వాలీద్వీపం తెలుసు కదా! అదే... ఇండోనేషియాలోని బాలి. జనాభా నలభైరెండు లక్షలకు కాస్త ఎక్కువ. వీళ్లలో 83.5 శాతం మంది హిందువులే. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియాలో ఏకైక హిందూ రాష్ట్రం (ప్రావిన్సు) బాలి. ఈ బాలి వాసుల అమ్మభాష ‘బాలినీస్’. క్రీ.శ.914 నుంచి ఇది వాడుకలో ఉన్నట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం అంతర్ధానానికి అడుగు దూరంలో ఉంది. ఇండోనేషియన్, ఆంగ్ల భాషల ధాటికి రోజువారీ వ్యవహారాలు, ప్రధాన స్రవంతి పత్రికలు - ప్రసార మాధ్యమాల నుంచి ఈ భాష ఎప్పుడో మాయమైంది. ఫలితంగా చాలామంది బాలి ప్రజలు తమ భాషను చదవడం, రాయడం మర్చిపోయారు. వీటికి తోడు బయట ఎక్కడా బాలినీస్లో మాట్లాడే అవకాశమూ లేదు. ఇళ్లలో అమ్మభాషలోనే మాట్లాడుకుంటున్నా... ఆ సంభాషణల్లో సగానికి సగం ఇండోనేషియన్ పదాలు దొర్లుతుంటాయి.
ఈ నేపథ్యంలో మాతృభాషను కాపాడుకోవడానికి ‘బాసబాలి’ అనే సంస్థ నడుంకట్టింది. ద్వీపంలోని మొత్తం పాఠశాలల్లో బాలినీస్ అధ్యయనం సాగేందుకు వనరులను అందించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా అంతర్జాలాన్ని వినియోగించుకుంటూ ‘బాలినీస్-ఇంగ్లిషు-ఇండోనేషియన్’ వికీ రిసోర్స్ మల్టీమీడియా నిఘంటువును ప్రారంభించింది. ఇందులో బాలినీస్ వాక్యాలు, ఆ భాషలో స్థానికుల సంభాషణలతో కూడిన వీడియోలు ఉంటాయి. ఈ నిఘంటువు ఆ మూడు భాషల ఇంటర్ఫేస్లతో ఉంటుంది. ఒక భాషలోంచి మరోదాంట్లోకి అనువాదం చేసుకోవచ్చు. దాంతో ఆంగ్లం, ఇండోనేషియన్ భాషలు తెలిసి... బాలిపై పట్టులేని వాళ్లు ఎవరైనా సరే దీని ద్వారా ఆ భాషను నేర్చుకోవచ్చు. మరోవైపు... ఈ నిఘంటువులో బాలినీస్ పదాల చేర్పు, వాటి అర్థాల వివరణ కూడా ఎప్పటికప్పుడు జరిగిపోతుంటుంది. సామాన్యులు కూడా ఇందులో పదాలను చేర్చవచ్చు. బాలినీస్ విశ్వవిద్యాలయాలకు చెందిన పది మంది భాషాశాస్త్రవేత్తల బృందం ఈ పదాలు - అర్థాలను చూసి, అవసరమైన మార్పుచేర్పులు చేస్తుంది. బాలి ప్రజల సమష్టి భాగస్వామంలో ఈ నిఘంటువు రోజురోజుకూ పరిపుష్టమవుతోంది.
బాలినీస్లో రాతను ప్రోత్సహించేందుకు ‘బాసబాలి’... ఆన్లైన్ బాలినీస్ కవితా పోటీలను నెలవారీగా నిర్వహిస్తోంది. ఇందులో ఆయా నెలకు సంబంధించి ఇచ్చిన అంశంతో కవిత్వాన్ని రాయాల్సి ఉంటుంది. అలాగే, ప్రత్యక్ష కవితల పోటీలనూ ఏర్పాటు చేస్తున్నారు. బాలి ప్రావిన్సులోని ప్రతి జిల్లా నుంచి యువతరం ఎక్కువగా ఈ పోటీల్లో పాల్గొంటోంది. అమ్మభాషను కాపాడుకోవాలన్న బాలినీస్ నవతరం తపనకు ఇది నిదర్శనం. మరోవైపు... ‘బాసబాలి’ ప్రభుత్వ విద్యాశాఖతో కలిసి పనిచేస్తూ అన్ని స్థాయుల పాఠశాలల్లో మల్టీమీడియా భాషా ఉపకరణాల్ని పంపిణీ చేస్తోంది. విద్యార్థులకు బాలినీస్ భాషలో రాయడం, చదవడం, మాట్లాడటంలో శిక్షణ ఇస్తోంది. ఆంగ్లం, ఇండోనేషియన్ భాషల్లోనూ ఉపకరణాలను తయారు చేసి, వాటిద్వారా ఈ శిక్షణను కొనసాగిస్తోంది. ‘బాసబాలి’ ఆశయం నెరవేరి, బాలినీస్కు పూర్వవైభవం లభిస్తే... ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న మాతృభాషా పరిరక్షణ ఉద్యమాల ప్రస్థానంలో కీలకఘట్టమవుతుంది. స్ఫూర్తిదాయక గాథగా చరిత్రలో నిలబడిపోతుంది.