అసిధారావ్రతం

  • 1073 Views
  • 10Likes
  • Like
  • Article Share

అసిధారావ్రతం

చాలా కష్టమైన పని అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. అసి అంటే కత్తి. ధారా అంటే అంచు. అసిధారావ్రతమంటే కత్తి అంచు మీద పడుకోవడమనేది భౌతికార్థం! నిజానికి ఇది బ్రహ్మచర్య దీక్షలో ఒక భాగం. మనసు నిలకడస్థితికి పరీక్ష పెట్టే వ్రతమిది. భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకున్నా కలవకుండాలి. ఇద్దరూ సమీపంలోనే ఉన్నా, మనోనిబ్బరంతో మెలగాలి. ఇందులో నెగ్గడం అంత సులువు కాదు. అందుకే ఏదైనా కష్టసాధ్యమైన పని గురించి చెప్పదలచుకున్నప్పుడు ‘నా బతుకంతా అసిధారావ్రతంగా నడుస్తోంది’ అంటారు. 

పొడుపూ విడుపూ
బుద్ధికి పదునుపెట్టే పొడుపుకథలు పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకూ ఒక ఆటవిడుపులాగా ఆసక్తినీ, ఉత్సాహాన్నీ కలిగిస్తాయి. ఉదాహరణకు.. ‘రెండిళ్లకూ ఒకటే దూలం’! కాస్త లోతుగా ఆలోచిస్తే ‘ముక్కు’ అని స్ఫురిస్తుంది ఎవరికైనా. ఇలాంటి పొడుపుకథలు పద్యరూపంలోనూ ఉంటాయి. 
పండిన దెండిన దొక్కటి;
ఖండించిన పచ్చిదొకటి; కాలిన దొకటై;
తిండికి రుచియై యుండును;
ఖండితముగ దీని తెల్పు కవియుం గలడే! 

పండింది, ఎండింది అంటే వక్క. ఖండించిన పచ్చిది అంటే తీగె నుంచి తెంపి తెచ్చింది- తమలపాకు. కాలింది అంటే సున్నం. ఈ మూడింటినీ సమపాళ్లలో కలిపి వేసుకునేది ఏంటీ! తాంబూలమేగా మరి!

ఉట్టి ఎన్నాళ్లూగుతది ఊగి ఊగి ఉన్నకాడ్కే వస్తది 
అకారణ కోపాన్ని ప్రదర్శిస్తూ చీటికీమాటికీ ఇతరుల మీద ఎగిరిపడుతుంటారు కొందరు. ఆ ఆగ్రహం ఎంతో సేపుండదు. లోలకాన్ని కదిపి వదిలితే ఊగి ఊగి ఆగినట్టుగానే కాసేపటికి శాంతిస్తారు. పల్లెల్లో ఒకప్పుడు ప్రతీ ఇంట్లో ఉట్లు ఉండేవి. పాలూ పెరుగూ ఇతర తినుబండారాలను పిల్లలకూ, పిల్లులకూ అందకుండా ఉట్టి మీద దాచిపెట్టేవారు. ఖాళీ ఉట్టినే కాదు కడవలతో బరువుగా ఉండే ఉట్టెనూ కాస్త కదిపితే అది ఊగి ఊగి ఆగిపోవడం సహజం. కోపంలో చిందులు తొక్కినా సరే, కాసేపట్లోనే సాధారణమైపోయే వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఉట్టితో పోలిక తెచ్చి ఈ సామెతను ప్రయోగిస్తారు. 
తెలుగూ.. తెలుగువారూ!
ద్రావిడ భాషా కుటుంబానికి జెందిన గొప్ప భాషలలో తెలుగు ఒక్కటే మృదుమధురమై వున్నది. అందువల్ల తెలుగును ప్రాచ్య ఇటాలియన్‌ భాష అనుట ఎంతో సముచితముగనున్నది. తెలుగుదేశపు పల్లెలలో పుట్టిన తెనుగు బుగ్గ, స్వచ్ఛమై, దూషితముగాక, ఎప్పుడూ ప్రవహించుచూ దేశమంతటా భాషా జీవనమును ఊరించుచూ దేశీయ వాణిని వినాశనము నుండి కాపాడుచున్నది. 10వ శతాబ్దమున రచియింపబడిన ‘దశకుమార చరిత్ర’ (సంస్కృతంలో నుండి కవి కృతము) తెనుగువారి ఆంధ్ర సామ్రాజ్యమును గూర్చి ఉగ్గడించుచున్నది. ఆంధ్రులు ప్రచండ నావికాబలము కలిగినవారు. వారికి యుద్ధనౌకలు అసంఖ్యాకములుగా ఉండేవి. వారికి వేలకువేలు నావికులుండేవారు. 
 - ఛార్లెస్‌ ఇ.గోవర్‌ (ఈయన ఇంగ్లాండు నివాసి. ‘దక్షిణ భారత జానపద గేయాలు’ అనే పుస్తకాన్ని రాశారు. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించారు.)
 


వెనక్కి ...

మీ అభిప్రాయం