పెరిగినాడు చూడరో!

  • 380 Views
  • 3Likes
  • Like
  • Article Share

మామూలోడివి కాదు నువ్వు...  మాగొప్ప బలవంతుడివి... ఈ సింధువు నీకు బిందువుతో సమానం... అంగలో దాటేయగలవు అంటూ అంగదాదులు పొగుడుతుంటే ఆంజనేయుడి ఛాతీ ఉబ్బిపోతోంది. దాంతో పాటు మొత్తం ఆయన ఆకారమంతా పదింతలవుతోంది. అలా అలా నింగికి నేలకు నిచ్చెనేసినట్లు అంత ఎత్తుకు పెరిగిపోయాడు పవన సుతుడు. ఆ ఊపులోనే సముద్రాన్ని దాటేశాడు. అమ్మను కలిసి అయ్య ఇచ్చిన అంగుళీకం ఇచ్చేశాడు. అంతటితో ఊరుకున్నాడా... ఊహూ! అశోకవనాన్ని ఆగమాగం చేశాడు. అడ్డుకోబోయిన రక్కసులను ఈడ్చి అవతలకు పడేశాడు. తర్వాత లంకాధిపతి దగ్గరికి పోయి సుద్దులు చెప్పాడు. బుద్ధి గడ్డితినడంతో వానర శ్రేష్ఠుడి వాలానికి నిప్పుపెట్టాలన్న కోరిక కలిగింది మండోదరి మగనికి. ‘చిరంజీవి’కి చిర్రెత్తుకొచ్చి... కాలుతున్న తోకను తిప్పుతూ మొత్తం లంకా నగరానికి నిప్పెట్టాడు. తర్వాత తీరిగ్గా రాముడి దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పాడు. ఆ తర్వాత కథ తెలిసిందే.
      ఇలా ఏ కార్యాన్నయినా అవలీలగా చేయగల సమర్థుడు, అమేయ బలసంపన్నుడైన అంజనీపుత్రుడి గురించి అన్నమయ్య సుమధుర సంకీర్తన ఇది...
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు
రక్కసుల పాలికి రణరంగ శూరుడు
వెక్కసపు ఏకాంగ వీరుడు
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు
లలిమీరినయట్టి లావుల భీముడు
బలుకపికుల సార్వభౌముడు
నెలకొన్న లంకా నిర్ధూమధాముడు
తలపున శ్రీరామునాత్మారాముడు
దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావింపగల తపః ఫలపుణ్యుడు
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు

      వానరసేన అంగదుడి నాయకత్వంలో సీతాన్వేషణకు బయలుదేరింది. లంకకు చేరాలంటే సముద్రం దాటాలి. ఎవరూ సాహసించలేకపోతున్నారు. వెంటనే జాంబవంతుడు ఈ కార్యానికి తగినవాడు మన ఆంజనేయుడే, అతడు తలచుకుంటే ఏదైనా సాధ్యం అంటాడు. అలా వానరులంతా కలిసి హనుమంతుణ్ని నువ్వే ఎలాగో ఒకలా రామకార్యానికి నడుం బిగించాలి. నీకు మాత్రమే సాధ్యమైన పని అది అని అంటారు. వానరులు అలా పొగుడుతుంటే ఉత్సాహం ఎక్కువైన హనుమంతుడు తన రూపాన్ని అంతెత్తుకు పెంచేస్తాడు. అన్నమయ్య వర్ణించిన పెద్ద హనుమంతుడు అతడే. దీన్నే నాటకీయంగా పెరిగినాడు చూడండి అదిగో, ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి అంటూ కళ్లముందు నిలుపుతున్నాడు అన్నమయ్య. ఈ కపికుల సార్వభౌముడు ప్రసిద్ధ (పరగి) విద్యలెన్నింటినో నేర్చిన బలవంతుడని చెబుతున్నాడు.
      ఆంజనేయుడు రామకార్యం నిమిత్తం లంకిణి, అక్ష కుమారుడు లాంటి ఎందరో రాక్షసులను సంహరించాడు. అందుకే రణరంగంలో రక్కసులకు శూరుడు అంటున్నాడు. ఇక వెక్కసం అంటే దుస్సహమైన, సహించలేని అనే అర్థాలు ఉన్నాయి. ‘ఏకాంగవీరుడు’ అంటే తనను ఒక్కరికే అర్పించుకున్నవాడు. పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో ‘‘ఏకాంగవీరు దేహేంద్రియదూరు/ లోకనిస్తారు నలోకానుసారు’’ అని బసవన్న గుణగణాలను వర్ణిస్తాడు. ఆంజనేయుడు తన జీవితాన్ని రాముని సేవకే అంకితం చేశాడు కదా మరి... అందుకే ఆయన ఏకాంగవీరుడు. ‘ఒక్కడే ఏకాంగవీరుడుర్వికి దైవమవునా।। ఎక్కడ హనుమంతునికెదురా లోకము’ అంటాడు అన్నమయ్య. మరోవైపు... లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణానికి మూర్ఛపోయి అపస్మారక స్థితికి చేరుకుంటే సంజీవిని తెచ్చి రక్షించిందీ హనుమంతుడే. సంజీవిని తెచ్చేందుకు వెళ్లిన పవనసుతుడు తాను వెతికే మొక్క ఏదో తెలియక... ఏకంగా కొండనే పెకలించుకొచ్చాడు. ఆ కొండను తెచ్చే ఆంజనేయుడిది అక్కజమైనట్టి- ఆశ్చర్యగొలిపే ఆకారం. ఆ సంజీవరాయడే అన్నమాచార్యులు వర్ణిస్తున్న పెద్ద హనుమంతుడు. 
      లలి అంటే ఉత్సాహం. లలిమీరిన అంటే ఉత్సాహం అతిశయించిన బలశాలి అయిన భీముడు- అంటే వాయుపుత్రుడైన హనుమంతుడే. ఆయన ఎంతటి వాడంటే... వాలి, సుగ్రీవుడు, అంగదుడు మొదలైన బలశాలులు ఉన్న కపికులానికి చక్రవర్తి. లంకానగరాన్ని నిర్ధూమ ధామం (పాడుకొంప)- నేలమట్టం చేసినవాడు ఆంజనేయుడు. ఉత్సాహం అతిశయించిన ఆ పెద్ద హనుమంతుణ్నే తాళ్లపాక అన్నమయ్య కళ్లకు కట్టినట్లు చెబుతున్నాడు.
      తన ప్రతి తలపులో శ్రీరాముణ్నే ఆత్మగా కలిగినవాడు హనుమంతుడు. అందుకే తన ఎదను చీల్చి సీతారాములను చూపించగలిగాడు. దేవకార్యాలకు ప్రధానమైన దిక్కుగా భావించేంత తపస్సు పుణ్యఫలంగా కలిగినవాడు ఆయన. రామాయణంలో రామకార్యాన్ని సాధించడంతో పాటు, ‘జెండాపై కపిరాజు’ అవతారమెత్తి మహాభారతంలో అర్జునుడికి విజయాన్ని చేకూర్చిన మహిమాన్వితుడు ఆంజనేయుడు. రాముడితో మైత్రిని కూర్చి వానర రాజ్యానికి సుగ్రీవుణ్ని రాజుగా కూర్చుండబెట్టిన ఘనత మారుతిది. అసలు సకల దేవతలు తమశక్తిని అంతా ఆంజనేయుడిలోనే నిక్షిప్తం చేశారు కదా! అందుకే ఎలాంటి కార్యమైనా సరే ఆయనకు అసాధ్యం కాదు మరి! సాటిలేని ఈ హనుమంతుణ్నే పదకవితా పితామహుడు పెద్దహనుమంతుడు అన్నది. ఆయన శ్రీవేంకటేశ్వరుడికి సేవకుల్లో అగ్రగణ్యుడట! అందుకే, అన్ని వేళలా శరణువేడుకోదగిన వాడట!
      ఇదే కాదు... ఆంజనేయ అనిలజ హనుమంతా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, కలశాపురముకాడ కందువ చేసినాడ, పదియారు వన్నెల బంగారు కాంతులతోడ, మంగాంబుధి హనుమంత లాంటి కీర్తనలు ఆంజనేయుణ్ని అర్చిస్తూ రాశాడు అన్నమయ్య. అన్నింట్లోనూ అదే మాధుర్యం... అదే అక్షరలాలిత్యం!


వెనక్కి ...

మీ అభిప్రాయం