సమాజమే ఇతివృత్తం

  • 1001 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। పరుచూరి గోపాలకృష్ణ, డా।। సింగుపురం నారాయణరావు

కులం కూడు పెట్టదు. మతం మంచినీళ్లు పోయదు. మానవత్వమే మనిషికి బలం. సామరస్య సహజీవనమే సంఘానికి శ్రేయస్కరం!
మనిషితనానికి గొడ్డలిపెట్టు మూఢనమ్మకం. సమాజానికి అది ప్రమాదకరం. 
రాజ్యం బలవంతుడి భోజ్యమా? కష్టాలూ కన్నీళ్లే పేదలకు పంచభక్ష్యాలా? సహించేది లేదు. ఎదురుతిరగడమే మార్గం. సమసమాజమే మా జీవిత స్వప్నం!
జూదం చితి. సారా కిరసనాయిలు. వ్యభిచారం నిప్పు. వాటి జోలికిపోతే జీవితం చితిమంటల పాలవుతుంది. వ్యసనాలే పతనానికి కారణాలు!
అత్యాచారం అనాగరికతకు ఆనవాలు. కట్నం కోసం కాల్చుకుతినడం హేయం. ఆడపిల్ల పుట్టిందని వడ్లగింజ బహుమతిగా ఇవ్వడం అమ్మను అవమానించడం!
గత ఎనభైఏళ్లలో తెలుగు నేల మీద బలంగా వినిపించిన నినాదాలివి. అలా అని ఇవి ఏ సంఘసంస్కర్తో చేసిన ప్రబోధాలు కావు. తెలుగు సినిమా వినిపించిన అభ్యుదయ వాణి ఇది. సమాజం నడకను పరిశీలిస్తూ... దాని నడతను శోధిస్తూ... సామాజిక దురాచారాలపై తెలుగు సినిమా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. అభ్యుదయమే పరమావధిగా ‘దృశ్యాల’ను ఎక్కుపెడుతూనే ఉంది. తెలుగు చలనచిత్ర గమనాన్ని గమనిస్తే ఇలాంటి ‘క్రాంతి’ కిరణాలెన్నో కనిపిస్తాయి. 

వినోదం, విజ్ఞానం, వికాసం... కలిస్తే చలనచిత్రం. కొన్ని చిత్రాల్లో వినోదమే ప్రధానం కావచ్చు.... కానీ, సినిమా అంటే అదొక్కటే కాదు. ప్రేక్షకుడి గుండె అడుగు పొరల్లో దాగిన చైతన్యాన్ని తట్టిలేపేది. వంద మాటలు చెప్పలేని భావాన్ని ఓ ఛాయాచిత్రం విశదీకరిస్తుంది. వేయి ఛాయాచిత్రాలు చెప్పే విషయాన్ని ఓ దృశ్యం వివరిస్తుంది. అలాంటి రెండున్నర గంటల పాటు సాగే దృశ్యకావ్యం... ప్రేక్షకులను ఇంకెంతగా కదిలిస్తుందో కదా! అందుకే గత ఎనిమిది దశాబ్దాల్లో చాలామంది దర్శకనిర్మాతలు... చలనచిత్రాన్ని ప్రభావవంతమైన మాధ్యమంగానే భావించారు. సమాజం మీద బలమైన ప్రభావాన్ని చూపించే చిత్రాలను తెరకెక్కించారు. 
      ‘లోకహితమే’ కావ్య లక్ష్యం అన్నారు పెద్దలు. సమాజానికి మంచి చెప్పడం, చెడును ఎత్తిచూపడం ప్రతి కవి, రచయిత బాధ్యత. తెలుగు కావ్యకర్తల్లో చాలామంది ఈ కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించారు. మరోవైపు... తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, హరికథల్లాంటి ‘దృశ్యప్రధాన’ కళారూపాలూ సమాజ చైతన్యానికి దారిదీపాలయ్యాయి. ‘కన్యాశుల్కం’ వంటి నాటకాలూ బాధ్యతను పంచుకున్నాయి. అభ్యుదయ చలనచిత్రాలదీ ఇదే వారసత్వం. కానీ,  తెలుగునాట ఆ విషయాన్ని గుర్తించిన వారు తక్కువ. 
      సాహిత్యానికి ఎంతో సేవ చేసిన కొడవటిగంటి కుటుంబరావు, సినీ సమీక్షలు చాలా రాశారు. ఆయన తన సాహిత్య వ్యాసాల్లో... రకరకాల సాహిత్యంలో ‘విటమిన్లు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, కార్బొహైడ్రేట్స్‌’ ఎలా ఉంటాయో లెక్కగట్టారు. ఆ లెక్క ప్రకారం చూస్తే అన్ని విభాగాల్లో సినిమా సాహిత్యం ‘సున్నా’లే సాధించింది. అంటే, ఆయన దృష్టిలో సినిమా ఓ పనికిరాని ప్రక్రియ! ఓ సినీ, నవలా రచయితగా, ప్రేక్షకుడిగా దీన్ని అంగీకరించలేకపోతున్నా! 
ఎందులో తక్కువ?
‘కర్తవ్యం’ సినిమా చూసి ఎంతోమంది ఆడపిల్లలు, పోలీసు అధికారులు అవ్వాలనుకోలేదా? ‘ఆడది’ చిత్రంలో శారద పాత్ర సారాపాకెట్లను తొక్కేసి కాలువలోకి విసిరేస్తే... గ్రామంలో సారాదుకాణాలు లేకుండా చేస్తే... ఆ దృశ్యాలు తర్వాత సారా వ్యతిరేక ఉద్యమానికి స్ఫూర్తినివ్వలేదా? ప్రభుత్వం దిగివచ్చి సారాయి అమ్మకాలు నిషేధించలేదా? ప్రతిఘటన, మౌనపోరాటం, పీపుల్స్‌ ఎన్‌కౌంటర్, మయూరి, స్వయంకృషిలాంటి ఎన్ని చిత్రాలు ప్రేక్షకుల మనోఫలకాలపై ముద్ర వేసుకోలేదు?
      యశస్సు, ధనం, వ్యవహారం, అమంగళాలను నశింపజేయడం, చదివిన వెంటనే గొప్ప ఆనందం కలిగింపజేయడం, చెలిలా ఉపదేశం ఇవ్వడం తదితరాల కోసం కావ్యం ఉపయోగపడుతుందంటాడు ‘కావ్య ప్రకాశ’కర్త ముమ్మటుడు. సినిమా కూడా కావ్యమే. దృశ్యకావ్యం. అంతరించిపోతున్న సంగీత విలువలను కాపాడాలని, అడుగంటిపోతున్న భారతీయ నాట్య కౌశలాలను వెలార్చాలనే ఆకాంక్షతో కె.విశ్వనాథ్‌ అందించిన శంకరాభరణం, సాగరసంగమం దృశ్యకావ్యాలు కావా?
మాలపిల్లతో మొదలు
కులాంతర వివాహాలను ‘మాలపిల్ల’లాంటి చిత్రాలు నలభయ్యో దశకంలోనే ప్రోత్సహించాయి. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ అందించింది గుడిపాటి వెంకటచలం. కథనం తాపీ ధర్మారావుది.  
      ఓ బ్రాహ్మణ యువకుడు ఓ మాలపిల్లను ఇష్టపడటం, దాని మూలంగా సంభవించిన మానసిక స్పర్థలు, కులం గొడవలు ఈ చిత్ర ఇతివృత్తం. మాలలను ఆలయంలోకి రానివ్వమన్న పెద్దల పట్టుదల, చెరువు నీళ్లు మాలలు తాగితే తప్పేంటన్న ప్రశ్న... ఈ కథాంశంలో ఇమిడి ఉన్నాయి. చివరకు బ్రాహ్మణ పెద్ద భార్య మంటల్లో తగలబడిపోతుంటే... ఆ చెరువు నీళ్లతోనే మాలలు ఆమెను కాపాడతారు. చివరకు పెద్దలు వారి తప్పు తెలుసుకోవడం పతాక సన్నివేశం.
      సామాజిక దృష్టితో పరిశీలిస్తే... ఈ సినిమా కథలో కులాంతర ప్రేమ, కులాంతర వివాహం, దళితుల ఆలయ ప్రవేశం, ఊరి చెరువు నీళ్లు తమకూ కావాలని దళితులు అడగడం, అంటరానితనం, గాంధీ సిద్ధాంత ప్రచారం, దళితుల ఆత్మ గౌరవం, జంతుబలి - మద్యపానం, జాత్యహంకారం అనే అంశాలు కనిపిస్తాయి. హరిజనుడు ఇంట్లో పని చేయవచ్చు. కానీ అతను ఆలయంలోకి రాకూడదు! ఈ ఒక్క అంశం మూలంగా ఎందరు దళితులు మతం మారిపోయారో మనకు తెలుసు. సమాజ ప్రగతికి ప్రతిబంధకమైన అంటరానితనాన్ని నిరసిస్తూ వచ్చిన ‘మాలపిల్ల’... అభ్యుదయ చలనచిత్రాలకు ఒరవడి దిద్దింది. 
      రామబ్రహ్మం దర్శకత్వంలోనే 1939లో ‘రైతుబిడ్డ’ వచ్చింది. భూమి కోసం రైతులు చేసిన పోరాటాన్ని మొదటిసారి తెలుగు వెండితెర మీద చూపించిన చిత్రమిదే. మొట్టమొదటిసారిగా నిషేధాన్ని ఎదుర్కొన్న తెలుగు చలనచిత్రమూ ఇదే. ఈ ‘రైతుబిడ్డ’ తమకు వ్యతిరేకంగా గళం విప్పాడనుకుని నాటి జమీందారులు నిషేధానికి పట్టుబట్టారు. రైతు తన భార్య తాళిబొట్టునైనా వదులుకుంటాడు కానీ... భూమిని మాత్రం వదులుకోడనే సందేశాన్నిస్తుందీ చిత్రం. 
      సినిమాను అనేక రకాలుగా విమర్శించిన కొడవటిగంటి కుటుంబరావు కూడా ఈ రెండు చిత్రాల్లోని చైతన్యజ్వాలలను గమనించకపోలేదు. ‘రామబ్రహ్మం మీద జాతీయోద్యమ, సాహిత్య ప్రభావాలున్నాయి. సినిమాల ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న ఆయన అభిలాషకు మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాలే నిదర్శనాలు’ అన్నారాయన. 
ఏటికి ఎదురీత
ఆరేళ్ల పసిపిల్ల... భర్తను పోగొట్టుకుని విధవరాలవుతుంది! ఆ అమ్మాయి పునర్వివాహ కథతో వచ్చిన చిత్రం ‘మళ్లీపెళ్లి’. యరగుడిపాటి వరదారావు (వై.వి.రావు) రచనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సంభాషణలు అందించారు. బిఎన్‌ రెడ్డి కూడా ‘విధవావివాహం’ కథాంశంగా 1940లో ‘సుమంగళి’ చిత్రాన్ని తీశారు. చనిపోతున్న భార్య ముచ్చట తీర్చాలని కూతురు సరస్వతికి బాల్యవివాహం చేస్తాడు కుటుంబ పెద్ద. కానీ, పెళ్లికొడుకు చనిపోవడంతో చిన్న వయసులోనే విధవరాలవుతుందా పిల్ల. కొద్ది కాలం తర్వాత వాసు, ఆమెను పెళ్లి చేసుకుందామనుకుంటాడు. కానీ, తను బాలవితంతువు అనే విషయం తెలుస్తుంది. తర్వాత వాసు ఏం చేశాడు, మధ్యలో గ్రామస్థులు ఎలా చెవులు కొరుక్కున్నారు, పెద్దల అంగీకారంతో వాళ్లిద్దరి పెళ్లి ఎలా జరుగుతుందన్నదే ‘సుమంగళి’ కథ. నాటి కాలమాన పరిస్థితులకు ఇది ఎదురీదడమూ, అభ్యుదయం వైపు దారి చూపడమూ కదా!  
      మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆనాడే ఓ చిత్రం వచ్చింది. అదే 1941లో విడుదలైన ‘దేవత’. ఇంగ్లాండులో న్యాయపట్టా పొంది పల్లెటూరికి వస్తాడు వేణుగోపాల్‌. ఇంట్లో పని చేస్తున్న లక్ష్మిని లొంగదీసుకుంటాడు. తెల్లవారి నూతిగట్టు దగ్గర ఏడుస్తున్న లక్ష్మితో, ‘పెళ్లి చేసుకుంటా’నని నమ్మబలుకుతాడు. కానీ, వృత్తిరీత్యా మద్రాసు వెళ్లిపోతాడు. లక్ష్మి కూడా అక్కడికి వెళ్లేసరికి... అతనికి వేరే పెళ్లి ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటిని చూసి మౌనంగా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది. వేణుగోపాల్‌ డబ్బు ఇవ్వబోతాడు. ‘డబ్బుకి ఒళ్లు అమ్ముకునే వ్యభిచారిణిని కాద’ని బదులిస్తుంది. రకరకాల కష్టాలు అనుభవించాక ఈ దేవత, ఆ వేణుగోపాలుడి ఇల్లాలు ఎలా అయ్యిందన్నదే కథాంశం.
      లక్ష్మీకాంత కవి రచన, వై.వి.రావు దర్శకత్వంలో నిర్మితమైన ‘తహశీల్దార్‌’... పాశ్చాత్య వ్యామోహం, బహు భార్యాత్వం మంచివి కావని చెబుతుంది. బి.ఎన్‌.రెడ్డి ‘స్వర్గసీమ’... పరస్త్రీ వలలో పడ్డ వివాహితుడి కథ. ఓ రకంగా చింతామణి లాంటి కథే. అలాగే... వేశ్యాలోలత్వం నేపథ్యంలో లక్ష్మమ్మ కథ, శ్రీలక్ష్మమ్మ కథ చిత్రాలూ వచ్చాయి. ఇలా తొలి ఇరవై సంవత్సరాల్లో కులం, రైతు, స్త్రీ అంశాల చుట్టూ అల్లుకున్న చిత్రాలెన్నో. 
పెరిగిన పరిధి
1950-70ల మధ్య వచ్చిన చిత్రాల్లో కొత్తకోణాలు, సామాజిక సమస్యలు కనిపిస్తాయి. ‘సమాజానికి మూలస్తంభాలు’ అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కిన చిత్రం ‘పెద్దమనుషులు’. పెద్దవాళ్ల చిల్లర బుద్ధులను ఎండగట్టింది. వడ్డీ వ్యాపారం తెచ్చే అనర్థాన్ని ‘షావుకారు’, బంజరు భూములను పేదలకు పంచాలంటూ ‘రోజులు మారాయి’ నినదించాయి.
      దుష్టరాజకీయాన్ని చాటి చెప్పిన ‘ఎం.ఎల్‌.ఎ.’, యజమాని కూడా కార్మికుడే అన్న భావాన్ని ముందడుగు వేయించిన ‘ముందడుగు’, పెళ్లినాటి ప్రమాణాలను ఉల్లంఘించిన భర్తను సంస్కరించుకున్న ఇల్లాలి కథ ‘పెళ్లినాటి ప్రమాణాలు’, భూమిలేని వాడికి ‘కాడెద్దులు ఎకరం నేల’ కావాలని ప్రబోధించిన (అదే పేరుతో వచ్చిన) చిత్రం, అత్యాచారానికి గురైన స్త్రీకి న్యాయమెక్కడ దొరుకుతుందని ప్రశ్నించే ‘స్త్రీ జన్మ’, కట్న పిశాచిని ఎదుర్కొనే ‘వరకట్నం’ మొదలైనవి ఈ కాలంలో విడుదలయ్యాయి. వీటితో తెలుగు సినిమా సామాజిక కోణం దృష్టి పెరిగింది.
      తర్వాతి రెండు దశాబ్దాల్లోని చిత్ర కథాంశాల్లో క్రాంతి కిరణాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కాలంలోనే దాసరి నారాయణరావు, టి.కృష్ణ, మాదాల రంగారావు, పరుచూరి సోదరులు, వేజెళ్ల సత్యనారాయణ, ఆర్‌.నారాయణమూర్తి లాంటి దర్శకులు, నటులు, రచయితలు తెలుగు సినిమాకు ఎర్రరంగు అద్దారు. అభ్యుదయపు అంచు వేశారు.
      తల్లిదండ్రులను పంచుకున్న తనయుల కథ ‘బడిపంతులు’, నీ తండ్రిని నువ్వు గౌరవించకపోతే... నిన్ను నేనెందుకు గౌరవించాలని ఓ నాన్నను ప్రశ్నించే కొడుకు ప్రధానపాత్రగా వచ్చిన ‘తాతా మనవడు’ తదితర చిత్రాలు విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలను ఆవిష్కరిస్తాయి. కులాంతర వివాహాలను సమర్థించే ‘కాలం మారింది’, ‘బలిపీఠం’, ‘మరోమలుపు’ ఆలోచనాత్మకంగా సాగుతాయి. వినాయకుడు పాలు తాగటాలు, చెట్టుకి పాలు కారడాలు వంటి మూఢవిశ్వాసాలు అనర్థదాయకమనీ ‘మరో మలుపు’ చెబుతుంది. బాలచందర్‌ ‘ఆకలి రాజ్యం’, వేజెళ్ల ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ నిరుద్యోగుల నిట్టూర్పులను చల్లారుస్తాయి. ‘డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌’కు పట్టం కడతాయి. నీకు దేశం ఏం ఇచ్చిందన్నది కాదు దేశం కోసం నువ్వేం చేశావని నిలదీసిన చిత్రం ‘మనిషి రోడ్డున పడ్డాడు’.  
      స్త్రీ హింస ప్రధానాంశంగా వచ్చిన ‘ప్రాణం ఖరీదు’, వ్యభిచారిణిని పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడి కథ ‘అంగడిబొమ్మ’, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు అద్దం పట్టిన ‘మాభూమి’, పెట్టుబడిదారి వ్యవస్థ మీద విద్యార్థుల తిరుగుబాటు ‘యువతరం కదిలింది’, కార్మిక యాజమాన్య పోరాటాన్ని భార్యాభర్తల మధ్య చూపించిన ‘సీతారాములు’, ఉరిశిక్షను రద్దు చేయాలనే ‘అభిలాష’... అన్నీ చైతన్యస్ఫోరకాలే. ఇలా ఈ ఇరవై ఏళ్లలో వందకుపైగా సామాజికాంశాల చిత్రాలు వచ్చాయి. 
కదిలించే సందేశం
టి.కృష్ణ దర్శకత్వంలో ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘ప్రతిఘటన’ రౌడీయిజాన్ని అంతం చేయమని ప్రబోధిస్తుంది. ఈ చిత్రంలో ఓ రౌడీ మీద స్త్రీ తిరుగుబాటు చేస్తుంది. ఆ తిరుగుబాటు మూలంగా ఆమె ఏం నష్టపోయింది, ఏం సాధించింది అనేదే ఇతివృత్తం. హిందీ చిత్రం ‘లావారిస్‌’ ఆధారంగా తెలుగులో నిర్మితమైన మరో కర్ణుడి కథ ‘నాదేశం’. తండ్రీ కొడుకుల బాంధవ్యాల కంటే, రాజకీయ వైరుధ్యాలే ఎక్కువగా చూపించిన చిత్రమిది. ‘నీకు రాజకీయం నేర్చుకోటానికి 36 ఏళ్లు పట్టింది. అదే రాజకీయాన్ని నేను మూడు నెలల్లో ఔపోసన పట్టాను’ అంటూ సాగే సంభాషణలు ఈ చిత్రానికి బలం. 
      ‘ఈనాడు’ చిత్రంలో సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా పోరాడిన పాత్ర రామరాజు. మురుగు కాలువ దగ్గర మూడు మతాల వాళ్లు కొట్టుకుంటే సమ న్యాయం చేసి, ఆ మురుగు నీళ్లను గవర్నమెంట్‌ బంగళా వైపు మళ్లిస్తాడు.  ఒక పార్టీ అభ్యర్థిగా గెలిచి... మరో పార్టీలోకి మారి పదవులను అనుభవించడం నేరమని చెబుతుందీ చిత్రం. 
      తెలుగు సినిమా రచయితలు ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి, నిట్టూర్చి ఊరుకోలేదు. వాటికి పరిష్కారాలను వెదుకుతూ... వారి కథలలో ఆయా అంశాలను ఏర్చికూర్చి కథలల్లారు.
      ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన మరో చిత్రం ‘మౌనపోరాటం’. అన్యాయానికి గురైన ఆడపిల్ల బతుకు కథ ఇది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి పాతిక సంవత్సరాలైంది. అయినా ఈనాటికీ, అన్యాయానికి గురైన ఆడపిల్ల పోరాటానికి దిగితే ‘ఫలానా అమ్మాయి మౌనపోరాటం’ అని పత్రికలు శీర్షికలు పెడుతున్నాయి. ఈ సినిమాలో ఓ గిరిజన యువతి చేసిన పోరాటం... ప్రజల గుండెల్లో అంత గాఢంగా నాటుకుపోయింది. ఈ చలనచిత్ర కథ నిజజీవితంలోంచే పుట్టింది. 1987-88 సంవత్సరాల్లో, సబిత అనే గిరిజన యువతి, ఒక నాగరికుడి చేతిలో మోసపోయి, తర్వాత న్యాయం కోసం చేసిన పోరాటమే దీనికి స్ఫూర్తి. 
      తొంభయ్యో దశకంలో వచ్చిన చిత్రాలూ అభ్యుదయ భావాలను అద్దుకున్నాయి. రిజర్వేషన్లతో దళితులకు రాజ్యాధికారం ఇచ్చినా... వాళ్లను పక్కన కూచోబెట్టి, పెట్టుబడిదారులు కుర్చీలో కూర్చునే దుస్థితికి వెండితెర రూపమే ‘ఎర్రమందారం’. స్త్రీ చాకిరీ ప్రధానాంశంగా ‘అమ్మ రాజీనామా’, ఆత్మరక్షణ కోసం హత్య చేసినా నేరం కాదని చెప్పే సెక్షన్‌ 100లోని ‘కల్పబుల్‌ హోమిసైడ్‌ క్లాజు’ను ప్రపంచీకరిస్తూ ‘ధర్మక్షేత్రం’, ‘అన్న’లాంటి చిత్రాలు వచ్చాయి.
      గృహహింసకు గురయ్యే అతివలకు సెక్షన్‌ 498ఎ అండగా ఉంటుందంటూ ఎం.ఎస్‌.నారాయణ రాసిన కథ ‘ప్రయత్నం’... ఆడపిల్లల బాధలకు ఓ పరిష్కారం చూపుతుంది. రైతు కూలీల సమస్యలతో నిర్మితమైన ‘లాల్‌ సలామ్‌’, సారా వ్యతిరేక సందేశాన్నందించిన ‘దండోరా’, సీలింగ్‌ యాక్ట్‌లో లోపాలను ఎత్తి చూపించిన ‘మదర్‌ ఇండియా’, స్వచ్ఛమైన రాజకీయ విలువలను చాటి చెప్పిన ‘ఆశయం’ తదితర చిత్రాలూ వెలుగురేఖలే. 
వర్తమానంలోనూ అదే స్ఫూర్తి
నాయకుడు ఎలా ఉండాలో చెప్పే ‘లీడర్‌’, రాజకీయాల్లోని కుటిలత్వాన్ని విడమరిచే ‘ప్రస్థానం’, జాతి సంపదను గుంపగుత్తగా జేబులో వేసుకునే పెద్దమనుషుల దురాగతాలను చూపించే ‘కృష్ణం వందే జగద్గురుం’, మలిదశ తెలంగాణ పోరాటానికి అద్దం పట్టే ‘జైబోలో తెలంగాణ’ తదితర చిత్రాలు నవతరం రచయితలు, దర్శకుల సామాజిక స్పృహకు నిదర్శనాలు. ‘నగరం నిద్రపోతున్నవేళ’, ‘ఆకాశంలో సగం’, ‘జీనియస్‌’, ‘నేనూ నా ఫ్రెండ్స్‌’ లాంటి చిన్న చిత్రాలు కూడా చక్కటి సామాజిక సందేశాలను అందించాయి. అయితే... దశాబ్ద కాలంగా ప్రేమ, ఫ్యాక్షన్, వినోదం పాళ్లు తెలుగు సినిమాలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
      కథ అంటే కదిలించాలి! కన్నీళ్లు పెట్టించాలి! కలవరం తెప్పించాలి! అప్పుడే అది సూటిగా హృదయంలోకి వెళుతుంది. రాబర్ట్‌మెక్కీ తన ‘స్టోరీ’ గ్రంథంలో చెప్పిన ప్రతి వాక్యం అక్షరసత్యం. 
      విజ్ఞానం, వికాసాలకు కూడా చలనచిత్రం చిరునామా అవుతుందనడానికి పైన మచ్చుగా చెప్పుకొన్న కొన్ని చిత్రాలే ఉదాహరణలు కాదు. వందలకొద్దీ కథాంశాల్లోని పాత్రలు, సంభాషణలు, సన్నివేశాల ద్వారా సినిమా కథకులు అనేక సామాజిక అంశాలను స్పృశించారు. సమస్యలకు తమ పరిధిలో ఉచితమైన పరిష్కారాలనూ సూచించారు. అందుకే తెలుగు సినిమా కథ - వెతలను పారదోలుకోవటానికి సామాజికుడికి సరైన దోవ చూపించే మార్గదర్శి.


వెనక్కి ...

మీ అభిప్రాయం