అక్షర తపస్వి

  • 271 Views
  • 4Likes
  • Like
  • Article Share

    డా।। పల్లా కృష్ణ

  • తెలుగు ఉపన్యాసకులు
  • వీరపునాయునిపల్లి, కడప జిల్లా.
  • 9985193868
డా।। పల్లా కృష్ణ

కథలు, పద్య నాటకాల రచయితగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా పలు ప్రక్రియల్లో ప్రతిభను చాటుకున్న అరుదైన సాహితీమూర్తి డా।। ఎన్‌.రామచంద్ర. కడప జిల్లా పులివెందుల తాలూకా రామిరెడ్డిపల్లిలో 1939లో సామాన్య రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. చాలా ఒడిదొడుకుల మధ్య రామచంద్ర పాఠశాల విద్య సాగింది. మొదట ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకుని జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఏంఏ పూర్తిచేసి 1965 నుంచి చిత్తూరు, ప్రొద్దుటూరు తదితర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పాఠాలు బోధించారు. 1981లో ఆచార్య కొలకలూరి ఇనాక్‌ పర్యవేక్షణలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ‘చలం సాహిత్యం - సామాజిక దృక్పథం’ మీద పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నారు. 
పాఠశాల రోజుల్లోనే భర్తృహరి సుభాషిత త్రిశతిని కంఠతా పట్టారు రామచంద్ర. దండి దశకుమార చరిత్ర, భానుడి కాదంబరి, శ్రీహర్షుని నైషధం, ఇంకా కాళిదాసు, భవభూతి రచనలతో పాటు ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వాటిని బాగా అధ్యయనం చేశారు. చిత్తూరులో పనిచేసే సమయంలో మధురాంతకం రాజారాం, కె.సభా, కలువకొలను సదానంద, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సి.వేణు లాంటి వారి ద్వారా స్ఫూర్తిపొందారు. మొదట్లో రక్తం చెమర్చిన కళ్లు (వచన కవిత్వం), నూర్జహాన్‌ చారిత్రక నవల, శ్రీకృష్ణ మాయ, పారిజాతాపహరణం (పౌరాణిక పద్య నాటకాలు) రాశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సాహితీ సృజనకు దూరమయ్యారు. 1997లో ఉద్యోగ విరమణ తర్వాత రచనా వ్యాసంగం మళ్లీ పుంజుకుంది. 2004 నుంచి ‘సాహితీ సౌరభం, కోయిలమ్మ పదాలు, చిలుక పలుకులు, ఊకదంపుళ్లు, ముళ్ల గులాబీలు, భ్రమర గీతికలు’ వంటి వచన కవితా సంపుటాలు, ‘పగటి చుక్కలు, దారి తప్పిన యాత్రికులు, స్వప్నచారులు, మనిషి ఇంటు మనిషి, మాపల్లె ముచ్చట్లు, కుముద్వతీ తీర కథలు, మా సీమ కథలు’ వంటి కథానికా సంపుటాలు, ‘సర్వాంతర్యామి, సీమ సంప్రదాయ కవుల వాఙ్మయ చరిత్ర, హేతువాది దార్శనికుడు మన కవి వేమన, తేనె పలుకులు- తీపి గుర్తులు’ విమర్శ గ్రంథాలు, ‘నూర్జహాన్‌తో పాటు నేను సైతం, రేనాడు, మాళవిక’ నవలలు రాశారు. ‘‘సృజన-విమర్శ రెండూ పరస్పరాశ్రితాలు. స్రష్టకంటే ద్రష్ట బాగా చూడగలడు. సాహిత్యం సముద్రమైతే దాన్ని మథించి వెలికితీసిన అమృతం విమర్శ. గుడ్డిగా మెచ్చుకొనేవాడికంటే గొప్ప విమర్శకుని కోసం రచయిత తహతహలాడతాడు’’ అంటారాయన. ప్రొద్దుటూరులో సాహితీ మిత్రమండలి తరఫున సారస్వత పరిమళాలు పూయించారు రామచంద్ర. అక్కినేని నాగేశ్వరరావు, అద్దేపల్లి, చిలుకూరి దేవపుత్ర, ఇనాక్, సింగమనేని లాంటి వారిని ప్రొద్దుటూరుకు ఆహ్వానించి చర్చలు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. 1959లో గంగాదేవితో రామచంద్ర వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. 
సమాజంలో అసహ్యకర పరిస్థితుల నుంచి అర్థవంతమైన జీవితం వైపు అడుగులు వేయాలని, కుల మతాలకతీతంగా నిర్మలంగా, ప్రశాంతంగా జీవితం సాగించాలని రామచంద్ర కథలు తెలియజెబుతాయి. స్త్రీల సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని కూడా ఆయన చాలా కథలు రాశారు. రామచంద్ర కథల్లో గ్రామీణ వాతావరణం తొణికిసలాడు తుంది. ఆయన కథల మీద ఎస్వీ విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. ‘‘నేను అంతిమంగా తెలుసుకున్నది మనం మన కోసం బతికేది కొంతవరకే. మిగిలిన దంతా సమాజం కోసమో కుటుంబం కోసమో’’ అని చెప్పే రామచంద్ర ఈ జూన్‌ 29న తుదిశ్వాస విడిచారు. చరమాంకంలో ‘నన్ను తీర్చిదిద్దిన ప్రాచ్య పాశ్చాత్యులు’ (ఆత్మ కథాత్మకం) వెలువరిం చారు. చివరి వరకు అలుపెరగకుండా కలం కదిలించిన ఆయనకు సరైన గుర్తింపు దక్కకపోవడం విచారకరం.


వెనక్కి ...

మీ అభిప్రాయం