బుడ్డిమంతులూ!జిందాబాద్‌

  • 852 Views
  • 5Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

అయ్యో! ఇప్పటికి ఎప్పుడూ మందు కొట్టిన పాపాన పోలేదా! ఎంత పొరపాటు చేశారు! కనీసం సరిదిద్దుకునే ప్రయత్నమైనా చేయలేదా? ఎంత ‘దేవతా ధిక్కారం’ చేశారు. ‘స్వర్గ’ జన్యమైన సత్సంప్రదాయాన్ని ఎలా కాలదన్నారు? అలా చూస్తారేంటి? ఇది పచ్చినిజం! దేవతలు ‘దేవతలు’ ఎలా అయ్యారు? తాగడం వల్లనేగా! సురాపానం చేసేవాళ్లు సురులు అయితే అది చేయలేని దద్దమ్మలు అసురులు. మరి తాగకపోతే ఏ(న)రకమైన శిక్షలు పడతాయో ఎల్లరూ తెలుసుకుని తీరాల్సిందే.
      ‘పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌’ అని సాక్షాత్తూ మహాకవి గురజాడ అప్పారావే కన్యాశుల్కంలో నొక్కివక్కాణించారు కదా! పొగతాగక పోతేనే అంత శిక్ష పడేట్టయితే ఇక మందు కొట్టని వాడి పరిస్థితి ఏంటి? ‘పొట్టగతులు’ ఉంటాయా! ‘మందు గురించి వినకు, మందు గురించి చెప్పకు, మందును కళ్లారా చూడకు’ అని కనీసం మహాత్మాగాంధీ కోతులైనా చెప్పలేదే! ‘తాగని నాకొడుకెందుకు లోకంలో? సొరగలోకమగపడతది మైకంలో’ అన్న సినిమా పాట కూడా ఉంది కదా! అంతకన్నా తాగడానికి పరమప్రమాణం ఏం కావాలి? పోనీ శ్రీశ్రీ మాట విన్నా చాలు. ఆయన ఏమన్నారు?
      ఇలా ‘విధాన ప్రకటన’ చేసిన శ్రీశ్రీ కాసే బ్రహ్మానందం అనడంతో పాటు ‘డోసే’ పరమానందం అన్న మహానుభావుడు. సత్కవుల్‌ హాలికులైననేమి అని పోతన అంటే ఆల్కహాలికులైన నేమి అని శ్రీశ్రీ అన్నారు. సమాజంలో ఉన్నతులు ఏం చేస్తే దాన్ని ఇతరులు అనుసరిస్తారని శ్రీకృష్ణపరమాత్మ ఎం‘చుక్కా’, ఎప్పుడో చెప్పాడు కదా! శ్రీశ్రీ మార్గదర్శకత్వం ఇంకొకటి కూడా ఉంది. 
      మూత్రం తాగితే వంద సంవత్సరాలు బతకవచ్చని మొరార్జీదేశాయి ప్రచారం చేసేవారు. ఆయన కొంతకాలం ప్రధాన మంత్రిగా కూడా ఉన్నారు. ‘మూత్రం తాగితే వంద సంవత్సరాలు బతకొచ్చునని మొరార్జీ దేశాయి గారు చెబుతున్నారు? మీరేమంటారు?’ అని శ్రీశ్రీని ఒక విలేకరి అడిగారు. దానికి శ్రీశ్రీ వెంటనే ‘మూత్రం తాగి బతకడం కన్నా మద్యం తాగి చావడం మంచిద’ని సిద్ధాంతీకరించారు. ఆయన ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అని మహాప్రస్థానంలో రాయడానికి బదులు పదండి ‘మందు’కు పదండి తోసుకు అని రాసి ఉంటే మజా వచ్చేది! 
      మందులోడా! ఓరి మాయలోడా! అని పాడతారు కానీ అది అంత అవసరమా? దానికన్నా మందు కొట్టేటోడా! ఓరి మాయలోడా! అని రాస్తే ‘మందాత్ముడి’ హృదయం ‘చుక్కా’గా ఆవిష్కృతమయ్యేది! మహాకవి దాశరథి గాలిబ్‌ గీతాల్లో ‘‘గాలిబా! నీదు తాత్త్విక కలన యహహ/ త్రాగకుండిన నిను మేము యోగియనమె’’ అన్నారు. దీన్ని యోగీశ్వరేశ్వరుడయిన శ్రీ కృష్ణపరమాత్ముడు కూడా కాదనడు! ‘మందు’ గమనుడైన మహాకవి శ్రీశ్రీకి సైతం ‘నేను సైతం మద్య వృష్టికి చుక్కనొక్కటి ధారపోశాను’ అని గానీ ‘పారబోశాను’ అని గానీ అనలేదే అనే వైరాగ్యంతో దిక్కులు చూసే ‘రస’ హృదయులు ఎంతోమంది ఉన్నారు. సుప్రసిద్ధ సినీ నటీమణి, రచయిత్రి భానుమతి చెన్నైలోని ఒక సంగీత కళాశాలకు ప్రధానాచార్యిణిగా పని చేసినప్పుడు మీరు ఏం సాధించారమ్మా అంటే ఎందు ‘తాగి’ నావురా రామా అని పాడేవాళ్లను ‘ఎందు దాగినావురా రామా’ అని పాడేట్టు చేశానన్నారు. కానీ నిజానికి ఆ శ్రీరాముడు తన భక్తకోటి తనివీ తీరా పాడిన గానసుధను తాగినవాడు అన్నది తడినిజం, పుత్తడి నిజం’.
మందుబాబుల తత్త్వం మహా మహా తాత్త్వికులకే అంతుబట్టదు. ఇల్లు ఇల్లనియేవు, ఇల్లు నా దనివేవు నీ ఇల్లు ఎక్కడే చిలుకా! అన్నవాళ్లు ఉన్నారు కానీ మందు మందని యేవు, మందునాదని యేవు నీ మందు ఎక్కడే చిలకా! అని అడిగిన పాపాన ఎవ్వరూ పోలేదు.
      తాగినవాడి తప్పుకు తగువు లేదని తెలుగువాడు ఎప్పుడో తీర్మానించేశాడు. కాబట్టి మద్యాన్ని చులకన చేయడానికి వీలేలేదు. మద్యం తాగడమంటే కళారూపాలను ‘కాళ్లారా’ ప్రోత్సహించటమే ఇది ‘నృత్యసత్యం’. మందు కొట్టినవాడు నడుస్తుంటే అదో రకం నృత్యం చేస్తున్నట్టే ఉంటుంది. ‘చూచు వారులకు’ చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటి అవకాశాలను కాలదన్నుకోవడం ఏం పద్ధతి? ‘వ్యతస్త పాదారవిందా!’ అని మైమరచి భగవంతుడి గురించి పాడతామా లేదా! తాగినప్పుడు ఎవరైనా తప్పకుండా ఎంతోకొంత వ్యతస్త పాదారవిందులే:
      ఎవరేమి అనుకున్నా మద్యప్రియులు సత్యసంధులు. అంటే వారిలో ఎంతో కొంత సత్యహరిశ్చంద్రుడి అంశ ‘తాగి’ ఉన్నట్టే లెక్క. ‘తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తుందన్నా’ అన్న పాట ఉండనే ఉంది. ఆ మాట కొస్తే అబద్ధాలను పసికట్టడానికి లై డిటెక్టర్లను ఉపయోగించే బదులు మందుకొట్టిస్తే మేలు. మందు మీద ఉన్నంత సేపూ మనిషి నిజాలు మాత్రమే చెబుతుంటాడు. నిజానికి న్యాయస్థానాల్లోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ‘నార్కో ఎనాలిసిస్‌’ పేరిట ఒంట్లోకి మందు ఎక్కించి నిజాలు కక్కించే పరీక్ష ఒకటుంది. అక్కడ వాడే మందు ఈ మందే అయితే పుచ్చుకున్న వాడికి పురుషార్థం, ఇచ్చిన వాడికి పుణ్యం బోనస్‌గా వస్తాయి. సంతోషం సగం బలం అంటారు. మందుపుచ్చుకుంటే మనిషికి సంతోషం. మరీ ఎక్కువైతే సంపూర్ణబలం వచ్చేసినట్టే. మందు-అంతటి బలవర్ధకమైన ఆయుధం అంటే ఎంతటి ధన్వంతరులైనా కాదనగలరా? మనోవ్యాధికి మందు లేదంటారు కానీ, దానికీ ‘మందే’ మందు! కదిలేదీ, కదిలించేదీ మునుముందుకు నడిపించేదీ, పరిపూర్ణపు బతుకిచ్చేదీ కవిత అని శ్రీశ్రీ అన్నా మందు అన్నది తిరుగులేని ‘కవితాత్మకమైన’ సత్యం! మందు వల్ల మనిషి తూలుతాడన్నది అసత్యం. అదే నిజమైతే నిండా మందు ఉన్నా సీసా తూలదేం?
      దేశంలో ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ హరించుకుపోతోందని గగ్గోలు రేగుతోంది కదా. మందుబాబులకు ఈ భయమేమీ లేదు. తాగినోడి నోటికి తాళం వేయగలిగిన శక్తి ఏదీ ఈ విశ్వంలో లేదన్నది వాస్తవం. వ్యక్తి స్వేచ్ఛకు ఇంతగా భరోసానిచ్చే మద్యమా! మజాకా!! ‘అంతా మత్తేనని తెలుసు. అదీ ఒక మాయేనని తెలుసు’ మన సినీ దేవదాసు ఎప్పుడో పాడాడు. ఆ సురాగీతం గ్రామఫోను రికార్డులు.. కాదు ‘తేమఫోను రికార్డుల్లో’ ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ‘తాగితే మరవగలను తాగనివ్వదు.. మరచిపోతే తాగగలను.. మరవనివ్వదు’ అని సినిమాలో కథానాయకుడు బాధపడుతుంటే తాగని జన్మవృథా అనిపిస్తుంది కదా! మద్యమంటే మధురం.. మధురమంటే మద్యం. ఈ విషయం సినీకవి ఆత్రేయకు బాగా తెలుసు. ‘పెదవులు మధురం చేసేటందుకె మధువులు ఉన్నాయి’ అని ఒక సినిమా పాటలో ఆయన గట్టిగా చెప్పిన తర్వాత మద్యం ప్రాధాన్యాన్ని తొక్కిపెట్టడం ఎవరివల్ల సాధ్యం? ‘మందుకొడితే మాకు మేమె మహారాజులం’ అని పాట కూడా ఉంది. ఇది పాట మాత్రమే కాదు మహా‘రాజబాట’! కాబట్టి తాగినవాడిదే పాట- సాగినవాడిదే ఆట!!
      ఇవన్నీ ఒక ఎత్తు అయితే మందు ప్రియులకు మించిన ‘త్యాగధనులు’ ఎక్కడా దొరకరు. ఏ పార్టీ ప్రభుత్వమైనా సొంత గల్లామీద నిలబడాలంటే అవసరమైంది నిధులే. వాటిని సమకూర్చడంలో మందు బాబుల ‘పాత్ర’ మామూలు పాత్ర కాదు... అక్షయపాత్ర. భార్య మెళ్లోని పుస్తెలను తెగనమ్మి మరీ ఏ మద్య దేవతకో నైవేద్యంగా సమర్పించుకో వాలనుకుంటారు మందుబాబులు. భార్యాపిల్లలు, కుటుంబం లాంటి బాదరబందీలను పట్టించుకోని ఆధ్యాత్మిక తత్వం మద్యప్రియులకు అలవాటవుతుంది. తాగేవాడే కడతాడు తాళ్లపన్ను అన్న మాటలు వింటుంటే మద్యప్రియుడు ఎంత బాధ్యతాయుతంగా ఉంటాడో తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ‘రస’ పక్షపాతంగా ఆలోచించే వారెవరైనా ‘మద్యదేవతా నమోస్తుతే’ అనకతప్పదు’. దేవతలకు సహస్రనామాలు వల్లించి నైవేద్యం సమర్పించినట్టే, మద్య పూజలో కూడా స్వదేశీ సారా నుంచి విదేశీ విస్కీ వరకూ రకరకాల ‘బ్రాండ్‌’ మేళాలతో నైవేద్యం పెడుతుంటారు. అబ్బెబ్బే.. ఆ మద్యం వాసన భరించలేం బాబోయ్‌ అని కొంతమంది సూకిరాలు పోతుంటారు. ఇది ఒట్టిబడాయి. ఇది ‘వాసనా’ మయమైన ప్రపంచం అని ‘గుర్రమెక్కిన’ ప్రతివాడూ చాటుతూ ఉంటాడు. అది అర్థం చేసుకోరేం? అయినా మద్యం మత్తుకు దూరంగా ఉండే వాళ్లను ఎవరు బాగు చేస్తారు? ఒక్కమాటలో చెప్పాలంటే బుడ్డిమంతుడే బుద్ధిమంతుడు. సరేనా!


వెనక్కి ...

మీ అభిప్రాయం