రోజుకి అయిదు రూపాయలు. ఒక్కోరోజూ పది వచ్చేది. నోరిప్పితే ఉత్తరాంధ్ర యాసలోనే మాట వస్తుంది. ‘‘నాను కాయాకట్టం సేసుకు బతికినాను బాబూ. నాకేటీ తెల్దు. ఏటీ సేయనేక వొల్లకుంతాను’’ - ఇదీ భాష. కాని వేషం కట్టి, విగ్గుపెట్టి, సిల్కు పంచెకట్టి, కిరీటం పెట్టి, రంగస్థలం మీద నిలబడితే మహారాజు అయిపోతాడు. హరిశ్చంద్రుడిగా మారిపోతాడు. అనర్గళంగా ‘‘మాయామేయ జగంబె నిత్యమని సంభావించి’’ అనీ ‘‘ఇచ్చోటనే కదా సత్కవీంద్రుల కమ్మని కలము నిప్పులలో కలసిపోయె’’ అంటూ జాషువా పద్యాలను ప్రేక్షకులమీదికి తారస్థాయిలో, ఆరున్నర శ్రుతిలో రువ్వుతాడు. అతని జీవిత సరళిని తెలిసినవారికి ఇది పరకాయ ప్రవేశం.
అతని
పేరు బొంతు సీతం నాయుడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి అయిదు కిలోమీటర్ల దూరంలో అతని స్వస్థలం... పేరు లెంకపేట. అతని తండ్రి బొంతు కన్నమనాయుడు. ఆ రోజుల్లో రెండెకరాల పొలం ఉండేది. తండ్రి ‘పాదుకా పట్టాభిషేకం’లో భరతుడిగా వేసేవాడు. అయితే ఆరుగురు పిల్లల పెంపకానికి, పెళ్లిళ్లకి ఆ రెండెకరాలూ కరిగిపోయాయి. రంగస్థలం కలిసిరాకపోయినా కన్నమనాయుడు కొడుక్కి నాటక కళని నేర్పించాడు. వారి గురువు బెలగాం వాకముల్లి రామినాయుడు. సీతంనాయుడు తన పన్నెండేళ్ల నుంచే నాటకాలు వేస్తున్నాడు. ఒక్క అక్షరం చదవడం రాదు, రాయడం రాదు. కానీ తొక్కుడు హార్మనీ కదిలితే ముల్తాన్‌ సారువా (ఇలాంటి రాగం లేదు. సారో సన్నివేశాలలో పాడే రాగానికి ఆ పేరు వచ్చిందేమో!) సావేరి, కన్నడ, భీంపలాస్, అసావేరి, మాల్కౌంస్, కాపీ, కానడ - ఇవికాక రెండు మూడు రాగాల మేళవింపుతో పద్యాలు చదువుతాడు. ‘‘ఇవన్నీ ఎలా నేర్చుకున్నావయ్యా?’’ అంటే ‘కేవలం శ్రుతపాండిత్యం, శ్రద్ధ. తండ్రి, గురువు పెట్టిన భిక్ష’ అంటాడు.
      ఆ రోజుల్లో సీతంనాయుడు రణస్థలం, రాజాం, బొబ్బిలి, అనకాపల్లి వంటి స్థలాలలో విరివిగా నాటకాలు ఆడాడు. ‘కురుక్షేత్రం’ పడక సీనులో అర్జునుడు, శ్రీకృష్ణుడు, ‘హరిశ్చంద్ర’లో కాటిసీను, వారణాశి పుర వీధులలో చంద్రమతిని అమ్మే సీను, ‘రామాంజనేయ యుద్ధం’లో రాముడు వేస్తాడు. నాటకానికి కాంట్రాక్టరుకి ఏ రెండు వేలో వచ్చేవి. ఇతని వాటా పది లేక పదిహేను. ఆనాటికి అది మంచి మొత్తమేకాక, నాటకం పెద్ద మైకం. ప్రేక్షకుల చప్పట్లు ఊహించలేని మత్తుకాగా, ఈ కృషి తనకి వారసత్వం.
      నాతో మాట్లాడుతూ ‘‘మాయమ్మ పేరు రాయండయ్యా’’ అని అడిగాడు. బొంతు లక్ష్మమ్మ. ‘‘ఎందుకని?’’ కవ్వించడానికి అడిగాను. ‘‘నాటకం అయ్యాక నాకోసం ఇంటి దగ్గర ఎదురుసూసేది. ‘ఎంతొచ్చిందిరా అయ్యా’ అని అడిగేదికాదు. బువ్వ కలిపి సేతికిచ్చేది’’ అన్నాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. అల్లుళ్లు ఏం చేస్తారు? ఒకరు తాపీ మేస్త్రీ. మరొకరు రోజుకూలీ. కొడుకు ఏదో డిపార్టుమెంటు స్టోరులో నౌఖరు. ఇప్పటికీ తనకి నాటకాలకి పదో పరకోవస్తే పిల్లలకి ఇస్తాడు. ఇప్పుడు సీతంనాయుడి వయసు 60. తట్టలు మోసే శక్తి లేక, కూలీపని చెయ్యలేక, కొబ్బరి బొండాలు కొట్టడం నేర్చుకుని - విశాఖపట్నం మువ్వలవాని పాలెం కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపం ముందు రోడ్డు మీద కొబ్బరి బొండాలు అమ్ముకుంటాడు. ఒక్కోరోజు వంద లేక వందా యాభై వస్తుంది. రాత్రి తన కొడుకు పనిచేసే డిపార్టుమెంటల్‌ స్టోరు వీధి అరుగుమీద పడుకుని పద్యాలు పాడుకుంటూ ఉంటాడు.
      ఈమధ్య పౌరాణిక నాటకాల జోరు తగ్గింది. అయినా శ్రీరామనవమి, నవరాత్రులకు ఏదైనా నాటకాలకు పిలుపు వస్తుంది. వ్యాపారం వదిలేసి వెళ్లిపోతాడు. ఒక్కొక్కప్పుడు వెయ్యి, రెండువేలూ వచ్చిన రోజులున్నాయి. కాని రెండేళ్లుగా ఏ నాటకమూ వెయ్యలేదు. శ్రీకాకుళం సాయి కళానికేతన్‌ బి.వి.ఏ.నాయుడు రెండో శుక్రవారం నాటకాలకి పిలిచేవారు. ఇప్పుడవీ తగ్గిపోయాయి.
      కొబ్బరిబొండాల అమ్మకంలో రోజుకి వంద వస్తుంది. తను తిని, పిల్లలకు ఇవ్వగా రోజుకి నాలుగు, అయిదు రూపాయలు ఒక పిడతలో దాచేవాడు. అలా అయిదారు సంవత్సరాలు దాచాడు. 30 వేలయింది. ఆ డబ్బుని ఓ పేద తండ్రి ఏం చేశాడు? ఇల్లు కట్టుకున్నాడా? కూతురుకి పెళ్లి చేశాడా? వ్యాపారం పెద్దది చేశాడా? ఆశ్చర్యం. 60 వేలు పెట్టి రాజమండ్రి బాక్స్‌ తొక్కుడు హార్మొనీ కొనుక్కున్నాడు. మిగతా 30 వేలు? తన తండ్రి ఇచ్చాడట. ఇదీ తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి. ఆ బాక్స్‌ రణస్థలంలో ఉంది. విశాఖలో ఉంచుకునే వసతి లేదు కనుక తెచ్చుకోలేదు. ‘‘పేదరికం, అవసరాలు కారణంగా ఆ బాక్స్‌ని ఎప్పుడయినా అమ్మెయ్యాలనిపించిందా?’’ అన్న ప్రశ్నకు ‘‘ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందా?’’ అన్నట్టు నిర్ఘాంతపోయి చూశాడు. 
      ‘‘నీ తదనంతరం ఆ హార్మొనీ పెట్టెని ఏం చేస్తావు?’’ అనడిగాను. ‘‘నేను అమ్మను. ఏదయినా దేవస్థానానికి ఇచ్చేస్తాను’’ అన్నాడు. జీవితమంతా ఆరాధించిన కళపట్ల అతని ఉదాత్తతకు అది పరాకాష్ఠ.
      అతని భార్య 15 ఏళ్ల కిందట - మతి స్థిరం తప్పి కన్నుమూసింది. ఆడపిల్లలకు తనే పెళ్లిళ్లు చేశాడు. వయసు మీదపడి, శక్తితగ్గి, కాళ్లు పట్టేసి కాయకష్టం చెయ్యలేక బొండాల అమ్మకానికి కుదురుకున్నాడు.
      విశాఖపట్నంలో మేడా మస్తాన్‌ రెడ్డి స్థాపించిన క్రియేటివ్‌ కామెడీ క్లబ్బుకి నేను సలహాదారుణ్ని. ప్రతీనెల ఒక అజ్ఞాత కళాకారుడిని ఇతోధికంగా సత్కరించడం రివాజు. ఆ మధ్య బొంతు సీతంనాయుణ్ని సత్కరించి వెయ్యి నూటపదహారు రూపాయలు ఇచ్చాం. 
      ఆ డబ్బుని సీతం నాయుడు ఏం చేశాడు? తనకంటే బీద స్థితిలో ఉంటూ, తనతో ఒకప్పుడు నాటకాలు వేసి, ప్రమాదంలో కాలువిరగడం వల్ల ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న ఓ సహనటుడు (ఇతను హరిశ్చంద్రలో నక్షత్రకుడి పాత్రధారి) - లక్ష్మీనాయుడికి  500 రూపాయలు ఇచ్చాడు.
      నా దగ్గరికి వచ్చిన సీతంనాయుడికి ఒకే ఒక్క కోరిక. ‘‘మూడు పద్దేలు సదువుతాను. ఇనుకోండి బావు!’’ అని పద్యం ఎత్తుకోగానే చదువురాని నాయుడు మహారాజు అయిపోతాడు. ముఖంలో కొత్త వెలుగు వస్తుంది. పద్యాల్లో అక్షరాల పొరపాట్లు ఉన్నాయి, ఉంటాయి. కానీ ఆనాటి నాటకం బాణీలో ఆరున్నర శ్రుతిలో చదవగల ఒడుపు, ప్రేక్షకుల నుంచి వన్స్‌మోర్‌లు, అప్పుడప్పుడు చదివింపులు పొందే నేర్పూ - కనిపిస్తాయి.
      ఒక్కొక్కప్పుడు కళ తిండి పెట్టకపోవచ్చు. కానీ ఎప్పుడైనా విశాఖపట్నం ఎమ్‌.వి.పి. కాలనీలో టి.టి.డి.కల్యాణమండపం పక్కన చెట్టుకింద నేలమీద కొబ్బరిబొండాలు పరుచుకుని అమ్ముకుంటున్న నేలబారు మనిషి- ఒకప్పుడు రంగస్థలం మీద శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రుడిగా నిలిచిన క్షణాలను తలుచుకుంటూ గర్వంగా జీవిస్తున్నాడని గుర్తుపట్టగలిగితే - మట్టిలో అరుదైన మాణిక్యం మీ కళ్లముందు మెరుస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం