చిలుక పలుకుల మధ్య కాకిగోల

  • 877 Views
  • 10Likes
  • Like
  • Article Share

    డా।। ద్వా.నా.శాస్త్రి

  • హైదరాబాదు
  • 9849293376
డా।। ద్వా.నా.శాస్త్రి

మానవుడు జంతువునుంచి పుట్టాడంటారు. అది నిజమో కాదో అలా ఉంచితే - మనిషికి జంతువులకీ అవినాభావ సంబంధం ఉంది. జంతువుల నుంచి మనిషిని వేరుచేసేది భాష మాత్రమే. భాష ఆలోచనాత్మకం, బుద్ధిగతం. మనిషిని ‘‘సాంఘిక పశువు’’ అన్నారు గదా! జంతువులకంటే మనిషి బుద్ధిజీవి అనీ, ఉచితానుచితాలు గ్రహించేవాడనీ... ఇలా చాలా చెబుతారు. కానీ మాటల్లో మాత్రం జంతువుల్ని వాడందే మనం ఉండలేం.
      మోసం చేసేవాణ్ని, జిత్తులమారివాణ్ని పోల్చటానికి నక్కను తీసుకొస్తాం. చిన్నయసూరి ‘‘నీతిచంద్రిక’’లో నక్క మనకి సుపరిచితమే. సమాజంలో నక్కబుద్ధులు గలవారు లేరా? ‘‘వాడా - ఓ జంబుకం!’’ అనడమూ ఉంది. ఒక్క నక్కతో సరిపెట్టుకోకుండా ‘‘జిత్తులమారి నక్క’’నూ గ్రహించాం. మనలో గుంటనక్కలా కాచుక్కూర్చునేవాళ్లు లేరంటారా?
      ఓ పండితుణ్ని ఒకాయన అడిగాడు ‘‘ఏమండీ - నక్క కుడివైపు నుంచి వెళ్తే మంచిదా? ఎడమవైపు నుంచి వెళ్తే మంచిదా?’’ అని. అప్పుడాయన వెంటనే ‘‘బాబు, కరవకుండా ఎటు వెళ్లినా మంచిదే’’ అని సమాధానమిచ్చాడట. నక్కకూతను ‘‘ఊళ’’ అంటారు. 
      తెలుగువాళ్లు ఆవునూ వదల్లేదు. సాధుస్వభావం గలవాణ్ని, తగాదాలకు వెళ్లకుండా తనపని తాను చేసుకు పోయేవాణ్ని ‘‘గోవు’’తో పోలుస్తాం. అంతేనా, ఒక్కోసారి ‘‘గంగిగోవు’’ అంటాం. గంగిగోవుపాలు గరిటెడైనా చాలన్నాడు వేమన. ‘గంగి’ అంటే శ్రేష్ఠమైన, పూజ్యమైన అని అర్థం. ఆవు ఎప్పుడూ పూజ్యమైనదేమరి! ఇవాళ గోవుల సంఖ్యేకాదు - మానవగోవుల సంఖ్యా తగ్గుతోంది..
      ‘ఆవు’ను వాడుకుంటే సరే - ఎద్దునూ, దున్నపోతునూ వాడేస్తున్నాం. ఎద్దులా పనిచేసేవాళ్లున్నారు. గంగిరెద్దును మనం తక్కువచేసి ‘‘వాడు గంగిరెద్దులా తలతిప్పుతాడు’’ అని ప్రతి విషయానికీ ‘సరే’ అనేవాణ్ని ఆడిపోసుకుంటాం. ఇంతటితో ఊరుకుంటామా -గానుగెద్దునూ తీసుకొస్తాం. కొందరి జీవితాలు గానుగెద్దులాంటివే గదా! సంస్కృతంలో ‘ఎద్దు’- బరువైంది-‘‘వృషభం’’! కొంతమంది ‘‘కవివృషభులు’’గా కనిపిస్తారు. కవుల్ని ఎందువల్లనో గోవులతో పోల్చరు. తొండముదిరితే ఊసరవెల్లి అన్నట్టు ఎద్దుముదిరితే ‘ఆంబోతు’ అవుతుంది. దీన్నీ మన భాషలోకి తెచ్చేసుకున్నాం. బికారీగా తిరిగేవాడు, ఏ పనీపాటా లేకుండా తిరిగేవాడు ‘‘అచ్చోసిన ఆంబోతు’’ అవుతాడు. అంటే ఎవరికీ ఉపయోగపడకపోవటం! ‘‘పురిపండా అప్పలస్వామి నన్ను అచ్చోసి వదిలాడు’’ అన్నాడు శ్రీశ్రీ. (అంటే శ్రీశ్రీ మొదటి కావ్యం ‘‘ప్రభవ’’ను పురిపండా అచ్చువేశాడు.) ఎంత చెప్పినా వినకపోతే, దేనికీ చలించకపోతే వానలో దున్నపోతు స్వభావాన్ని తెచ్చుకుంటాం. ‘దున్నపోతు మీద వాన కురిసినట్టే’ అంటాం. దున్నపోతులా పనిచేసే వాళ్లున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే!
      ఆంధ్రుల స్వభావాన్ని రకరకాలుగా వర్ణించడం ఉంది. ఎవరికి వారే విమర్శించుకుంటే కొంతనయంగదా! అందుకని ‘మనవాళ్లు గొర్రెల మందలు’అని కితాబిస్తాం. గొర్రెదాటు మనస్తత్వం చాలామందిలో ఉన్నా రాజకీయరంగంలోని వారికి మరీ ఎక్కువనటం స్వభావోక్తే అవుతుందని ఇటీవలి సంఘటనల వల్ల తెలిసిపోతుంది. తమిళులకి ప్రాచీనభాష హోదా వచ్చిన తరువాత వాళ్లలా అనుకరించి- గొర్రెలాగా- మనమూ గొడవచేశాం. ఎంత చేసినా మనం సాధించింది ‘‘గొర్రెకు బెత్తెడు తోక’’ అంతే!
      ‘‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’’ అన్నాడు సుమతీ శతకకర్త బద్దెన. దీనికి ‘‘హర్టింపక తాహర్టక ఎస్కేపై తిరుగువాడు ధన్యుడు’’ అని పేరడీ రాశారు. ఈ స్వభావాన్ని మనం జంతువుతో పోల్చి చెబుతాం. అప్పుడుగాని  పూర్తిగా అవగాహన కాదు- అది ‘గోడమీద పిల్లి’ వ్యవహారమని! ‘పొయ్యిలో పిల్లిలేవలేదు’, ‘పిల్లిమొహం చూశాను’, ‘పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకబెట్టుకొని వెళ్లినట్టు’, ‘పిల్లి కళ్లు’, ‘పిల్లి గడ్డం’, ‘ఇంట్లోపిల్లి బయటపులి’... ఇలా పిల్లిని మనం వదల్లేం. ‘‘వాడికేంటి, పులి’’ అనటం పాతమాట - ‘‘పులిరాజా’’ అన్నది ఇప్పటిమాట! పులిని చూసి నక్కలు వాతపెట్టుకున్నట్టుగా మనలో అనుకరణజ్ఞులూ, డాబుసరులూ తక్కువేమీకాదు.
      నేటి రాజకీయాల్లో ఊసరవెల్లులు సిగ్గుపడేలా రంగులు - కాదు, కండువాలు మార్చడం సహజమైంది. ఇలా అనటం కంటె ‘కప్పదాటులు’ ఎక్కువయ్యాయనటం క్లుప్తంగా, శక్తిమంతంగా ఉంటుంది. కొందరిది ‘కప్పపొట్ట’! డబ్బుంటే బంధువులు నిండానీరున్న చెరువులోకి కప్పలు వచ్చినట్టు వస్తారని కుండబద్దలు కొట్టిచెప్పాడు బద్దెన- ఎప్పుడనుకున్నారు - 13వ శతాబ్దంలో!!
      ఇవాళ సమాజంలో రాబందులు ఎక్కువా? జలగలు ఎక్కువా? అంటే సమాధానం చెప్పగలమా? ఎన్టీఆర్‌ ‘పందికొక్కుల్ని’ పదేపదే గుర్తుకు తెచ్చేవారు. ప్రతిపక్ష సభ్యులు ఏదడిగినా, దేనికి అరిచినా పాలకపక్షంవారికి ‘కాకిగోల’ గానే ఉంటుంది. ‘కాకి ముక్కుకి దొండపండు’ వంటి పెళ్లి సంబంధాన్ని ఎవరు ఇష్టపడతారు చెప్పండి? కాకిలా కలకాలం బతకడం దండగ అంటాం కానీ కాకికి వినిపిస్తే కోపంరాదా? ‘కాకితో కబురుపెడితే వాలమూ?’ అనేది పూర్వపు రోజుల్లో బాగా వాడుకలో ఉండేది.
      ‘చిలుకమ్మ’లు మనకి తక్కువేమీ కాదు. ‘చిలుకపలుకులు’ సరేసరి! చిలుక జోస్యంపై ఎంత మక్కువో! పూర్వం ‘చిలుక్కొయ్య’లకి బట్టలు తగిలించేవారు. ‘చిలుకపచ్చ’ అందరికీ ఇష్టమేగదా! 
      మన ప్రభుత్వ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? అని అడిగాతే ఉపన్యాసం ఇవ్వక్కర్లేదుసుమా! ‘నత్తనడకగా సాగుతూ ఉంటాయి’ - అంటే ఎంత సముచితంగా ఉంటుందో! కొందరేమో ‘లేడికి లేచిందే పరుగ’న్నట్టు ఆగమేఘాల మీద ఉంటారు. ఇంకొందరు ‘‘మొసలికన్నీరు’’ కారుస్తుంటారు. పదోన్నతికోసమో, పై అధికారి మెప్పుకోసమో ‘కొంగజపం’ చేసేవారు మరికొందరు! ‘సీబీఐ’ వారిది ‘డేగకన్ను’గా ఉండాలిగదా! సాహిత్యంలో ‘సింహావలోకనాలూ’, ‘విహంగ వీక్షణాలు’ మామూలే!
      ఆవిడది ‘కోకిల కంఠ’మని పొగుడుతాం. కవికోకిలలు, గానకోకిలలు తక్కువేమీకాదు. హాస్యానికి ‘కవిగార్దభాలు’ అంటాం. ‘గాడిద బరువు’ ఎవరుమోస్తారు? ఎంత ‘గాడిదచాకిరీ’ చేసినా పేరు రాకపోవటం దురదృష్టమే! మన చట్టసభల్లో చాలామంది ప్రతినిధులు ‘మన్నుతిన్న పాములే’! పాముపగ, పాము చెవులు, పాముకోరలు... మనకేమీ కొత్తకాదు. కుక్కమూతి పిందెలు, కుక్కలాంటి విశ్వాసం గలవాడు, కాపలాకుక్క... మనకి అలవాటైనవే. విద్యార్థులవి ‘కోతిచేష్ట’లే! ‘కోతిమూక’ మనకి తెలియనిదా? ‘మీనాక్షులు’ఎవరికి ఇష్టం కాదు చెప్పండి? ఎవరూ హంసల్ని చూడకపోయినా ‘హంసనడకలు’ అనటంకద్దు. తుమ్మెదలవంటి జుట్టు అనాలి. తేనెటీగలా కూడబెట్టాలి. ‘కోర్టుపక్షి’  నిజానికి పక్షికాదుగా! ‘పేనుకు పెత్తనం’ ఇస్తే ఏమవుతుందో చెప్పాలా? పిచ్చుకమీద బ్రహ్మాస్త్రమా? తాపట్టిన కుందేలుకి మూడేకాళ్లు! చిలుకా గోరింకలు!
      కొడితే ‘ఏనుగు కుంభస్థలాన్ని’ కొట్టాలి! కోరికలే గుర్రాలైతే? పంది, బల్లి, జెర్రి... ఇలా మనం దేన్ని విడుస్తాంగనుక! ‘ఉడతాభక్తి’తో సత్కరిస్తాం. స్త్రీల నడుమును ‘సింహమధ్య’ అంటాం. వ్యర్థంగా ఖర్చు చేసి లాభంలేకపోతే - ‘ఏనుగుపాడి’గా ప్రకటిస్తాం. ఏదైనా సాధించాలంటే ‘ఉడుంపట్టు’ తప్పదు! తేలుగొండిగాళ్లు కొత్తేమీకాదు. ‘పిల్లికి ఎలుక సాక్ష్యం’ అంటాం కవిత్వంలో! చెప్పేదానికి చేసేదానికి ‘హస్తిమశకాంతరం’ (ఏనుగు- దోమ) ఉంటుంది. ఒకరినొకరు ‘వాడి బతుకు హాయి’ ‘వాడు హాయిగా ఉన్నాడు’ అనుకుంటారు. కానీ ‘పీతకష్టాలు పీతవి’ అని అనుకోరు. ప్రజలసొమ్మును ‘గద్ద’లా తన్నుకుపోరూ? ఏమంటారు. పేరుకోసం, ప్రచారంకోసం ‘గొంతుకోసిన మేకలా’ అరుస్తూ ఉంటారు. ‘కాకిపిల్ల కాకికిముద్దు’ కాదంటారా? ‘ఎద్దుపుండు కాకికినొప్పా?’, ‘గుర్రం గుడ్డిదైనా దాణతప్పదుగా’, ‘కోడికూత’ ఒకనాటి సమయసూచన! లోకమంతా కోడైకూసినా ప్రభుత్వం పట్టించుకోదు. ఇలా... జంతువుల్ని మనభాషలోకి తెచ్చుకొని మన భావప్రకటనాశక్తిని మరింత బలోపేతం చేసుకున్నాం! మరింత ఆకర్షణీయం చేసుకున్నాం! ఇంకొంత ‘అపహాస్యం’ చేసుకున్నాం... అవునా?కాదా? నీరక్షీరన్యాయం చేసే హంసను అడుగుదామా? చెవిలోని ‘జోరీగ’నడుగుదామా? ‘మొరిగే కుక్క కరవదు’అని సర్దిచెప్పుకుందామా? ‘బెల్లంచుట్టూ చేరే ఈగల’ వంటి వారిని ఏంచేద్దాం?... 
      ఇలా ఎన్నెన్నో జంతుసహిత ప్రశ్నలు! జంతుమయభాషా ప్రాభవం!

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం